
ఎపిసోడ్ 11: నిత్యనూతనమైన బేకన్ మహాశయుని సిద్ధాంతాలు
ఫ్రాన్సిస్ బేకన్ ప్రతిపాదించి, విస్తృతంగా అద్యయనం చేసిన ఙ్ఞానభ్రమలను మనం తెలుసుకుంటున్నాము. వాటికి తగిన ఉదాహరణలు కూడా మన నిజజీవితం నుంచీ, ప్రసిద్ధ శాస్త్రవేత్తల జీవితాల నుంచీ తీసుకుని పరిశీలిస్తున్నాము. టైకో బ్రాహే కృషి, ఫ్రాన్సిస్ బేకన్ ప్రతిపాదనలు శతాబ్దాలు గడిచినా మనం నిజజీవితంలో వాటి ఉపయోగం చూస్తున్నాము. గత ఎపిసోడ్లో గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించటంలో టైకో బ్రాహే ప్రభావం గురించి చూశాము. ఙ్ఞానభ్రమలలో జాతి భ్రమల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మిగిలిన వాటిని గురించి తెలుసుకుంటూ వాటిని ఎలా అధిగమించాలో చూద్దాము.
గుహ భ్రమలు (Idols of the Cave)..
నిర్వచనం: గుహ భ్రమలు వ్యక్తిగత అనుభవాలు, విద్య, అలవాట్లు, లేదా పరిమిత దృక్కోణాల నుంచి ఉద్భవిస్తాయి. ఈ భ్రమలు ప్రతి వ్యక్తి ప్రత్యేక లక్షణాలకు సంబంధించినవి.
లక్షణాలు:
వ్యక్తిగత పక్షపాతం: ఒక్కొక్క వ్యక్తి తన అనుభవాలు, ఆసక్తులు, లేదా విద్య ఆధారంగా ప్రపంచాన్ని ఒక్కొక్క రీతిలో చూస్తాడు. ఇది వారి ఆలోచనలను పరిమితం చేస్తుంది. ఆలోచనలకు పరిమితి విధిస్తుంది.
అతి గుర్తింపు: కొందరు తమకు ఇష్టమైన ఒక రంగంలోని ఆలోచనలను లేదా సిద్ధాంతాలను అన్ని సమస్యలకు అన్వయించబూనుతారు.
సాంస్కృతిక లేదా వ్యక్తిగత పరిమితులు: వ్యక్తి నేపథ్యం, సాంస్కృతిక ప్రభావం, లేదా అనుభవాలు వారి జ్ఞాన గ్రాహణాన్ని(knowledge absorption)సంకుచితంగా చేస్తాయి.
ఉదాహరణ: ఒక శాస్త్రవేత్త తన సొంత రంగంలో(ఉదాహరణకు భౌతిక శాస్త్రం)లోని సిద్ధాంతాలను జీవశాస్త్ర సమస్యలకు అన్వయించడానికి ప్రయత్నిస్తే, అది గుహ భ్రమకు ఉదాహరణ. బేకన్ ఈ భ్రమను ప్లేటో “గుహ ఉపమానం” నుంచి ప్రేరణ పొంది పేర్కొన్నాడు. ఇక్కడ వ్యక్తి తన “గుహ”(వ్యక్తిగత దృక్కోణం) లోపల నుంచి మాత్రమే ప్రపంచాన్ని చూస్తాడు. బావిలో దృక్కోణం అని కూడా అనుకోవచ్చు.
ప్రభావం: ఈ భ్రమలు వ్యక్తిగత పక్షపాతాలను పెంచుతాయి. అంతేకాకుండా శాస్త్రీయ ఆలోచనలో విస్తృత దృక్పథాన్ని అడ్డుకుంటాయి.
కాసేపు ఇక్కడ ఆగుదాము. ఈ గుహ భ్రమలకు ఒక గొప్ప ఉదాహరణ ఆధునిక చరిత్రలో మన కళ్ళ ఎదుటే పెద్ద సాక్ష్యంగా ఉంది. అదేమిటంటే మనం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
అలెగ్జాండర్ ఫ్రీడ్మన్(అలెగ్జాందర్ ఫ్రీద్మన్ – Alexander Friedman, 1888–1925) ఒక రష్యన్ గణిత శాస్త్రవేత్త. భౌతిక శాస్త్రంలో కూడా ప్రముఖుడు. ఆధునిక కాస్మోలజీకి(విశ్వోద్భవ శాస్త్రం లేదా విశ్వావిర్భావ శాస్త్రం) పునాది వేసిన విశ్వ విస్తరణ సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందాడు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జన్మించిన ఫ్రీడ్మన్, ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ సాధారణ సాపేక్షతా సిద్ధాంతాన్ని ఉపయోగించి 1922లో విశ్వ గతిశీలతను వివరించే గణిత సమీకరణాలను(ఫ్రీడ్మన్ సమీకరణాలు)ప్రతిపాదించాడు. ఈ సమీకరణాలు విశ్వం విస్తరించవచ్చు లేదా కుంచించుకుపోవచ్చని సూచించాయి. ఇది ఐన్‌స్టైన్ స్థిరవిశ్వ(Static Universe) ఊహకు విరుద్ధంగా ఉంది. ఈ ప్రతిపాదన తరువాత కాలంలో ఎడ్విన్ హబుల్ పరిశీలనల ద్వారా ధృవీకరించబడింది. ఇది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి పునాది వేసింది.
ఫ్రీడ్మన్ వాతావరణ శాస్త్రం, యుద్ధ విమానశాస్త్ర పరిశోధనలలో కూడా సహకరించాడు. కానీ 1925లో టైఫాయిడ్ జ్వరంతో 37 ఏళ్ల చిన్న వయసులోనే మరణించాడు. అతని సిద్ధాంతాలు కాస్మోలజీలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి.
సహజంగానే అలెగ్జాండర్ ఫ్రీడ్మన్, ఆల్బర్ట్ ఐన్స్టైన్ల మధ్య వివాదం ప్రధానంగా విశ్వ స్వభావం, దాని విస్తరణకు సంబంధించిన గణిత సమీకరణాల గురించి వచ్చింది. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాము.
వివాదం కావటానికి కారణం..
ఐన్‌స్టైన్ స్థిర విశ్వం (Static Universe): ఐన్‌స్టైన్ తన సాధారణ సాపేక్షతా సిద్ధాంతాన్ని(Theory of General Relativity) 1915లో ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధాంతం గురుత్వాకర్షణను స్థల- కాల వక్రత (space-time curvature) ద్వారా వివరించింది. అయితే, ఐన్‌స్టైన్ విశ్వం స్థిరంగా (static) ఉందని నమ్మాడు. అంటే అది విస్తరించడం లేదా కుంచించుకుపోవడం లేదని భావించాడు. ఈ నమ్మకం ఆ యుగంలో సర్వసాధారణమైన ఖగోళశాస్త్ర ఆలోచనల నుంచి వచ్చింది. విశ్వం స్థిరంగా ఉండాలంటే, గురుత్వాకర్షణ శక్తిని సమతుల్యం చేయడానికి ఐన్‌స్టైన్ తన సమీకరణాలలో “కాస్మోలాజికల్ కాన్స్టాంట్” (cosmological constant, Λ) అనే అదనపు పదాన్ని చేర్చాడు.
ఫ్రీడ్మన్- విస్తరించే విశ్వం (Expanding Universe): రష్యన్ గణిత, భౌతిక శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్రీడ్మన్ 1922లో ఐన్‌స్టైన్ సాధారణ సాపేక్షతా సమీకరణాలను ఉపయోగించి విశ్వ గతిశీలతను వివరించే కొత్త సమీకరణాలను ప్రతిపాదించాడు. ఈ సమీకరణాలు(ఇప్పుడు ఫ్రీడ్మన్ సమీకరణాలు అని పిలుస్తారు) విశ్వం స్థిరంగా ఉండకపోవచ్చని, అది విస్తరించవచ్చు లేదా కుంచించుకుపోవచ్చని సూచించాయి. ఫ్రీడ్మన్ నమూనాలో కాస్మోలాజికల్ కాన్స్టాంట్ అవసరం లేదని, విశ్వ గతిశీలత దాని సాంద్రత(density), వక్రత (curvature) ఆధారంగా నిర్ణయించబడుతుందని తెలిపాడు.
ఐన్‌స్టైన్ ప్రతిస్పందన: ఫ్రీడ్మన్ 1922లో ప్రచురించిన సిద్ధాంత వ్యాసాన్ని(research paper) చదివిన ఐన్‌స్టైన్, దానిలో గణిత లోపం ఉందని భావించి, ఒక విమర్శనాత్మక లేఖను ఒక జర్మన్ జర్నల్‌లో ప్రచురించాడు. అయితే, ఫ్రీడ్మన్ తన సమీకరణాలు సరైనవని, ఐన్‌స్టైన్ విమర్శలు తప్పుడు ఊహలపై ఆధారపడి ఉన్నాయని సమాధానమిచ్చాడు. తరువాత కాలంలో ఐన్‌స్టైన్ తన విమర్శలో పొరపాటు ఉందని ఒప్పుకున్నాడు. 1923లో ఆ లేఖలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాడు. అయినప్పటికీ ఐన్‌స్టైన్- ఫ్రీడ్మన్ విస్తరించే విశ్వం ఆలోచనను స్వీకరించడానికి సంశయించాడు. దానికి కారణం అది అతని స్థిరవిశ్వ నమ్మకానికి విరుద్ధంగా ఉంది.
వివాద పరిణామం: 1929లో ఎడ్విన్ హబుల్ పరిశీలనలు గెలాక్సీలు ఒకదానిపై ఒకటి దూరంగా వెళుతున్నాయని, అంటే విశ్వం విస్తరిస్తోందని నిరూపించాయి. ఈ పరిశీలనలు ఫ్రీడ్మన్ గణిత మోడల్‌ను ధృవీకరించాయి. దీంతో ఐన్‌స్టైన్ తన కాస్మోలాజికల్ కాన్స్టాంట్ను “తన జీవితంలో అతిపెద్ద తప్పిదం”(greatest blunder of my life) అని పేర్కొన్నాడని చెబుతారు, అయితే ఈ వ్యాఖ్య ప్రామాణికత గురించి కొంత చర్చ ఉంది.
చూశారా? చరిత్రలోనే అత్యంత గొప్ప శాస్త్రవేత్తలలో ఒకడు, 20వ శతాబ్దంలో అత్యంత మేధావి అని గుర్తింపు పొందిన, గత 200 సంవత్సరాలలో జన్మించిన శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడనిపించుకుని, ఈ రోజుల్లో మేధావి అన్న ఒక చిన్న భావనకు చిత్ర రూపం ఇవ్వాలంటే ఆయన రూపమే మన మదిలో మెదలేలా చేసుకున్న ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ కూడా విఙ్ఞానశాస్త్ర విషయంలో తప్పు చేశాడు. దానికి మూలం గుహభ్రమ.
ఎలాగో చూద్దాము..

ఐన్‌స్టైన్ ఙ్ఞానభ్రమ(Idol of Mind): ఈ సందర్భంలో(“ఙ్ఞానభ్రమ”)ఫ్రాన్సిస్ బేకన్ “Idols of the Mind” భావన ఎంత నిత్యనూతనమో, సార్వకాలీనతను సంతరించుకున్నదో తెలియజేస్తుంది. ఇది మానవ మనస్సు పక్షపాతాలు, సరికాని శాస్తరరంగానికి చెందిన ఊహలను సూచిస్తుంది. ఈ ఙ్ఞానభ్రమలు శాస్త్రీయ ఆలోచనను అడ్డుకుంటాయి. ఐన్‌స్టైన్ విషయానికి వస్తే, ఆయన ఙ్ఞానభ్రమ విశ్వం స్థిరంగా ఉండాలనే అతని బలమైన నమ్మకం వల్ల కలిగినదని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నమ్మకం అతన్ని కాస్మోలాజికల్ కాన్స్టాంట్ను ప్రవేశపెట్టడానికి, ఫ్రీడ్మన్ విస్తరించే విశ్వం(లేదా కుంచించుకునే విశ్వం) అనే ప్రతిపాదనను వ్యతిరేకించడానికి దారితీసింది.
పక్షపాత మూలం: ఐన్‌స్టైన్ ఙ్ఞానభ్రమ ఆ యుగంలో సర్వసాధారణమైన ఖగోళశాస్త్ర నమ్మకాల నుంచి వచ్చింది, అవి విశ్వం శాశ్వతంగా స్థిరంగా ఉంటుందని ఊహించాయి. ఈ ముందస్తు ఊహ అతని శాస్త్రీయ తీర్మానాలను ప్రభావితం చేసింది, ఫ్రీడ్మన్ గణిత సమీకరణాలను ప్రారంభంలో తిరస్కరించడానికి దారితీసింది.
ఫలితం: హబుల్ పరిశీలనల తర్వాత, ఐన్‌స్టైన్ తన స్థిర విశ్వం ఊహను వదిలివేయవలసి వచ్చింది. ఈ విషయం ఆయన జీవితంలో చిన్న మచ్చలాంటిది. ఫ్రీడ్మన్ సమీకరణాలు ఆధునిక కాస్మోలజీ పునాదిగా మారాయి.
తెలుసుకోవాల్సిన విశేషం..
ఫ్రీడ్మన్, ఐన్స్టైన్ల మధ్య వివాదం విశ్వ స్వభావం గురించి వారి విభిన్న ఊహలపై ఆధారపడింది. ఐన్‌స్టైన్ ఙ్ఞానభ్రమ అతని స్థిర విశ్వం నమ్మకంలో పాతుకుపోయింది, ఇది అతన్ని ఫ్రీడ్మన్ విస్తరించే విశ్వం ఆలోచనను వ్యతిరేకించడానికి దారితీసింది. ఈ వివాదం శాస్త్రీయ ఆవిష్కరణలలో ముందస్తు ఊహలు, పక్షపాతాలు ఎలా అడ్డంకులుగా మారవచ్చో చూపిస్తుంది. అయితే శాస్త్రీయ పురోగతి చివరికి వాస్తవ పరిశీలనల ద్వారా నడపబడుతుంది. ఐన్‌స్టైన్ మాదిరి ఒక ఆలోచనతో, నమ్మకానికి లేదా “నేను చెప్పాను కనుక” అనే భావనకు పరిమితం కాలేదు కనుక ఫ్రీడ్మన్ ఈ ఙ్ఞానభ్రమను అధిగమించగలిగాడు.
మార్కెట్ భ్రమలు(Idols of the Marketplace)..
నిర్వచనం: మార్కెట్ భ్రమలు భాష, మానవుల మధ్య సామాజిక సంకర్షణ నుంచి ఉద్భవిస్తాయి. ఇవి భాష అస్పష్టత లేదా తప్పుడు ఉపయోగం వల్ల సృష్టించబడతాయి. నిజానికి మనం చదవకుండా వదిలేసే small print.
లక్షణాలు..
భాష అస్పష్టత: పదాలు తరచుగా అస్పష్టంగా లేదా తప్పుగా అర్థం చేసుకోబడతాయి. లేదా అలా అర్థం చేసుకోవటంలో గందరగోళపడేలా వ్రాయబడతాయి.
తప్పుడు నిర్వచనలు: కొన్ని పదాలు వాస్తవంలో లేని విషయాలను సూచిస్తాయి. కానీ వాటిని నిజమైనవిగా భావిస్తారు. (ఉదాహరణకు “ఫ్లోజిస్టన్” అనే ఊహాజనిత పదార్థం).
సామాజిక సంకర్షణ: మానవులు సమాజంలో పదాలను, భావనలను వాడుకోవడం వల్ల, తప్పుడు ఆలోచనలు లేదా సిద్ధాంతాలు విస్తృతంగా ఆమోదించబడతాయి. ఈమధ్యకాలంలో ఒక పదాన్ని వాడలేక వేరే పదంతో మార్చి వాడుతున్నారు కదా(ప్రత్యేకించి బూతు పదాలలో. అలాగే then, thanలను కూడా చాలామంది తప్పుగా వాడుతున్నారు. అవి ఎంతలా విస్తరిస్తున్నాయంటే ఏఐ కూడా ఆ తప్పుడు వాడకాన్ని నేర్చుకునేలా. లేదా స్మార్ట్‌ఫోన్ కీబోర్డులు ఆటోకరక్షన్ ఆ తప్పుడు వాడకాలను సరైనవి అనుకునేంతలా.
ఉదాహరణ: “స్వాతంత్య్రం (independence)” లేదా “స్వేచ్ఛ(freedom)” వంటి పదాలు వివిధ సందర్భాలలో వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. రెండూ సమానం కాదు. వీటి వాడకంలో జరిగే పొరబాట్లు తప్పుడు అవగాహనలకు దారితీస్తుంది. శాస్త్రంలో “ఉష్ణం” లేదా “శక్తి” వంటి పదాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల తప్పుడు సిద్ధాంతాలు ఏర్పడవచ్చు.
ప్రభావం: ఈ భ్రమలు శాస్త్రీయ చర్చలలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. జ్ఞాన సముపార్జనలో కచ్చితత్వాన్ని తగ్గిస్తాయి.
నాటక భ్రమలు (Idols of the Theatre)..
నిర్వచనం: నాటక భ్రమలు తప్పుడు తాత్విక సిద్ధాంతాలు, సాంప్రదాయ ఆలోచనలు, లేదా మతపరమైన విశ్వాసాల నుంచి ఉద్భవిస్తాయి. బేకన్ ఈ భ్రమలను నాటకాలతో పోల్చాడు, ఎందుకంటే అవి ఊహాజనిత కథల వలె మనస్సును ఆకర్షిస్తాయి.
లక్షణాలు..
తప్పుడు సిద్ధాంతాలు: పురాతన తత్వవేత్తల సిద్ధాంతాలు లేదా సాంప్రదాయ విశ్వాసాలు, ఆధారాలు లేకుండా, విస్తృతంగా ఆమోదించబడతాయి.
అధికారానికి లొంగడం: మానవులు ప్రముఖ తత్వవేత్తలు లేదా నాయకుల సిద్ధాంతాలను ప్రశ్నించకుండా అంగీకరిస్తారు.
ఊహాజనిత ఆలోచనలు: ఈ భ్రమలు వాస్తవిక ఆధారాల కంటే ఊహాత్మక లేదా సౌందర్యాత్మక ఆలోచనలపై ఆధారపడతాయి.
ఉదాహరణ: అరిస్టాటిల్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు, ఉదాహరణకు, గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయని లేదా వస్తువులు సహజంగా విశ్రాంతి స్థితిలో ఉంటాయని చెప్పడం, నాటక భ్రమలకు ఉదాహరణ. ఈ సిద్ధాంతాలు శాస్త్రీయ ఆధారాలు లేకుండా శతాబ్దాల పాటు ఆమోదించబడ్డాయి.
ప్రభావం: ఈ భ్రమలు శాస్త్రీయ పురోగతిని అడ్డుకుంటాయి, ఎందుకంటే అవి తప్పుడు సిద్ధాంతాలను స్థిరపరుస్తాయి, కొత్త ఆలోచనలను అంగీకరించడాన్ని నిరోధిస్తాయి.
జ్ఞాన భ్రమల యొక్క ప్రభావం..
బేకన్ ప్రకారం ఈ నాలుగు రకాల భ్రమలు మానవ జ్ఞాన సముపార్జనతో సత్యాన్ని చేరుకోవడానికి అడ్డంకులుగా పనిచేస్తాయి. ఈ భ్రమలు పక్షపాతాన్ని పెంచుతాయి. అవి మానవులను వాస్తవాన్ని సరిగా గ్రహించకుండా అడ్డుకుంటాయి.
శాస్త్రీయ పురోగతిని నిరోధిస్తాయి: తప్పుడు సిద్ధాంతాలు, పక్షపాతాలు కొత్త ఆవిష్కరణలను ఆలస్యం చేస్తాయి.
గందరగోళాన్ని సృష్టిస్తాయి: భాషా లోపాలు, తప్పుడు ఆలోచనలు శాస్త్రీయ చర్చలను సంక్లిష్టం చేస్తాయి.
జ్ఞాన భ్రమలను అధిగమించడం..
బేకన్ ఈ భ్రమలను అధిగమించడానికి వైజ్ఞానిక పద్ధతి(scientific method), ఇండక్టివ్ రీజనింగ్(inductive reasoning)ను ప్రతిపాదించాడు. ఆయన సూచనలు..
పరిశీలన, ప్రయోగం: ఊహాగానాల కంటే పరిశీలనలు, ప్రయోగాల ద్వారా జ్ఞానాన్ని సేకరించాలి.
పక్షపాత నివారణ: శాస్త్రవేత్తలు తమ వ్యక్తిగత, సామాజిక పక్షపాతాలను గుర్తించి, వాటిని నియంత్రించాలి.
భాష ఖచ్చితత్వం: శాస్త్రీయ చర్చలలో స్పష్టమైన, కచ్చితమైన భాషను ఉపయోగించాలి.
సాంప్రదాయ సిద్ధాంతాలను ప్రశ్నించడం: పురాతన లేదా సాంప్రదాయ సిద్ధాంతాలను అంగీకరించకుండా, వాటిని శాస్త్రీయ ఆధారాలతో పరీక్షించాలి.
ఇక్కడ ఒక విచిత్రమైన ఉదాహరణ చెప్పుకోవాలి. విశిష్టాద్వైత సిద్ధాంతకర్తగా పేరు పొందిన రామానుజాచార్యులు ప్రతి కొన్ని తరాలకూ సిద్ధాంతాలను పునఃపరిశీలించి అవసరాన్ని బట్టీ సవరించుకోవాలని వేయి సంవత్సరాల క్రితమే ప్రతిపాదించారు. దీనినే పాశ్చాత్య తత్వవేత్తలు revisionist philosophy అని చెప్పారు. ఈ రివిజనిజానికి పునాది కూడా ఆథ్యాత్మిక రంగంలో రామానుజాచార్యులు గురువు చెప్పిన ప్రమాణాలలో లోపాలని ఎత్తి చూపి, సవరించటం ద్వారా పడింది. దేనినైనా ప్రశ్నించి, పరిశీలించి, పరిశోధించి అంగీకరించాలని ఆయన చేసిన మార్గదర్శనం ఆధునిక సైన్సు పరిశోధనలలో కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది.
బేకన్ ఈ విధానం ఆధునిక వైజ్ఞానిక పద్ధతికి పునాది వేసింది. ఇది లక్ష్యబద్ధమైన, ఆధారాలపై ఆధారపడిన జ్ఞాన సముపార్జనను ప్రోత్సహిస్తుంది.
జ్ఞాన భ్రమల ఆధునిక ఉదాహరణలు..
బేకన్ జ్ఞాన భ్రమలు ఆధునిక సమాజంలో కూడా సందర్భోచితంగా ఉన్నాయి. ఈ భ్రమలు శాస్త్రీయ పరిశోధనలో మాత్రమే కాకుండా, రోజువారీ జీవితంలో కూడా కనిపిస్తాయి.
జాతి భ్రమలు: సమాజంలో తప్పుడు సాధారణీకరణలు. ఉదాహరణకు, స్టీరియోటైప్‌లు లేదా గ్రూప్థింకింగ్, జాతి భ్రమల ఆధునిక రూపాలు.
గుహ భ్రమలు: వ్యక్తిగత పక్షపాతాలు. ఉదాహరణకు, సోషల్ మీడియా ఎకో ఛాంబర్స్, ఇవి వ్యక్తులను తమ దృక్కోణంలో ఇరుక్కుపోయేలా చేస్తాయి. Brainwashing కూడా.
మార్కెట్ భ్రమలు: ఆధునిక భాషలో “ఫేక్ న్యూస్” లేదా తప్పుడు సమాచారం వ్యాప్తి, ఇవి భాష దుర్వినియోగం వల్ల సృష్టించబడతాయి.
నాటక భ్రమలు: ఆధునిక సమాజంలో సాంప్రదాయ లేదా శాస్త్రీయంగా నిరూపితం కాని ఆలోచనలు. ఉదాహరణకు కొన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిద్ధాంతాలు, నాటక భ్రమల ఉదాహరణలు.
ఉదాహరణలతో వివరణ..
జాతి భ్రమలు: ఒక వ్యక్తి ఆకాశంలో మేఘాల ఆకారాలను చూసి, అవి జంతువులు లేదా వస్తువుల ఆకారంలా ఉన్నాయని భావిస్తాడు. ఇది మనస్సు నమూనాలను గుర్తించే సహజ ధోరణి.
గుహ భ్రమలు: ఒక శాస్త్రవేత్త తన రంగంలోని ఒక సిద్ధాంతాన్ని మాత్రమే నమ్మి, ఇతర రంగాల నుంచి వచ్చే ఆధారాలను విస్మరిస్తాడు. ఉదాహరణకు ఒక భౌతిక శాస్త్రవేత్త జీవశాస్త్ర సమస్యలను భౌతిక శాస్త్ర సూత్రాలతో మాత్రమే వివరించడానికి ప్రయత్నిస్తాడు.
మార్కెట్ భ్రమలు: ఆధునిక శాస్త్రంలో “క్వాంటమ్” అనే పదం తరచుగా అస్పష్టంగా ఉపయోగించబడుతుంది. ఇది తప్పుడు అవగాహనలకు దారితీస్తుంది. ఇది కొన్ని రంగాల వారికి fashionable word కూడా. పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ వారు తరచుగా క్వాంటమ్ సైన్స్ అంటూ కొన్ని తప్పుడు సిద్ధాంతాలను రుద్దే ప్రయత్నం చేస్తుండటం గమనించదగిన విషయం.
నాటక భ్రమలు: పురాతన కాలంలో “భూమి బల్లపరుపుగా ఉంది” అనే నమ్మకం లేదా ఆధునిక కాలంలో కొన్ని కాన్స్పిరసీ థియరీలు నాటక భ్రమలకు ఉదాహరణలు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.