
ఫొటో క్రెడిట్: పీటీఐ
సింగపూర్‌లో జరుగుతున్న షాంగ్రీల డైలాగ్ వేదికగా భారత్ పాకిస్తాన్ ఉన్నత సైనిక అధికారులు వాగ్వాదానికి దిగారు. షాంగ్రిలా డైలాగ్ రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఆసియాలో జరిగే అత్యున్నతమైన చర్చా వేదిక. భారత్ పాకిస్తాన్ల మధ్య తాజాగా జరిగిన సైనిక ఉద్రిక్తతల నడుమ ఇరుదేశాల ఉన్నత సైనిక అధికారులు తమ వాదనలను చర్చకు పెట్టే ప్రయత్నంలో మాటా మాటా పెరిగాయని ఛానల్ న్యూస్ ఏషియా కథనాన్ని ప్రసారం చేసింది. ప్రాంతీయ సంక్షోభ నివారణ చర్యలు రక్షణాత్మక పరిష్కారాలు అన్న అంశంపై శనివారం రాత్రి షాంగ్రీల డైలాగ్‌లో భాగంగా చర్చలు జరిగాయి.
పాకిస్తాన్‌కు రెడ్ లైన్ వార్నింగ్..
ఉగ్రవాదం విషయంలో భారతదేశం ఏమాత్రం సహనం పాటించదని భారత సర్వ సైన్యాధికారి(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) అనిల్ చౌహాన్ హెచ్చరించారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ రాజకీయంగా భారత ప్రభుత్వం ఎటువంటి ఉగ్రవాదం అయినా సహించేది లేదని స్పష్టం చేసిందని చెప్పారు.
తాజా సైనిక చర్య పొరుగుదేశానికి ఒక హెచ్చరికగా పనిచేయాలని, భారతదేశం అసహనానికి లోనైతే ఏం జరుగుతుందన్న విషయం తాజా పరిణామాల ద్వారా పాకిస్తాన్‌కు అర్థమయ్యే ఉంటుందని అనిల్ చౌహాన్ అన్నారు. రెండు దశాబ్దాలకు పైగా పరోక్ష యుద్ధం రూపంలో జరుగుతున్న ఉగ్రవాద చర్యల వలన భారతదేశం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిందని ఇక దీనికి స్వస్తి చెప్పాలనుకుంటున్నామని ఆయన తెలిపారు.
పాకిస్తాన్ స్పందన..
మరోసారి భారత పాకిస్తాన్ల మధ్య ఘర్షణ జరిగితే పరిస్థితి ఇలాగే ఉండదని పాకిస్తాన్ తరఫున పాల్గొన్న జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ అధ్యక్షులు జనరల్ శంషాద్ మీర్జా అన్నారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘర్షణలు జరిగితే సరిహద్దులు అవరోధం కాబోవని నగరాలే లక్ష్యాలుగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. మరోసారి ఇటువంటి పరిస్థితులు తలెత్తితే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవటానికి ముందే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని శంషాద్ మీర్జా చెప్పారు. ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శంషాద్ మీర్జా పాకిస్తాన్ భూభాగంలో తలెత్తుతున్న ఉగ్రవాద సంస్థలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అదే సమయంలో తాలిబాన్ పాలిత ఆప్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్లో చొరబడుతున్న సీమాంతర ఉగ్రవాదాన్ని కూడా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఉగ్రవాదం కారణంగా తమ దేశం లక్షల కోట్ల డాలర్ల రూపాయలతో పాటు వేలాదిమంది ప్రాణాలు కూడా నష్టపోయిందని వెల్లడించారు.
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు పర్యటిస్తున్నాయి. ఇదే తరహాలో పాకిస్తాన్ కూడా జూన్ రెండో తేదీ నుంచి తమ ప్రతినిధి బృంధాలను వివిధ దేశాలకు పంపి తమ వాదనను వినిపించనున్నది.
భారతదేశం సాయుధ స్వయంప్రతి కలిగిన దేశం: చౌహాన్
భారతదేశం తన సైనిక అవసరాలు తీర్చుకోవడానికి ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని సర్వ సైన్యాధికారి అనిల్ చౌహాన్ వ్యాఖ్యానించినట్లు ఆ పత్రిక నమోదుచేసింది. ఇప్పటికే భారతదేశానికి వైవిద్య భరితమైన సాయుధసైనిక సంపత్తి సామర్థ్యాలు ఉన్నాయని ఈ మధ్యకాలంలో ఈ సామర్ధ్యాలను వినియోగంలోకి తెచ్చామని అనిల్ చౌహాన్ తెలిపారు.
ఛానల్ న్యూస్ ఏషియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాకిస్తాన్ సర్వ సైన్యాధికారి జనరల్ శంషాద్ మీర్జా ప్రపంచంలో ఆయుధోత్పత్తులు చేసే అన్ని దేశాల నుంచి తాము ఆయుధాలు దిగుమతి చేసుకున్నామని తెలిపారు.
తాజాగా జరిగిన సైనిక ఘర్షణలలో భాగంగా అణ్వస్త్ర సామర్థ్యాన్ని ప్రయోగించాలన్న ప్రతిపాదన తమ ఎజెండాలో లేదని తెలియజేశారు. పత్రికల్లో వచ్చినట్టుగా పాకిస్తాన్ ప్రభుత్వం న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ కమిటీ మీటింగ్ జరపలేదని, అది తప్పుడు వార్త అని మీర్జా కొట్టి పారేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.