
తమ రచన వ్యాసంగాన్ని కొనసాగించేందుకు గుగివా థియాంగో చెల్లించిన మూల్యం మరే కాల్పనిక కథల రచయితా చెల్లించి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. నైరోబి విశ్వ విద్యాలయంలో అధ్యాపక వృత్తి కోల్పోయాడు. జైలు పాలయ్యాడు. ఏళ్ళ తరబడి ప్రవాస జీవితం అనుభవించాడు. కెన్యా పర్యటనకు వచ్చినపుడు ఆయనపై దాడులు జరిగాయి. ఆయన్ను దోచుకున్నారు. ఆయన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టారు.
కష్టాలు విషమ పరిస్థితులు గూగికి కొత్తమీ కాదు. ఆయన యవ్వనంలో బ్రిటిష్ వలసగా ఉన్న కెన్యాను చూశాడు. గూగి సోదరుడు చెవిటివాడు కావడంతో బ్రిటిష్ అధికారి ఆదేశాలు వినపడక తాను వెళ్ళిపోతూ ఉంటే అతన్ని కాల్చి చంపారు. చారిత్రాత్మక తిరుగుబాటును దగ్గర నుండి చూశాడు. అందులో భాగస్వామి కూడా. తిరుగుబాటు సమయంలో ఆయన స్వగ్రామమైన మౌమౌను బ్రిటిష్ సైన్యం నేలమట్టం చేసింది. గూగి తల్లి అరెస్ట్ అయి మూడు నెలల పాటు కారాగారంలో ఒంటరిగా శిక్ష అనుభవించారు.
ఈ అనుభవాలు జ్ఞాపకాలు గూగిలో వలసవాద వ్యతిరేకత, సామ్రాజ్యవాద వ్యతిరేకతను నింపాయి. మార్క్సిజం వైపు అడుగులు వేయించాయి. ఆయనను సృజనాత్మక సైనికుడిగా మార్చాయి. ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకొని ఆయన జైల్లో ఉన్నప్పుడు మల శుద్ధి కోసం వాడే కాగితంపై రాసిన నవల శిలువనెక్కిన దయ్యం విడుదలైంది.
ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు జేమ్స్ గూగి. 1970 ప్రాంతంలో తాను పేరు మార్చుకునేసరికి కెన్యా కూడా స్వతంత్ర దేశంగా మారింది. అయినా వలసవాద వారసత్వం అణిచివేత రూళ్ళకర్ర లాగా కొనసాగుతూనే ఉన్నాయి.
దాదాపు 17 ఏళ్ల పాటు ఇంగ్లీషులో రచన వ్యాసంగాన్ని సాగించిన గూగి తర్వాత 1977లో ఇంగ్లీష్ వ్యాసంగాన్ని త్యజించి తన మాతృభాష అయిన గికుయులో రచనా వ్యాసంగం ప్రారంభించారు. అదేమంత తేలికైన పనేమీ కాదు. ఆంగ్ల భాష వలస పాలకుల భాష. సందేహం లేదు. అదే సమయంలో అది అంతర్జాతీయ భాష కూడా. ఆంగ్ల రచయితలకు అంతర్జాతీయ పాఠకులు ఉంటారు. సాహిత్యం సృష్టికి, సారస్వత రంగంలో కృషికి ఆంగ్ల మాధ్యమానికి ఉన్నంత అవకాశం ఇతర భాషలకు ఉండదు. ప్రచురణ కర్తలు, వ్యాఖ్యాతలు, విశ్లేషకులు, విశ్వ విద్యాలయాల్లో కోర్సులు అన్ని ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంటాయి. మాండలికం అయిన గికుయుకు ఇటువంటి హంగులు, ఆర్భాటాలు, అవకాశాలు విస్తృతి ఏమీ లేవు. వలస దేశాల్లో అనేక భాషలకు నేటికీ లిపి లేదు.
అప్పట్లో ఆంగ్లం ఒక చెరసాల లాంటిది. అదే సమయంలో విశ్వాన్ని చేరుకోవటానికి ఆంగ్లం గవాక్షం కూడా. ఈ మౌలిక వైరుధ్యం ఆఫ్రికన్ భాషల్లో రాసే రచయితలు అందరికీ తెలుసు. అయినా ఎంతోమంది మనసు చంపుకొని ఇంగ్లీష్లోనే రాస్తూనే ఉంటారు. నైజీరియాకు చెందిన చెన్నువా అచేబే గూగివాకు ముందరి తరం వాడు. ఆయన మాటల్లో “ఎవరి కోసమో తమ మాతృభాషను త్యజించటం సరైనదేనా? అది ప్రమాదకరమైన జ్ఞాపకం. రచయితకు తప్పు చేస్తున్నానన్న భావన కలిగిస్తుంది. కానీ నాకు మరో మార్గం లేదు. నాకు ఆ భాష అంటకట్టారు అదే కొనసాగించాను” అంటూ ” ఏది ఏమైనా నా ఆఫ్రికా జీవన భారాన్ని, సారాన్ని తెలియజేయటానికి నూతన పదాలతో కూడిన ఆంగ్లం కావాలి. ఆఫ్రికా ప్రత్యేకతలకు అనుగుణంగా మలుచుకోగలిగిన భాష కావాలి” అన్నారు.
ఈ దిశగా గూగి మరో అడుగు ముందుకు వేశారు. ఆయన దృష్టిలో ” భాష అత్యంత పదునైన సాధనం. అధికార వ్యక్తీకరణకూ, మనసును కట్టిపడేయడానికి ఉపయోగపడే సాధనం. తుపాకీ భౌతిక అణిచివేతకు చిహ్నం అయితే భాష ఆధ్యాత్మిక అణిచివేతకు సాధనం” ఈ వ్యాఖ్యానంలో వర్గ దృక్పథం కూడా ఉంది. యూరోపియన్ భాషల్లో వెలువడిన ఆఫ్రికా సాహిత్యం పెట్టీ బూర్జువా దృష్టి కోణాల్ని అందిస్తుంది. పెట్టి బూర్జువా వర్గానికి, బూర్జువా వర్గానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందన్న మాట వాస్తవమే. పెట్టి బూర్జువా వర్గం ఏకశిలా సదృశ్యం కాదు. సామ్రాజ్యవాద దళారులు, జాతీయవాదులు మొదలు సోషలిస్టుల వరకు ఎవరైనా ఈ శ్రేణిలో ఇమిడిపోతారు. వీరు సృష్టించిన సాహిత్యం ప్రపంచం ముందు ఆఫ్రికాను ఆఫ్రికా జాతీయులను ఆత్మగౌరవంతో నిలబెట్టింది అనటంలో సందేహం లేదు. కాకపోతే ఆత్మగౌరవం మాటున అణిగి ఉన్న వర్గ స్వభావాన్ని ఈ సాహిత్యం విపులీకరించలేదు.
సామ్రాజ్యవాదుల భాషను త్యజించడం మినహా. తన వాళ్లైన కార్మికులు, రైతాంగం మాట్లాడే భాషను ఆలింగనం చేసుకోవడం, ఆ భాషలోనే ఆలోచనలను ఆత్మను సాక్షాత్కరించుకోవటం తప్ప. గూగికి మరో ప్రత్యామ్నాయం లేదు. ఆయన చేసింది కూడా అదే.
భాష వస్త్రధారణ కాదు, అది వదిలేసి నచ్చిన చొక్కా తొడుక్కోవటానికి. ఏ భాష కైనా ద్వంద్వ లక్షణాలు ఉంటాయి. విషయ వ్యక్తీకరణ వాహకం మాత్రమే కాదు. సాంస్కృతిక వ్యక్తీకరణ సాధనం కూడా.
మాతృభాష గికుయులో ఆయన తొలి రచన ఒక నాటిక. కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటాను అన్నది ఆ నాటిక శీర్షిక. గుగివా మిరితో కలిసి రాశారు. తరువాత శిలువనెక్కిన దెయ్యం అనే నవల, నా కోసం అమ్మ పాడిన పాట సంగీత రూపకం ఇలా ఎన్నో రచనలు వెలబడ్డాయి. 2006లో నల్లకాకి మాంత్రికుడు కూడా ఈ క్రమంలో వెలువడినదే.
నాటిక రూపొందిన తీరు కూడా ఆసక్తికరమైనది. 1976లో ఒకరోజు పొరుగునున్న కమిరిత్తు గ్రామానికి చెందిన మహిళ గుగి వద్దకు వచ్చి నువ్వు బాగా చదువుకున్నావు కదా, పుస్తాకాలు కూడా రాస్తున్నావంట కదా. నీకొచ్చిన చదువు గ్రామంలో పిల్లలు కూడా కొద్దిగా నేర్పొచ్చుగా అని అడిగిందట. ఆ గ్రామంలో ఒక యువజన కేంద్రం లాంటిది ఉందని దాన్ని పునరుద్ధరించాలనుకుంటున్నామని ఆమె చెప్పిందట. గూగికి విసుగు వచ్చేంత వరకు ఆమె ప్రతివారం వచ్చి వెళ్లేదట. ఆ విధంగా ఆయనకు కమిరిత్తు గ్రామ యువజన సాంస్కృతిక కేంద్రంతో అనుబంధం ఏర్పడింది.
యువజన కేంద్రం కార్యకలాపాలలో కళారూపాల ప్రదర్శనది కీలక స్థానం. కెన్యా పౌరుల, ఆఫ్రికా పౌరుల ఆత్మ గౌరవానికి సంబంధించిన కళారూపాలు తయారయ్యాయి. ఆత్మగౌరవ ఉద్యమంలో అక్షరాస్యత ఉద్యమం ఒక భాగమైతే దేశవాళీ కళారూపాల నిర్మాణం మరో భాగం.
అయితే అప్పటికి వాళ్లకి స్థానికంగా నాటక సమాజాలు లేవు. అది ఒక ఆటస్థలం. అక్కడ కొంత భాగాన్ని శుభ్రం చేసి చదును చేసి స్థానిక రైతులు వేదిక ఏర్పాటు చేశారు. ప్రదర్శనకు అవసరమయిన తాత్కాలిక ఏర్పాటు చేశారు. తర్వాత రోజుల్లో గూగి చెప్పినట్లు ” కళావేదికనేది ఒక భవనం కాదు. ప్రజలు ఉంటేనే కళావేదికకు అలంకారం. వారి జీవితం, జీవనమే కళారూపానికి సారం.”
సాధారణ శ్రామిక జనావళి కథలు, కథనాలు కళారూపాలుగా మార్చేటప్పుడు ఏ భాష వాడాలి? ప్రజలకు అర్థం కాని పరాయి భాష కాదు కదా. వారి జీవితానికి, చరిత్రకు, సాంస్కృతిక వారసత్వానికి సంబంధం లేని భాషను వాడలేము కదా. ఈ సందర్భంలోనే గూగి ” సాంస్కృతిక జీవితంలో నా గతంతో తెగ తెంపులు చేసుకొని స్థానిక గీకుయు భాషలో రాయటం మొదలు పెట్టాను. ఒక రకంగా అది నాకు పెద్ద మలుపు.” అన్నారు.
గుగివా మేరితో కలిసి రూపొందించిన “నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటా” అన్న నాటిక వలస పాలన నాటి గ్రామీణ వ్యవసాయాధారిత ప్రజానీకం కార్మిక వర్గంగా పరిణామం చెందే క్రమాన్ని విశ్లేషించి వ్యక్తీకరించే నాటిక. ఎకరంన్నర భూమిలో చాలీచాలని ఆదాయంతో పొట్టపోసుకోవటానికి వేతన కూలీలుగా మారిన కిగుండ కుటుంబం చివరకు దళారీ వ్యాపారుల సహాయంతో అమెరికా జపాన్ యూరప్ దేశాల వ్యాపారవేత్తల సమన్వయంతో ఏర్పాటయిన బహుజాతి కంపెనీ దెబ్బకి ఉన్న పొలం కాస్త కోల్పోయి పూర్తిగా కార్మికుడిగా మారిన కథ ఈ నాటిక. ఈ నాటిక గురించి విన్నప్పుడు 1952లో బిమల్ రాయ్ రూపొందించిన దో భిగా జమీన్ సినిమా గుర్తుకొస్తుంది. గూగి మేరీ, కియాంగోలు ఈ సినిమా చూశారని కాదు. వలస దేశాలలో వలసానంతర కాలంలో జరుగుతున్న సామాజిక పరిణామాన్ని రెండు కళారూపాలు ఒకే రకంగా ప్రతిఫలిస్తున్నాయి
ఆ నాటిక రిహార్సల్స్ బహిరంగ ప్రదేశంలో జరుగుతూ ఉండేవి. దాంతో గ్రామస్తులు అంతా గుమి గూడి చూసేవాళ్ళు. కొంతకాలం గడిచేటప్పటికీ ఆ నాటికలో మాటలన్నీ ఎక్కువ మంది గ్రామస్తులకు కంఠత వచ్చేశాయి. రోజు సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళ బంధుమిత్రులను, కుటుంబ సభ్యులను వెంటనే తెచ్చే వాళ్ళు. ఆ విధంగా నాటక ప్రదర్శన కంటే ముందే ఊరు ఊరంతా నాటికను చూసింది. రిహార్సులు జరుగుతున్నప్పుడే చాలామంది విలువైన సూచనలు, సలహాలు అందించారు. అసలు నాటికలు ప్రదర్శిస్తే చూడటానికి జనం సిద్ధంగా ఉన్నారా అన్న ప్రశ్న గూగి మెదడులో మెదులుతున్నప్పుడు, విలువైన ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రదర్శన అన్న అవగాహనను గూగి ఈ విధంగా అమలు చేశాడు.
1977 అక్టోబర్ 22న జరిగిన నాటిక తొలి ప్రదర్శన బ్రహ్మాండంగా విజయవంతమైంది. గ్రామస్తులంతా వచ్చారు. కేవలం ప్రేక్షకులుగా మాత్రమే కాదు. తామే అన్ని అయి నాటికి ప్రదర్శనకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఇది వాళ్ళ గ్రామంలో రూపొందించుకున్న నాటిక. అందుకే ఇరుగుపొరుగున ఉన్న సుదూర గ్రామాలలో ప్రజలకు కూడా ఈ నాటిక ప్రదర్శన గురించి ప్రచారం చేశారు. ఆ నాటిక ప్రదర్శనే ఒక సాంస్కృతిక ఉత్సవం లాగా మారింది. ఒకరోజు ఈ నాటిక ప్రదర్శిస్తున్నప్పుడు కుండపోత వర్షం కురుస్తుంది. దాంతో కళాకారులు ప్రజలు అందుబాటులో ఉన్న చెట్టు నీడకో చూరు నీడకో చేరుకున్నారు. ఎన్నిసార్లు వర్షం కారణంగా ఆపి నాటిక ప్రదర్శన ప్రారంభించాల్సి వచ్చిన ఏ ఒక్కరు కదలకుండా ఉన్నారు. ఆ నాటిక జనాన్ని అలా ఆకట్టుకుంది.
చాలా రోజులపాటు వారి గ్రామంలో నాటిక ప్రదర్శించారు. అదో విజయం. 1977 నవంబర్ 16వ తేదీ వరకు ఈ నాటిక ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. ఆరోజున కెన్యా ప్రభుత్వం నాటిక ప్రదర్శనపై నిషేధం విధించడమే కాకుండా గూగితో సహా ప్రదర్శనకారులను అరెస్ట్ చేసింది. గూగిని అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయం నడుమ ప్రత్యేకంగా జైల్లో ఉంచారు.
2018 ఫిబ్రవరిలో నేను గూగిని కలిశాను. కోల్కతాలోను ఢిల్లీలోను కొన్ని గంటల పాటు ఆయనతో ముచ్చటించే అవకాశం దొరికింది. కలకత్తా కేంద్రంగా ఉన్న సీగల్ బుక్స్ గూగి రచనలను భారతదేశంలో ప్రచురించింది. ఆ సందర్భంగా కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ ఆవరణలో ఆయనతో ముఖాముఖి ఆయన రచనల గురించి చర్చించేందుకు సైకిల్ పబ్లిషర్స్ నన్ను ఆహ్వానించారు. న్యూస్ క్లిక్ వార్తా సంస్థ కోసం ఢిల్లీలో కూడా ఆయనను ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూలో నేను ప్రశ్నలు వేయటం ఆయన సమాధానం చెప్పడం కనిపిస్తుంది. కానీ మాట మంతిలో మాత్రం ఆయనవే ప్రశ్నలు. నేను సమాధానం చెప్పేవాడిని. భారతదేశం పట్ల ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేది. ఇన్ని భాషలు ఆయా భాషల నుంచి వచ్చే సాహిత్యం, వాటిపై జరిగే చర్చ, భారత్- పాకిస్తాన్ సంబంధాలు, భారతదేశంలో వామపక్ష ఉద్యమం ప్రత్యేకించి భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు) పోరాటాలు, కృషి గురించి, నాటక రచయిత అయిన మా నాన్న గురించి, నా ఆహారపు అలవాట్లు ఆసక్తులు వంటి అనేక విషయాల గురించి ముచ్చటించుకునేవాళ్ళం.
తర్వాత మరోసారి సంభాషణ ఈమెయిల్ ద్వారా జరిగింది. విజయ ప్రసాద్ సంపాదకత్వంలో వెలువడిన ఎర్రబారిన తూర్పు తీరం: మూడో ప్రపంచ దేశాల్లో సోషలిస్టు సంస్కృతి తన గ్రంథాన్ని వెలువరించే క్రమంలో ఆయనతో ఈమెయిల్ ద్వారా సంభాషణ నడిపాను. పెటల్స్ ఆఫ్ బ్లడ్ రాసేటప్పుడు సోవియట్ యూనియన్ ఆయనకు అందించిన సహాయం గురించి ఒక వ్యాసం రాశారు. ఈ పుస్తకంలోనే దీపా బాష్టి కూడా కమ్యూనిస్టు అయిన తన తాత గ్రంథాలయం గురించి ఒక వ్యాసం రాశారు. ఈ మధ్యనే దీపా భాష్టి ఇంటర్నేషనల్ బుకర్ బహుమతి పొందారు. ఇదే బహుమతిని కొన్నేళ్ళ క్రితం గూగి కూడా పొందారు. ఇంకా చెప్పాలంటే తన పుస్తకాన్ని అనువాదం చేసినందుకు తనకే అవార్డు ఇచ్చారు. ఆ విధంగా అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా గూగి అంతర్జాతీయ సాహిత్య రంగంలో చరిత్ర సృష్టించారు. అంతేకాదు ఒక ఆఫ్రికా ఖండానికి చెందిన భాషలో రాసిన రచయితకు అంతర్జాతీయ బహుమతి దక్కటం గూగితో మాత్రమే సాధ్యమైంది.
ఆయనను నేను ఒక మాట అడిగాను. మరుగుదొడ్డిలో ఉపయోగించే కాగితం చాలా పల్చగా ఉంటుంది దాని మీద నీకు ఎలా రాయటానికి సాధ్యమైంది అని అడిగాను. దానికి ఆయన నవ్వుతూ మాకు జైల్లో ఇచ్చిన మల శుద్ధి కాగితాలు చాలా మందపాటివి. వాటిని ప్రయోగిస్తే శరీరంపై పొక్కులు వచ్చేవి. అంత మందపాటి కాగితాలు మాకు ఇవ్వటంలో కూడా వాళ్ళ ఉద్దేశం అదే. కానీ నేను ఆ కాగితాల మీదనే సాహిత్యం సృష్టించి వారిపైనే ప్రయోగించాను అన్నారు.
సుధన్వ దేశ్ పాండే
అనువాదం: కొండూరి వీరయ్య
ప్రపంచ సాహిత్యంలో శిఖరాయమానంగా వెలుగొందిన ఈ మహా రచయితకు ప్రపంచం నివాళులర్పిస్తుంది.
(సుధన్వ దేశ్ పాండే ప్రచురణకర్త, నటుడు, లెఫ్ట్ వర్డ్ బుక్స్ 2020లో ప్రచురించిన అల్లా బోల్: సర్దార్ హష్మీ మరణం- జీవితం గ్రంథ రచయిత.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.