
మతమెరుగని మానవతానగరి
భాగమతి ప్రేమైక సుందర స్వప్ని భాగ్యనగరి
హిందూ ముస్లిం, సిక్కు- పార్సీ “బహు మత” సంగమం
గంగాజమునా తెహజీబ్‌కు సాక్షి ఈ భాగ్యనగరి
రాజరిక నియంతలకుగోరి కట్టిన సామాన్యుడి తెగువ
పోరువీరుల త్యాగాల మాగాణం ఈ భాగ్యనగరి
భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ప్రతీక
శాంతి సామరస్యాల సుప్రభాతిని నా భాగ్యనగరి
కులమతాతీత సమైక్య ప్రజానిలయి
లౌకిక భారతికి అర్ధం అద్దం నా భాగ్యనగరి
బోనాలు బతుకమ్మలు రంజాన్ క్రిస్మ్మస్లు
పంద్రాగస్టు రిపబ్లిక్లు పండుగేదైనా
ప్రజా ఆనందాల సాగరి నా భాగ్యనగరి
వీరతెలంగాణ పోరుకు రాగాల శృతులు
వీరగాథల కృతులందించిన కోటిరతనాల వీణ
పోరు తంత్రులు మీటుతోంది జనతంత్రానికై
రామదాసు పోతనల భక్తితత్త్వం సూఫీ భైరాగుల ఏకత్వం
మగ్దూం, బద్దంల సామ్యవాదం
జయశంకర్, కొండా లక్ష్మణ్‌ల ఆశయం నవ తెలంగాణం
దక్కన్ ల్యాండ్‌కు, చైతన్య వెలుగు దివ్వెలు
పాలకులు పార్టీలు జెండాలు ఎజెండాలు ఏమైనా!
ప్రజా ఆకాంక్షలు తీర్చడమే జాతి భవితకు శ్రేయోమార్గం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.