
మన విద్యావిధానం గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు రోగనిర్ధారణ సంగతి చూద్దాం. విద్యార్థి అంటే జ్ఞానాన్ని సముపార్జించేవాడు అన్న అర్ధం ఇవాల్టి రోజున పూర్తిగా మసకబారిపోయింది. విద్య ఇవాళ ఒక పోరాట యోధురాలిగా మారిపోయింది. జ్ఞాన సాధన లక్ష్యంగా కాదు, తన అర్ధాన్ని పరమార్థాన్ని అన్వేషించడం కోసం, తన చుట్టూ ఉన్న ప్రపంచంతో సంభాషించడం కోసం కాదు. ఆ ప్రపంచంతో యుద్ధం చెయ్యడం కోసం. తరగతి గది ఇప్పుడు తళుకులీనుతున్న వెండితెరగా మారింది. తోటి విద్యార్థుల బృందం ఒక ఆల్గరిథమ్గా మారింది. తరగతి గది విస్ఫోటనాస్థలిగా మారింది. సుహ్రుద్భావ సంబంధాలు కొరవడిన మూలంగా ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. అంతర్ముఖీనత పెరిగిపోతుంది. ఆందోళనకు లోనుకావడం పరిపాటిగా మారింది. హింసాత్మక ప్రవృత్తి పెరిగిపోతుంది. మాదక ద్రవ్యాలకు అలవాటుపడడం, బలవన్మరణాలకు పాల్పడడానికి దారి తీస్తుంది. విద్యసాధనా పరికరానికి(డివైజ్) ముడిపడి వ్యక్తికేంద్రకంగా తయారయి అర్థరహితంగా మారిపోయింది.
కొరియా- జర్మన్ తత్వవేత్త బైయుంగ్- చుల్హాన్ ఈ పరిస్థితులను”సంక్షుభిత సమాజం”గా అభివర్ణించాడు. స్వేచ్ఛ, ఉత్పాదకత, ప్రతిభ పొందడం కోసం బాహ్య నిర్బంధాల నుంచి విముక్తి కావడం పేరిట వ్యక్తులు తమని తాము ధ్వంసం చేసుకోవడం ఈ “సంక్షుభిత సమాజ” లక్షణాలుగా బైయుంగ్ వివరిస్తాడు. విద్యార్థులు ప్రస్థుతం విద్యానియంతృత్వం కింద నలిగిపోతున్నారు. ప్రస్థుత విద్యావ్యవస్థ విద్యార్థులను బహుళ లక్ష్యాలు సాధించాలని, నిరంతరం అందుబాటులో ఉండాలని శాసిస్తుంది. ఇది ప్రత్యక్షంగా కనబడని నరకయాతన, నిశ్శబ్ధంగా, అంతర్గతంగా ప్రభావం చూపిస్తున్నది. అంతమాత్రాన ఇది తక్కువ ప్రాణాంతకమని భావించనవసరం లేదు.
విద్య అంటే ఒకప్పుడు సామూహిక తత్వం, ప్రశ్నించే ధోరణి అలవరుచుకోవడం, ఒకరికొకరు తోడుగా నిలబడడం, తనకు తానుగా ఈ ప్రపంచంతో అనుసంధానించుకోవడం. కానీ మన ప్రస్థుత విద్యావ్యవస్థ ఒంటరి ద్వీప సమూహాలను తయారు చేస్తుంది. విద్యార్థుల సమూహాన్ని చిద్రుపలు చేసి, అలసిసొలసి డస్సిపోయేలా చేస్తుంది.
విద్యార్థులలో సహానుభూతిని పెంపొందించడానికి బదులు ఒకరి మీద మరొకరు పైచెయ్యి సాధించడానికి నిరంతరం యుద్ధానికి సిద్ధపడేలా తయారు చేస్తుంది. దీనికోసం విద్య అవసరం లేదు. పోరాటానికి సిద్ధపడడానికి ఆలోచనరాహిత్యం, సహజాత ప్రవృత్తి ఉంటే చాలు. ఎలాంటి సిలబస్‌తో పని లేకుండా జంతువులు ఈ కళలో ఆరితేరి ఉంటాయి.
ఇంక ఉపాధ్యాయుల సంగతి చూస్తే..
ఒకప్పుడు భావజాల పరంపరకు మంత్రసానులుగా ఖ్యాతికి ఎక్కిన ఉపాధ్యాయులు కూడా ఈ నిశ్శబ్ధ యుద్ధానికి సమిధలుగా మారారు. ఆహ్లాదకరమైన శిక్షణకు, సందేహాలు తీర్చడానికి, గందరగోళాన్ని పారద్రోలి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దే సృష్టికర్త స్థానాన్ని కోల్పోయారు. బతకడం కోసం బడి పంతుళ్లుగా మారారు. ఏపీఐ స్కోరు, ప్రచురణల పర్వం, పదోన్నతుల యావలో పడిపోయారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కంటే ర్యాంకుల సాధకులుగా మార్చడంలో నిమగ్నమైపోయారు. చదువుల మీద శ్రద్ధ పెట్టడం కంటే ర్యాంకుల వ్యవస్థలో పై మెట్టు మీద ఉండడమే బోధనావృత్తిలో ముందంజ వెయ్యడంగా భావించి ఈ యుద్ధంలో ఎవరికివారు గెలుపుకోసం పాకులాడుతున్నారు.
పోనీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇంతకంటే భిన్నంగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఒకప్పుడు భావజాల సంఘర్షణకు, అసమ్మతి స్వరాలకు ప్రయోగశాలలుగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నేడు ప్రామాణీకరించబడిన మూసలో నిర్బంధ యుద్ధానికి పాల్పడుతున్నాయి. బోధనాత్మక పరికల్పన, మేధస్సుల స్థానంలోకి “న్యాక్”(ఎన్ఎసీసీ), ఎన్ఐఆర్ఎఫ్ స్కోర్లు, ర్యాంకింగ్‌లు వచ్చి చేరాయి. అక్రెడిషన్లు, గ్రేడింగ్‌లు, ఎంఓయులు, ఆడిట్లు- నిరంతరం వీటిలో మునిగి తేలుతున్నాయి. ఈ ప్రపంచాన్ని ఎలా వివరించాలో ఒక నమూనా సిద్ధం చేసేశాక ఇక ఈ ప్రపంచం గురించి కొత్తగా ఆలోచించడానికి అవకాశమే లేకుండా పోయింది. మన విద్యాసంస్థల విలువ ఏ పాటిదో అంతర్జాతీయ ప్రమాణాలు తూకం వేస్తున్న నేపథ్యంలో స్థానీయతకు సంబంధించిన సవాళ్లను సృజనాత్మకంగా ఎలా ఎదుర్కోవాలనే చర్చకు స్థానం లేకుండా పోయింది. అసాధారణ ఆలోచనలకు, పరికల్పనలకు అభయారణ్యాలుగా కొనసాగాల్సిన విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం ఉద్యోగార్థులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా తయారయ్యాయి.
విద్యార్థులు తమతో యుద్ధాలకు పూనుకుంటూ, అధ్యాపకులు తమ వృత్తితో యుద్ధం కావిస్తూ, విశ్వవిద్యాలయాలు సృజనాత్మకతపై యుద్ధం ప్రకటిస్తున్న ప్రస్తుతం నేపథ్యం శాశ్వత యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నది. ఈ యుద్ధం కాస్త భిన్నమైనది. ఈ యుద్ధం అసమ్మతికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడినది. తాను కాలుమోపిన భూమిపైన సాగిస్తున్న యుద్ధం ఇది. సకల శాస్త్రాలతో సాగిస్తున్న యుద్ధం ఇది.
విద్యార్థులు ప్రశ్నించడం మానుకుంటే..
జాతీయ విద్యావిధానం 2020 ఈ సంక్షోభానికి ఆరంభం కాదు. దీర్ఘకాలంగా మన విద్యావ్యవస్థను కుళ్లగిస్తున్న తర్కాన్ని పీడీఎఫ్‌ల రూపంలో నదురుగా రూపొందించిన విధాన(పాలసీ) ప్రకటనకు ప్రతిరూపమే ఈ జాతీయ విద్యావిధానం- 2020. ఈ విధానం ప్రయోజకత్వాన్ని వాగ్దానం చేస్తుంది. కానీ విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. ఈ విధానం సాధికారత గురించి ఉద్భోదిస్తుంది. కానీ అణిగి ఉండడాన్ని రుద్దుతుంది. 21వ శతాబ్దానికి అవసరమైన ఉద్యోగితా నైపుణ్యాలను అలవరుస్తుందంటూ చేస్తున్న భవిష్య వాగ్దానం వాస్తవానికి ఫ్యూడల్ యుగానికి నడిపిస్తుంది. జాతీయ విద్యావిధాన రూపకల్పన కమిటీ అధ్యక్షుడు కే కస్తూరి రంగన్ అయితే “మార్కెట్ అవసరాలకు తగిన విధంగా సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్ధ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాల వంటివి పెంపొందించిన శ్రామిక శక్తిని” రూపొందించడానికి అనుగుణంగా ఈ నూతన విద్యావిధానం రూపొందించబడినదని సగర్వంగా ప్రకటించారు. అంటే కార్పోరేట్ కంపెనీల అవసరాలకు తగినట్టుగా “క్యూబిపైల్స్”లో యూనిఫారం తొడుక్కుని విధేయంగా ఒదిగిఒదిగి పనిచేసే వారిని తయారు చేస్తామని చెప్పకనే చెప్పాడు ఆయన. ఇవాళ జాతికి అవసరమైనది ప్రశ్నించే గొంతుకలు కాదు. విధేయంగా పని చేసే ఉద్యోగులు, కార్మికులు.
అది విద్యార్థులే కానీ, ప్రజలే కానీ ప్రశ్నించడం మానుకుంటే అణిగిమణిగి ఉండడానికి అలవాటు పడిపోతారు. అధికార నడవాల్లోంచి ప్రచార భ్రమలను వాస్తవమని నమ్మేస్తారు. కాంతి వేగానికి మించిన వేగంతో ప్రయాణించే క్షిపణులను భారతదేశం తయారు చేసిందని ప్రచారం చేస్తే దాన్ని నిజమని నమ్మిన వాళ్లకూ కొదవలేదు. ఒకప్పుడు కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసి టీవీ యాంకర్‌గా అవతారం ఎత్తిన పెద్దమనిషి నాటకీయతతో కూడిన వాచలత్వాన్ని టీవీ తెరల మీద ప్రదర్శించడం, కుహానా దేశభక్తి తలకి ఎక్కిన జనాలను మరింత వెర్రిక్కించే ఉద్దేశ్యంతో ఇలా చెప్పాడా లేదా పూర్తి అజ్ఞానంతో మాట్లాడాడా అన్న విషయాన్ని పక్కనే పెడితే ఇది నిజమని నమ్మిన జనాలకు వ్యూహాత్వకంగా పరిమిత లక్ష్యాలను ఛేదించడానికి ఉద్దేశించిన “సైనిక చర్య”కు యుద్ధానికి మధ్యగల తేడాను గ్రహించ లేనంతటి దుర్దశ దాపురించడం ఎంతటి దయనీయమైన పరిస్థితి?
సైనిక చర్యను యుద్ధంగా భ్రమిసి చేపట్టిన ప్రచారం మూలంగా చెలరేగిన గందరగోళం అంతిమంగా దక్కిన ఫలితాలను జీర్ణం చేసుకోలేని స్థితికి జనాన్ని నెట్టేసింది. అవధులు మించి చేసిన ప్రచారానికో వాస్తవానికి పొంతన లేకుండా పోయింది. చదువుకున్న జనాలు కూడా ఈ ప్రచారంలో పడి కొట్టుకుపోయారంటే వారికి జ్ఞానం లేకనా? నిజం ఏమిటో, అబద్ధం ఏమిటో తేల్చుకోగల వనరులు అందుబాటులో లేకనా? కాదు కదా.. సమాజంలో కుతూహలాన్ని, సందేహించే ధోరణిని, ఆలోచనలను, అన్వేషించే ధోరణులను నిలువుగా ఉప్పు పాతర వెయ్యడం మూలంగా దాపురించిన పరిస్థితులు ఇవి.
మూర్ఖత్వపు సాగు..
“న్యూక్లియర్ వార్ హెడ్” తగిలించిన బాలిస్టిక్ క్షిపణిని క్రికెట్ ఆటలో బౌండరీలైన్ దగ్గర బంతిని ఆటగాడు “క్యాచ్” పట్టినట్లు గాల్లో అడ్డుకోవచ్చని చాలా మంది నమ్ముతున్నారంటే దానికి కారణం దేశభక్తి కాదు, కేవలం అజ్ఞానం. ఇది పాలకులు సాగు చేసిన అజ్ఞానం. కొన్ని సంవత్సరాల తరబడి నిరంతరాయంగా స్వార్ధపరశక్తులు సాగిస్తూ వచ్చిన అబద్ధపు ప్రచారాల చీకటి కళ పర్యవసానమే ఈ అజ్ఞానం.
నా బాల్యంలో మళయాళీ లెజెండ్ కార్టూనిస్టు టామ్స్ “బొబ్బనమ్ మోలియమ్”(బొబ్బన్, మోళి) పేరిట ధారావాహికగా కార్టున్లు వేసేవారు. అందులో ఒకదానిలో గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ దినపత్రిక చూస్తూ ఈ భూగోళం మొత్తాన్ని ధ్వంసం చెయ్యగల అణుబాంబును తయారు చేసిన వ్యక్తి గురించిన విశేష వార్తను పైకి చదువుతాడు.
పిల్లలకు సహజంగా ఉండే ఆసక్తి కొద్దీ బొబ్బన్, మోళిలు “ఇలాంటి భయంకరమైన బాంబును కనుగొని ఆ పెద్దమనిషి ఏం సాధించినట్లు” అన్న సందేహం వ్యక్తం చేస్తారు.
అజ్ఞానానికి, వెధవాయిత్వానికి ప్రతీకయిన పంచాయితీ ప్రెసిడెంట్ “మానవాళి అచిరకాలం అతన్ని గుర్తుంచుకుంటుంది” అని గొప్పగా చెపుతాడు.
టామ్స్ దృష్టిలో పంచాయితీ ప్రెసిడెంట్ వ్యంగోక్తికి, వక్రోక్తికి ప్రతీక, అజ్ఞానం- అధికారం కలగలిసిన వ్యక్తి అయినప్పటికీ ఎవరికీ కీడు తలపెట్టని పెద్దమనిషి, కానీ ఇవాళ్టి రోజున ఆఖరుకు పంచాయితీ ప్రెసిడెంట్ కూడా వ్యంగోక్తికి లొంగని మనిషయిపాయే. అధికారం మొత్తాన్ని గుప్పిట చేతబట్టాడు. ప్రైమ్- టైమ్ టీవీ ఛానళ్లలో నిత్యం కనబడుతుంటాడు. విధాన నిర్ణయాలన్నీ ఒంటి చేత్తో తనే చేస్తుంటాడు. ఎంఓయుల మీద సంతకాలు గీరేస్తుంటాడు. క్వాంటమ్ యుద్ధతంత్రం గురించి అంతర్జాతీయ నాయకులకు ఉద్భోదిస్తుంటాడు. చదువులు డొల్లగా మారితే దాపురించే అనర్ధాలు ఇవే. మంత్రిమండలి ఉత్సవ విగ్రహంగా మారుతుంది. భక్తమండలి భజన మాత్రం కొనసాగుతూ ఉంటుంది.
ఇప్పుడు అతను పంచాయితీ ప్రెసిడెంట్ కాదు. దేశవిదేశాలకు ప్రెసిడెంటు. విశ్వాధ్యక్షుడు. ఇలాంటి సందర్భంలోనే టామ్స్ చేసిన మరో కార్టూన్ కథనం నాకు గుర్తుకు వస్తుంది. పంచాయితీ ప్రెసిడెంట్ ఒక మతిస్థిమితం లేని వ్యక్తిని పిచ్చాసుపత్రిలో చేర్పించడానికి తీసుకువెళ్తాడు. తీరా చూస్తే ఆ మతిస్థిమితం లేని వ్యక్తి ఆసుపత్రి వాళ్లని పంచాయితీ ప్రెసిడింట్కే పిచ్చి ఉందని నమ్మించి అతన్ని ఆసుపత్రి పాలుజేయిస్తాడు. “నే చెప్పేది నమ్మరా, పిచ్చి నాకు కాదు నేను పంచాయితీ ప్రెసిడెంట్‌ని” అని డాక్టర్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తే దానికి సమాధానంగ డాక్టర్లు “మీది పిచ్చి కాదు లెండి. త్వరగానే నయం అయిపోతుంది. ఇంతకు ముందయితే ఒకతను అమెరికా ప్రెసిడెంట్‌ని అని చెప్పుకునేవాడు. తనకే నయం చేశాం” అనిచెప్తారు.
ఇక్కడ లాకాన్ తర్క విశేషం ఒకటి మీతో పంచుకవాలి “మతి స్థిమిత లేని వ్యక్తి భిక్షగాడే కాదు. తనని తాను దేశానికి ప్రభువుగా చెప్పుకుంటుంటాడు. కానీ, రాజుగారు మాత్రం తనొక్కడే ప్రభువని అనుకుంటూ ఉంటాడు.” మన పంచాయితీ ప్రెసిడెంట్ విషయంలో కూడా లాకాన్ తర్కం సరిగ్గా అతికినట్లు సరిపోతుంది.
జాతీయ విద్యావిధానం ఉత్తమ విద్యార్థిని రూపొందించే ఉదాత్త లక్ష్యంతో నిర్దేశించినది కాదు. హెర్బల్ట్ మార్క్వెజ్ చెప్పినట్లు ఏక పరిమాణాత్మక జీవులను విధేయంగా చెప్పింది చెప్పినట్లు చేసే మర మనుషులను తయారు చెయ్యడానకి ఉద్దేశించినది. ఆలోచనాశక్తిని పరిహరించి, వైరుధ్యాలను లుప్తం చేసి, బిళ్లబీటుగా వ్యవహరించే విద్యార్థులు మన సంక్లిష్ట ప్రజాస్వామిక వ్యవస్థలో మెరుగైన పౌరుడిగా మసల లేడు. ఐక్యత పేరిట నడిపే జగన్నాటంకంలో మహా అయితే ఒక పాత్రధారిగా మిగులుతాడు. ఒడిదుడుకులు లేని పరిపాలన అందించేందుకు ఎన్నికల పేరిట వృధావ్యయం నివారించేందుకు ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదం మాదిరి “ఒకే ఆలోచన, ఒకే లక్ష్యం” కలల బేహారి అవుతాడు. భిన్నాభిప్రాయాలు పక్కదోవ పట్టించే ఆలోచనలుగా, అసమ్మతి విచ్ఛిన్న శక్తిగా పరిగణించబడతాయి.
మార్కెట్‌కు తయారుగా ఉన్న యంత్రాలు..
జాతీయ విద్యావిధానం- 2020 మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. ప్రతి విద్యాసంస్థలో వృత్తిగతమైన శిక్షణను గరపడం, డిగ్రీ కోర్సులను ముఖ్యంగా ఇంజనీరింగ్, బిజినస్, వ్యవసాయ కోర్సులను పారిశ్రామిక రంగ అవసరాలకు తగినట్లు పునర్మూల్యాంకనం చేశారు. తద్వారా మానవీయ శాస్త్రాల పట్ల ఆసక్తిని నీరుగార్చేశారు. సునిశితైన ఆలోచన ధోరణిని పెంపొందించే ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించే, ప్రజాస్వామిక చైతన్యాన్ని పెంపొదించే ఈ హ్యుమాటిటీస్ కోర్సులను పాలకశక్తులు స్వార్థ, స్వీయ ప్రయోజనా కోసం దెబ్బ తీశాయి. ఈ జాతీయ విద్యావిధానం నిశ్చిత కార్యాచరణ పునాదులను లోపాయకారీగా దెబ్బతీస్తుంది. సామాజిక- విద్యావిషయక వెనుకబాటతనాన్ని అధిగమంచేందుకు రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల సముదాయానికి కల్పించిన రిజర్వేషన్లను దెబ్బతియ్యడానికి పైకి తటస్థంగా కనబడే “ఆర్థికంగా వెనుకబడిన తరగతుల” వారికి అన్న సాంకేతిక పదజాలం చొప్పించింది. “సామాజికంగా- ఆర్థింగా వెనుకబడిన తరగతులు” అన్న పదాన్ని తప్పించేసింది.
ఇదేదో అమాయకంగా చేపట్టిన చర్య అనుకునేరు. కానేకాదు. శతాబ్దాల తరబడిగ కొనసాగుతున్న కులవివక్ష, కులపీడనల మూలంగా నెలకొన్న అసమనతల వ్యవస్థను “ఆర్థిక వెనుకబాటుతనం” పేరిట అతి సాధారణీకరించడమే పాలకుల ఉద్దేశ్యం. చారిత్రకంగా ఒక ప్రజాసముదాయం గురవుతున్న అన్యాయాన్ని “మార్కెట్ సంసిద్ధత” పేరిట కప్పిపెట్టి “మెరిట్”వాదానికి జాతీయ విద్యావిధానం రాచబాటలు వేస్తుంది. “సమ్మిళితం”(ఇన్‌క్లూజన్) పేరిట “నిశ్చయాత్మక చర్య”ను పలుచన చేస్తుంది. రిజర్వేషన్లను బాహాటంగా వ్యతిరేకించకుండా నిర్వచనల మాటున చాటుగా ధ్వంసం చేస్తుంది. సామర్థ్యం, ఉద్యోగితా అవకాశాల పేరిట సామాజిక న్యాయానికి ప్రతీకగా రాజ్యాంగం పొందుపరిచిన రిజర్వేషన్ల ఊసులేకుండా చేస్తుంది.
ప్రజాస్వామ్యం అంటే ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలుగా, విద్య అనేది ఉద్యోగార్ధులుగా అవకాశాల కోసం “క్యూ”లో వేచి ఉండేవారిగా తయారయి పోయాక ఇక అటువంటి సమాజానికి ఆలోచనాపరుల అవసరమే లేదు. కేవలం ఓటర్లు సరిపోతారు. జాతీయ విద్యావిధానం నూరు ఆలోచనలు వికసింపచెయ్యడానికి ఉద్దేశించినది కాదు. ఒక తరం మొత్తాన్ని ఒకే విధంగా ఆలోచించి, ఒకే విధంగా ఓటు వేసేలా తయారు చెయ్యడానికి రూపొందించిన పక్కా ప్రణాళిక.
విద్య ద్వారా యువతరాన్ని మానవీయంగా తీర్చిదిద్దడం కంటే శ్రమ చేసే సరుకుగా రూపొందించడమే జాతీయ విద్యావిధానం లక్ష్యం. విద్య ద్వారా పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దడానికి బదులు మార్కెట్ పనిముట్టుగా, శ్రమ చేసే యంత్రంగా తయారు చెయ్యడమే దాని అసలు ఉద్దేశ్యం.
ఈ క్రమంలో కృత్రిమమేధ ద్వారా విద్యను అనుసంధనించడంలో జాతీయ విద్యావిధానం విఫలమయ్యింది. జ్ఞాపకశక్తి, తార్కిక ఆలోచనలలో కృత్రిమ మేధ కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ యంత్రాలు నేర్పలేని సమాదర భావాన్ని, పరస్పర సంబంధలను, ప్రతిఘటనను విద్య నేర్పించాలి. కానీ విషాదం ఏమిటంటే మనం విద్యార్థులను పరమ విధేయంగా పనిచేసే యంత్రాలకన్నా హీనంగా తయారు చేస్తున్నాం. చరిత్ర ఎప్పుడూ దుర్భర బానిసత్వానికి వ్యతిరేకంగా నిలబడిన వారి పక్షానే నిలిచింది.
విద్యార్థి దశలో జ్వాజ్వల్యమానమైన అధ్యాయాలు “ఇంటర్న్‌షిప్”ల ద్వారా రాలేదు. తిరుగుబాట్ల ద్వారా రూపుదిద్దుకున్నాయి. స్వాతంత్య్రోద్యమం నుంచి 1968 మేలో ఫ్రాన్స్ విద్యార్థుల తిరుగుబాటు వరకు, అమెరికన్ నగరాల్లో హోరెత్తిన యుద్ధ వ్యతిరేక ప్రదర్శన నుంచి తియాన్మన్ స్క్వేర్ వరకు విద్యార్థులు ప్రాసంగకిత కోసం వేచి చూడలేదు. తామే ప్రాసంగకితగా మారిపోయారు. విద్య ద్వారా నిద్రాణ సమాజాన్ని మేల్కొలిపారు. నూతన ఆలోచనలను సమాజం ఎప్పుడూ తిరుగుబాటుగానే భావించింది.
స్వర్గభావాన్ని సవాలు చేసినందుకు గెలీలియో విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. విశ్వాంతరాళాన్ని ఊహించిన నేరానికి బ్రూనోను సజీవదహనం చేశారు.
కాంతివేగం కేవలం ఒక కొలమానం కాదు. కాలాన్ని మనం పరిగణిస్తున్న తీరును సవాలు చెయ్యటమని ఐన్‌స్టీన్ మానవాళికి నేర్పించాడు. గోడెల్ ఆవిష్కరించిన ప్రమేయ సిద్ధాంతాలు(థీరమ్స్) అసంపూర్ణంగా ఉన్నాయంటే ఏ వ్యవస్థలో కూడా పరిపూర్ణ సత్యాలు ఉండవని గుర్తు చేశాడు. వీళ్లందరూ కేవలం మేధావులు మాత్రమే కాదు. భావజాలం మీద తిరుగుబాటు చేసినవాళ్లు, వాళ్లు చెల్లించిన మూల్యం కేవలం అజ్ఞానానికి వ్యతిరేకంగానే కాదు, వాళ్లు ప్రద్శించిన అసమాన సాహాసనానికి.
జాతీయ విద్యావిధానం ఈ అన్వేషణా స్ఫూర్తిని జిజ్ఞాసను లుప్తం చేస్తుంది. విద్యార్థులను పౌరులుగా, ఆలోచనాపరులుగ, అన్వేషకులుగా,సైంటిస్టులుగ, కవులు- రచయితలుగా లేదా తిరుగుబాటుదారులుగా రూపొందించడానికి బదులుగా ఒక “వనరు”గా మార్చేస్తుంది. విశ్వవిద్యాలయాన్ని భావజాల సంఘర్షణ స్థలిగా బదులు స్టార్టప్‌ల ఇన్‌క్యుబేటర్‌గా తయారు చేస్తుంది. ఉపాధ్యాయుడిని జ్ఞానబోధకుడి బదులుగా విద్యానంతర ఉపాధికల్పనా సౌకర్యదారిగా మార్చేస్తుంది. ఇది సంస్కరణ కాదు. ఇది పునఃప్రణాళిక క్రింది స్థాయి నుంచి సమూలంగా మార్చేసే ప్రణాళిక ఇది.
గతంలో మనం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం..
ఇరవైయ్యవ శతాబ్దం కూడా ఆత్మశుద్ధికి అవకాశంలేని యుద్ధోన్మాద సిద్ధాంతాలను, సంస్థలను సమర్థవంతంగా రూపొందించింది. భాష కూడా తడబడేంత క్రూరత్వానికి ప్రతీకగా మారాయి. ఇదంతా గమనించే చార్లీచాప్లిన్ “గ్రేట్ డిక్టేటర్” సినిమాన వ్యంగోక్తిగా, ఒక హెచ్చరికగా మనకు అందించాడు. ఛాతి మీద వీరత్వ పతకాలు ధరించి, పదంపదం కలిపి నడుస్తూ, ఆదేశాలకు అనుగుణంగా నాటి మనుషులను హత్య చేసి వారందరూ ఇవాళ సమాధుల్లోకి వెళ్లి భూస్థాపితం అయిపోయారు.చరిత్ర విస్మరణకు గురయ్యారు. కానీ అనాగరిక యుద్ధాలకు ఎదురొడ్డి ఆత్మస్థైర్యంతో, నిబద్ధతతో ప్రశ్నించిన వాళ్లు చరిత్రలో నిలిచిపోయారు. ఇవాళ్టికి మనతో సంభాషిస్తున్నారు.
గాంధీ, బెర్ట్రాండ్ రస్సెల్, ఐన్‌స్టీన్, చార్లీ చాప్లిన్, మహమ్మద్ అలీ వంటి వారు వారిలో కొందరు. వీళ్లకు దేశభక్తి లేదని తూలనాడారు, మరి కొందరయితే ఏకంగా దేశద్రోహులని ముద్ర వేవారు. ఈ దూషణలన్నీ వాళ్లు భరించారు. అందుకే వాళ్లు నాటికీ మార్గదర్శకులుగా కొనసగుతున్నారు. గిడసబారిన సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఆధిపత్య భావజాలాన్ని ధిక్కరించడానికి పూనుకున్నందున వారికి ఈ అరుదైన గౌరవం దక్కింది. అందుకే వాళ్లు ఉత్తమ విద్యార్థులుగా, అసలు సిసలైన బోధకులుగా నిలిచిపోయారు. ఇవాళ మనం అటువంటి సందిగ్ధ సందర్భంలో ఉన్నాం.
విద్య “ఉమ్మడి జాబితా”లో అంశమని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి జాతీయ విద్యావిధానాన్ని ఏకపక్షంగా రాష్ట్రాల మీద రుద్దే అధికారం లేదు. ఇది రాజ్యాంగవిహితమని సుప్రీం తీర్పు స్పష్టం చేస్తుంది. నూతన జాతీయ విద్యావిధానాన్ని తిరస్కరించడానికి సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రాలు జాతీయ విద్యావిధానాన్ని తిరస్కరిండంతోపాటు విద్యను పూర్వపు స్థాయిని కల్పించే కృషి చేపట్టాలి.
జాతీయ విద్యావిధానానికి మార్పులు, చేర్పులు చేపట్టడమా లేదా అనేది అసలు చర్చనీయాంశం కాదు.
మన ముందున్న సవాలు చాలా ప్రగాఢమైనద, ప్రమాదకరమైనది. జీవన మాధుర్యాన్ని మరిచిపోయేలోపు అధ్యయనం అంటే ఏంటో మనం గుర్తు తెచ్చుకోగలమా?
అనువాదం: కె సత్యరంజన్
(వ్యాస రచయిత పాలక్కడ్ జిల్లాలోని పాతిరిపాల ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో ఆంగ్లాచార్యులు. “ఈజ్ దేర్ ది దళిత్ వే ఆఫ్ థింకింగ్” పేరిట అనిల్ పుస్తకాన్ని నవయాన ప్రచురణా సంస్థ ప్రచురించనున్నది. “ది ఆబ్సెంట్ కలర్” పేరిట కవిత్వ సంపుటి ప్రచురించబడింది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.