
భారతీయ చరిత్ర పరిశోధన మండలి ఐసిహెచ్ఆర్ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది చరిత్ర పరిశోధన పద్ధతులు, విధివిధానాలు, ప్రమాణాలు రూపొందించడంతోపాటు భారత చరిత్రకు సంబంధించిన పరిశోధనలు చేపట్టే ప్రతిష్టాత్మక సంస్థ. ఇటువంటి సంస్థలో 2014- 2017 మధ్యకాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కీలక బాధ్యతల్లో చేరారు.
భారతీయ చరిత్రను పునర్లిఖించే లక్ష్యంతో అఖిల భారతీయ ఇతిహాస్ సంకలన యోజన సంస్థను ఆర్ఎస్ఎస్ ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోనే ఉంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మూడేళ్ళల్లోనే ఈ సంస్థకు సంబంధించిన కీలక వ్యక్తులకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే భారతీయ చరిత్ర పరిశోధన మండలిలో కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
ఈ నియామకాలు ఐసిహెచ్ఆర్ సైద్ధాంతిక దృక్కోణంలో వచ్చిన మార్పులను తెలియజేస్తున్నాయన్నది నిస్సందేహం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి పెద్దగా వివరణ అక్కర్లేదు. గత పదేళ్ళలో విద్యాబోధన గురించి ప్రత్యేకించి చరిత్ర బోధన గురించి మారుతున్న పాఠ్యాంశాలు పరిశీలిస్తే సరిపోతుంది. ఈ నియామకాలు వివాదం కావడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే, ఐసిహెచ్ఆర్ చరిత్రలో ఎన్నడూ జరగనంత స్థాయిలో జరిగిన కుంభకోణం. ఆ కుంభకోణంలో ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన కీలక వ్యక్తుల పాత్ర ఉంది.
ఈ ఆరోపణలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే సాధారణంగా గత పన్నెండేళ్లలో బీజేపీ పెద్దల ఏలుబడిలో ఎన్నో లక్షల కోట్ల అవినీతికి సంబంధించిన ఆరోపణలు వచ్చినా చలించని కేంద్ర ప్రభుత్వం ఐసిహెచ్ఆర్ కుంభకోణం గురించి స్పందించక తప్పలేదు.
ఐసీహెచ్ఆర్ బాధ్యతల్లో ఉన్న కాలంలో అఖిల భారతీయ ఇతిహాస్ సంకలన్ యోజనకు చెందిన నలుగురిని తాజాగా కేంద్ర విజిలెన్స్ కమిషన్ దోషులుగా నిర్ధారించింది. వారి పదవీకాలంలో జరిగిన ఆర్థిక అవకతవకలకు, వివాదాస్పద, అనుమానస్పద ఆర్థిక లావాదేవీలు దీనికి కారణంగా ఉన్నాయి.
ఈ నలుగురితో పాటు మరో పదకొండు మంది ప్రస్తుత మాజీ ఐసీహెచ్ఆర్ కౌన్సిల్ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మానవ వనరుల అభివృద్ధి శాఖను కేంద్ర విజిలెన్స్ కమిషన్ కోరింది.
అఖిలభారత ఇతిహాస్ సంకలన్ యోజన ప్రముఖులు ఐసీహెచ్‌ఆర్‌లో కీలక బాధ్యతల్లో నియమితులైన తరువాత జరిగిన నియామకాలు, పదోన్నతులు, ఆర్థిక లావాదేవీలు గురించి 2022లోను 2023లోను లోక్‌పాల్ వద్ద దాఖలైన పిటిషన్ల ఆధారంగా ఐసీహెచ్‌ఆర్‌లో ఆర్ఎస్ఎస్ నాయకత్వం బాగోతం బయటపడింది.
ఈ ఫిర్యాదుల ఆధారంగా ఒకవైపు కేంద్ర విజిలెన్స్ సంఘం మరోవైపు కేంద్ర మానవ వనరుల శాఖ సమాంతరంగా దర్యాప్తు సాగించాయి. ఐసీహెచ్ఆర్ కూడా 2023 చివర్లో తమ అకౌంట్స్ పుస్తకాలను ఆంతరంగిక తనిఖీ బృందానికి(ఇంటర్నల్ ఆడిట్) నివేదించింది. ఈ ఆడిట్లో మొత్తం 14.03 కోట్లకు సంబంధించిన ఆర్థిక అవకతవకలు జరిగాయని గుర్తించారు. ఇందులో 7 కోట్లు అఖిల భారత ఇతిహాస్ సంకలన్ యోజన సభ్యుల ప్రోద్బలంతో వివిధ చరిత్ర పరిశోధన ప్రాజెక్టులకు కేటాయించిన గ్రాంట్లని తేలింది. ఈ ఏడు కోట్ల రూపాయలను గ్రాంట్ల రూపంలో అందుకున్న పరిశోధకులు తమ పరిశోధన ఫలితాలను ఐసీహెచ్ఆర్కు సమర్పించలేదు. ఈ ఆడిట్లో అడ్డగోలుగా జరిగిన అనేక ఖర్చులకు సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి. ఉదాహరణకు ఒక ఐసీహెచ్ఆర్ సీనియర్ సిబ్బంది రాసిన పుస్తకాన్ని ప్రచురించడానికి 30 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారని ఇంటర్నల్ ఆడిట్లో తేలింది.
ఇంటర్నల్ ఆడిట్ బృందం అందించిన తొలి నివేదికలో “ఐసిహెచ్ఆర్ కౌన్సిల్ ఈ కాలంలో నిధుల వినియోగం విషయంలో విచ్చలవిడిగా వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వ నిధుల వ్యయాన్ని, వ్యయానికి సంబంధించిన మార్గదర్శకాలు జనరల్ ఫైనాన్షియల్ రూల్స్‌తో సహా అనేక నియమ నిబంధనలను ఉల్లంఘించింది” అని స్పష్టం చేసింది.
బాధ్యులైన కీలక అధికారులు..
ఈ లావాదేవీలకు సంబంధించి మొత్తం 15 మంది ఐసిహెచ్ఆర్ కౌన్సిల్ సభ్యులు సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మే 2న కేంద్ర విజిలెన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
విజిలెన్స్ కమిషన్ సిఫార్సు మేరకు చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరు సౌరబ్ కుమార్ మిశ్రా ఉన్నారు. ఈయన అఖిలభారత ఇతిహాస్ సంకలన్ యోజనలో ప్రచార విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. మోడీ తొలిసారి అధికారానికి వచ్చిన తర్వాత ఆయన ఐసీహెచ్ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అఖిలభారత ఇతిహాస్ సంకలన్ యోజనకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖ ఆర్ఎస్ఎస్ నేత బాల్ ముకుంద్ పాండేకు మిశ్రా మేనల్లుడు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి ఓంజీ ఉపాధ్యాయ. అఖిలభారత ఇతిహాస్ సంకలన్ యోజనలో ఈయన సీనియర్ రచయితగా పనిచేస్తున్నారు. 2014 తరువాత ఐసిహెచ్ఆర్లో అత్యంత కీలకమైన పలుకుబడితో పాటు బాధ్యత కలిగిన మెంబర్ సెక్రటరీగా నియమితులయ్యారు. మెంబర్ సెక్రటరీ బాధ్యతతో పాటు ఈయన పరిశోధన, పరిపాలన విభాగానికి కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.
ఉపాధ్యాయ అనేక టీవీ చర్చల్లో ప్రభుత్వ విధానాలను, చర్యలను, నిర్ణయాలను సమర్ధించడం కనిపిస్తుంది.
విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు నేరారోపణ ఎదురుకొంటున్న మూడో వ్యక్తి జగదీష్ సింగ్. జహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా జగదీష్ పనిచేస్తున్నారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, గ్రంథాలయంలో పరిశోధన- ప్రచురణ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న నరేంద్ర శుక్ల నాలుగో వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జగదీష్ సింగ్, నరేంద్ర శుక్లాలు ఐసిహెచ్ఆర్లో కీలకమైన నిర్ణయాత్మక వేదికల్లో సభ్యులుగా ఉన్నారు. అంతేకాకుండా నరేంద్ర శుక్ల అఖిలభారత ఇతిహాస్ సంకలన్ యోజన నిర్వహించే పత్రిక ఇండియా దర్పణ్కు 2022 వరకు సంపాదకునిగా పనిచేశారు.

వీరితోపాటు ఈ కాలంలో ఐసిచ్ఆర్లో మెంబర్ సెక్రటరీస్‌గా పనిచేసిన ఉమేష్ అశోక్ కాదం, కుమార్ రత్నంలపై కూడా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ కోరింది.
ప్రస్తుతం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాదం కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధంగా పనిచేసే ఇతిహాస్ సంకలన్ యోజన సభ్యుడే. జేఎన్‌యూ ప్రొఫైల్‌లో కాదం తాను 2022 నుంచి ఇతిహాస్ సంకలన్ యోజన సభ్యుడుగా ఉన్నానని చెప్పుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2022లోనే కాదం ఐసీహెచ్ఆర్ మెంబర్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.
చట్టబద్ధంగా చర్యలు చేపట్టాలన్న కేంద్ర విజిలెన్స్ సిఫార్సు కేవలం కేంద్ర ప్రభుత్వానికి సూచన మాత్రమే. దీన్ని తప్పనిసరిగా అమలు జరపాలన్న నిబంధన ఏమీ లేదు. విజిలెన్స్ చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే సంబంధిత వ్యక్తులకు ఐసీహెచ్ఆర్ చార్జ్షీట్లు ఇస్తుంది.
బాధితులందరికీ చార్జ్షీట్లు ఇచ్చామని దీన్ని బట్టి ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఐసిహెచ్ఆర్ ఉందని ఐసీహెచ్ఆర్ అధ్యక్షులు రఘువేంద్ర తన్వర్ స్క్రోల్ డిజిటల్ న్యూస్ పోర్టల్‌కు తెలిపారు.
ఐసీహెచ్ఆర్ గురించి సంక్షిప్తంగా..
భారతీయ చారిత్రక పరిశోధన మండలి 1972లో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ప్రారంభమైంది. నిష్పాక్షికమైన, హేతుబద్ధమైన చరిత్ర రచన ఈ సంస్థ వ్యవస్థాపక లక్ష్యం. సంస్థ కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మహాభారత కాలం నుంచి నేటి వరకు జరిగిన చరిత్రను భారతీయ నేపథ్యం నుంచి పునఃసంకలనం చేయటమే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న సంస్థ అఖిలభారత ఇతిహాస్ సంకలన్ యోజన. ఈ సంస్థకు సంబంధించిన కీలకమైన వ్యక్తులను 2017 నుంచి క్రమంగా ఐసీహెచ్ఆర్ బాధ్యతలకు ప్రభుత్వం బదిలీ చేసింది.
ఇతిహాస్ సంకలన్ యోజన ప్రముఖులు ఐసిహెచ్ఆర్లో బాధ్యతలు చేపట్టిన తర్వాత 2018లో పెద్దగా చెప్పుకోదగిన విద్యార్హతలు లేని వారిని ఐసిహెచ్ఆర్ పరిశోధన ప్రాజెక్టులకు బాధ్యులుగా నియమించిన విషయాన్ని 2018లో ఈ రచయిత న్యూస్ లాండ్రి ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఐసిహెచ్ఆర్లోకి ఇతిహాస్ సంకలన్ యోజన సభ్యులతోపాటు వారి బంధుమిత్రులు కూడా వచ్చి చేరారు.
ఐసీహెచ్ఆర్ సిబ్బంది, అధికారులకు వ్యతిరేకంగా 2022 జూన్ నుంచి 2023 జూలైలో లోక్‌పాల్‌కు ఫిర్యాదుల అందాయి.
జూన్ 2022లో దాఖలయిన ఫిర్యాదులలో ఐదుగురు ఐసీహెచ్ఆర్ ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా 14 ఆరోపణలు నమోదయ్యాయి. నియామకాలలో జరుగుతున్న అవకతవకలు, అక్రమాలు, పరిశోధన ప్రాజెక్టుల మంజూరి, సెమినార్ల నిర్వహణ, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు వంటి అనేక అంశాలు ఈ ఫిర్యాదులో ఉన్నాయి.

వీలైనంత ఎక్కువమంది అఖిలభారత ఇతిహాస్ సంకలన్ యోజన సభ్యులను, క్రియాశీల కార్యకర్తలను నియమించడంతోపాటు ఈ నియామకాల్లో పెద్ద ఎత్తున బంధుప్రీతితో జరిగిన నియామకాలు కూడా ఉన్నాయని ఫిర్యాదుదారులు లోక్‌పాల్ దృష్టికి తీసుకు వచ్చారు.
జూలై 2023లో దాఖలైన ఫిర్యాదులు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా చరిత్ర పరిశోధనకు మార్గదర్శకత్వం వహించాల్సిన ఐసిహెచ్ఆర్ ప్రస్తుతం ఒకే భావజాలానికి సంబంధించిన పరిశోధన ప్రాజెక్టును మంజూరు చేసే వేదికగా మారిపోయిందని, కొందరు ప్రభుత్వ పెద్దల సహకార ప్రమేయంతో ఓ పథకం ప్రకారం ఐసిహెచ్ఆర్ నిధులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
లోక్‌పాల్‌కు చేరిన ఫిర్యాదులు కేంద్ర విజిలెన్స్ కమిషన్ ద్వారా మానవ వనరుల శాఖకు చేరాయి. కొన్ని ఆరోపణలు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి కావడంతో సీవీసీ ద్వారా ఫిర్యాదులు అందుకున్న కేంద్ర మానవ వనరుల శాఖ ఐసీహెచ్ఆర్ ఆర్థిక వ్యవహారాలపై ఇంటర్నల్ ఆడిట్‌కు ఆదేశించింది.

తీవ్రమైన అవకతవకలు..
2021- 22, 2022- 23 ఆర్థిక సంవత్సరాలలో ఐసీహెచ్‌ఆర్‌లో సుమారు 14 కోట్ల మూడు లక్షల రూపాయలకు సంబంధించిన ఆర్థిక అవకతవకులు, లావాదేవీలలో చట్టవిరుద్ధమైన ఖర్చులు జరిగాయని ప్రత్యేక ఆడిట్ వేదిక ఖరారు చేసింది. ప్రత్యేక ఆడిట్ నివేదిక మొత్తం 18 అంశాలకు సంబంధించిన వాటిని గుర్తించింది. అందులో 16 అంశాలు నియామకాలు, పదోన్నతులకు సంబంధించినవి.
2022 ఆగస్టు నుంచి 2023 మే వరకు ఐసిహెచ్ఆర్లు మెంబర్‌గా, మెంబర్స్ సెక్రటరీగా పనిచేసిన ఉమేష్ అశోక్ కాదం కాలంలో ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించిన విధివిధానాలను, నిబంధనలను, ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించారని స్పష్టం చేసింది.
అవకతవకల్లో ముఖ్యమైనది ప్రాథమిక పరిశోధన కూడా పూర్తి చేయని 397 మంది పరిశోధకులకు ఐసిహెచ్ఆర్ ఖాతా నుంచి 26 లక్షల రూపాయలు విడుదల చేయటం. ఐసిహెచ్ఆర్ పరిశోధన గ్రాండ్స్ నిబంధనల ప్రకారం ఈ 397 మంది స్వీకరించిన గ్రాంట్స్‌ను తిరిగి ఐసిహెచ్ఆర్కు జమచేయాల్సి ఉంది. ఈ రిపోర్టు విషయంలో సీనియర్ ఐసిహెచ్ఆర్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించలేదు.
మరో 85 మంది ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వలన వసూలు చేయాల్సిన ఒకటిన్నర రూపాయలు వసూలు చేయకపోవడం కూడా ఐసీహెచ్ఆర్ నిబంధనల ఉల్లంఘన కోవకు చెందుతుంది.
సంబంధిత విభాగం అనుమతులు లేకుండా సుమారు 2.55 కోట్ల రూపాయలకు సంబంధించిన ఐసీహెచ్ఆర్ భవన మరమ్మతు పనులను కూడా ఆదేశించారు. మరమ్మతుల విషయంలో కూడా ఐసీహెచ్ఆర్ అకౌంటింగ్ ప్రమాణాలు ఉల్లంఘించారని ఆడిట్ కమిటీ నిర్ధారించింది.

డిప్యూటీ డైరెక్టర్ సౌరభ్ కుమార్ మిశ్రా గురించి కూడా ఆడిట్ నివేదికలో ప్రస్థావనలు ఉన్నాయి. కాదంతో కలిసి మిశ్రా ఐసీహెచ్ఆర్కు సంబంధించిన ఈ-అప్లికేషన్స్ ప్రాజెక్టును కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న కంపెనీకి ఇచ్చే విషయంలో కూడా నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆడిట్ పరిశీలనలో బయటపడింది. ఈ కాంట్రాక్టు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌కు అప్పగించరాదని ఐసీహెచ్ఆర్ కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ ఆ తీర్మానాన్ని ఉల్లంఘించి అదే సంస్థకు అప్పగించటం జరిగింది. నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు ఈ కాంట్రాక్టు అప్పగించాలని కౌన్సిల్ తీర్మానించింది.
మిశ్రా ఇచ్చిన వివరణలో అప్లికేషన్ తయారు చేయడానికి ఎన్ఐసీ ఎక్కువ సమయం కోరిందని తెలిపారు. అయితే ఈ విషయంపై ఎన్ఐసీతో సంప్రదింపులు జరిగినట్టు, ఉత్తర- ప్రత్యుత్తరాలు దొరికినట్టు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదని ఆడిట్ నివేదిక స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్‌తో పాటు నిబంధనలకు విరుద్ధంగా మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని అడ్వాన్స్ రూపంలో చెల్లించడాన్ని కూడా ఆడిట్ నివేదిక తప్పు పట్టింది. పైగా కాంట్రాక్ట్ కొనసాగింపులో సేవలందించడానికి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ ఇండియన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ మరో ప్రైవేట్ సంస్థను ఆశ్రయించి ఇదే పనిని సబ్ కాంట్రాక్ట్ ద్వారా చేయించడం మిశ్రా, కాదంలపై వచ్చిన ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ ఇండియన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నుంచి సబ్ కాంట్రాక్టు పొందిన మరో కంపెనీ ఆర్ఎస్ఎస్ నేత కిరణ్‌కు చెందినది కావడం గమనార్హం.
ఈ కిరణ్ అనే వ్యక్తి కేశవ్ గోవింద పరండేతో కలిసి ఆర్ఎస్ఎస్ నిర్వహించే సేవా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ సేవా బ్రిడ్జి ఫౌండేషన్ అనే కంపెనీ నడుపుతున్నారు. ఐసీహెచ్ఆర్ నుంచి దొడ్డిదారిన సబ్ కాంట్రాక్ట్ పొందిన ఇన్ఫోరా కంపెనీలో కూడా కిరణ్ డైరెక్టర్‌గా ఉన్నారు. గతంలో కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన హిందూ సేవా ప్రతిష్టాన్, యూత్ ఫర్ సేవ వంటి సంస్థల్లో కీలక హోదాల్లో పని చేశారు.
అంతకంటే ముఖ్యమైన పరిశీలన ఏంటంటే ఇన్ఫోర అనే కంపెనీ 2021లో పెట్టిన తర్వాత సంపాదించిన ఏకైక కాంట్రాక్ట్ ఐసీహెచ్ఆర్దే. గత రెండేళ్లలో కంపెనీ నిర్వహణ ద్వారా కేవలం 12 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. అది కూడా ఐసీహెచ్ఆర్ వర్క్ సబ్ కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన ఆదాయమే కావడం గమనార్హం. ఇన్ఫోరా ఎగ్జిక్యూటీవ్ స్పందిస్తూ తమ కంపెనీకి ఆర్ఎస్ఎస్ అనుబంధం కారణంగా కాంట్రాక్టు దక్కలేదని ఓపెన్ బిల్డింగ్ ద్వారానే కాంట్రాక్టు సంపాదించుకున్నామని తెలిపారు. ఇదే విషయంపై బీఈసీఐఎల్కు వివరాలు కోరుతూ రాసిన మెయిల్‌కు సమాధానం రాలేదు. మిశ్రాకు రాసిన మెయిల్‌ను ఐసీహెచ్ఆర్ ప్రదర్శన విభాగానికి పంపించారు. తాను ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నిబంధనల ఉల్లంఘన అవుతుందని ఆయన తెలిపారు.

మదర్ ఆఫ్ డెమోక్రసీ..
ఐసీహెచ్ఆర్ అధ్యక్షుడు రఘువీంద్ర తన్వర్, కాదంతో కలిసి రచించిన ఇండియా మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తకం ప్రచురణ పంపిణీ విషయంలో కూడా నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేలింది. ఈ పుస్తకం ప్రచురించడానికి 20 లక్షల రూపాయలు ఖర్చుకు అనుమతిస్తూ జూలై 2022లో జరిగిన రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కమిటీ తీర్మానం చేసింది. ఈ పుస్తకాన్ని ప్రచురించేందుకు నలుగురు ప్రచురణ కర్తలను గుర్తించారు. అప్పటికే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కమిటీలో అధ్యక్షుడు తన్వర్‌తో పాటు సీఎల్ ఐజాక్, హిమాంశు చతుర్వేది, శ్రీధర్ మధుకర్‌లు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ పుస్తక ప్రచారంలో కూడా అఖిల భారత ఇతిహాస్ సంకలన్ యోజన ప్రభావం కనిపిస్తుంది. సీఎల్ ఐజాక్ ఆ సంస్థ సభ్యులు. చతుర్వేది భారత ఇతిహాస్ సంకలన యోజన గోరఖ్ పూర్ విభాగానికి అధ్యక్షుడిగా, మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఎంపిక చేసిన ప్రచురణకర్తలు నుంచి ఎటువంటి కోటేషన్లను ఆహ్వానించకుండానే నచ్చిన వాళ్లకు ఇచ్చేందుకు మెంబర్ సెక్రటరీ కమిటీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని నివేదిక నిర్ధారించింది.
ఈ పుస్తక ప్రచురణకు కితాబ్వాలే అనే పబ్లిషర్‌ను ఎంపిక చేసుకున్న కాదం కమిటీ, తాము ఆమోదించిన 20 లక్షల కంటే అదనంగా 10 లక్షలు చెల్లించారని ఆడిట్లో తేలింది.
కితాబ్వాలే కంపెనీ ప్రొఫైల్ చూస్తే కంపెనీ యజమాని ప్రశాంత్ జైన్ పలువురు ఆర్ఎస్ఎస్ అధినేతలతో కలిసిన సందర్భంగా తీసుకున్న ఫోటోలు ఉంటాయి. స్క్రోల్‌తో మాట్లాడుతూ ప్రశాంత్ జైన్ తాను సంఘ్‌పరివారంలో సభ్యుడిని కాదని, కాకపోతే సంఘ పరివారం సిద్ధాంతాలు- భావజాలాన్ని అంగీకరిస్తానని తెలిపారు. పుస్తక ప్రచురణకు సంబంధించిన విషయం తప్ప ప్రచురణకర్తగా తమకు సంబంధం లేదని తెలిపారు. ఈ పుస్తక ఖరీదును 5000 రూపాయలుగా నిర్ణయించారు.
50 శాతం డిస్కౌంట్‌తో పాతిక లక్షలు చెల్లించి ప్రచురణకర్తల నుంచి ఐసిహెచ్ఆర్ వేయి కాపీలను కొనుగోలు చేసిందని, అందులో కేవలం 26 కాపీలు మాత్రమే అమ్ముడుపోయాయని మరో 94 కాపీలు ప్రధానమంత్రి కార్యాలయానికి కాంప్లిమెంటరీ కాపీలుగా ఇచ్చారని ఆడిట్ సమయానికి మిగిలిన 80 కాపీలు అమ్ముడుపోకుండా ఉన్నాయని ఆడిట్ గమనించింది. రచయితలకు, ప్రూఫ్ రీడర్స్‌కు మరో ఐదు లక్షల పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇదంతా పరిశీలించిన తర్వాత ఒకసారి ప్రచురణ విషయంలో ఐసిహెచ్ఆర్ దీర్ఘకాలంగా పాటిస్తూ వచ్చిన ప్రమాణాలు లోపించాయని ఆడిట్ కమిటీ గుర్తించింది.
కేంద్ర విద్యా శాఖ నుంచి రాజీనామా చేశారని సంస్థ అధికారి ఒకరు స్క్రోల్‌తో చెప్పారు. ఇదే విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి కాదంకు పలుసార్లు మెయిల్స్ ద్వారా మెసేజ్ ద్వారా ప్రయత్నం చేసిన స్పందించలేదు.
నియామకాలు పదోన్నతులు..
ఆర్థిక అవకతవకలతో పాటు నియామకాలలో పదోన్నతుల విషయంలో కూడా సదరు అధికారులు అనేక ఉల్లంఘనలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. పదోన్నతులు, నియామకాల విషయంలో జరిగిన కుంభకోణంపై వచ్చిన ఆరోపణల గురించి దర్యాప్తు చేసిన కేంద్ర విద్యాశాఖ ఈ మొత్తం వ్యవహారాలకు పెద్ద అధికారులను బాధ్యులుగా గుర్తించింది.
అందులో ఒకరు ధర్మేంద్రసింగ్. 2017 వరకు సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేసిన ఈయన 2017లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఐసిహెచ్ఆర్లో ఇప్పటి వరకూ ఈ పోస్టు లేనే లేదు. 2022లో ధర్మేంద్రసింగ్ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రమోట్ అయ్యారు. డిప్యూటీ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కావలసిన అనుభవం అతనికి లేదని ఆడిట్ కమిటీ నిర్ధారించింది.
మరో సెక్షన్ ఆఫీసర్ సచిన్ కుమార్ ఝా 2018లో అసిస్టెంట్‌గా నియమించబడ్డారు. 2021 నాటికి సెక్షన్ ఆఫీసర్‌గా ప్రమోషన్ పొందారు. నియామకం సమయంలో కానీ పదోన్నతి సమయంలో కానీ కావలిసిన వయో పరిమితి కంటే తక్కువ వయసు ఉన్నప్పటికీ పదోన్నతి ఇచ్చారని ఆడిట్ నివేదిక పేర్కొంది. ధర్మేంద్ర సింగ్, సచిన్ కుమార్ ఝాలతో పాటు మరో అసిస్టెంట్ దేవిందర్ సింగ్‌లకు కూడా తీవ్రమైన జరిమానా విధించాలని కేంద్ర విజిలెన్స్ సంఘం సిఫార్సు చేసింది.

అఖిలభారత ఇతిహాస్ సంకలన్ యోజన ద్వారా ఐసిహెచ్ఆర్లో కీలక బాధ్యతలు చేపట్టిన వారు సంస్థ నిధులను విచ్చలవిడిగా ఖర్చుపెట్టడానికి కావలసిన సహాయ సహకారాలు అందించినందుకే ధర్మేంద్రసింగ్, దేవేందర్, సచిన్ కుమార్ ఝాలకు అడ్డదారిలో ప్రమోషన్ దక్కాయని మరో అధికారి వెల్లడించారు. ధర్మేంద్ర సింగ్, దేవేందర్‌లు అకౌంట్స్ విభాగంలో నిధులు మంజూరు చేసే కీలక అధికారులుగా ఉన్నారు.
సచిన్ కుమార్ ఝాకు అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చినందుకు మాజీ మెంబర్ సెక్రెటరీ కుమార్ రత్నంకు కూడా జరిమానా విధించాలని సీవీసీ పేర్కొన్నది. అంతేకాకుండా ఝా నియామకం, పదోన్నతి విషయంలో కుమార్ రత్నం పోషించిన పాత్ర గురించి లోతైన దర్యాప్తు జరపాలని సీవీసీ సిఫార్సు చేసింది.
రిక్రూట్మెంట్ ఫోరం..
2018 చివర్లో ఐసిహెచ్ఆర్ ఖాళీ పోస్టులు భర్తీ చేయడానికి కావలసిన పరీక్షల నిర్వహించే కాంట్రాక్టును ఓ ప్రైవేట్ ఫోరంకు అప్పగించింది. ఈ సంస్థ ఎంపిక విషయంలో ఈ-టెండర్ పద్ధతి పాటించలేదని, జనరల్ ఫైనాన్షియల్ రూల్స్ అతిక్రమించారని దాంతో కొత్తగా ఐసీహెచ్‌ఆర్‌లో ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువమంది ఐసీహెచ్‌ఆర్‌లో అప్పటికే పని చేస్తున్న సిబ్బంది, ఉన్నతాధికారుల బంధుమిత్రులు ఉన్నారని 2022 లోక్‌పాల్‌కు అందిన ఫిర్యాదులులో ఆరోపించారు.ఈ సమయంలోనే దేవేందర్, సచిన్ కుమార్‌తో సహా 28 మందిని నియమించినట్లు ఆఫీస్ రికార్డులు ద్వారా ఆడిట్ కమిటీ గుర్తించింది. సచిన్ కుమార్ ఆర్ఎస్ఎస్ అనుబంధ చరిత్ర పరిశోధన సంస్థ అధ్యక్షుడు పాండేకు బంధువు.

స్క్రోల్ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ నాకు చాలా మంది తెలిసినట్లె పాండేకు కూడా తెలుసు అన్నారు. ఈ ప్రశ్నలు అన్నీ తనను నియమించిన వారిని అడగాల్సిన ప్రశ్నలని సచిన్ సమాధానం ఇచ్చారు.
ఐసీహెచ్ఆర్ నియామకాల కోసం ఒక ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడంపై 2023 ఏప్రిల్‌లో సీవీసీ విచారణ చేసింది. దాంతో లోక్‌పాల్‌కు అందిన ఫిర్యాదులలోని ఆరోపణలు వాస్తావమైనవేనని స్పష్టం అవుతోంది. ఈ మార్కెట్ పోర్టల్ ద్వారా ఎంపిక చేయకుండా ఐసీహెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఫోరంను ఎంపిక చేసినట్లు నిర్ధారణ అయింది. సమాచార హక్కు కింద ఐసీహెచ్ఆర్కు జన సమాచారం ప్రకారం ఐసీహెచ్‌ఆర్‌లో ఖాళీ పోస్టులకు పరీక్షలు నిర్వహించడానికి ఈ సంస్థకు 89.18 లక్షల కాంట్రాక్ట్‌ను ఇచ్చారు.
సదరు రిక్రూట్మెంట్ ఫోరంను ఎంపిక చేయడంలో ధర్మేంద్ర సింగ్, ఓంజి ఉపాధ్యాయ, అప్పటి మెంబర్ సెక్రటరీ రాజేష్ కుమార్ శుక్ల కీలకపాత్ర పోషించినట్లు మే 2024 నాటికి విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీలో తేలింది. శుక్ల ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ అనుబంధ చరిత్ర సంకలన యోజన విభాగానికి జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ-గవర్నెన్స్ బిడ్డింగ్ పోర్టల్ జెమ్ గురించి ఆవాగాహన లేకపోవడం వలన ఈ పొరపాటు జరిగిందనీ శుక్లా విజిలెన్స్ కమిషన్‌కు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
అనువాదం: కొండూరి వీరయ్య
స్క్రోల్ సౌజన్యంతో ది వైర్లో ప్రచురితం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.