
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో హత్యలు, మృతదేహాల పట్ల అమానవీయ వ్యవహారాన్ని ఖండిస్తూ జాతీయ- అంతర్జాతీయ పౌరహక్కుల సంఘాలు సంయుక్త బహిరంగ ప్రకటనను విడుదల చేశాయి. బస్తర్ డివిజన్లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మాడ్ ప్రాంతంలో 2025 మే 21న 28 మందిని హత్య చేయడాన్ని ప్రకటనలో తప్పుపట్టాయి. దీంతో పాటు ఆదివాసి ప్రాంతాలలో రాష్ట్ర, కేంద్ర బలగాలు చేస్తున్న ప్రజల నిరంతర హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా పేర్కొన్నాయి.
మొత్తం 14 జాతీయ, అంతర్జాతీయ పౌరహక్కుల సంఘాలు సంతకాలు చేస్తూ బహిరంగ ప్రకటనను విడుదల చేశాయి. ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఫర్ అకడమిక్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా(ఇన్సాఫ్ ఇండియా), ఎస్ఓఏఎస్ బ్లాక్ పాంథర్స్, ఇండియన్ వర్కర్స్ అసోసియేషన్ జీబీ ఇండియా లేబర్ సాలిడారిటీ (యూకే), తెలంగాణ విద్యావంతుల వేదిక, ఉత్తర అమెరికా పంజాబీ లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్, విన్నిపెగ్ సౌత్ ఏషియన్ డయాస్పోరా యాక్షన్ కలెక్టివ్(ఎస్ఏడీఏసీ), ఇండియన్ అలయన్స్ పారిస్, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ సౌత్ ఆసియా సాలిడారిటీ గ్రూప్ అలయన్స్ ఎగేనెస్ట్ ఇస్లామోఫోబియా, పెరియార్ అంబేడ్కర్ థాట్స్ సర్కిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఫౌండేషన్ ఆఫ్ లండన్ స్టోరీ, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, ఇండియన్ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ యూకే, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ – ఆస్ట్రేలియా & న్యూజిలాండ్, ది హ్యూమనిజం ప్రాజెక్ట్- ఆస్ట్రేలియా, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్- యూకే ఈ ప్రకటనలో సంతకాలు చేశాయి.
ఉద్దేశపూర్వక దహనం..
ప్రకటనలో “బస్తర్‌లో ఎనిమిది మంది మృతదేహాలను చట్టవిరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ఛత్తీస్‌గఢ్ పోలీసులు దహనం చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దహనం చేసిన ఎనిమిది మందిలో ఐదుగురిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన నంబాళ్ళ కేశవరావు, సజ్జా వెంకట నాగేశ్వరరావు, లలిత, రాకేశ్, వివేక్, భూమికలుగా కుటుంబ సభ్యులు గుర్తించారు. క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం, భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బసవరాజును సజీవంగా పట్టుకుని, చట్టాతీతంగా హత్య చేశారు. ఈ ప్రకటన రాసే సమయానికి మిగిలిన ముగ్గురి వివరాలు తెలియలేదు. వీరంతా ఛత్తీస్‌గఢ్ ఆదివాసులుగా భావిస్తున్నారు.” అని తెలియజేశాయి.
“బాధిత కుటుంబాలు ఫ్రీజర్లు ఉన్న అంబులెన్స్‌లతో రాష్ట్రాలు దాటి ప్రయాణం చేసి, పోలీస్ స్టేషన్ బయట రోజుల తరబడి ఎదురు చూశారు. కోర్టులో పిటీషన్లు దాఖలు చేయడంలాంటి తీవ్ర ప్రయత్నాలను చేసి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు 2025 మే 24న శవపరీక్ష ప్రక్రియ అవగానే మృతదేహాలను తిరిగి ఇస్తామని ఛత్తీస్‌ఘఢ్ ప్రభుత్వం నుంచి కుటుంబాలు అధికారిక వాగ్దానాన్ని పొందారు. అయినప్పటికీ చత్తీస్ఘడ్ అధికార యంత్రాంగం యిచ్చిన మాటను బహిరంగంగా ఉల్లంఘించింది.” అని పౌరసంఘాలు ప్రకటనలో పేర్కొన్నాయి.
ఇంకా ప్రకటనలో “నారాయణపుర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక మారుమూల ప్రాంతంలో మృతదేహాలను డీజిల్ పోసి ఛత్తీస్‌గఢ్ పోలీసులు దహనం చేశారు. ఈ చర్య మరణించిన వారికి సరైన అంత్యక్రియలు జరిగాల్సిన ప్రాథమిక గౌరవాన్ని కూడా తిరస్కరించింది. ఇది ఆకస్మాత్తుగా జరిగింది కాదు. అసాధారణమైనది కూడా కాదు. ఇది ఒక ఉద్దేశ్యపూర్వకమైన, రాజ్యం ఆమోదించిన చర్య.”అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.
సాక్ష్యాలను నాశనం చేస్తోన్న రాజ్యం..
2026 మార్చి 31 నాటికి ‘మావోయిస్టు ఉద్యమాన్ని’ నిర్మూలిస్తామని భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించిందని పౌరహక్కుల సంఘాలు గుర్తు చేశాయి. అందులో భాగంగానే చేపట్టిన క్యాంపెయిన్‌లా దీనిని పరిగణించాలని అన్నాయి.
“ఈ తిరుగుబాటు వ్యతిరేక క్యాంపెయిన్‌లో ఇప్పటికే 400 మందిని పైగా హత్య చేశారు. వారిలో ఎక్కువ మంది ఆదివాసీలు ఉన్నారు. సాధారణ పౌరులు, మావోయిస్ట్ క్యాడర్లను అనుమానాస్పద, చట్టాతీతంగా హత్యలు చేయడం కూడా ఇందులో ఉన్నది. ఈ చట్టాతీత హింస క్యాంపెయిన్‌ను కొనసాగిస్తూ, రాజ్యం కేవలం హత్య చేయడం మాత్రమే కాకుండా, సాక్ష్యాలను నాశనం చేస్తుంది. జవాబుదారీతనం లేకుండా చేస్తుంది. న్యాయం, మానవత్వాల అత్యంత ప్రాథమిక సూత్రాలను అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది.” అని పౌర సంఘాలు చెప్పాయి.
అంతేకాకుండా ఎన్కౌంటర్ చేసి మృతదేహాల ముందు రాష్ట్ర, కేంద్ర బలగాలు చేసిన చర్యలను ప్రకటనలో ప్రస్థావించాయి. “ఆరంభం నుంచే రాజ్య కార్యకలాపాలు చట్ట పాలనననుసరించి కాకుండా, ఒక ప్రణాళికాబద్ధమైన క్రూరత్వంతో నిండి ఉన్నాయి. ఈ హత్యలను చేసిన తరువాత భద్రతా బలగాలు బహిరంగంగా వేడుకలు జరుపుకున్నాయి. మృతదేహాల ముందు తమ ఆయుధాలతో నృత్యం చేస్తూ ఫొటోలు తీసుకున్నాయి. ఎటువంటి ఆమోదయోగ్యమైన ప్రక్రియ లేకుండా తమ సొంత పౌరులను చంపుతున్న భారత రాజ్యం విజయోత్సవాన్ని వ్యక్తం చేస్తోంది.” అని అసహనాన్ని వ్యక్తం చేశాయి.
“శవ పరీక్ష చేయడం రోజుల తరబడి ఆలస్యం అయింది. మృతదేహాలను ఫ్రీజర్‌లో భద్రపరచలేదు. కుళ్లిపోవడానికి ఉద్దేశపూర్వకంగా వదిలివేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన కుటుంబాలను వేధింపులకు గురిచేశారు. దుర్భాషలాడి అవమానించారు. అడ్డంకులు కల్పించారు. రాజ్యం తీసుకున్న ప్రతి చర్య సాక్ష్యాలను నాశనం చేయడం, న్యాయ పరిశీలన నుంచి తప్పించుకోవడం అనే ఏకైక వ్యూహాత్మక లక్ష్యాన్ని సూచిస్తుంది.” ప్రకటనలో పౌరసంఘాలు చెప్పుకొచ్చాయి
హక్కులను కాలరాసిన ప్రభుత్వం..
మృతదేహాల విషయంలో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను, అంతర్జాతీయ మానవ చట్టంలో పేర్కొన్న హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ప్రకటనలో తెలియజేశాయి. “ఇలా చేయడం జీవితమూ- మరణమూ రెండింటిలోనూ కూడా గౌరవం ఇవ్వాలనే హక్కుకు హామీ ఇచ్చే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. ఇది అంతర్జాతీయ మానవీయ చట్టాన్ని కూడా స్పష్టంగా ఉల్లంఘిస్తోంది. జెనీవా ఒప్పందం సాధారణ ఆర్టికల్ మూడు ప్రకారం ఇరుపక్షాలూ మరణించినవారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. వారి అవశేషాలను జాగ్రత్తపరచాలి. సాధ్యమైన అన్నీ సందర్భాలలోనూ వాటిని వారి కుటుంబాలకు తిరిగి ఇవ్వాలి. ఈ బాధ్యతలు ఐచ్ఛికం కాదు. తమ బంధువుల స్థితి ఏమిటో తెలుసుకోవటానికి, ఒకవేల చనిపోతే వారి మృతదేహాలను పొందే హక్కు బాధిత కుటుంబాలకు ఉందని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ(ఐసీఆర్సీ)నొక్కి చెబుతోంది.” అని గుర్తుచేశాయి.
“సందేహాస్పద చట్టాతీత హత్యలు, బలవంతంగా మృతదేహాలను దహనం చేయడం, కుటుంబాలను అడ్డుకోవడం, ఉద్దేశపూర్వకంగా శవాలను దాచడం మొదలైన చర్యలు ఐసీఆర్సీ నిర్వచించిన ఒప్పంద ఆధారిత అంతర్జాతీయ బాధ్యతలను, సాంప్రదాయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించాయి. ఈ చర్యలు యుద్ధ నేరాలకు సమానం. వ్యవస్థీకృత అధికారం కింద చట్టవిరుద్ధతకు సంబంధించిన పూర్తి అవగాహనతోనే అధికారిక సిబ్బంది ఈ చర్యలు చేసింది. న్యాయవ్యవస్థ పర్యవేక్షణలోనూ, బహిరంగంగానూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయన్న వాస్తవం బస్తర్‌లో రాజ్యం చేపడుతున్న చర్యలలో వ్యవస్థీకృత శిక్షాలేమి ఉండడాన్ని, మానవత్వం లేకపోవడాన్ని ఎత్తిచూపుతుంది.”అని ప్రకటనలో పౌరసంఘాలు తెలియజేశాయి.
ఇది ఒక కీలక ఘట్టం..
ఇంకా ప్రస్థావిస్తూ “అంతర్జాతీయ సముదాయాలు ప్రస్తుతం భారత రాజ్యం ఉద్దేశపూర్వకంగానూ, వ్యూహాత్మకంగానూ అంగీకరించడానికి నిరాకరిస్తున్న వాస్తవాల కోసం పోరాడాలి. బస్తర్‌లో జరుగుతున్న సంఘర్షణను ‘అంతర్జాతీయం కాని (అంతర్గత)సాయుధ సంఘర్షణ (ఎన్ఐఎసీ)’గా వర్గీకరించడానికి అవసరమయ్యే చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. నిరంతరం కొనసాగుతున్న హింసాకాండ, సంఘటిత సాయుధ మూకల ఉనికి, సైనిక బలగాల మోహరింపు స్థాయిలను బట్టి చూస్తే కనుక చట్టపరమైన అస్పష్టతకు తావు లేదు. బస్తర్‌ను ఎన్ఐఎసీగా గుర్తించడం ఒక సాంకేతిక సూచన కాదు. ఇది చట్టపరమైన బాధ్యత. రాజకీయ అవసరం. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని అమలు చేయడానికి, అంతర్జాతీయ పర్యవేక్షణను నిర్ధారించడానికి, రాజ్య శిక్షాలేమినీ, అణిచివేత యంత్రాంగాన్నీ కూల్చివేయడానికీ ముందు షరతు.”
కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం సీపీఐ(మావోయిస్టు)పార్టీ, పౌర సమాజ సంస్థల నుంచి అనేక విజ్ఞప్తులు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం మానవహననాన్ని అమలుచేస్తున్నదని పౌరహక్కుల సంఘాలు ప్రకటనలో పేర్కొన్నాయి. అంతేకాకుండా, తన సొంత పౌరులను బహిరంగంగానూ చట్టవిరుద్ధంగానూ కాల్చి చంపడం జరిగిందని తెలియజేశాయి.
“ఈ పరిస్థితిని అదుపులో పెట్టడానికి రాజ్యానికి స్పష్టమైన అవకాశం ఉన్నప్పటికీ దానిని మరింత తీవ్రతరం చేసే లక్ష్యంగా చేసుకొని హత్యలు చేయడాన్ని, కప్పిపుచ్చుకోవడాన్ని, విజయోత్సవ, శిక్షారహిత నాటకీయ ప్రదర్శనలను ఎంచుకుంది” అని పేర్కొన్నాయి.
అంతర్జాతీయ సమాజమూ, ఆందోళన చెందుతున్న ప్రజలందరూ తక్షణమే దృఢంగా, రాజీ పడకుండా స్పందించాలని పౌరహక్కుల సంఘాలు విజ్ఞప్తి చేశాయి. “నారాయణపూర్‌లో జరిగిన దౌర్జన్యం విడి ఘటన కాదు. ఇది ఒక కీలక ఘట్టం. ఈ సంఘర్షణను నిర్ణయాత్మకంగా ఎదుర్కోకపోతే ఎక్కడికి దారి తీస్తుందో” అని హెచ్చరించాయి. ఈ చర్యలను భయానక స్పష్టతతో కూడిన సంకేతాలుగా అభివర్ణిస్తూ, తక్షణమే ప్రభుత్వం ఈ చర్యలను ఆపాలని డిమాండ్ చేశాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.