Reading Time: 7 minutes
2024 జులై 2న హత్రాస్‌లో ఒక సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 123మంది ప్రజలు చనిపోయారు. వాళ్ళలో అత్యధికులు మహిళలు. ఈ సంఘటన జాతిని కుదిపివేసింది. తననితాను భగవంతుడి అవతారంగా ప్రకటించుకున్న భోలే బాబా అలియాస్ నారాయణ సకర్ హరి ఈ సత్సంగ్‌ను ఏర్పాటు చేశారు. అతడి పేరు సూరజ్ పాల్ జాతవ్. ఇతడు మాజీ పోలీస్ కానిస్టేబుల్. ఒక ప్రధాన దళిత కులానికి చెందినవాడు. బహుజన సమాజ్ పార్టీ అధినేత మాయావతిది కూడా అదే కులం. 28 సంవత్సరాల క్రితం అతడిపై వచ్చిన ఒక అత్యాచారం నేరారోపణతో ఉద్యోగం నుండి తొలగించారని కొందరంటారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పదవీవిరమణ పథకాన్ని ప్రకటించినప్పుడు అందులో భాగంగా ఆయన స్వచ్ఛందా పదవీవిరమణ చేశాడని ఆయనతోపాటు కొందరంటారు. ఏది ఏమైనప్పటికీ అతని మీద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో లైంగిక అత్యాచారం కేసులతో సహా ఐదు క్రిమినల్ కేసులు నమోదై వున్నాయి.
ఆలీఘర్` జీటి రోడ్డు పక్కనే గల 13 ఎకరాల స్థలంలో వున్న విలాసవంతమైన ‘ప్రవాస్ ఆశ్రమమ్’లో స్వరాజ్‌పాల్ నివశిస్తున్నాడు. అందులో ఐదు నక్షత్రాల సౌకర్యాలు వున్నాయి. విలాసవంతమైన ఆయన కార్ల కోసం ఒక పెద్ద గ్యారేజీ వుంది. మొత్తం మీద ఆయనకు 24 ఆశ్రమాలున్నాయి. 100కోట్ల విలువ కలిగిన ఆస్తులున్నాయని ఒక అంచనా. వీటన్నింటినీ అనేక ధార్మిక సంస్థల పేరుతో నిర్వహిస్తున్నాడు. వీటి ముసుగులో ఆయన పెద్ద మొత్తంలో ఆస్తి సంపాదించాడు. ఆయన ఆస్తులపై శ్రీ నారాయణ హరి సకర్ ఛారిటబుల్ ట్రస్ట్ అజమాయిషీ చేస్తోంది. ఆయన అనుయాయులందరూ దళిత, ఓబిసి కులాలకు చెందిన పేద, నిరక్షరాస్యులైన ప్రజలైనప్పటికీ ఈయన ఇంత ఆస్తిని ఎలా సంపాదించాడనేది ఒక రహస్యం.
ఆయన తన భక్తులకు దర్శనమిచ్చే సమయంలో గంజిపెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి దుస్తులు ధరించి టై కట్టుకుని అధునాతనమైన కళ్ళజోడు ధరించి వుంటాడు. టయోటా ఫార్ట్యూనర్ కారులో తిరుగుతుంటాడు. శక్తివంతమైన మోటార్ సైకిళ్ళపైన ప్రయాణించే కమాండోలు ఇతడి ప్రయాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోయేటట్టు చూస్తారు. ఆయన ఆశ్రమంలో అంతా పకడ్బందీ రహస్యమే. అక్కడ ఫోటోలు తీసుకోవడం, రికార్డ్ చేయడం నిషిద్ధం. చచ్చిపోయినవాళ్ళను బతికించడంతో సహా ఆయనకు దైనిక శక్తులున్నాయని అతని అనుయాయుల నమ్మకం. ఆయన పాద ధూళిని పోగుచేసుకునేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడిన ఫలితంగా తొక్కిసలాట జరిగింది.
బాబాల సాధారణ జీవిత చిత్రణ :
సమకాలీన భారతదేశంలో ఎక్కువమంది బాబాల జీవితాలు ఇలానే గడుస్తున్నాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్థాయి. అతి సాధారణమైన నేపథ్యం నుండి వచ్చినవాళ్ళు బాబాలయ్యాక విలాసవంతమైన జీవితాలను గడుపుతారు. సంపన్నమైన ఛారిటబుల్ సంస్థలు వీళ్ళకి నిధులందిస్తాయి. వాళ్ళ నిధుల వనరు రహస్యం. వాళ్ళకు భద్రతకోసం, రహస్యాల్ని కాపాడటం కోసం స్వంత సైన్యాలుంటాయి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల అండదండలుంటాయి. ఏదోఒక ఆరోపణ బట్టబయలై ప్రజల దృష్టిలో బహిర్గతమయ్యేంతవరకూ వాళ్ళు పూజ్యనీయులుగానే భావించబడతారు. ఆయన ఆశ్రమాలు వున్న ప్రాంతాల వెలుపల వున్న ప్రదేశాలలో భోలే బాబా పెద్దగా సుపరిచితుడు కాదు. పైన పేర్కొన్న విషాద సంఘటన కారణంతో ఆయన దేశ ప్రజల దృష్టిలో పడ్డాడు. గుట్టు రట్టు అయిన ఇంకొంతమంది ప్రఖ్యాత బాబాలు కూడా వున్నారు: ఆశ్రమ్బాపు (అత్యాచారం వంటి నేరాలలో శిక్ష పొందినవాడు) గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (హత్యతో సహా ఇతర సీరియస్ నేరాల కింద శిక్షించబడ్డవాడు) ఇఛ్చాధారి సంత్ స్వామి భీమానంద్ జీ మహారాజ్ చిత్రకూట్ వాలే (పెద్ద ఎత్తున సెక్స్ వ్యాపారాన్ని నిర్వహించాడు. అతడి ఆస్తుల విలువ రూ. 2,500 కోట్లు) రాంఫాల్ (అనేక నేరాలలో శిక్ష పొందినవాడు, ముద్దాయి) చంద్రస్వామి ఎలియాస్ నేమి చాంద్ జైన్ (ఆర్థిక తదితర నేరాలు ఇతనిపై నమోదయ్యాయి) స్వామి సదాచారి (వేశ్యాగృహాన్ని నిర్వహిస్తున్నందుకు జైల్లో వున్నాడు) క్రిపాలూ మహారాజ్ (అత్యాచారం, వేధింపుల కేసులలో నిందితుడు) దేవనాథన్ (భక్తులు బయట వేచి చూస్తుండగా గదిలో లైంగిక చర్యలకు పాల్పడతాడని ఆరోపణ) స్వామి అమృత చైతన్య (మైనర్లు, యువ మహిళలపై అత్యాచారాలు చేసినందుకు శిక్ష పొందినవాడు). ఈ జాబితా ఎంత మాత్రమూ సమగ్రమైన పూర్తి జాబితా కాదు. పేరు ప్రఖ్యాతులున్న కొందరు బాబాలపై అనేక వివాదా స్పద ఆరోపణలున్నాయి. శ్రీ శ్రీ రవిశంకర్ (పర్యావరణ నిబంధనలను ఉల్లఘించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు) జగ్గీ వాసుదేవ్ అలియాస్ సద్గురు (స్టాక్మార్కెట్లో లాభాల కోసం సూచనిలిస్తాడని ప్రసిద్ధి. అక్రమ నిర్మాణాలకు బాధ్యుడన్న ఆరోపణను ఆయన ఖండిరచాడు. ఆయన నిర్వహిస్తున్న యోగా కేంద్రం నుండి ఆరుగురు జాడ తెలియకుండా పోయారన్న ఆరోపణను ఆయన ఫౌండేషన్ నిరాకరిస్తోంది) ఇప్పుడు ‘కైలాస్’కు చెందిన నిత్యానింద గురించి (ఆయన మీద అత్యాచారంతో సహా అనేక ఆరోపణలున్నాయి) (ఈయన అనుచరులందరూ మహిళలే. వాళ్ళందరితో కలిసి దేశం నుండి పారిపోయి కైలాస అనే పేరుతో ఒక స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు` అను.) ఇలాంటి స్వామీజీల జాబితాకు, వాళ్ళ నేరాల చిట్టాకు అంతేలేదు.
కీలకమైన సూటి ప్రశ్నలు కొన్ని :
హత్రాస్ దుర్ఘటన అనంతరం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆనాడు జరిగిన సత్సంగ్ నిర్వాకులపై ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేశారు. సాక్ష్యాన్ని దాచిపెట్టారని, అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలను తీసుకువచ్చారని, అధికారులతో సహకరించలేదని వాళ్ళమీద ఆరోపణలున్నాయి. ఎఫ్.ఐ.ఆర్ ప్రకారం వాళ్ళు ఎనభైవేల మంది హాజరవుతారని అనుమతి తీసుకున్నారు. కాని రెండున్నర లక్షలమందిని అనుమతించారు. దీని కారణంగా ఆ ప్రజానీకాన్ని అజమాయిషీ చేయడం సాధ్యంకాకుండా పోయింది. ఎఫ్.ఐ.ఆర్‌లో నిర్వాహకుల పేర్లు మాత్రమే వున్నాయి. మొదటి ఫిర్యాదులో ప్రస్తావించిన భోలే బాబా పేరు ఎఫ్.ఐ.ఆర్‌లో లేకపోవడం గమనించాల్సిన విషయం. ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి చిన్న చిన్న కార్యకర్తల సమావేశాలకు కూడా అనుమతులు నిరాకరిస్తున్న పాలనా యంత్రాంగం, ప్రజల భద్రతకు ప్రమాదకరమైన రీతిలో అంత పెద్ద సమూహం ఒకచోట చేరడానికి ఎలా అనుమతినిచ్చిందనేది కీలకమైన ప్రశ్న. అనుమతించిన ఎనభైవేల సంఖ్యకూడా తక్కువేమీ కాదు. అంతమంది జనాన్ని నిర్వాహకుల దయాదాక్షిణ్యాలకు వదిలివేయడం సరైంది కాదు. శాంతి భద్రతలను కాపాడడం పాలనా యంత్రాంగపు బాధ్యత. అందుకు కేవలం నిర్వాహకులను నిందించడం సరికాదు. పాలనా యంత్రాంగానిది కూడా సమాన బాధ్యత. ఒకరకంగా చెప్పాలంటే అంతకంటే ప్రధాన బాధ్యత. అనుమతించిన సంఖ్య కంటే మూడిరతల మంది ప్రజలు వస్తున్నా పట్టించుకోకపోవడానికి వాళ్ళదే బాధ్యత. ఈ బాబాల కార్యాకలాపాలకు సంబంధించిన మరొక ప్రాథమిక ప్రశ్న వున్నది. రాజ్యాంగంలోని 51(ఎ) నిబంధన ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం రాజ్యపు బాధ్యత. ఈ బాబాల చర్యలు ఈ నిబంధనకు ఉల్లంఘన. తమకు దైవిక శక్తులున్నాయని వాళ్ళు నమ్మబలుకుతారు. ప్రార్థనల ద్వారా రోగాలు తగ్గిస్తామని ప్రచారం చేసుకుంటారు. భ్రమలను ప్రచారం చేస్తారు. అప్రజాస్వామిక కార్యకలాపాలకు పాల్పడతారు. ఇవన్నీ రాజ్యాంగంలో పేర్కొన్న శాస్త్రీయ దృక్పథ సూత్రాలకు విరుద్ధమైనవి. వాళ్ళు చేస్తున్నదేదీ నిజానికి మతం అనే దాని కిందకు రాదు. అలాంటి అర్హత దానికి లేదు. మత స్వేచ్ఛ హక్కు కింద వాళ్ళ చర్యలను క్షమించడానికి వీలులేదు.వీటికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాజకీయ నాయకుల అండదండలున్నాయనేది చేదు వాస్తవం. బాబాలు విడివిడిగా వున్న (వివిధ మూలాలకు లేదా అస్తిత్వాలకు చెందిన) ఓటర్లను గుడ్డి అనుయాయులుగా సంఘటితం చేసుకుంటారు. ఇలాంటి బాబాల ద్వారా రాజకీయ నాయకులు ఆ ప్రజల మద్దతు పొందడం తక్కువ ఖర్చుతో కూడిన పని. ఈ సౌకర్యాన్ని వదులుకోవడానికి ఏ రాజకీయ నాయకుడూ సిద్ధం కాడు. భాజపా భోలే బాబాకు సమాజ్‌వాదీ పార్టీతో సంబంధాన్ని అంటగట్టే ప్రయత్నం చేసింది. అన్ని రాజకీయ పార్టీలు వాటి భావజాలాలు ఏమైనప్పటికీ, ఓటర్ల విషయానికివస్తే వాటి ప్రవర్తన ఒకేరకంగా వుంటుంది. స్థాయీ భేదం తప్ప, వనరుల వ్యత్యాసం తప్ప మరే తేడానూ వుండదు. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణంలో వున్న లోపం. ఈ బాబాలు జరిపే మత సంబంధమైన ఉత్సవాలకు శ్రామికవర్గానికి చెందిన ప్రజలు కూడా హాజరవుతారు. వాళ్ళ ఓట్లను పోగొట్టుకుంటామేమోననే భయంతో కమ్యూనిస్టు పార్టీలు కూడా బాబాలను బహిరంగంగా వ్యతిరేకించడాన్ని దాటవేస్తాయి. మరోపక్క భాజపా ఈ బాబాలకు ప్రత్యక్షంగా మద్దతునిస్తుంది.మోడీ పాలన అమలులో వున్న గత పది సంవత్సరాలలో రాజ్య వ్యవహారాలలో బాబాలకు, బువాలకు (మహిళా బాబాలకు) ప్రాధాన్యత లభించడాన్ని మనం అనేక పర్యాయాలు చూశాం. ఉదాహరణకు, కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన సమయంలో రాజ్యాంగపరంగా దేశాధినేత అయిన రాష్ట్రపతి అక్కడ లేకపోవడం కొట్టొచ్చినట్టు కనపడిరది. అదేసమయంలో సాధువులు, మతాధిపతులు, బాబాలకు ఆ వేడుకలో ప్రాముఖ్యతగల స్థానం లభించింది. సెనగాల్ (రాజదండాన్ని)ను చేతపట్టిన మోడీ భారత చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతున్న సమయంలో ఆయన్ను వాళ్ళు ఆశీర్వదించుతున్నట్టుగా అది నడిచింది. ఆ రాజదండం దక్షిణ భారతానికి చెందిన చోళవంశపు భూస్వామ్య రాజరిక చిహ్నం. హిందూ మతాధిపతులకు రాజ్య వ్యవహారాలలో పెద్దపీటవేసే ధోరణి రాజ్యాంగానికి బహిరంగ ఉల్లంఘనే. దీనికి ఒక ఉదాహరణ : ఒక న్యాయస్థానం వెలుపల రామ్ రహీం సింగ్ అనుయాయులు లక్ష మంది పోగై అక్కడ అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నించిన సమయంలో, పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాని మోడీని, హర్యానా ముఖ్యమంత్రి ఖట్టార్‌ను వాళ్ళను అక్కడ గుమిగూడడానికి అనుమతించినందుకు విమర్శిస్తూ ఇలా అన్నది. ‘‘ఈ చర్య కేవలం ఓట్ బ్యాంక్‌ను ఆకట్టుకోవడానికి చేసిన రాజకీయ లొంగుబాటు’’ అని. రాజ్యాంగపరమైన బాధ్యతలున్నప్పటికీ, ఇలాంటి వ్యక్తుల ప్రభావాన్ని అరికట్టటంలో ప్రభుత్వ వైఫల్యం భారత ప్రజాస్వామిక వ్యవస్థలో వ్యవస్థాగత లోపానికి ఉదాహరణ.
ప్రజలు బాబాలను ఎందుకు అనుసరిస్తారు?
దీనికి అనేక మానసిక సంబంధమైన కారణాలున్నాయి.
- తమ ఉనికికి అర్థాన్ని తెలుసుకోవాలనే తపన : తమ జీవితానికి లోతైన అర్థాన్ని తెలుసుకోవాలనే కోరిక వ్యక్తులకుంటుంది. బాబాలు వాళ్ళకు అనుకూలమైన అతి సాధారణమైన కథనాలను వినిపించి మార్గనిర్దేశం చేస్తారు.
- భయం, ఆందోళన : భయానికి, ఆందోళనకు గురైనప్పుడు ప్రజలు తమమీద తాము నమ్మకాన్ని కోల్పోయి భరోసా కోసం బాబాలను ఆశ్రయిస్తారు. వారి భయాలను పోగొట్టటానికి అవసరమైన ప్రత్యేక శక్తులు తమకున్నాయని బాబాలు చెప్పుకోవడం దీనికి కారణం.
- గుంపులో భద్రతను వెతుక్కోవటం : అనుయాయులు భక్తుల బృందంలో భాగంగా సాంఘిక మద్ధతును పొందుతారు. తామంతా ఒక కమ్యూనిటీకి చెందినవాళ్ళమనే భావన వాళ్ళలో రూపొంతుంది.
- శక్తి, ఆకర్షణ : అనిశ్చిత స్థితిలో వున్నవాళ్ళకు, అభద్రతకు గురైనవాళ్ళకు బాబాలు నమ్మకాన్ని కలిగిస్తారు.
- సామాజిక రుజువు : ఇతరులు ఒక బాబాకు అనుచరులుగా మారితే వాళ్ళందరినీ చూసి తాముకూడా అలా మారాలనే మూక మనస్తత్వం.
- నమ్మకానికి, వాస్తవానికి మధ్య వైరుధ్యం : ఒకసారి ఒక బాబాకు మద్ధతుదారులుగా మారాక, తాము ఊహించినదానికి భిన్నమైన వాస్తవాలు తెలిసినా వాటిని నమ్మకుండా బాబాపట్ల తమ విశ్వాసాన్ని మరింతగా పెంచుకోనే మనస్తత్వం.
- సంక్షోభ పరిస్థితులు : వ్యక్తిగత, సామాజిక సంక్షోభాలు ఎదురైనప్పుడు, పరిష్కారాలు వెతుక్కొనే క్రమంలో ప్రజలు ఇలాంటి బాబాలకు మరింతగా లొంగిపోతారు.
- నేరం చేసామన్న భావన నుండి, అవమానం నుండి విముక్తి : తాము చేసిన నేరాలకు ప్రక్షాళన పొంది గతంలోని తమ తప్పులకు ప్రాయశ్చిత్తానికి అవసరమైన బోధనలు చేసి బాబాలు వాళ్ళచేత పూజలు చేయిస్తారు.
- మానవాతీతమైన పరిష్కారాల మీదా, అద్భుతాల మీదా కోరిక : తమ సమస్యలకు మానవాతీతమైన పరిష్కారాలు దొరుకుతాయాని, కొన్ని అద్భుతాలు జరుగుతాయని బాబాలు చేసిన వాగ్దానాలను నమ్మటం.
- కుట్ర, దోపిడి : కొందరు బాబాలు అనుచరులను మానసికంగా లొంగతీసుకుని వాళ్ళ బలహీనతను ఉపయోగించుకుని వాళ్ళను తమ అనుయాయులుగా మార్చుకుంటారు.
- గుర్తింపు, హోదా : తాను ఒక బాబాకు విధేయుడననే గుర్తింపు తన కమ్యూనిటీలో తన హోదాను పెంచుతుందనే నమ్మకం.
- సాంస్కృతిక , మత సందర్భం : ఆధ్మాత్మిక గురువుల సాంప్రదాయం బలంగా వున్న సంస్కృతులున్న సమాజాలలో ప్రజలు బాబాలకు లొంగిపోవడం చాలా తేలికగా జరిగిపోతుంది.
పైన పేర్కొన్నవన్నీ ఒక స్థితిని సూచించే కారకాలు. వీటిలో కొన్ని సాధారణమైనవి కావచ్చు, కొన్ని కల్పితాలు కావచ్చు. వీటికి లోనుకాకుండా వుంచడం కోసమే రాజ్యాంగం సార్వజనీనమైన విద్యను ప్రోత్సహించాలని, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ది చేయాలని మానవతా వాదాన్ని, పరిశోధనా తత్వాన్ని, సంస్కరణల పట్ల అభిరుచిని పెంచాలని ప్రభుత్వాలకు సూచనలనిచ్చింది. బాబాల, భూస్వామ్య నియంతల ప్రభావానికి అనుకూలమైన సాంస్కృతిక మత సందర్భం ఈ దేశంలో వుందన్న ఎరుక రాజ్యాంగ నిర్మాతలకు తెలుసు. ఆ సందర్భాన్ని బలహీనపర్చడానికి తగిన విధానాలను రూపొందించి అమలుపరిచే బాధ్యతను ప్రభుత్వాలు నిర్వర్తిస్తాయని, ప్రజల్లో హేతుబద్ద ఆలోచనలను పెంపొందిస్తాయని వాళ్ళు ఆశించారు. అయితే అప్పటి నుండి ఇప్పటివరకు పాలించిన ప్రభుత్వాలన్నీ, 48వ నిబంధనలోని గో రక్షణ అంశాన్ని తప్ప మిగిలిన ఆదేశిక సూత్రాలన్నింటినీ గాలికి వదిలేశాయి. ఈ నిర్లక్ష్యం జరిగినప్పటికీ వలసానంతర తొలి దశాబ్దాలలో హేతుబద్ద ఆలోచనకు విలువైన స్థానం వున్నది. అయితే 1990ల నుండి నయా ఉదారవాద సంస్కరణలు హేతుబద్ద ఆలోచనలపై దాడిచేశాయి. ఈ సంస్కరణల కారణంగా ఆర్థిక సంక్షోభాలు మరింత తీవ్రమయ్యాయి. ప్రజల స్థితి మరింత దయనీయంగా మారి, వాళ్ళు క్షుద్ర విద్యల ద్వారా ఓదార్పు పొందే వైపు నెట్టబడ్డారు. దీని ఫలితంగా బాబాల, మితవాద రాజకీయ శక్తుల ప్రభావం పెరిగింది. 1980ల మధ్యకాలంలో పూర్తిగా పతనమైన భాజపా 1990లలో కేంద్రంలో అధికారాన్ని స్వాధీనం చేసుకునే స్థాయికి ఎదగడం ఈ క్రమానికి సాక్ష్యం.ఈ క్రమం ప్రపంచమంతటా కనపడుతోంది. అన్ని దేశాలలోనూ తీవ్రమితవాదశక్తులు బలం పుంజుకుంటున్నాయి. తిరోగమన మత సంబంధిత సాంస్కృతిక నమూనాల పునరుద్ధరణ జరుగుతోంది. ప్రపంచీకరణ ప్రపంచాన్ని మరింతగా మత ప్రభావ అధీనంలోకి నెట్టివేసింది, మతాలను మరింతగా రాజకీయం చేసింది. ప్రజల మధ్య ఆర్థికపరమైన సంబంధాలు పెరుగుతున్న క్రమంలో వాళ్ళలో తమ మతం, తమ నాగరికతా వారసత్వాలకు సంబంధించిన చైతన్యం పెరిగి అది ఇతరుల పట్ల ద్వేషానికి దారితీసింది. ఈ స్థితి మత అధిపతులకు, విశ్వాసం పేరుతో హింసను, ఘర్షణలను రెచ్చగొట్టేవాళ్ళకు ఉపయోగపడిరది.
మితవాద భావజాలంలో రాటుదేలి ముఖ్యమంత్రిగా తన శక్తి ఏమిటో నిరూపించుకున్న నరేంద్రమోడీ నాయకత్వంలో భాజపా 2014లో పూర్తి మెజారిటీని సాధించినప్పటి నుండీ బాబాల ప్రభావం వికృత రూపం తీసుకుంది. ప్రపంచ పెట్టుబడి, అతిపెద్ద సంఖ్యలో వున్న పౌరసమాజం దన్నుతో మోడీ రాజ్యయంత్రాంగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. మీడియాలో తనపై పొగడ్తల వర్షం కురిపించేటట్లు మార్చుకున్నాడు. సాంస్కృతిక వారసత్వాన్ని, అభివృద్ధిని కాపాడే రక్షకుడుగా తననుతాను ప్రచారం చేసుకున్నాడు. సాంస్కృతిక వారసత్వం ప్రధానంగా ఊహాజనితమైంది. వాస్తవంలో దానర్థం సనాతన హిందూ వారసత్వం. రామమందిరాల వంటి దేవాలయాల నిర్మాణం దాని లక్ష్యం. అభివృద్ది అంటే ఫ్లై ఓవర్లు, రోడ్లు , విమానాశ్రయాలు, వందేభారత్ రైళ్ళు, పార్లమెంట్ నూతన భవనం. ఇవన్నీ కొద్దిమందిగా వున్న ధనవంతులకే ఉపయోగం. సాధువుల దుస్తులు ధరిస్తూ తననితాను ఒక అత్యంత భక్తిపరుడైన హిందువుగా చెప్పుకొంటూ తనలో దైవిక శక్తులున్నాయని ప్రచారం చేసుకుంటూ అనుయాయుల గుంపులకు చూసి ఆనందిస్తున్నాడాయన.
బాబాలు, ఫాసిస్టు నాయకులు :
2014 నుండి భారతదేశంలో విశ్వాసం, రాజకీయాల కలయిక పెరుగుతోంది. బాబాలకు, అధినేతకు మధ్య సరిహద్దు గీతలు చెరిగిపోతున్నాయి. మోడీ ప్రధానమంత్రి అయిన మొదటిసారే నిర్హేతుకమైన రూపాయి విలువ తగ్గింపు చర్యతో అట్టడుగు ప్రజలకు కనీవినీ ఎరుగని కష్టాలు తెచ్చిపెట్టాడు. తమకున్న కొద్దిపాటి డుబ్బులు బ్యాంకుల్లో మార్చుకోవడానికి ప్రజలు పాము మెలికల్లాంటి క్యూలల్లో నిలబడాల్సి వచ్చింది. వాళ్ళు తమ స్వంత బాధలు మర్చిపోయి, మోడీ ‘మన్ కీ బాత్’ ను స్మరించుకుంటూ జాతికోసం ఆ మాత్రం కష్టాన్ని పట్టించుకోమని అనుకునేటట్లు చేయగలిగాడు. తదనంతరం పెట్రోల్ ధర ఐదువేల రూపాయలైనా తమకు ఆయనపట్ల నమ్మకం సడలదని, తాము మోడీకే ఓట్లు వేస్తామని వాళ్ళు చెప్పుకున్నారు. ఇలాంటి అంధ భక్తులను ఆయన తయారుచేసుకున్నాడు.
ఆధ్మాత్మిక సరుకులను అమ్ముకునే బాబాలకు, జాతీయవాదాన్ని, సాంస్కృతిక ఔన్యత్యాన్ని అమ్ముకునే ఫాసిస్టు నాయకులను పోల్చి చూసుకుంటే ఆ రెండింటి మధ్య మానసిక సంబంధమైన సామాజిక సంబంధమైన పోలీకలు అనేకం కనపడతాయి. ఈ రెండు రకాల నాయకులు మానవ ఉద్రేకాల మీదా, సామాజిక చలనాల మీదా ఆధారపడి అనుయాయులను ఆకర్షించుకుంటారు. కొన్ని పోలికలను కింద చూద్దాం.
- ఇద్దరూ వాడేది ఆకర్షక శక్తిని. తమకు విలక్షణమైన జ్ఞానసంపద, బలం వున్నాయని బాబాలు, ఫాసిస్టు నాయకులు ప్రచారం చేసుకుంటారు. తాము జ్ఞానసంపన్నులమని బాబాలు చెప్పుకొంటే, జాతి శక్తికి, సాంస్కృతిక పవిత్రతకు తాము ప్రతిరూపాలమని ఫాసిస్టు నాయకులు చెప్పుకుంటారు.
- ఇద్దరూ పరిష్కారాలను వాగ్దానాలు చేస్తారు. బాబాలు ప్రజల వ్యక్తిగత సమస్యలకు ఆధ్మాత్మిక పరిష్కారాలను చూపెడుతూ వాళ్ళకు శాంతిని, సంపదను, ఆరోగ్యాన్ని వాగ్దానం చేస్తారు. ఫాసిస్టు నాయకులు ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడం, జాతి గౌరవం, భద్రత, సాంస్కృతిక వైభవ పునరుద్ధరణ వంటి పరిష్కారాలను వాగ్దానం చేస్తారు.
- ఇద్దరూ తమకు అనుకూల బృందాన్ని సృషించుకుని, మిగిలినవాళ్ళంతా బయటివాళ్ళని ప్రచారం చేస్తారు. బాబాలు తమకు విధేయంగా వుండే బృందాన్ని తయారుచేసుకుని మిగిలినవాళ్ళందరూ అవిశ్వాసులని ప్రచారం చేస్తారు. ఫాసిస్టు నాయకులు జాతి, మత గుర్తింపుల మీద ఆధారపడ్డ బృందాలను తయారుచేసుకుని మైనారిటీలు రాజకీయ శత్రువులు ప్రమాదకరమని ప్రచారం చేస్తారు.
- ఇద్దరూ ప్రజల్లో భయాందోళనలను కృత్రిమంగా సృష్టిస్తారు. బాబాలు ఆరోగ్యం గురించి, భవిష్యత్ గురించి వుండే వ్యక్తిగత భయాలను ఉపయోగించుకుంటారు. తామిచ్చే ఆధ్మాత్మిక సలహాల సహాయంతో రక్షణను వాగ్దానం చేస్తారు. ఫాసిస్టు నాయకులు ఆర్థిక అనిశ్చితత్వాన్ని, సాంస్కృతిక విలువల పతనాన్ని చూసి భయపడుతున్న సమాజాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అధికారయుత విధానాల ద్వారా భద్రతను వాగ్దానం చేస్తారు.
- ఇద్దరూ రెచ్చగొట్టేది ఉద్రేకాలనే. బాబాలు అద్భుతాల సృష్టికి సంబంధించిన కథలు చెప్పి ప్రజలలో ఆశలను రేకెత్తించి వాళ్ళను తమవాళ్ళుగా మార్చుకుంటారు. ఫాసిస్టు పాలకులు పదేపదే దేశభక్తి పాటలు పాడుతూ ప్రజలలో కల్పిత శత్రువుపట్ల కోపాన్ని, ఐక్యతను సాధిస్తారు.
- ఇద్దరూ సమస్యలకు సులువైన తక్షణ పరిష్కారాలను ప్రతిపాదిస్తారు. క్లిష్టమైన వ్యక్తిగత సమస్యలకు బాబాలు మానవాతీత పరిష్కారాలను సూచిస్తారు. ఫాసిస్టు నాయకులు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు కొన్ని సమూహాలు కారణమని నిందిస్తూ వాళ్ళపట్ల వ్యతిరేకతను పెంచే పద్ధతిని వాడతారు.
- ఇద్దరూ తమకు మాత్రమే ఒక ప్రత్యేక హోదా వుందని ప్రచారం చేసుకుంటారు. తమకు ఇంకెవరికీ లేనివిధంగా ఆధ్మాత్మిక జ్ఞానం వుందని బాబాలు చెప్పుకుంటారు. దీని ద్వారా అనుయాయులలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతారు. జాతి అభివృద్ధి చెందే మార్గానికి సంబంధించిన జ్ఞానం తమకు మాత్రమే వుందని ప్రచారం చేసుకోవడం ద్వారా ఫాసిస్టు నాయకులు తమ అనుయాయులలో జాతి అస్తిత్వ రక్షకులుగా ఒక ప్రత్యేక గుర్తింపు పొందుతారు.
- ఇద్దరూ వ్యక్తిపూజ మీద ఆధారపడతారు. బాబాలు తమ ఆధ్యాత్మిక అస్తిత్వం మీద ఆధారపడి తమకంటూ ఒక ఆరాధనా వ్యవస్థను సృష్టించుకుంటారు. అనుయాయుల జీవితాల్లో తాము కేంద్ర బిందువులౌతారు. ఫాసిస్టు నాయకులు తమ రాజకీయ గుర్తింపు కేంద్రంగా ఒక ఆరాధనా వ్యవస్థను సృష్టించుకొని జాతి గుర్తింపుకు కేంద్ర బిందువులౌతారు.
- ఇద్దరూ ఆర్థిక దోపిడీకి పాల్పడతారు. బాబాలు ఆధ్యాత్మిక వస్తువులను, సంఘటనలను విక్రయించటం ద్వారా అనుయాయులను ఆర్థికంగా దోచుకుంటారు. ఫాసిస్టు నాయకులు జాతీయ వనరులను, ఆర్థిక వ్యవస్థలను దోచుకుని తమకు, తమ మద్దతుదారులకు లాభం కలిగేలా చూస్తారు. ఈ క్రమంలో వాళ్ళ చర్యలు సాధారణ ప్రజలకు నష్టాన్ని కలిగిస్తాయి.
- ఇద్దరూ ఆధారపడేది ప్రాపగాండా మీద. బాబాలు మత ప్రాపగాండా మీదా, మత ప్రసంగాల మీదా, తాము చేసిన బోధనల వల్ల ఉపయోగం కలిగిందన్న భక్తుల సాక్ష్యాల మీద ఆధారపడి తమ శక్తిని బలోపేతం చేసుకుంటారు. ఫాసిస్టు నాయకులు రాజకీయ ప్రచారాన్ని ఉపయోగించుకుని మీడియా మీదా ఆధిపత్యాన్ని సంపాదించి జాతి చిహ్నాలన్నింటినీ తమ రాజకీయ ఆధిపత్యాన్ని దృఢతరం చేయడానికి ఉపయోగించుకుంటూ మద్ధతుదారులను ఆకర్షిస్తారు.
దేశం గురించి, ప్రజల గురించి మనందరం ఆత్మశోధన చేసుకోవల్సిన అవసరాన్ని హత్రాస్ సంఘటన గుర్తింపచేస్తుంది.
(ఆనంద్ తేల్తుంబ్డే ఖరగ్‌పూర్ ఐఐటిలో మాజీ ప్రొఫెసర్. గోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా పూర్వ ఆచార్యులు. రచయిత, పౌరహక్కుల కార్యకర్త.)
అనువాదం : సి.యస్.ఆర్. ప్రసాద్