
రాజకీయ అధికారం కోసం బీజేపీ , ఆరెస్సెస్ వారు తరచుగా ప్రచారం మీద, తప్పుడు సమాచారం మీద, సత్యాలను వ్యూహాత్మకంగా వక్రీకరించడం మీద ఆధారపడతారు. హిందుత్వ సిద్ధాంతకర్తలు వి.డి.సావర్కర్,బి.ఎస్.మూన్జే,కె.బి.హెగ్డేవార్ అలాగే ఎం.ఎస్.గోల్వాల్కర్ మొదలుకొని వారి వర్తమాన వారసుల దాకా హిట్లర్,ముస్సోలినీల నుండి స్ఫూర్తి పొందిన వారే. కాలాన్ని బట్టి సందర్భాలని బట్టి వీరిలో కొన్ని తేడాలుండొచ్చు కానీ, వీరికీ వీళ్ళ యూరప్ ఫాసిస్టు పెద్దలకు మధ్య అనేక సామీప్యాలు కొట్టొచ్చినట్టు కనపడతాయి.
వీళ్ళ మధ్య అతి ముఖ్యమైన సామీప్యం ఏమిటంటే, సత్యాలను వక్రీకరించడం, ప్రచారం మీద ఆధారపడడం, పచ్చి అబద్ధాలను నిజాలుగా నమ్మించడం- హిట్లర్ ప్రాపగాండా మంత్రి జోసెఫ్ గోబెల్స్ యొక్క టెక్నిట్ ఇదే. సత్యాన్ని అసత్యంగా మార్చడం అనే మంత్రోపదేశం చేసింది గోబెల్సే. అతనేమంటాడంటే, “ఒక పెద్ద అబద్ధాన్ని చెప్పు, అదే అబద్ధాన్ని పదే పదే చెప్పు. అదే నిజమైపోతుంది.” ఈ అసత్య ప్రచార పరంపరను కొనసాగించడంలో హిందుత్వ సిద్ధాంతకర్తల వర్తమాన వారసులు గోబెల్స్ మనవలుగా మారి ఆయన చూపిన దారిలో అడుగు తప్పకుండా నడుచుకుంటున్నారు.
అసత్యాల పునాదులు
హిందుత్వ ఉద్యమ సైంద్ధాంతిక పునాది భయంకరమైన అసత్యాల మీద నిర్మితమైంది. ఈ అబద్ధాలకు కేంద్రం లాంటిది ఏంటంటే, హిందువులు అఖండ భారత ( అవిభాజ్య ఇండియా) మూల వాసులని, వీరే సర్వోన్నత నాగరికతకు సృష్టికర్తలని, ప్రపంచానికి జ్ఞాన ప్రదాతలని చెప్పడం. ఏడో శతాబ్దం తర్వాత ఇస్లామిక్ పాలన కింద ఈ గత వైభవాన్ని ఈ మూలవాసులు కోల్పోయారని, హిందువులు తిరిగి ఆ గత ప్రాభవాన్ని దక్కించుకోవాలన్నదే దీని సారాంశం. చారిత్రకంగా వేరు వేరు అస్తిత్వాలున్న హిందువులంతా సమీకృతం కావాలని వీరు వలస కాలం నుంచీ ఇదే ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
అసలు హిందూ అనే మాటే బయటి నుంచి దిగుమతి చేసుకున్న పరాయి పదం. ఇండస్ నదీ ప్రాంతానికి చెందిన పర్షియన్ మాట నుంచి వచ్చింది అది. హిందుత్వ ప్రచారకులు ఏ ముస్లిం పాలకులను తిడతారో వారే ఈ పదాన్ని వాడారు. అది ముఖ్యంగా ఒక భౌగోళిక సూచిక మాత్రమే. సింధు నదికి ఇవతల ఉండే వారిని గురించి చెప్పేటప్పుడు పర్షియన్లు, గ్రీకులు ఈ మాటను వాడే వారు. అ మాట లేదా పదం ఒక ప్రత్యేక మతానికి గుర్తింపు కాదు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజల ఆచార వ్యవహారాలను, సంస్కృతిని తెలియజెప్పేది మాత్రమే.
మన పురాతన గ్రంథాలైన వేదాల్లో,ఉపనిషత్తుల్లో హిందూ అనే మాట లేదు. సనాతన ధర్మానికి చెందిన ఆచారాలు, కొన్ని ప్రత్యేకమైన పండగలు, తాత్త్విక ఆలోచనలను తెలియజేసే పదజాలం మాత్రమే ఉంది. బ్రిటిష్ వారు పరిపాలనా సౌలభ్యం కోసం విభిన్న జాతులను ఒకే మతం గుర్తింపు కింద తీసుకురావడానికి హిందూ అనే మాటను స్థిరపరిచారు. ఇలా సమ్మిళితం చేయడం ద్వారా భారత ఉపఖండంలోని విభిన్న ఆచారాలు,సంప్రదాయలతో కూడిన బహుళత్వాన్ని విస్మరించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, హిందూయిజం అనే మాటను బ్రిటిష్ రచయితలే 19వ శతాబ్దంలో వాడుకలోకి తెచ్చారు, భారతీయులు కాదు.
అన్ని నాగరికతలకూ హిందూయిజమే తల్లి అనే వాదన మన హిందుత్వ వాదులు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో తెచ్చిందే. ఈ నాగరికత అంతా ఇండస్ వ్యాలీ నాగరికతకు చెందిందే. నార్త్ వెస్ట్ సౌత్ ఏషియాలోని కాంస్య యుగపు నాగరికత అది. క్రీ.పూ.3300 -1300 మధ్య దాని ఉచ్ఛస్థితికి చెందిన కాలం క్రీ.పూ. 2600 -1900 నాటిదే. 1920లలో సర్ జాన్ మార్షల్ వంటి బ్రిటిష్ పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీసిన నాగరికత ఇది. ఈ సింధు నదీ నాగరికత ఆర్యన్లు రాక ముందు విలసిల్లినదే. భారత చరిత్రలో చీకటి యుగంలాంటి క్రీ.పూ.2000 -1500 మధ్యకాలంలో మధ్య ఆసియాకు చెందిన మతవాదులైన ఆర్యన్లు ఈ ప్రాంతానికి రాకముందు వెల్లివిరిసిన నాగరిరకత ఇది. ఈ ఆర్యన్ల బ్రాహ్మనికల్ కల్చర్ హిందూయిజానికి మూలం.
హిందుత్వ వాదులు చెప్తున్న ఇండస్ వ్యాలీ నాగరికత వారి సైద్ధాంతిక ప్రతిపాదనే కానీ, దానికి పురాతత్వ శాస్త్ర పరమైన లేదా చారిత్రకమైన ఎలాంటి పునాదీ లేదు. ఎంతో క్లిష్టమైన బహుళ సంస్కృతుల గతాన్ని తమ వర్తమాన రాజకీయ ప్రయోజనాలకు మద్దతుగా చరిత్రను మలచుకునే ప్రయత్నమే ఇది. ఈ వక్రీకరణలు నిజమైన భారతీయ నాగరికతను తక్కువ చేయడమే కాదు, ఈ ఉపఖండంలోని బహుళ సంస్కృతిలో విడదీయరాని చారిత్రక భాగస్వామ్యం కలిగిన జాతులను విడదీసే ప్రమాదకర పోకడ కూడా. హిందుత్వ సైంద్ధాంతిక వాదన భారత దేశ బహుళత్వ చరిత్రలో తమకు అనుకూలంగా లేని నిజాలను చెరిపేసి, ఒక తప్పుడు అహంభావాన్ని రెచ్చగొట్టేది మాత్రమే. వీరి వాదనలోని విచ్ఛిన్నకర ఎజెండాను ఎదుర్కొనాలంటే ఈ నిజాలను గుర్తించడం అనివార్యం.
హిందుత్వ ఆవిర్భావం
హిందుత్వం అనేది కూడా దిగమతి చేసుకున్న సిద్ధాంతమే. 1923లో వి.డి.సావర్కార్ “హిందుత్వం:ఎవరు హిదువు?”(Hinditva:who is a Hindu?) అనే కరపత్రంలో ఈ పదాన్ని సృష్టించాడు. ఇది మతపరమైన ఆచారాలతో కాదు, సంస్కృతి పరంగా ఇండియాతో ముడివడిన ప్రాంతీయ గుర్తింపుతో చేసిన నిర్వచనమే. ఇది సనాతన ధర్మంలో ఉండే ఆధ్యాత్మికతకు దూరం కావడమే. హిందుత్వ సిద్ధాంతకర్తలైన ఎం.ఎస్. గోల్వాల్కర్, సావర్కర్, యూరోపియన్ జాతీయ ఉద్యమాల నుండి, ఇటలీ ఫాసిజం, జర్మనీ నాజీయిజం నుండి స్ఫూర్తి పొందిన వారు. మైనారిటీలను హిట్లర్ ఎలా చూశాడో దాన్నొక మోడల్ గా తీసుకుని హిందూ రాజ్యాన్ని నిర్మించడానికి రాసిన రాతలే గోల్వాల్కర్ రాతలన్నీ. ఏక అస్తిత్వాన్ని నొక్కి చెప్పడం, మైనారిటీలను ముఖ్యంగా ముస్లిం, క్రిష్టియన్లను శత్రువులుగా చూపడం, శుద్ధ పౌరాణిక గతాన్ని వైభవీకరించడం హిందుత్వ ఐడియాలజీకి ముఖ్య చిహ్నాలు. ఇదంతా యూరోపియన్ ఫాసిజానికి స్పష్టమైన నకలు మాత్రమే.
ప్రాచీన భారత సంస్కృతికి తాము ప్రతినిధులమని చెప్పుకుంటున్న హిందుత్వం, బహుళ సంస్కృతుల భారతీయ చరిత్రకు తిరస్కారమే. భారతీయ సంపద్వంతమైన బహుళత్వాన్ని ఏకత్వ అస్తిత్వంలోకి కుదించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే.
విచిత్రంగా జాతీయ ఎజెండాగా మారిన హిందుత్వం దాని సైద్ధాంతిక రూపకల్పన అంతా యూరోపియన్ జాతీయవాదం, సాంస్కృతిక ఆధిపత్య భావజాలం ఆధారంగా చేసిందే. హిందుత్వ సంస్థాగత సైద్ధాంతిక వ్యూహాలను ప్రభావితం చేసిన వారు ఇటాలియన్ జాతీయ వాది గూసెప్పీ మజ్జినీ, ఫాసిస్టు నాయకుడు బెనిటో ముస్సోలినీలే. దైవ భాషగా మాటిమాటికీ హిందుత్వ వాదులు కీర్తించే సంస్కృత భాష కూడా బయటి వారు తీసుకువచ్చిందే. సంస్కృత భాషకు మూలం దాదాపు క్రీ.పూ. 1500 నాటి మైసీనియన్ గ్రీక్, ప్రాచీన గ్రీక్ తో పాటు ప్రోటో ఇండో యూరోపియన్ భాషా కుటుంబం.
అఖండ భారతం
అఖండ భారతం అనే భావన కూడా మరొక కల్పితం. బ్రిటిష్ పాలనకు ముందు ఈ ఉపఖండానికి చారిత్రకంగా ఏకైక రాజకీయ పాలనా వ్యవస్థ లేదు. హిందుత్వ వాదులు చెప్తున్న ఏకీకృ భారత్ అనేది ఆధునిక పరికల్పనే కాని, చారిత్రకంగా అది సరికాదు. హరప్పా నాగరికత కనుగొనడానికంటే ముందు అతి పురాతన నాగరికతల్లో ఇండియా ఎక్కడా చారిత్రకంగా కనిపంచదు. ఈ ప్రాంతపు భిన్నత్వాన్ని, బహుళ జాతుల చరిత్రనూ తుడిచేయడానికే ఊహాజనిత హిందూ కేంద్ర నాగరికతను కీర్తిస్తున్నారు.
ఇండియా అనేది వేల సంవత్సరాల క్రితమే ఉనికిలో ఉందన్నది అబద్ధం. ఇండియా అనేది వలసవాద కాలంలో 1947 లో ఒక దేశం( Nation-state)గా అవిర్భవించింది. అప్పుడే బ్రిటిష్ ఇండియా విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. బ్రిటిష్ వలసవాద పాలనలో భాగంగానే ప్రాంతీయ సరిహద్దులు,పాలనా విభాగాలు,ఏకీకృత దేశం అనే భావన రూపు దిద్దుకున్నాయి. 1947 కి ముందు భారత ఉపఖండం చిన్నచిన్న రాజ్యాల,సామ్రాజ్యాల,స్వతంత్ర ప్రాంతాల సమాహారం మాత్రమే. సాంస్కృతికమైన వాణిజ్య సంబంధమైన కార్యకలాపాల వల్ల ఐక్య నాగరికత భావన ఏర్పడింది కానీ, ఇండియా అనేది ఒకే రాజకీయ అస్తిత్వంగా ఉనికిలో లేదు. భారత జాతీయ వాదం జెండా కింద సాగిన వలసవాద వ్యతిరేక పోరాటం విభిన్న జాతులను ఏకం చేసింది. ఉనికిలో ఉన్న బహుళత్వాన్ని గౌరవిస్తూ ఇండియాని బహుళ సంస్కృతుల ప్రజాస్వామిక దేశంగా గాంధీ,నెహ్రూ,అంబేద్కర్ తీర్చిదిద్దారు.
దీని అర్థం ఆర్థిక,వైజ్ఞానిక,నాగరికతా రంగాలలో ప్రాచీన భారత ప్రగతిని త్రోసిపుచ్చడం కాదు. అయితే ఇది బ్రాహ్మణిక ప్రగతి కాదు, అదంతా శ్రమణిక( బౌద్ధ) సంప్రదాయంతో రూపు దిద్దుకున్నది. దానిని హిందుత్వ ఉద్యమం తనలో కలిపేసుకుంది. నేర్పుగా హిందుత్వ చేసిన ఈ పని ఇక్కడి ప్రత్యామ్నాయ భావజాలం నిర్వహించిన పాత్రను చెరిపేసి, భారతీయ చరిత్రలో భిన్నత్వ వైవిధ్య వైశిష్ట్యాన్ని లేశమాత్రంగా కుదించేసింది.
మన స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారి తుపాకులను, తూటాలను ఎదుర్కొంటున్న సమయంలో హిందుత్వ ప్రచారకులు బ్రిటిష్ వారితో కుమ్మక్కయి బ్రిటిష్ వారు మన శత్రువులు కాదని ప్రజలకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. పైగా వారు ఇండియాని తమ ఇల్లుగా ఎప్పుడో మలచుకున్న ముస్లింలను టార్గెట్ చేశారు. కావున, ఈ మొత్తం హిందుత్వ భావన అనే భవనం అబద్ధాల పునాదుల మీద నిర్మితమైంది.
అబద్ధాలతో సమీకరణ
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.),భారతీయ జనతా పార్టీ (బి.జె.పి.) తమ రాజకీయ అధికారం కోసం ప్రచారాన్ని,తప్పుడు సమాచారాన్ని, వ్యూహాత్మక సత్య వక్రీకరణనీ తరచుగా వాడుకుంటారు.
వారి అబద్ధాలు, వక్రీకరణల జాబితా ఒకసారి తిరగేద్దాం..
చరిత్ర వక్రీకరణ
ముస్లిం పాలకులు విశ్వవ్యాప్త దురాక్రమణదారులని, మనము వెర్సెస్ వారు (Us Vs.them) అనే వాదన తీసుకొచ్చారు. ముస్లిం పాలకులు హిందూ పాలకులతో కలిసి సాగించిన ప్రగతిశీల విధానాలు, సంకీర్ణ సాంస్కృతిక తీరు విస్మరించారు. సావర్కర్ లాంటి వారిని దృఢమైన జాతీయవాదులుగా చూపిస్తూ వలస వాదులతో వారు కుమ్మక్కైన చరిత్రను, మత ప్రాతిపదికన ప్రజల ఐక్యతను దెబ్బ తీసిన ప్రయత్నాలను దాచిపెట్టారు.
ఆదివాసీల పై వారి వాదన
ఆరెస్సెస్ వారు, వారి అనుబంధ సంస్థలు గిరిజన జాతులను హిందూ సమాజంలో భాగమే అని చెప్తూ వారిని వనవాసులు( అడవుల్లో ఉండేవారు) అంటారు తప్ప ఆదివాసులు(మూల వాసులు) అని అనరు. ఈ చిత్రణ వల్ల వారిని హిందూ సాంస్కృతిక వారసత్వానికి కొనసాగింపుగానే చూస్తున్నారు గాని వారి స్వయం ప్రతిపత్తిని నిరాకరిస్తున్నారు. వనవాసలు అని చెప్పడం ద్వారా గిరిజనులు అడవుల్లో నివసించే వారనే కాని, వారి భూములకు హక్కుదారులని కాదు. వనవాసి కల్యాణ ఆశ్రమ్ అనే పథకాలతో వారు క్రిస్టియానిటీ లాంటి ఇతర మతాల్లోకి పోకుండా కట్టడి చేయడం మరొకటి. శబరి, హనుమాన్ లాంటి పురాణ పాత్రలతో వారి మూలాలను కలపడం ద్వారా హిందూ సంస్కృతిలో వారిని భాగం చేసే యత్నమే. వారిని వనవాసులుగా మాత్రమే గుర్తించి రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్, అటవీ హక్కుల చట్టం ద్వారా వారికి సంక్రమించే భూ హక్కుల నుండి దూరం చేస్తున్నారు.
మత సమీకరణ ప్రచారం
ఇండియాలో అధికారాన్ని హస్తగతం చేసుకోడానికి ముస్లింలు ఎక్కువ మంది భార్యలతో ఎక్కువ మంది పిలల్ని కంటున్నారన్న అబద్ధాన్ని ప్రచారంలో పెడుతున్నారు. హిందూ అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకుని వారిని తమ మతంలోకి మార్చుకోడానికి ముస్లిం పురుషులు చాలా క్రమబద్ధంగా హిందూ స్త్రీలకు వల వేస్తున్నారని చెప్తూ దానికి ‘లవ్ జిహాద్’ అనే బోగస్ పేరు పెట్టారు. రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదాన్ని పూర్తిగా మత పరమైన వివాదంగా చూపించి దాని వెనకున్న రాజకీయ దురుద్దేశాలను దాచి పెడుతున్నారు.
తప్పుడు ఆర్థిక విజయాల ప్రచారం
తమను తాము క్రమశిక్షణ కలిగిన పరిశుద్ధమైన పార్టీగా ప్రచారం చేసుకునే బీజేపీ వారు అందిరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని, నల్లధనాన్ని వెనక్కి తెస్తామని చేసిన వాగ్దానం ఎన్నికల జిమ్మిక్కుగా నిలిచిపోయింది. లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. లెక్కలు చూస్తే నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
అబద్ధాలతో అడ్డదారులు
నిరసన తెలియజేయడాన్ని జాతి వ్యతిరేక చర్యగా చిత్రీకరించి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది దేశ ద్రోహంగా చూపించి దేశంలో ప్రతిపక్షమే లేకుండా చేయడానికి, హిందూ రాష్ట్ర నిర్మాణమే ఏకైక లక్ష్యంగా బీజేపీ కదులుతోంది. దేశంలో సమస్త పాపాలకీ, ఆఖరికి తమ లోపాలకి కూడా కాంగ్రెసే కారణమని బీజేపీ వారు చెప్తారు.
ప్రతిపక్షాల మీద అసత్య ప్రచారం
బీజేపీ తమ సొంత పార్టీలో కుటుంబాలకు పట్టం కడుతూ కాంగ్రెస్ ని మాత్రం వారసత్వ రాజకీయాల పార్టీ అని ముద్ర వేస్తున్నారు. మైనారిటీలను బుజ్జగించే పార్టీలుగా ప్రతిపక్షాలను చిత్రీకరిస్తూ సెక్యులర్ విధానాలు మెజారిటీ హిందూ మతానికి అన్యాయం చేసేవిగా చెప్తున్నారు.
టక్నాలజీతో ప్రచారం
మీడియా మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని సంపాదించి అసత్య వార్తలను ప్రచారం చేసే ఒక ఎకో సిస్టంని నెలకొల్పారు. రాజకీయ ప్రత్యర్థులను, మైనారిటీలను టార్గెట్ చేసుకుని వారి మీద దుష్ప్రచారం చేయడానికి కల్పిత వీడియోలు, తప్పుడు వార్తలు సృష్టించడానికి సోషల్ మీడియా వేదికలను, ఐటీ సెల్స్ నీ వాడుకుంటున్నారు. ఈవీఎంల మీద ఎన్నికల అవకతవకల మీద ఎన్నో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిపుణులైన వారు వ్యక్తం చేస్తున్న సందేహాలను కూడా కొట్టి పారేస్తున్నారు.
సంస్కృతి, నాగరికతల కల్పితాలు
దేశం వాస్తవంగా సాధించిన చారిత్రక విజయాలను అపహాస్యం చేస్తూ, ప్లాస్టిక్ సర్జరీలు,స్టెమ్ సెల్ టెక్నాలజీ మొదలైనవి ఎప్పుడో ప్రాచీన భారతీయులు కనిపెట్టేసారని బీజేపీ ఒక సూడో సైంటిఫిక్ వాదన చేస్తుంది. దేశంలోని వివిధ భాషల, సంస్కృతుల వైవిధ్యాన్ని తక్కువ చేస్తూ హిందీ భాష, హిందూ మత ఔన్నత్యాలను భారతీయ సంస్కృతిగా చూపిస్తున్నారు.
అబద్ధాలతో పాలన
2014లో నరేంద్ర మోడీ ప్రధాని కావడమే ఒక అబద్ధ పునాది మీద జరిగింది. తానే వికాస పురుషుడినని చెప్పుకుంటూ గుజరాత్ మోడల్ పాలన మీద డంబాలు పలికాడు మోడీ. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే లౌకిక నినాదం ముసుగులో విషపూరిత మత తత్వాన్ని కప్పిపుచ్చుకున్నాడు. పార్లమెంటరీ డెమోక్రసీకి తానే అసలు సిసలు భక్తుడినని చెప్పుకునే ఆయన నాటకీయ పార్లమెంటు ప్రవేశం కూడా ఒక పెద్ద అబద్ధమే. పార్లమెంటరీ సంప్రదాయాలన్నీ విచ్చిన్నం చేయడమే దీనికి నిదర్శన. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల ఆయన భక్తి శ్రద్ధలు కూడా నిజం కాదు. రాజ్యాంగ నైతికతను నిర్లక్ష్యం చేయడమే దీనికి ఉదాహరణ.
గత పదేళ్ళలో మోడీ ప్రభుత్వ తప్పుడు విధానాలు, అసత్యాల జాబితా చూద్దాం..
వేగవంతంగా ఆర్థిక అభివృద్ధి
వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించినట్టు మోడీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. వాస్తవానికి అభివృద్ధి రేటు మొదట్లో ఎక్కువే ఉన్నప్పటికీ , అది క్రమంగా పెద్ద నోట్ల రద్దు, కరోనా కల్లోలం తర్వాత పడిపోయింది.
పెద్ద నోట్ల రద్దు
పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్ల ధనాన్ని రూపు మాపామని,టెర్రరిజాన్ని అరికట్టేశామని ఎకానమీని డిజిటైజ్ చేశామని గొప్పలు చెప్పుకున్నారు. కానీ రిజర్వు బ్యాంకు రిపోర్టు ద్వారా మనకేం తెలుస్తోందంటే, 99 శాతం రద్దయిన కరెన్సీ తిరిగి తెల్లధనంగా మారిపోయిందని, టెర్రరిజాన్ని అరికట్టిన నిదర్శనలేమీ లేవని అర్థమైపోయింది. నోట్ల రద్దు తర్వాతే ఇండియన్ కరెన్సీ సర్క్యులేషన్ వేగంగా పెరిగింది. నవంబర్ 2016 లో అది 16.63 లక్షల కోట్లు ఉంటే, 13.35 లక్షల కోట్లకు పడిపోయింది కానీ వెంటనే పెరుగుతూ అది మార్చి 2024 నాటికి 35.15 లక్షల కోట్లకు చేరుకుంది.
GST
జి.ఎస్.టి. టాక్స్ విధానం బెడిసికొట్టింది. చిన్న వ్యాపారాల మీద అది వ్యతిరేక ప్రభావం చూపింది. అనేక ఆర్థిక లోపాలకు అది కారణమైంది. ఫెడరల్ సంబంధాల మీద అది నెగిటివ్ ప్రభావం చూపింది. ఇదంతా చాకచక్యంగా తెర వెనక్కి గెంటేశారు.
సంక్షేమ విజయం
పి.ఎం. కిసాన్ యోజన, స్వచ్ఛ భారత్,ఉజ్వల యోజన వంటి పథకాలకు ప్రచారం పటాటోపంగా జరిగింది. వాటి అమలులో లోపాలను మాత్రం పట్టించుకోరు.
అవినీతి మీద తప్పుడు వాగ్దానం
ఒక పక్క కుంభకోణాలు, క్రోనీ క్యాపిటలిజం, ఎన్నికల ఫండింగ్ విధానాలు దగ్గర పెట్టుకొని అవినీతిని అరికట్టేశామని గొప్పలు చెప్పుకుంటారు. రఫేల్ డీల్ లో అవినీతి, ఎలక్టోరల్ బాండ్లు,ప్రయివేట్ సెక్టార్ పట్ల పక్షపాత ధోరణి..ఇవన్నీ వీరి పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.
నిర్మాణ రంగం మరియు ఉపాధి
మేకిన్ ఇండియా అనేది నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసి ఉద్యోగాలను కల్పించిందని ప్రభుత్వం చెప్తోంది. వాస్తవానికి నిర్మాణ రంగం స్తంభించింది. ఉద్యోగాల కల్పన కలగానే మిగిలింది. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ( C.M.I.E.),నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ( N.S.S.O.) వెలువరించిన గణాంకాలు చూస్తే గత 45 ఏళ్ళలో చూడనంత నిరుద్యోగం తాండవిస్తోందని తెలుస్తోంది.
రైతు ఆదాయం
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపయిందని ప్రభుత్వం చెప్తోంది. కానీ వాస్తవానికి రైతు ఆదాయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. వ్యవసాయం కుదేలైంది. రైతుల నిరంతర ఆందోళన,పోరాటాలే దీనికి ఉదాహరణ.
కరోనా కాలం
చాలా దేశాల కంటే ఇండియా కరోనా కట్టడిలో మెరుగైన స్థానంలో ఉందని ప్రభుత్వ ఉవాచ. కానీ కరోనా రెండో వేవ్ లో ఆక్సిజన్ కొరత లాంటి ఎన్నో ప్రభుత్వ వైఫల్యాలు చాలా బయటపడ్డాయి. చావుల విషయంలో ప్రభుత్వ లెక్కలు తప్పుల తడకలే.
పౌరసత్వ సవరణ చట్టం
తాము రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టం ( సి.ఏ.ఏ.) ఎలాంటి వివక్షతో కూడినది గానీ, ఏ మతాన్నీ ఉద్దేశంచింది గానీ కాదని ప్రభుత్వం చెప్పింది. కానీ న్యాయ నిపుణులు, విశ్లేషకులు మాత్రం ముస్లిం సముదాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టమని అభిప్రాయపడ్డారు. ఎన్నార్సీ దీన్ని ఇంకా దృఢపరిచింది.
ఆర్టికల్ 370
ఆర్టికల్ 370 ని రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ లో శాంతిని, అభివృద్దిని సాధించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. వాస్తవం మాత్రం వేరుగా వుంది. మానవ హక్కుల ఉల్లంఘన దారుణం, దీర్ఘకాలం పాటు ఇంటర్నెట్ కోత, స్తంభించిన రాజకీయ కార్యకలాపాలు, అభివృద్ధి నమూనా కనిపించకపోవడం మనకు వేరే చిత్రాన్ని ఇస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేయడం మోడీ ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారో దాన్ని ఉల్లంఘించడమే.
రామ మందిరం
దేశంలోని లౌకిక వాతావరణాన్ని దెబ్బ తీసిన ఈ మొత్తం కథాకమామీషు అంతా అనేకానేక అబద్థాల మీద నిర్మితమైందే. రామ మందిరం కోసం వచ్చిన నిధులన్నీ పారదర్శికమే, వాటి వినియోగం సక్రమమే అన్నారు. కానీ నిధుల దుర్వినియోగం జరిగినట్టు, ల్యాండ్ డీల్స్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.
అబద్ధపు వార్తలు
బీజేపీ, ఆరెస్సెస్ అనుబంధ ఐటీ సెల్స్ అసత్య వార్తలను ప్రచారం చేయవని చెప్తారు. రాజకీయ ప్రత్యర్థులను, మైనారిటీలను లక్ష్యం చేసుకుని పక్కాగా దుష్ప్రచారాన్ని సాగిస్తున్నట్టు ఆల్ట్ న్యూస్ తో సహా ఎందరో ఫ్యాక్ట్ చెకర్స్ చెప్తున్నారు.
మత స్వేచ్ఛ
మత పరమైన స్వేచ్ఛను, లౌకికత్వాన్ని బిజెపి కాపాడుతుందని చాటుకుంటారు. కానీ ద్వేషపూరిత నేరాలు, మత కలహాలు, విద్వేష ప్రసంగాలు బిజెపి పాలనలోనే పెరిగాయి. ఇదంతా పార్టీ నాయకుల మద్దతుతోనే జరుగుతోంది.
ఇవన్నీ బీజేపీ పాలనలో ఆందోళన కలిగిస్తున్న విషయాలే. గోబెల్స్ మనవల ఆ అబద్ధాల ఫ్యాక్టరీ తాత్కాలిక అద్భుతాలు చేయవచ్చు. కానీ ఈ మోసం ఎల్లకాలం కొనసాగదని చరిత్ర చెప్తోంది. తాము నమ్మే ధార్మిక గ్రంథం ముండకోపనిషత్తులో ఉన్న ఒక మాటను వారు వింటే వారికే మంచిది. అదేమంటే, “సత్యమేవ జయతే”. అంటే సత్యమే ఎప్పటికీ జయస్తుంది.
…………………………… ……………………..
(ఆనంద్ తెల్టుంబ్లే మాజీ సి.ఇ.ఓ, పి.ఐ.ఎల్,ప్రొఫెసర్,ఐ.ఐ.టి.ఖర్గపూర్ మరియు జి.ఐ.ఎం,గోవా, రచయిత, పౌరహక్కుల కార్యకర్త)
అనువాదం : ప్రసాద మూర్తి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.