
ఎన్ సి ఇ ఆర్ టి ముద్రించిన 6 నుంచి 12 తరగతుల భారతదేశ చరిత్ర పుస్తకాలనుంచి ఇటీవల కొన్ని భాగాలను తొలగించడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ వివాదానికి సంబంధించి ఎందుకు పాఠ్యపుస్తకాలు విద్యలో కీలకమైనవో, వాటినుంచి కొన్ని భాగాలను ఏకపక్షంగా ఎందుకు తొలగించవలసి వచ్చిందో, అట్లా చెయ్యడంలోని తక్షణ ప్రయోజనం ఏమిటో నేను వ్యాఖ్యానించ దలుచుకున్నాను.
పాఠ్యపుస్తకాల ప్రాధాన్యత
పాఠ్యపుస్తకాలకు కనీసం మూడు ప్రయోజనాలున్నాయి. మొదటిది, అవి ఒక అధ్యయన అంశానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఒకచోటకు చేరుస్తాయి. ఇందులో ఒక అంశం చిన్న తరగతులవారికి సులువుగా అర్థమయ్యే స్థాయినుంచి పెద్ద తరగతులవారికి లోతుగా అర్థమయ్యే రీతివరకూ స్థాయీల వారీగా రూపొందించబడుతుంది. ఇది పునరావృతం కావడం కాదు. ఒకొక్కదశలో చరిత్ర ఒకొక్క స్థాయిలో చర్చించబడుతుంది. రెండవది, మంచి పాఠ్యపుస్తకాలు విద్యార్థుల్ని తాము అధ్యయనం చేస్తున్న అంశాలమీద మెరుగైన అవగాహనకు కావలసిన ప్రశ్నల్ని లేవనెత్తేటట్టుచేస్తాయి. ఏ జ్ఞానార్జనలోనైనా ప్రశ్నలను సంధించటం కీలకమైనది. విద్య ప్రోత్సహించవలసినది ఇదే. మూడవది, సమాజంమీద సంస్కృతి మీద ఆ అధ్యయన అంశం చూపే ప్రాధాన్యతను వివరించడానికి ఉపాధ్యాయులకు ఉండే ముఖ్య ఉపకరణం పాఠ్యపుస్తకం. పిల్లలకు మనం దేనిని, ఎలా బోధిస్తామనే అంశమ్మీదనే వారెలాంటి పౌరులుగా రూపొందుతారనేది ఆధారపడి ఉంటుంది. జెసూట్లు, ఆరెస్సెస్ వంటి సంస్థలు వాదించేదికూడా ఇదే. అందువల్లనే ఎన్ సి ఇ ఆర్ టి సెట్ 1, సెట్ 2 పుస్తకాల్ని రాయించినపుడు అత్యంత శ్రద్ధ, నిమగ్నతలను చూపించింది. కానీ పాఠ్యపుస్తకాలు ఇట్లా కత్తరింపబడినపుడు వాటి ప్రయోజనం విద్య మాత్రమే కాదని మనకు తెలుస్తుంది. అధికారంలో ఉన్నవారు తమను ప్రశ్నించడానికి వీల్లేనివిధంగా పౌరుల్ని రూపొందించడానికి వాటిని ఉపయోగించుకుంటారని కూడా మనకు తెలుస్తుంది. ఏమైనప్పటికీ విద్య అంటే అక్షరాలు దిద్దించటం, ప్రాథమిక స్థాయి వాచకాలను వల్లించటం కాదు. అంతకుమించిన అన్వేషణ జరగాలి. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తాము నివసిస్తున్న ప్రపంచాన్ని మెరుగ్గా అర్థంచేసుకునేందుకు తర్ఫీదు పొందాలి. అందుకు ఇప్పటికంటే ఎక్కువ నిధులను బడ్జెట్ లో కేటాయించవలసి ఉంది.
ఏది కత్తిరించబడింది ?
చరిత్ర క్రమానుగత సంఘటనలమీద ఆధారపడుతుంది. దానినుంచి పెద్ద పెద్ద భాగాలను తొలగించడం విద్యార్థులను, ఉపాధ్యాయులను అయోమయానికి గురిచేస్తుంది. ‘ముస్లిం చరిత్ర’ ను దాటుకుంటూ ప్రాచీనయుగం నుంచి ఒక్కసారిగా రెండవ సహస్రాబ్దంలోకి దూకడం విద్యార్థిని పూర్తిగా గందరగోళపరుస్తుంది. ఈ కత్తరింపులు కథనంలో ఖాళీలను ఏర్పరచి సంఘటనలమధ్య కార్యకారణ సంబంధానికి విఘాతం కలిగిస్తాయి. ఉదాహరణకు గాంధీ హంతకుని ఉద్దేశ్యాలను అర్థం చేసుకోకుండా గాంధీ హత్యానంతర రాజకీయ పరిణామాలను ఎవరైనా అర్థం చేసుకోగలరా ?
చరిత్ర కేవలం తారీఖుల గొలుసుకట్టు కాదు. సందర్భాన్ని చర్చించడం చారిత్రక అవగాహనకు కీలకం. ఒక ప్రత్యేక సందర్భంలో ఒక ప్రజాసమూహం ఎందుకు పెద్దసంఖ్యలో గురిబెట్టబడిందో లేదా చంపబడిందో చర్చించబడడం చరిత్రకు అవసరం. అటువంటి అంశాలను పాఠ్య పుస్తకాలనుంచి తుడిచిపెట్టడానికి వీల్లేదు. ఎన్ సి ఇ ఆర్ టి పుస్తకాలనుంచి 2002 నాటి గుజరాత్ మారణకాండ అట్లానే తొలగించబడింది. అటువంటి సంఘటనలు ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయి బాహాటంగానూ, అంతర్గతంగానూ చర్చింపబడుతూనే ఉంటాయి. వాటిని ప్రజలు మరచిపోరు. అవి ఇతర పుస్తకాల్లో, చర్చల్లో చోటుచేసుకుంటూనే ఉంటాయి. జర్మన్లు చేసిన జాతి హననం, రష్యన్ల గులగ్ లు అటువంటివే.
ఎన్ సి ఇ ఆర్ టి పుస్తకాల్లో చేసిన మార్పుల్లో కొన్ని అంశాలు స్పష్టతలేక గందరగోళపరుస్తున్నాయి. మొదటిది సిలబస్ కత్తిరింపు (rationalisation) అంటే ఏమిటి ? రెండు, ఏ ప్రాతిపదికన 11,12 తరగతుల పుస్తకాలనుంచి ఆ భాగాలను తొలగించారు ? దాని న్యాయబద్ధత ఎంత ? గాంధీ హంతకుడు ‘బ్రాహ్మణుడు’ అనే పదాన్ని తొలగించడం కోవిడ్ అనంతరం సిలబస్ భారాన్ని తగ్గించడం ఎట్లా అవుతుంది ?
కత్తిరించడం అంటే తర్కాన్ని, హేతువును లేకుండా చెయ్యడం కాదు. ఒక అంశం ఎందుకు పుస్తకం నుంచి తొలగించబడిందో, అది రాయబడిన దృక్పథం నుంచే వివరించవలసి ఉంటుంది. తొలగించడం అనే చర్య ఏకపక్షంగానో, యధాలాపంగానో లేక ఒక భావజాలాన్ని సమర్థించేందుకో ఉండడానికి వీల్లేదు. కత్తిరింపు హేతుబద్ఢంగా ఉండాలి. కొన్ని వాక్యాలను, పేరాగ్రాఫులను, అధ్యాయాలను తొలగించడం కత్తిరింపు అవుతుందికానీ, హేతుబద్దీకరణ కాదు. ఎన్ సి ఇ ఆర్ టి కత్తిరింపునే హేతుబద్దీకరణ అనుకుంటుందా ? అందుకేనా, విద్యార్థుల శ్రమ తగ్గించడం అనే నెపంతో పెద్ద పెద్ద భాగాలను తొలగించేసింది ?
నిజానికి కోవిడ్ పర్యవసానంగా సిలబస్ భారం తగ్గించాలనుకుంటే, సిలబస్ ను యథాతథంగా ఉంచి కొన్ని భాగాలను పరీక్షనుంచి మినహాయింపు ఇవ్వవలసింది. కోవిడ్ అనంతరం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇది న్యాయమైన పరిష్కారం అయి ఉండేది. అది చరిత్రను యధాతథంగా ఉంచడమేకాక తెలివైన విద్యార్థులకు ఆసక్తికరంగానూ ఉండేది. ప్రశ్నలు రేకెత్తడం మొదలయ్యే 12 వ తరగతి స్థాయి పాఠ్యపుస్తకం ఇట్లానే ఉండాలి. కత్తరింపులు తార్కికంగా, హేతుబద్ధంగా లేవు కాబట్టి అవి చెయ్యడానికి కోవిడ్ కారణం కాదని తెలిసిపోతోంది. అవి మార్పులు చేసినవారి భావజాలానికి అనుగుణంగా జరిగాయని కూడా అర్థమౌతోంది. ప్రతి వాక్యాన్ని తీసుకుని కత్తిరింపులు ఎందుకు జరిగాయో, మిగిలినవి ఎందుకు జరగలేదో చెప్పవలసి ఉంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ మార్పులన్నీ స్పష్టమైన ప్రణాళికతోనే చేశారని ఎన్ సి ఇ ఆర్ టి ఇస్తున్న అసంబద్ధ సమాధానాల్ని బట్టి తెలిసిపోతోంది. ఆ ప్రణాళిక ఏదో తమ బృంద రచయితల చేత రాయించబోయే సెట్ 3 పాఠ్యపుస్తకాలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
గతంలో జరిగిన ఒకానొక సంఘటన 12 వ తరగతి చరిత్ర పుస్తకంలో చోటుచేసుకునే అర్హత కలిగి ఉన్నపుడు, అది ఎప్పుడు ఎందుకు ఎలా ఏమి జరిగిందో చర్చించవలసిన అవసరం దానంతట అదే ఏర్పడుతుంది. క్రీశ 1200-1800 మధ్య మధ్యయుగం అనబడిన 600 ల సంవత్సరాల చరిత్రను 300 సంవత్సరాలకు కుదించడమంటే మరో 300 సంవత్సరాలను పూర్తిగా తుడిచిపెట్టడం కాదు. మొత్తం కాలం నుంచి ఎక్కువ ప్రాథాన్యతగల ఘటనలను ఉంచి తక్కువ ప్రాథాన్యతగల అంశాలను తొలగించడం.
పుస్తకాల నుంచి పేజీలకు పేజీలు, అధ్యాయాలకు అధ్యాయాలు తొలగించడం అవివేకమైన చర్య. ఎన్ సి ఇ ఆర్ టి అందుకు అమోదయోగ్యమైన కారణాలను చెప్పలేకపోతోంది. అందువల్ల చరిత్ర పుస్తకాల నాణ్యత పెంచటం కాదనీ, కత్తరింపులకు ఆదేశించినవారి భావజాలాన్ని పెంచటమే అసలు ఉద్దేశ్యమని అర్థమౌతుంది.
పాఠ్యపుస్తకాల చరిత్ర
ప్రశ్నలను రేకెత్తిస్తున్న మరొక అంశం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏ చరిత్రకారులు రాసిన ఏ చరిత్ర గ్రంథాలు కత్తరింపులకు గురౌతున్నాయి? ఎన్ సి ఇ ఆర్ టి కోసం చరిత్ర పుస్తకాలు (సెట్ 1) మొదటిసారి 1960 లు, 1970 లలో రాయబడ్డాయి. వీటిని రొమీలా థాపర్, అర్జున్ దేవ్, ఆర్ యస్ శర్మ, సతీష్ చంద్ర, బిపన్ చంద్ర వంటి చరిత్రకారులు రాశారు. ఈ పుస్తకాలను మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం రద్దు చేయడానికి ప్రయత్నించింది కానీ అది జరిగేలోగానే ఆ ప్రభుత్వం పడిపోయింది. ఏమైనా ఈ చరిత్రకారుల్ని బిజెపి తీవ్ర పదజాలంతో వ్యతిరేకించింది. వారిని మార్క్సిస్ట్ లనీ, వామపక్షీయులనీ అంటూ వాటిని దూషణపదాలుగా ఉపయోగించింది. చరిత్రను వక్రీకరించారనీ విమర్శించింది. అందులో శాస్త్రీయ విద్యను తమ అభూతకల్పనల చరిత్రతో ఎదుర్కోలేనితనమే కనిపిస్తుంది. బిజెపి ప్రభుత్వం 1999 లో సంఘ్ పరివార్ ఆలోచనలకు అనుగుణంగా రాయగల చరిత్రకారులతో చరిత్రను రాయించడానికి ఆదేశించింది.కానీ 2004 లో ఆ ప్రభుత్వం పడిపోవడంతో అవి అంతంతమాత్రంగానే అమలులోకి వచ్చాయి.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం, అప్పటికే పాఠ్యపుస్తకాలు వచ్చి 40 ఏళ్లు దాటడంతో కొత్తవి రాయించడానికి సంకల్పించింది. ప్రభుత్వాలు మారినపుడల్లా పాఠ్యపుస్తకాలు మారడం ఒక ప్రహసనంగా మారింది. అందువల్ల మాలో కొందరం 2005 లో యుపిఎ ప్రభుత్వానికి ఘాటైన లేఖను రాశాం. అందులో ఏ అధ్యయన అంశంలోనైనా పాఠ్యపుస్తక రచన ప్రభుత్వం అధీనంలో ఉండరాదనీ, అది ఆ అధ్యయన అంశంలో నిపుణులైన విద్యావేత్తల చేతుల్లోనే ఉండాలనీ కోరాం. ఇప్పుడు అన్ని అధ్యయన అంశాల్లో లోతైన, విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నై. నిపుణుల్లో నిపుణులు రూపొందుతున్నారు. అందువల్ల అధ్యయన అంశం మీద సరైన అవగాహన లేనివారికి, రచనా పద్ధతి తెలియనివారికి పాఠ్యపుస్తక రచన అప్పగించరాదు. మా లేఖలకు సమాధానాలు రాలేదని వేరుగా చెప్పనవసరంలేదు. మా విజ్ఞప్తిని ఏ రాజకీయ పార్టీ పట్టించుకోకపోవడానికి కారణం ఆ పార్టీలు యువహృదయాలను సరాసరి ఆకట్టుకుని, లోబరుచుకోవడానికే శ్రద్ధ చూపాయిగానీ, చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రశ్నించడంలో వారికి తర్ఫీదు ఇవ్వాలని భావించలేదు. ఎందుకంటే పౌరులు స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకుని, ప్రశ్నించడం మొదలుపెడితే ప్రభుత్వాలు చాలావాటికి సమాధానం ఇవ్వాల్సివస్తుంది. ఈ ధోరణి ఇటీవలి కాలంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు విద్య సారాంశం ప్రశ్నించే తత్వం నేర్పడం కాదు, పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు జవాబులు చదువుకోవడమే.
విద్యార్థులకు సిలబస్ నిర్ణయించడం క్లిష్టమైనదే కాదు, సమయం తీసుకునే ప్రక్రియ కూడా. ఎన్ సి ఇ ఆర్ టి కోసం సెట్ 1 చరిత్ర సిలబస్ నిర్ణయకమిటీలో ఉన్న మేం సుదీర్ఘ చర్చలు చేయడం గుర్తుంది నాకు. ప్రతి అంశాన్ని పుటం పెట్టి చూశాం. ఆధారాలున్నాయా లేదా అని పరిశీలించాం. వర్తమాన చరిత్రలోనే కాదు, అనంతరకాలంతోపాటు బహుళ కోణాల్లో వాటి పాత్రను పరిగణించాం. సిలబస్ నిర్ణయం అంటే ఇలా జరగాలి.
చరిత్రను తుడిచిపెట్టడం సమంజసం కాదు
సెట్ 2 పుస్తకాలను రాయవలసివచ్చినపుడు కూడా ఇదే పద్ధతిని పాటించాం. కూలంకషంగా చర్చలు జరిపాం. చారిత్రకాంశాలను నవీకరించాం. ఒక అంశాన్ని చేర్చాలా, తొలగించాలా అని సుదీర్ఘంగా చర్చలు జరిపాం. కమిటీలో కేవలం రచయితలే కాదు, ఇతర నిష్ణాతులు కూడా ఉండేవారు. ఈ పద్ధతిని ఇటీవల పాఠ్యపుస్తకాలనుంచి భాగాలను తొలగించినపుడు ఎన్ సి ఇ ఆర్ టి అనుసరించలేదు. అది చేసిన బహిరంగ ప్రకటనల్లో తొలగింపులకు చూపిన ఏకైక కారణం పాఠశాల విద్యార్థులకు కోవిడ్ వల్ల జరిగిన నష్టాన్ని తగ్గించడమే. 6 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు ఉన్న సిలబస్ లో పునరావృతం అయినవాటిని తొలగించడం అర్థం లేని చర్య. ఎందుకంటే ఒక అంశం 6 వ తరగతిలో చెప్పే స్థాయికి 10 వతరగతిలో చెప్పే స్థాయికి అంతరం ఉంటుంది. ఒకానొక చారిత్రక వాస్తవం లేదా ప్రతిపాదనను తొలగించడానికీ కోవిడ్ భారానికి సంబంధంలేదు. ఏదైనా ఎందుకు తప్పించబడిందో తెలుసుకోవడం ఎవరికైనా అవసరమే. ఈ సందర్భంలో మరీ అవసరం. తొలగింపుల పట్టిక చూస్తే అవి తొలగించడానికి కోవిడ్ భారం కారణం కాదని ఇట్టే తెలిసిపోతుంది. అది అధికారంలో ఉన్నవారికి అమోదయోగ్యమైన చరిత్ర వ్యాఖ్యానాన్ని సమర్థించడానికి చేసిందనికూడా తెలిసిపోతుంది. వృత్తిరీత్యా చరిత్రకారులైనవారి అభిప్రాయాలను గమనిస్తే ఏకపక్షంగా జరిగిన తొలగింపుల పర్యవసానంగా మిగిలిన చరిత్ర వారికి అంగీకారంగా లేదు. సిలబస్ ను సులభతరం చేయడమంటే దానిని పునర్వ్యవస్థీకరించాలి గానీ, గొడ్డలి పెట్టి ముక్కలు చేయకూడదు.
12 వ తరగతి భారతదేశ చరిత్ర పాఠ్యపుస్తకంలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగంలో మార్పులేమీ చేయలేదు. రెండవభాగంలో 30 పేజీల అధ్యాయం పూర్తిగా తొలగించబడింది. ఆ అధ్యాయం శీర్షిక ‘16,17 శతాబ్దాలలో మోఘల్ ఆస్థానాలు : చక్రవర్తులు, వృత్తాంతాలు. ‘ తొలగించబడడానికి కారణం అధికారిక చరిత్రలో మొఘల్ పరిపాలనను కించపరడం తప్ప మరొకటికాదు. . గతంలో మొఘల్ పరిపాలన భారతదేశ ముస్లిం పాలనలో ఉత్కృష్టదశగా పరిగణించబడింది. ముస్లిం పాలనను కించపరచాలంటే మొఘల్ పాలనను కత్తిరించడమే మార్గం. నిజానికి అటువంటి నిర్ణయాలు చరిత్రంటే మిడిమిడి జ్ఞానం ఉన్నవారో, అసలు జ్ఞానమే లేనివారో మాత్రమే చేస్తారు.
వాళ్లకు నచ్చినా నచ్చకపోయినా 16,17 శతాబ్దాలు అనేక సంస్కృతుల, అర్థిక వ్యవస్థల, సామాజికవర్గాల అద్భుత మేళవింపు అని చెప్పాలి. అది జైన, హిందూ, అరబిక్ వ్యాపారుల కృషి ఫలితంగా సాధించిన వాణిజ్య ఆర్థికవ్యవస్థలో ప్రతిఫలించింది. భూస్వాముల, వర్తకుల సమ్మేళనంవల్ల అభివృద్ధి దిశగా పరిణామం చెందిన ఆర్థికవ్యవస్థలో కూడా అది కనిపిస్తుంది. ఈ యుగంలో జరిగిన మహత్తర నిర్మాణాల వాస్తుకళలో కూడా ఆ తాళైక్యత దృశ్యమానమైంది. చక్రవర్తి ఆస్థానంతోపాటు సామంతుల ఆస్థానాలలో వికసించిన సూక్ష్మ చిత్రకళలో అప్పటి జీవితం వ్యక్తమయ్యింది. ఆ యుగానికి చెందిన జీవితాన్ని ఎంతో అందంగా, దృఢంగా విశదంచేసిన వందలాది పుస్తకాలు ఉన్నాయి. అప్పటికి లవ్ జిహాద్ ల ఆరోపణలు లేవు. హిందూ రాజపుత్ర కన్యల్ని ఉన్నతి తరగతికి చెందిన ముస్లిములు వివాహం చేసుకున్నారు. మొఘల్ పరిపాలనలో కచ్ఛ్వాహ రాజపుత్రులు ఉన్నతపదవులు అలంకరించారు. ఈ పరిణామాలన్నిటిని ఇప్పటి భారతీయులు తెలుసుకోనవసరం లేదా ? హిందూ ఆరాధనా విధానంలో, నమ్మకాలలో అనేక సంస్కరణలు జరిగిన కాలం అది. భక్తి ఉద్యమం హిందూమతాన్ని సుసంపన్నం చేసింది అప్పుడే. వలసవాదం దేశాన్ని ఆక్రమించడానికి ముందున్న ఈ కాలంలోనే సూఫీ గురువులు యోగులతో జరిపిన సంభాషణల ఫలితంగా హిందీతోపాటు అనేక ప్రాంతీయభాషలలో అపారమైన సాహిత్యం సృజించబడి భారతీయ మేధో వాతావరణం సంపద్వంతమైంది. హిందూ కృష్ణభక్తులేకాదు, ముస్లిం కృష్ణభక్తులు కూడా రచించిన అప్పటి కీర్తనలు ఇప్పటికీ శాస్త్రీయ సంగీత కచేరీలలో ఆలపించబడుతున్నాయి. సంస్కృతులమధ్య జరిగిన వైజ్ఞానిక ఆదాన ప్రదానాలలో గణిత, ఖగోళ, వైద్య శాస్త్రాలలో సాధించిన ప్రగతి ఎల్లలు దాటి విదేశీ విద్యాలయాలకు చేరింది. ఇదంతా తుడిచిపెట్టబడవలసిందేనా ?
అయితే నాణేనికి రెండోవైపు లేకపోలేదు. అది భారతదేశానికి మాత్రమే పరిమితమైన సామాజిక సూత్రాలకు సంబంధించినది. ధర్మశాస్త్రాలు అవర్ణులకు, అస్పృశ్యులకు విధించిన హీనస్థాయి ఇతర మతాలలోకి వ్యాపించింది. ఫలితంగా ముస్లింలలో పస్మందులు (pasmandas), సిక్కులలో మజబీలు (mazhabis) రూపొందారు. అల్లా దృష్టిలో అందరూ సమానమేనని ఇస్లాం ప్రకటించినప్పటికీ షరియా అనేక సామాజిక కట్టుబాట్లను విధించింది. రెండువేల సంవత్సరాలుగా ఒకే మతంలో తీవ్ర అసమానతలకు గురయ్యింది కూడా ఈ వర్గమే. ఈ పరిణామాలన్నీ ఇప్పుడు చరిత్ర పుస్తకాలనుంచి తొలగింపబడ్డాయి. వీటికి బదులుగా వీలైన ప్రతి సందర్భంలో ‘ముస్లిములు హిందువులను బలిచేశారు’ అన్నవిషయమే ప్రస్తావించబడింది. కానీ, అందుకు ఆధారాలు లేవు.
మేధో వ్యతిరేకత
భారతదేశ చరిత్ర రాసిన వలసవాద చరిత్రకారులు ఉద్దేశ్యపూర్వకంగానే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పెంచి పోషించారు. ఇది 1817 లో జేంస్ మిల్ తో మొదలైంది. ఇదే వలసవాద చరిత్ర రచనకు కేంద్రబిందువు అయింది. కొందరు భారతీయ జాతీయవాద చరిత్రకారులు దీనిని వ్యతిరేకించారు. కానీ పాకిస్తాన్ ను కోరుకున్న, హిందూ రాష్ట్రం రావాలని ఆశించిన ఉభయ మత జాతీయవాదులు దీనిని తమ భావజాలాలకు అనుకూలంగా మలుచుకున్నారు. వీళ్లు పాకిస్తాన్ లో ముస్లిముల, హిందూ రాష్ట్రంలో హిందువుల ఆధిక్యతకోసం ఆరాటపడ్డారు. ఎవరైతే సహేతుకమైన, శాస్త్రీయమైన చరిత్ర కావాలని కోరుకుంటారో వారిని వీరు మెకాలే సంతానంగా అభివర్ణించారు. విచిత్రమేమంటే వలసవాదులనుంచి ద్విజాతీ సిద్ధాంతాన్ని స్వీకరించి అనుసరించిన ముస్లిం హిందూ జాతీయవాదుల్నే మెకాలే సంతానం అనాల్సి ఉంది.
హిందూ పాలన, ముస్లిం పాలన వంటి అధిక సంఖ్యాకుల భావజాలాలను మించి ఇప్పుడు చరిత్ర రచన ప్రమాదంలో పడింది. చరిత్ర రచనతోపాటు ఇతర సామాజిక శాస్త్రాల శాస్త్రీయమైన రచనా పద్ధతి తుడిచిపెట్టుకుపోతోంది. రచనాపద్ధతులు భారతీయ మేధో వాతావరణంలోకి ఇంకా వేళ్లు తన్నుకోవలసి ఉంది. తమ పరిశోధనలకు శాస్త్రీయమైన విధానాలనే వాడే భారతీయ శాస్త్రవేత్తలలో కొందరు శాస్త్రీయతను పాటించకుండా ఊహలతో కలగాపులగం చేయబడిన చరిత్రను విశ్వసిస్తారు. ఈ శాస్త్రవేత్తలు వృత్తిరీత్యా చరికారులైన వారు రాసిన చరిత్రను ‘వక్రీకరింపబడిన చరిత్ర’ అనో, వామక్షీయులు, మార్క్సిస్టులు ఉద్దేశ్యపూర్వకంగా రాసిన చరిత్ర అనో అంటారు. వారి మాదిరిగానే చరిత్రను అభూతకల్పనలుగా భావించేవారితో కులాసాగా ఏకీభవిస్తారు. వారంగీకరిస్తున్న చరిత్ర సిద్ధాంతాలు వారు సమర్థించే శాస్త్రీయ పద్ధతులకు అనుగుణంగా రూపొందాయా లేదా అని ఒక్క క్షణంకూడా ఆలోచించరు.
ఎన్ సి ఇ ఆర్ టి ఇతర అధ్యయన అంశాల పాఠ్యపుస్తకాల్లో కూడా ఇటువంటి కత్తరింపులకే పాల్పడుతోంది. ఇట్లానే అనేక అధ్యయన అంశాలకు ఉపయుక్తమయ్యే డార్విన్ సిద్ధాంతం తొలగించబడింది. తొలగింపుకు ముందు కనీస సూచన కూడా చెయ్యలేదు,చర్చించలేదు. అందరూ అనుకుంటున్నట్టుగా ఇది కేవలం వామపక్ష మరియు ఉదారవాదులకు – హిందూ మతతత్వవాదులకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. అనేక అధ్యయన అంశాలు ఈ మౌలిక సూత్రం మీద ఆధారపడి ఉన్నాయి. హేతుబద్ధ అధ్యయనానికి సంబంధించిన మౌలిక ప్రాతిపదికలను ఎన్ సి ఇ ఆర్ టి తొలగించుకుంటూ పోయేటట్టయితే విద్యలో అ,ఆ లు, 1 నుంచి 10 వరకూ అంకెలు తప్ప ఏమీ మిగలవు. అధికారంలో ఉన్నవారి మేధో వ్యతిరేక విధానం ఏమిటో ఇప్పటికే తేటతెల్లమయ్యింది. మేధావులు, వారిపట్ల సానుకూలత ఉన్నవారు ఎప్పుడు సంఘటితమై ప్రజాప్రతినిథులు బహిరంగసభల్లో చేస్తున్న అసత్య ప్రకటనల్ని అడ్డుకుంటారనేదే ప్రశ్న. ఈ అసత్య ప్రకటనలనే నిజమని ఏమీ తెలియని ప్రజలు నమ్ముతున్నారు, లేదా తెలిసినవారు ఖండించడానికి భయపడుతున్నారు. మనం ఒక మేధో వ్యతిరేక వాతావరణంలో జీవిస్తున్నాం. స్వేచ్ఛగా ఆలోచించగలిగే తత్వంతో మన అనుబంధాన్ని కోల్పోతున్నాం.
ఒక ఆలోచనాసరళికి అనుగుణంగా క్రమబద్ధంగా సాగుతున్న తొలగింపులున్న పాఠ్యపుస్తకాలను చదివే తరం ఏమైపోతుందనేది కీలకమైన సమస్య. భారతదేశ సరిహద్దులకు పరిమితమైన విద్య వరకూ సమస్యను చూస్తే కేవలం భారతీయ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. అటువంటి విద్యార్థులవల్ల ప్రపంచానికేమీ నష్టం ఉండదు. భారతదేశానికే నష్టం. ఎందుకంటే జ్ఞానం వైజ్ఞానిక శాస్త్రాలలోనే కాదు, సామాజిక శాస్త్రాలలో కూడా బాగా విస్తరింపబడుతోంది. భారతదేశంలో కేవలం ఒక మతానికి చెందిన చరిత్రను మాత్రమే చదివి అంతర్జాతీయ రంగం మీద అర్థవంతంగా నిలబడలేం, వివరించలేం. అనేక కోణాలలో మానవజాతి పరిణామాన్ని వివరిస్తుంది చరిత్ర. ఈ దృక్పథంలోని నాణ్యత, స్పష్టతలే మన జీవితాల్ని నిర్మిస్తాయి.
మనం చరిత్రనుంచి కొన్ని భాగాలను తొలగించుకుంటూ పోతే పోవచ్చు. కానీ అంతర్జాతీయంగా మేధావులను, పండితులను చదవకుండా ఆపలేం కదా! అవి వారి వారి అధ్యయన కేంద్రాలలో అధ్యయనం చేయబడుతూనే ఉంటాయి. కొత్త విశ్లేషణలు, కొత్త వ్యాఖ్యానాలు ఇవ్వబడుతూనే ఉంటాయి. అదంతా భారతదేశం వెలుపల భారతదేశ చరిత్రలో భాగంగా ఉంటుంది. మనం మాత్రం అరకొర చదువు చదువుకుంటాం.
భారతదేశం వెలుపల భారతదేశ చరిత్ర, అందులోని బహుళ సంస్కృతి, అది సాధించిన ఘనత మతంతో సంబంధంలేకుండా అధ్యయనం చేయబడుతుంది. ప్రపంచ వ్యాపితంగా భారతదేశచరిత్ర అధ్యయనానికి పూనుకున్న విశ్వవిద్యాలయాల్లో, లైబ్రరీల్లో, మ్యూజియంలలో అది కొనసాగుతుంది. కేవలం భారతదేశ గతంగా కాదు, ప్రపంచ గతంలో భాగంగా. ఈ విజయాలన్నీ కేవలం భారతీయుల విజయాలుగా కాదు, ప్రపంచ మానవాళి విజయాలుగా ఉంటాయి. కానీ మనం మాత్రం ఆ విజయాలు తెలియని అజ్ఞానులుగా మిగిలిపోతాం. భారతీయ నాగరికతను నిర్మించుకోవడంలో భాగంగా మానవాళి సంస్కృతి మనం ఏమిచ్చామో, అందునుంచి ఏమి తీసుకున్నామో మనకు ఎప్పటికీ తెలియదు.
(రొమిలా థాపర్ ప్రసిద్ధ చరిత్రకారిణి )
తెలుగు: కొప్పర్తి వెంకటరమణమూర్తి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.