
భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టం లైంగికత, లింగ వివక్ష యొక్క మూస స్వభావాన్ని తొలగించడంలో వచ్చిన మంచి అవకాశాన్ని కోల్పోయింది. సెక్షన్ 377ను పూర్తిగా విస్మరించడం వల్ల పురుషులు మరియు లింగమార్పిడి బాధితులకు ఎటువంటి చట్టపరమైన సహాయం అందదు.
ప్రపంచం యావత్తు గాఢనిద్రలో ఉన్న సమయంలో, అర్ధరాత్రి , కోల్‌కతాలోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం మరియు హత్యతో భారతదేశం ఉలిక్కిపడింది. తరువాత, దేశం యధాతద స్థితికి తిరిగి వచ్చింది. అపరాజిత బిల్లులో చెప్పబడినట్లుగా, ఒక భయంకరమైన, అవాంఛనీయ సంఘటన జరిగిన వెంటనే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతుంది. నిందితులకు కఠినంగా శిక్షించాలనే డిమాండ్‌తో పాటు మరికొన్ని డిమాండ్లు ముందుకొస్తాయి. అయితే, కాలక్రమేణా, దేశం తిరిగి ఆత్మసంతృప్తిలోకి జారిపోతుంది. ఈ అంశం పైన మళ్ళీ కోపాన్ని రేకెత్తించే మరొక సంఘటన కోసం దేశ ప్రజానీకం వేచి ఉంటారు. మధుర, నిర్భయ నుండి RG కర్ వరకు, ఈ విషచక్రం కొనసాగుతూనే ఉంటుంది.
భారతదేశం ఇటువంటి సంఘటనల పట్ల తీవ్రంగా ప్రతిస్పందించే దేశంగా, కొన్నిసార్లు ముందే స్పందించే చురుకైన దేశంగా ఉంటుంది. కానీ దేశ విధానాలు, నేతలు మాత్రం విపత్తు సంభవించే వరకు స్థబ్దంగా ఉంటారు. ప్రతీకార వాంఛ రగులుతున్నప్పటికీ, ఇది కేవలం రోగానికి తక్షణ చికిత్సగా పనిచేస్తుంది తప్ప మూల కారణాలను పరిష్కరించడంలో విఫలమవుతుంది.
అత్యాచారం కేవలం శరీరక వాంఛలను నియంత్రించుకోలేక పోవటం వల్ల కలిగిన పర్యావసానం మాత్రమే కాదు. ఇది సమాజంలో లోతుగా పాతుకుపోయిన సామాజిక జులుం యొక్క అభివ్యక్తీకరణ.
ఇది లైంగిక హింసను ఎదుర్కొనే బాధితులు ఎదురుతిరగరాదని, స్త్రీలు నిస్సహాయంగా పడిఉండాలనే యుగాలనాటి భావనలను శాశ్వతం చేయాలనే సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. మన లైంగిక చట్టాలు కూడా ఏ సంస్కృతీనైతే కూలదోయ్యాలో అదే సంస్కృతిని శాశ్వతం చేసే విధంగా ఈ పక్షపాత వైఖరిని బలపరుస్తున్నాయి.
లైంగిక చట్టాలు – బలమైన మూస పద్ధతులు :
కొత్త క్రిమినల్ చట్టాల అమలుకు ముందు, భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 375 అత్యాచారాన్ని ‘మగ నేరస్థుడు‘ ‘బాధిత మహిళ‘పై చేసే చర్యగా నిర్వచించింది. సెక్షన్ 377 ప్రకారం పురుషులపై జరిగే అత్యాచారం అధికారికంగా అత్యాచారం నేరంగా వర్గీకరించబడలేదు. కానీ ‘అసహజ సెక్స్‘గా వర్గీకరించబడింది.
కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) అటువంటి లైంగిక పరమైన మూసపద్దతులను తొలగించడంలో గొప్ప అవకాశాన్ని కోల్పోయింది. సెక్షన్ 377ను పూర్తిగా విస్మరించడంతో, పురుషులు మరియు లింగమార్పిడి బాధితులు ఎటువంటి చట్టపరమైన సహాయం పొందలేరు (నిరాకరించబడతారు). ఇది న్యాయసంబంధమైన పర్యవేక్షణ కారణంగా జరిగిన విస్మరణ కావచ్చు. కానీ అంతర్లీనంగా ఇది మహిళలపై జరిగే అత్యాచారం ఇతర జెండర్ల పైన జరిగే అత్యాచారం కంటే చాలా తీవ్రమైనదనే సామాజిక భావనను ప్రతిబింబిస్తుంది.
అది ఎటువంటి అత్యాచారం అయినా, లైంగికతతో సంబంధం లేకుండా, ఒకరి శారీరక స్వాభిమానాన్ని ఉల్లంఘించినట్లుగా చూడాలి తప్ప గౌరవం లేదా పవిత్రతకు కాదు. సెక్షన్ 377 యొక్క విస్మరణ స్వలింగ సంపర్కుల సంబంధాల ఆలోచనను, అటువంటి సందర్భాలలో అత్యాచారం యొక్క అవకాశాన్ని కూడా తక్కువ చేసి చూడబడుతుంది. BNS కొన్ని నేరాలకు పాల్పడేవారిని తటస్థంగా చూపిస్తూ, అలాంటి సందర్భాలలో కేవలం మహిళలను మాత్రమే బాధితులుగా గుర్తిస్తుంది.
పురుషులు మాత్రమే సెక్స్ ని కోరుకుంటారని, మహిళలు కేవలం దానికి ప్రతిస్పందిస్తారని, తద్వారా స్త్రీలను లొంగదీసుకునే స్థితిలో ఉంచుతారనే భావజాలాన్ని మన చట్టాలు వాడుకలో పెట్టాయి. ఇది సమాజంలో అత్యాచార సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఏమి చేయలేని నిస్సహాయ లైంగిక వస్తువులుగా స్త్రీలను చూపిస్తారు. తద్వారా వారు అత్యాచారానికి గురయ్యే అవకాశం ఉంది.
ఇటువంటి జెండర్ చట్టాలు న్యాయవ్యవస్థకు కూడా రకరకాల అనుమానాలను రేకెత్తిస్తాయి. ఉదాహరణకు, ప్రియా పటేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్‌లో , గ్యాంగ్ రేప్ నేరం కింద అభియోగాలు మోపబడిన ఒక మహిళను సుప్రీంకోర్టు నిర్దోషిగా విడుదల చేయవలసి వచ్చింది, ఎందుకంటే అది ఇప్పుడు రద్దు చేయబడిన IPCలోని సెక్షన్ 375 ప్రకారం ‘అసభవమైనది. ఊహించలేనిది‘. స్త్రీలు లైంగిక హింసను నిస్సహాయంగా స్వీకరిస్తారు (లొంగిపోతారు)తప్ప, అటువంటి చర్యలకు తమంతట తాము పాల్పడలేరనే పితృస్వామ్య భావనను ఈ చట్టం బలపరిచింది.
వలసపాలనను నిర్మూలించే దిశగా ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినప్పటికీ, మన శిక్షాస్మృతి నిబంధనలు మాత్రం వలస నైతికత యొక్క అవశేషాలను అలాగే కొనసాగించాయి. BNS యొక్క సెక్షన్ 74 , స్త్రీల స్వయంప్రతిపత్తిని సమర్థించటానికి బదులు స్త్రీ స్వచ్ఛత మరియు పవిత్రతపై దృష్టి పెడుతుంది.
‘అసహ్య ప్రవర్తన‘ మరియు ‘నమ్రత‘ వంటి పదాలతో సహా, ఈ చట్టాల భాషలోని అస్పష్టత వల్ల వ్యవస్థాగత అసమానతలను పరిష్కరించడంలో విఫలమైనప్పుడు అది దుర్వినియోగానికి దారి తీస్తుంది. ఈ నిబంధనలు లైంగిక తప్పులను శిక్షించడంపై అసమానమైన ప్రాధాన్యతనిస్తాయి. తద్వారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, లైంగిక స్వయంప్రతిపత్తి మరియు సంబంధాలలో సమానత్వం వంటి లైంగిక హక్కులను ముందుకు తీసుకురావలసిన అవసరాన్ని విస్మరిస్తాయి.
సెక్షన్ 63లోని వైవాహిక అత్యాచార మినహాయింపు సామాజిక పక్షపాత వైఖరిని మరియు చట్టాల మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. ఇది విధానాలలో మార్పులుతేవలసిన తక్షణ అవసరాన్ని నొక్కి చెబుతుంది. అంతేకాకుండా, అత్యాచారాన్ని ఖండించాల్సిన అంశాలలో కూడా చట్టాలు కళ్ళు మూసుకుంటాయి. ప్రత్యేకించి కులం, మతం, లైంగికత మరియు ఇతర సామాజిక-ఆర్థిక కారణాలతో కొన్ని వర్గాలకు రక్షణ కల్పించటంలోను, మరియు బహిరంగంగా చర్చ పెట్టకుండా వదిలివేస్తాయి లేదా పూర్తిగా మినహాయిస్తాయి.
సరైన సంస్కరణలు అవసరం
మన ఉన్నతాధికారులు (బ్యూరోక్రాట్లు) నిజంగా అత్యాచారం అనే వ్యాధిని ఎదుర్కోవాలని అనుకుంటే, దాని పైపై లక్షణాలను కాకుండా మూల కారణాలను వెలికితీసి పరిష్కరించడం ప్రారంభించాలి. మన చట్టాల్ని రూపొందించే ప్రజాప్రతినిధులు, వారు చేస్తున్న చట్టాలు మొదలుకొని సమాజంలో అత్యాచార సంస్కృతి వేళ్లునుకోవటానికి దోహదంచేస్తున్న అన్ని వ్యవస్థాగత కారణాల పైన దృష్టి సారించటం అత్యంత కీలకం.
BNSలో IPC యొక్క సెక్షన్ 377ని పునరుద్ధరించే బదులు, అత్యాచారం కోసం ప్రస్తుతం ఉన్న శిక్షా స్మృతి నిబంధనలను లైంగికత నుండి తటస్థం చేయడంపై శాసనసభ దృష్టి పెట్టాలి. తద్వారా అన్ని జెండర్లకు చెందిన వ్యక్తులను ఒక తాటిపైకి తేవచ్చు. అదనంగా, మహిళల ‘నమ్రత‘ను సూచించే చట్టాలను పునర్నిర్వచించి వారి “స్వచ్ఛతను రక్షించడం” వైపు నుండి “స్త్రీల వ్యక్తిగత స్వయంప్రతిపత్తిని సమర్థించడంపై” దృష్టి మరల్చే దిశగా కృషిచేయాలి.
అనేక సంవత్సరాలుగా సంస్కరణలు చోటుచేసుకున్నప్పటికీ, మధుర మరియు నిర్భయ ఎదుర్కొన్న భయాందోళనలు కొనసాగుతున్నాయని ఆర్.జి కర్ కేసు మనకు గుర్తు చేస్తుండటం బాధాకరం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం మరియు చట్టపరమైన పురోగతి తర్వాత కూడా, భారతదేశం తన మహిళలను రక్షించడానికి మరియు వారి హక్కులను సమర్థించడానికి పోరాడుతోంది. సక్రమ క దిశగా మార్పుకు, సంస్కరణకు, పూర్తి నిజాయితీగా మరియు హృదయపూర్వకంగా మేల్కొలపడానికి ఇది సరియైన సమయం.
సాయి దర్శన్ కె.ఎస్.
OP జిందాల్ గ్లోబల్ లా స్కూల్లో న్యాయ విద్యార్థి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.