
A Reflective Biography of Dr Babasaheb Ambedkar
ఆనంద్ తెల్తుంబ్డే రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆయన బహుముఖ చిత్రణను అందిస్తుంది. సామాజిక మార్పు కోసం ఆయన రూపొందించిన సంక్లిష్టమైన, పరిణామ క్రమంలో ఉన్న వ్యూహాలను తిరిగి అంచనా వేయడానికి ఈ రచన ఒక ఆహ్వానం పలుకుతుంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ బలమైన ఆలోచనలను, మానవీయ కోణాన్ని పట్టించుకోకుండా ఆయన్ను దేవుడితో పోల్చి ఆరాధించే భక్తుల కాలం ఇది. ఈ పరిస్థితుల్లో ఆనంద్ తెల్తుంబ్డే రచించిన ప్రతిమా భంజకుడు: బాబాసాహెబ్ ప్రతిబింబ జీవిత చరిత్ర కొత్త పుంతలు తొక్కుతుంది. ఆత్మపరిశీలనకు అవకాశాలు కల్పిస్తుంది.
స్వప్రయోజనాల కోసం అంబేద్కర్ వారసత్వం గురించి ప్రాచుర్యంలో పెట్టిన అతిశయోక్తులను తొలగించి బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసత్వాన్ని గుర్తించే అవకాశాన్ని ‘విగ్రహ విధ్వంసకుడు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మననశీలమైన జీవిత చరిత్ర’ పాఠకులకు అందిస్తుంది.
టెల్తుంబ్డే జీవిత చరిత్రపై పట్టుదలతో పనిచేసిన పరిస్థితులు – కోవిడ్-19 సంక్షోభం, ప్రజల నైరాశ్య సాధారణ స్థితి, కఠినమైన ఉపా చట్టం కింద జైలు శిక్ష వంటి కఠోర పరిస్థితులు ` అంబేద్కర్ జీవిత చరిత్ర రచన ముగించేందుకు రచయితను పట్టువదలని విక్రమార్కుడిగా పని చేయించాయి. ఇటువంటి విషమ పరిస్థితుల్లో కూడా పట్టువదలకుండా పుస్తకరచనకు పూనుకున్నారంటే ఈ పుస్తకానికి రచయిత ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతుంది.
తాము మెచ్చిన వ్యక్తుల లేదా ఆరాధించే వ్యక్తుల జీవిత చరిత్రలు రూపొందించేటప్పుడు నిర్దిష్ట ఆధారాలు, ఉదాహరణలతో నిజాయితీగా లోతైన విశ్లేషణ చేయటం ఎలాగో తెలుసుకునేందుకు ఈ రచన గొప్ప ఆధారం అవుతుంది. భావి రచయితలు ఇటువంటి రచనలకు పూనుకుంటున్నపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తక రచనాశైలి ఓ పాఠంలా అక్కరకొస్తుంది.
అంబేద్కర్ తను ఆరాధించే బుద్ధుడిని అధ్యయనం చేయడానికి తన ‘బుద్ధుడు మరియు అతని ధర్మం’లో అనుసరించిన పద్ధతినే తాను ఉపయోగించానని ముందుమాటలో తెల్తుంబ్డే ప్రకటించాడు. అంటే ఇది శిష్యుడికి తన గురువు పట్ల ఉండవలసిన బాధ్యతను గుర్తు చేస్తుంది .
600 పేజీలకు పైగా విస్తరించిన ఈ పుస్తకం ఒక సమగ్ర రచన. ఇందులో 45 పేజీల ముందుమాట, 60 పేజీల నోట్స్, ఉల్లేఖనలు, 35 పేజీల పొడవైన సూచికలు, జీవిత చరిత్ర గురించిన అవగాహనను మెరుగుపరిచే ఛాయాచిత్రాలు ఉన్నాయి.
చారిత్రక కాలక్రమానుసారం అంబేద్కర్ జీవిత కథనాన్ని ఏడు దశలుగా విభజించటం జరిగింది. దీనికి ఎనిమిదవ దశ జోడిరచబడిరది: ఇతర మేధావులు చెప్పినట్టు అతని మరణానంతర ప్రభావం ఎంతగా ఉందంటే అంబేద్కర్ తన జీవితకాలంలో కంటే మరణానంతరమే మరింత శక్తివంతమయ్యాడు. ప్రారంభంలో ప్రధాన స్రవంతిచే నిర్లక్ష్యం చేయబడిన తరువాత కూడా భారతీయ రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా గౌరవించబడ్డాడు.
అంబేద్కర్ వారసత్వంలో భాగంగా ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్న కొన్ని ఉద్యమాలు ప్రత్యేకించి భూపోరాటాల గురించి రచయిత పరిశీలించారు. కానీ అంబేద్కర్ అనుయాయులు ఆయర వారసత్వంలో ఈ కోణాన్ని మాత్రం మరుగునపడేశారు. అప్పటికే పాలకవర్గం ఈ అనుయాయుల్లో కొందరిని అక్కున చేర్చుకోవడంతో మొత్తంగా ఈ పాలకవర్గం అంగీకరించినంతవరకే అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తే సరిపోతుందన్న పొరపాటు అవగాహనను కింది స్థాయి వరకూ తీసుకెళ్లటంతో అంబేద్కర్ అనుచరులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అతని వారసత్వాన్ని దెబ్బతీయడం ద్వారా అతను కష్టపడి స్థాపించిన సంస్థలను విచ్ఛిన్నం కావడానికి దారితీసిన సందర్భాలను కూడా అతను పరిశీలిస్తాడు. ఈ పరిణామం కొంత వరకు అంబేద్కర్ జీవితకాలంలోనే మొదలైందన్న భావన నర్మగర్భంగా ఉంది.
దళితుల జీవితాల్లో సంభవించిన స్పష్టమైన మార్పులను అంచనా వేయడం రచయిత విశ్లేషణలో ముఖ్యమైన భాగమైంది. అంబేద్కర్ అపారమైన రచనలు చేసినప్పటికీ వారి పరిస్థితి దళితేతరులతో పోల్చినప్పుడు ఎప్పటి వలెనే ఉంది. మంచుకొండ కొన వంటి ఒక చిన్న దళిత మధ్యతరగతి యావత్ దళితుల నిస్సహాయ స్థితిని కనపడకుండా కప్పివేస్తుంది. దళిత ఉద్యమం గురించి ఇంత నిక్కచ్చిగా, ఆత్మపరిశీలనతో, లోతుగా వివరించడం చాలా అరుదు.
అంబేద్కర్ చనిపోయిన తర్వాత ఆయన్ను దేవుడిని చేసి కూర్చోబెట్టే దిశగా సాగిన ప్రయత్నాలను రచయిత నిశితంగా పరిశీలిస్తాడు. దళితులు అంబేద్కర్ను గౌరవించవలసిన అవసరం ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అదే సమయంలో ఆయనను తమ ఉద్యమ సామూహిక చరిత్ర స్వరూపుడిగా గుర్తించాలని ఆయన నొక్కిచెప్పారు. దీనిపై ఎంతో సాహిత్యం ఉన్నప్పటికీ, ఎంతోమంది పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఈ కోణంలో అవగాహన పెంపొందించటం, దాని పరిణామాల గురించి అధ్యయనం చేయవలసింది ఎంతో ఉంది.
మొదటి దశ అంబేద్కర్ ప్రారంభ జీవిత గమనాన్ని అన్వేషిస్తుంది. ‘అంటరానితనం’ అనే కఠోరమైన వాస్తవం పేద దళితులకు రోజువారీ జీవితంలో ఒక వాస్తవం అయినప్పటికీ కొంతమంది దళితులు వలస పాలన కాలంలో బ్రిటిష్ సైన్యంలో చేరడం ద్వారా ఉచిత ఆంగ్ల విద్యను పొందారు.
ఆ రోజుల్లో సైన్యంలో ఒక భారతీయుడు చేరుకోగలిగిన అత్యున్నత స్థానమైన సుబేదార్ మేజర్గావున్న తన తండ్రి అంతస్థు నుండి భీమ్రావ్ ప్రయోజనం పొందాడు. దానితో స్థిరమైన ఆర్థిక నేపథ్యం, ఆంగ్ల విద్య, కొత్త సాంస్కృతిక వాతావరణం ఏర్పడిరది. బొంబాయిలో స్థిరపడాలని అతని తండ్రి తీసుకున్న నిర్ణయం వల్ల అంబేద్కర్ బొంబాయి విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. పట్టణ వాతావరణం, సంఘ సంస్కర్తలతో అనుబంధం, పేరుమోసిన సంస్థానమైన బరోడా అందించిన స్కాలర్షిప్ కారణంగా అమెరికా, ఇంగ్లాండ్ లలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుండి అత్యున్నత విద్యార్హతలను సాధించడానికి ‘అంటరాని’ యువకుడికి ఒక మార్గం ఏర్పడిరది. ఇది ఒక సాధారణ మహర్ కుర్రాడు ‘‘భివా’’ను బలీయమైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్గా మార్చింది.
ఈ యాదృచ్ఛిక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నప్పుడు, రచయిత అంబేద్కర్ ఏకాగ్ర దృష్టిని, కృషిని కొనియాడాడు. ధృడచిత్తంతో సాగించిన కృషి అతని జీవితాన్ని ఒక అధ్యయనశీలిగా మార్చింది. జాన్ డ్యూయీ, జేమ్స్ షాట్వెల్, ఎడ్విన్ సెలిగ్మాన్, జేమ్స్ హార్వే రాబిన్సన్ వంటి ఉపాధ్యాయుల ప్రభావంతో ఆయన వ్యక్తిత్వం, ఆలోచనా ప్రక్రియ, అధ్యయన శీలత, సైద్ధాంతిక నేపథ్యం రూపొందాయి. ఈ వివరణ అంబేద్కర్ తరువాత కాలంలో అనేక కీలక నిర్ణయాలను తీసుకోవడంలోను, విధానాలను రూపొందించటంలోను తోడ్పడ్డాయని సూచిస్తుంది.
రెండవ దశ అంబేద్కర్ ఉన్నత విద్యావంతుడైన యువకుని నుండి గౌరవనీయమైన ‘‘బాబాసాహెబ్’’ (1919-1927) వరకు జరిగిన పరిణామాన్ని చూపుతుంది. ఎక్స్ కమ్యూనికేటెడ్ బెనివలెంట్ సొసైటీ స్థాపన, సౌత్బరో కమిటీ ముందు అంబేద్కర్ వాంగ్మూలం, మరాఠీ పక్షపత్రిక ముక్నాయక్ స్థాపన మరియు వివిధ విద్యా కార్యక్రమాలను ప్రారంభించడానికి తన ప్రయత్నాలపై నిశిత పరిశోధన, కొత్తగా వెలుగుచూసిన సాక్ష్యాల ద్వారా తేల్తుంబ్డే తాజా కోణాలు అందించారు. ఈ దశలో రచయిత మునుపటి జీవిత చరిత్రలలోని లోపాలను ఎత్తిచూపుతూ అంబేద్కర్ ప్రారంభ ప్రజా మరియు మేధో జీవితానికి సంబంధించిన సూక్ష్మ చిత్రణను అందించటం ద్వారా అంబేద్కర్ విశిష్ట వ్యక్తిత్వం ఆవిర్భావాన్ని హైలైట్ చేశాడు.
ఉదాహరణకు, మహాద్ వద్ద చావ్దార్ ట్యాంక్ సత్యాగ్రహాన్ని విశ్లేషిస్తూ, అతను ‘ఉన్నత’ కుల సంఘ తీవ్ర వ్యతిరేకతను, బ్రిటిష్ పరిపాలన యొక్క పక్షపాత వైఖరిని ఎత్తి చూపాడు. ఏది ఏమయినప్పటికీ, ‘అంటరాని’ ప్రజల అచంచలమైన సంకల్పాన్ని వర్ణించడంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు కూడా కొంతమంది బ్రాహ్మణ మరియు ‘ఉన్నత’ కులాలకు చెందిన మిత్రులు ఇచ్చిన సాహసోపేతమైన మద్దతును రచయిత గుర్తించాడు. అంబేద్కర్ వ్యూహాత్మక నిర్ణయాలను పునఃసమీక్షించడం ద్వారాను, రచయిత రాసిన ‘మహద్: ది మేకింగ్ ఆఫ్ ది ఫస్ట్ దళిత్ రివోల్ట్’ లో వివరించినట్టు మహద్ సత్యాగ్రహం అంబేద్కర్ నాయకత్వాన్ని మాత్రమే కాకుండా, విస్తృత దళిత ఉద్యమానికి ఎలా పునాదిని వేసిందన్న విషయం గురించి తెల్తుంబ్డే తాజా దృష్టి కోణాన్ని అందించాడు.
మహద్లో పాతుకుపోయిన అగ్రకుల హిందువుల కులాధిపత్యం పట్ల విసుగు చెందిన అంబేద్కర్, దళితులకు ప్రాతినిథ్యం కోసం కొత్త అవకాశాలు ఏర్పడుతున్న రాజకీయ రంగంలో ఏకకాలంలో మరింత లోతుగా నిమగ్నమై ఉంటూ, మత మార్పిడిని ‘అంటరానివారికి విముక్తి సాధనంగా పరిగణించడం ప్రారంభించాడు.
అంబేద్కర్ వ్యూహాలు, చర్యలపై విమర్శనాత్మకంగా వ్యాఖ్యానిస్తూ రచయిత ఆయన కీలక నిర్ణయాల సందర్భాన్ని విశదీకరించాడు.
తెల్తుంబ్డే విమర్శతో ఏకీభవించినా, ఏకీభవించక పోయినా, ఈ విశ్లేషణ దళిత విముక్తి ఉద్యమ ప్రధాన కోణాల నిశిత పరిశీలనగా భావించాలి. సామాజిక మార్పు సాధనకు చక్కగా నిర్వచించబడిన వ్యూహాత్మక వ్యాఖ్యాతలు అవసరమని క్రియాశీల కార్యకర్తల సమూహాలకు ఇది సరిjైున సమయంలో గుర్తుచేస్తుంది.
అంబేద్కర్ రాజకీయాల్లోకి ప్రవేశించడంతో ఆయన జీవిత చరిత్రలో అతని ప్రయాణం మూడవ దశలోకి చేరినట్టవుతుంది. బొంబాయిలో అతని శాసనసభ పోరాటాలు కాకుండా, ఈ దశలో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీతో అతనికి ఏర్పడిన తీవ్రమైన విభేదాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఆ తర్వాత అంబేద్కర్ దళితుల పాన్-ఇండియా నాయకుడిగా ఆవిర్భవించి, అనేక మంది ప్రాంతీయ నాయకులను మసకబారేలా చేశారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, అంబేద్కర్ ప్రబలంగా సింపుల్ మెజారిటీ ఆధారిత ఎన్నికల వ్యవస్థపై అంతగా చూపకుండా దానికి బదులు దామాషా ప్రాతినిధ్య విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఉండివుంటే, ప్రాతినిధ్య సమస్యపై అంబేద్కర్ చేసిన స్థాయిలో పోరాటం చేయాల్సిన అనవసరం ఉండేదని రచయిత అభిప్రాయపడ్డారు. కనీసం సిద్ధాంతపరంగా, ప్రతి వ్యక్తికీ ప్రాతినిధ్యం లభించేదే.
పూనా ఒప్పందంలో దళితులకు పెరిగిన ప్రాతినిధ్య పరిమాణం అంబేద్కర్ను ఎలా బోల్తా కొట్టించిందో కూడా ఈ జీవిత చరిత్ర హైలైట్ చేస్తుంది. తరువాత ఆయన ఆ విషయంపై విచారం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఆయన దళితుల కోసం ఉమ్మడి నియోజకవర్గాలను సమర్థించాల్సి రావటం ఒక వైచిత్రి.
నాల్గవ దశలో అంబేద్కర్ అనుసరించిన రెండు విరుద్ధ విధానాలపై వివరణ ఉంటుంది: భారత ప్రభుత్వ చట్టం, 1935 తర్వాత 1936-37 ప్రాంతీయ ఎన్నికలలో పాల్గొనడానికి ఆయన స్థాపించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ద్వారా వర్గ రాజకీయాలను ఆచరించటం, మరోవైపు మత మార్పిడి ఉద్యమం పథం. 1936 ఎన్నికలలో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఎన్నికల విజయంపై తేల్తుంబ్డే వ్యాఖ్యానిస్తాడు. కొంకణ్ ప్రాంతంలో భూస్వామ్య ఖోటీ వ్యవస్థకు వ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన చారిత్రాత్మక యాత్రను, 1938లో పారిశ్రామిక వివాద చట్టానికి వ్యతిరేకంగా కార్మికుల సమ్మె సమయంలో వచ్చిన అనుకూల ప్రజా స్పందనను పరిశీలిస్తాడు.
అంబేద్కర్ కుల-వర్గ పోరాటంతో చేసిన ప్రయోగం స్వల్పకాలికం అని రచయితకు అనిపిస్తుంది.
భారతదేశంలో కుల-వర్గ పోరాటం అనే అంశానికి ఆయన అనుకోకుండా సరైన సమాధానాన్ని పొందినప్పటికీ, ఆయనకు తెలియకుండానే, ఖోటీ వ్యతిరేక పోరాటం మరియు కార్మికుల సమ్మె ద్వారా దానిని విజయవంతంగా ఆచరించినప్పటికీ, ఆ ప్రయోగం వృధా అయింది. అంబేద్కర్ త్వరలోనే కులంపై దృష్టి సారించి, ఇండిపెండెంట్ లేబర్ పార్టీని రద్దు చేసి, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య ను స్థాపించాడు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా రాజ్యాధికారం వైపు మొదటి అడుగు కూడా వేశాడు.
మిగిలిన దశలు 1940, 1950 దశకాలలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తాయి. అధికార బదిలీతో పాటు వచ్చిన రాజకీయ పరిణామాలలో, ఫిబ్రవరి 1946లో జరిగిన కౌన్సిల్ ఎన్నికలలో ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కులాల సమాఖ్య పేలవమైన పనితీరు కారణంగా, అంబేద్కర్ మళ్ళీ నిర్లక్ష్యానికి గురయ్యాడు. చివరకు కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకతను అధిగమించి జోగేంద్ర నాథ్ మండల్ కారణంగా ఉమ్మడి బెంగాల్ నుండి రాజ్యాంగ సభకు ఎన్నికయ్యాడు. కానీ మౌంట్ బాటన్ విభజన ప్రణాళిక ప్రకారం ఆయన సీటు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉంది) కు వెళ్ళినప్పుడు, కాంగ్రెస్ ఆయనను బొంబాయి నుండి రాజ్యాంగ సభకు ఎన్నుకోవటమే కాకుండా ముఖ్యమైన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఛైర్మన్ గా కూడా చేసింది. ఈ కీలకమైన పరిణామాల వెనుక ఉన్న రహస్య యుక్తుల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది.
1951లో బాబాసాహెబ్ నెహ్రూ మంత్రివర్గానికి రాజీనామా చేసి, రాజ్యాంగాన్ని తాను రాసినట్లు చెప్పడాన్ని కూడా వ్యతిరేకించారు. రాజ్యాంగం మరియు బాబాసాహెబ్ పై జరిగిన చర్చ సమాచారంతో కూడుకున్నది.
ఈ జీవిత చరిత్ర అంబేద్కర్ అధ్యయనాలలో గణనీయమైన అంతరాన్ని పూరిస్తుంది. గత ప్రయత్నాల ఆధారంగా తాజా అంతర్దృష్టులను, సందర్భోచిత లోతును అందించడానికి ప్రయత్నిస్తుంది. ధనంజయ్ కీర్, చాంగ్దేవ్ ఖైర్మోడే, బి.సి. కాంబ్లే వంటి వారు రాసిన అంబేద్కర్ జీవిత చరిత్రలు విస్తృతంగా ఉన్నప్పటికీ, వాటికి అనేక తీవ్రమైన పరిమితులు ఉన్నాయని పలువురు పరిశోధకులు మేధావులు అభిప్రాయపడ్డారు. ఖైర్మోడే, కాంబ్లే రచనలు బహుళ సంపుటాల రచనలు. కానీ ఈ రచనలు సమగ్ర అవగాహన కల్పించేవిగా లేవు. అంత లోతైన విశ్లేషణ ఈ రచనల్లో లేదు. అంబేద్కర్ సామాజిక-రాజకీయ, సైద్ధాంతిక కోణాలను లోతుగా పరిశీలించిన అశోక్ గోపాల్, ఆకాష్ సింగ్ రాథోడ్, స్కాట్ స్ట్రౌడ్, క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ ల ఇటీవలి పరిశోధనాత్మక రచనలను కూడా తేల్తుంబ్దే తాజా రచన ప్రస్తావిస్తోంది.
బాబాసాహెబ్ జీవితం, కృషి గురించిన బహుముఖ చిత్రణ, ధైర్యంగా చర్చకు పెట్టిన అంశాలు, వాటి పర్యవసానాలతో కూడిన తెల్తుంబ్డే రచన అంబేద్కర్ అధ్యయనాలపై ప్రభావం చూపగలుగుతుంది.
అంబేద్కర్ను కీర్తించిన లేదా విద్యాపరమైన పరిమితుల్లో ఆయనను కఠినంగా విశ్లేషించిన అనేక మంది మునుపటి రచయితల మాదిరిగా కాకుండా, తేల్తుంబ్డే ఈ సరిహద్దులను అధిగమించాడు. ప్రధానంగా నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం, కుల నిర్మూలనకు అవసరమైన వర్గ పోరాటాల నేపథ్యంలో సాగుతున్న సమకాలీన సామాజిక పోరాటాల చట్రంలో అంబేద్కర్ జీవితాన్ని, వారసత్వాన్ని ఆయన పున:ప్రతిష్టించే ప్రయత్నం చేశారు.
ఈ రచన కేవలం చారిత్రక వాస్తవాలను వివరించేందుకు పరిమితం కాలేదు. ఇది సామాజిక మార్పు కోసం అంబేద్కర్ రూపొందించిన సంక్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న వ్యూహాలను తిరిగి అంచనా వేయడానికి ప్రయత్నం చేసింది. రచయిత అంబేద్కర్ను తన కాలపు ఉత్పత్తి (ఆయన జీవించి, రాణించిన కాలం ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది) అయినప్పటికీ, తాత్కాలిక, ప్రాదేశిక పరిమితులను అధిగమించి పరిష్కారాలను అందించిన వ్యక్తిగా ప్రతిపాదిస్తారు.
అంబేద్కర్ను ఒక మహోన్నత నాయకుడిగా మాత్రమే చూడటానికి ఈ రచన పరిమమితం కాలేదు. ఆ అనుసరణలు విరుద్ధంగా అనిపించినప్పటికీ, తన కాలంలోని మారుతున్న వాస్తవాలకు అనుగుణంగా తన పాత్రలను స్వీకరించిన వ్యక్తిగా అంబేద్కర్ను వైరుధ్యాలు, సైద్ధాంతిక పోరాటాలతో నిండిన మానవుడిగా ప్రదర్శించడం ద్వారా తెల్తుంబ్డే తన లక్ష్యాన్ని సాధిస్తాడు.
అంబేద్కర్ మరణం తరువాత, పలువురు నాయకులు తమ సొంత లాభం కోసం అంబేద్కర్ భావజాలానికి భిన్నమైన వివరణలను అనుసరించడంతో దళిత ఉద్యమం దాని దిశను కోల్పోయిందని రచయిత అభిప్రాయపడతారు. ముఖ్యంగా కమ్యూనిస్టులతో అంబేద్కర్కున్న సైద్ధాంతిక సంఘర్షణలు, దళితులను జీవనోపాధి-కేంద్రీకృత పోరాటాల నుండి మళ్లించడానికి ఎలా ఆయుధంగా ఉపయోగించబడ్డాయో ఆయన చర్చిస్తున్నారు.
ఏకీకృత దళిత ఉద్యమ క్షీణత లక్ష్యంగా రూపొందిన పాలక వర్గ వ్యూహంలో భాగంగా పాలకవర్గాల మద్దతుదారులుగా మారకముందు దళితుల విప్లవాత్మక సామర్థ్యాన్ని ప్రదర్శించే అరుదైన, ప్రకాశవంతమైన క్షణాలుగా ఖాందేష్, మరాఠ్వాడ ప్రాంతాలలో అంబేద్కర్ అనంతర రెండు ప్రధాన భూ పోరాటాలను తెల్తుంబ్డే గుర్తుచేసుకున్నారు.
తెల్తుంబ్డే కథనం ప్రకారం 1970లలో అంబేద్కర్ను దైవంగా మార్చడం అతని రాడికల్ ఆలోచనలను తటస్థీకరించడానికి ఒక వ్యూహాత్మక చర్య. అలా నిర్మితమైన ఇమేజ్ను వేరుగా ఉంచి, కుల నిర్మూలన కోసం అవిశ్రాంతంగా పోరాడిన వాడిగా , తన కాలంలోని సామాజిక-రాజకీయ సంక్లిష్టతలకు లోతుగా అర్థంచేసుకుని, అందుకు అనుగుణంగా వ్యవహరించిన అంబేద్కర్ ను తెల్తుంబ్డే మరింత ప్రామాణికంగా వెల్లడిస్తాడు.
అంబేద్కర్ వారసత్వాన్ని అనివార్యంగా ముందుకు తీసుకెళ్లే సవాలును రచయిత తిరిగి వివరిస్తాడు. అంబేద్కర్ దృక్పథం అన్ని సమయాల్లో ప్రేరణకు మూలంగా ఉంటుందని, అయితే వారి అంతర్దృష్టులను సమకాలీన వాస్తవాలకు అనుగుణంగా మార్చడం ద్వారా కొత్త సవాళ్లను పరిష్కరించే బాధ్యత ప్రతి తరంపై ఉంటుందని తెల్తుంబ్డే చెప్పాడు.అంబేద్కర్ రచనలు ప్రజలకు అందుబాటులోకి రావడం ప్రారంభించిన తరువాత అంటే కనీసం 30 సంవత్సరాల క్రితమే ‘‘ఐకానోక్లాస్ట్: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిబింబ జీవిత చరిత్ర’’ రాయబడి ఉండాలి. కానీ ఈ రచనలను వ్యూహాత్మకంగా అర్థం చేసుకోవడానికి బదులుగా, ప్రతి ఆలోచన, చర్యను దాని సందర్భం, లక్ష్యం నుండి వేరు చేసి ప్రతి ఆలోచనను, పనిని ప్రశంసించే, కీర్తించే జీవిత చరిత్రలు రాయించటం కోసం పాలకవర్గాలు అందించిన ప్రలోభాలకు చాలా మంది మేధావులు బలైపోయారు. ఇది దళిత ఉద్యమాలలో తమ చుట్టూ ఉన్న కఠినమైన వాస్తవికతను అర్థం చేసుకోవటంలో ఏర్పడిన గందరగోళాన్ని మరింత తీవ్రతరం చేసింది.
దళితులకు సముచిత స్థానాన్ని సృష్టించడానికి, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఆధారంగా తన ఆదర్శ సమాజాన్ని చూడాలని కలలు కనే వ్యక్తిగా, తన సొంత బలాలు, బలహీనతలతో పోరాడిన వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఒక సజీవ వ్యక్తిగా చూపించడం అవసరం. దళిత యువకులు దాని నుండి చాలా నేర్చుకోగలిగేవారు. ఆ కోణంలో కొంచెం ‘ఆలస్యం’ అయినప్పటికీ, ఈ జీవిత చరిత్ర మనకు మరింత నిజమైన అంబేద్కర్ను పునరుద్ధరిస్తుంది.
సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ పుస్తకం దళితులు మాత్రమే కాదు, భారత గణతంత్ర నిర్మాణం, దాని భవిష్యత్తును అర్థం చేసుకోవాలనుకునే వారందరూ తప్పక చదవాలి.
రాహుల్ కోశాంబి ఒక సామాజిక శాస్త్రవేత్త, అంబేద్కర్ స్కాలర్ . 2017లో తన ఉభా ఆదవ్ పుస్తకానికి యువ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.