
సీనియర్ జర్నలిస్ట్ రాఘవ రచించిన ‘శేషాచలం కొండల్లో..’ పుస్తకాన్ని ప్రముఖ చరిత్రకారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ ఆవిష్కరించారు. ఎస్వీ యూనివర్సిటీ ఓరియంటల్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్, జిల్లా పౌరచైతన్య వేదిక, తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ సెమినార్ హాల్ లో గురువారం ఉదయం ఈ ఆవిష్కరణ సభ జరిగింది.
ఈ సందర్భంగా వకుళాభరణం మాట్లాడుతూ, ‘‘రాఘవ ట్రెక్కింగ్ అనుభవాలు చాలా సాహసోపేతంగా ఉంటాయి. నలభై అడుగుల ఎత్తు నుంచి జలపాతంలోకి దూకడాన్ని తలుచుకుంటేనే గుండెలు అదురుతాయి. ఇది చెప్పలేని ఆనందం. దీని గురించి చదివితే కాదు, దూకితేనే ఆ ఆనందం తెలుస్తుంది. ట్రెక్కింగ్ కు వెళ్ళాలంటే సాహసం పట్టుదల కావాలి. నడవడం మనిషికి ముఖ్యం. అందుకే సి.నారాయణ రెడ్డి ఉదయం ‘నా హృదయం. నడక నా ప్రాణం’ అంటారు.’’ అని పేర్కొన్నారు.
‘‘నిజానికి ట్రెక్కింగ్ లో చెప్పలేని ఆనందం ఉంటుంది. రాఘవ లాగా జలపాతాల్లో దుమికితేనే ఆ ఆనందం తెలుస్తుంది.కొత్త కొత్త ప్రదేశాలు కనుగొనడం, వాటిని చూసి ఆనందించడం, ఆరాధించడం, వాటి గురించి అందరికీ తెలిసేలా రాయడం; ఇదే ఆనందం. ట్రెక్కింగ్ జాగ్రత్తలు పాటిస్తూ, యువకులతో కలిసి నడుస్తూ, వాటిని అక్షర రూపంలో పెట్టడం అందరికీ సాధ్యం కాదు. అందుకునే రాఘవను మిస్టర్ వాకర్ అంటాను. చేయి తిరిగిన జర్నలిస్టు రాఘవ, వచనంలో ఉండే సొగసును, మధురమైన రుచిని కూడా చూపించగలరు’’ అని వ్యాఖ్యానించారు.
ఎస్వీ యూనివర్సిటీ ఓరియంటల్ రిసెర్చి ఇన్ స్టిట్యూట్ విభాగాధిపతి ఆచార్య పి.సి.వెంకటేశ్వర్లు ‘శేషాచలం కొండల్లో..’ పుస్తకాన్ని లోతుగా సమీక్షించారు. ‘‘శేషాచలం కొండల్లో..పుస్తకం యాత్రా సాహిత్యం కిందకు వస్తుంది. తెలుగులో వచ్చిన యాత్రా సాహిత్యంలో ఏనుగల వీరాస్వామి రాసిన నా కాశీయాత్ర తొలి గ్రంథం కాగా, అమెరికా, కాశ్మీర్ వంటి ప్రాంతాలకు యాత్రలు చేసిన వారు కూడా తమ అనుభవాలను రాశారు. రాఘవ రాసిన ఈ పుస్తకం వాటికంటే ఎంతో భిన్నమైంది. శేషాచలం కొండల్లో ఏమున్నాయో చరిత్రను, పర్యావరణ రహస్యాలను సామాజిక బాధ్యతతో రచయిత నిక్షిప్తం చేశారు. మానవ జీవితాన్ని రాఘవ అర్థం చేసుకున్నారు కనుకనే ప్ర కృతిని అర్థం చేసుకున్నారు. అందుకునే ప్రకృతి ముందు మోకరిల్లాలని చెపుతారు. ట్రెక్కింగ్ ను మతం నుంచి విడదీసి వర్తమానంలో జీవించమని పిలుపునిస్తూ, సమూహంలో భాగంగా ఎలా ఉండాలో చెపుతారు. అన్ని రకాల జంతువులను, వృక్షజాతులను బతకనిస్తేనే జీవవైవిధ్యం అని, అది ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని అంటారు. ఒకప్పటి మానవ ఆవాసాలైన ఈ కొండ కోనలే మన పూర్వీకుల ఆవాసమని, ఇక్కడ నుంచే మానవుడు సామాజిక వ్యవస్థను రూపొందించాడని గుర్తు చేస్తారు. ఈ పుస్తకంలో కవిత్వముంది, చదివించే మంచి వచనమూ ఉంది. ఒక సామాజిక ప్రయోజనంతో ఈ పుస్తకాన్ని రాశారు.’’ అంటూ విశ్లేషించారు.
సభలో అతిథిగా పాల్గొన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘శేషాచలం కొండల్లో అరుదైన వృక్షాలు, ఔషధ మొక్కలు ఉన్నాయి. అతి శీతల, అతి ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో బతికే మొక్కలు కూడా శేషాచలం కొండల్లో కూడా బతుకుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో అడవులు నాశనం కాకుండా చర్యలు చేపట్టాలి.’’ అన్నారు. చివరగా రచయిత రాఘవ మాట్లాడుతూ శేషాచలం కొండల్లో మూడు దశాబ్దాలుగా చేస్తున్న ట్రెక్కింగ్ అనుభవాలను వివరించారు. అడవికి వెళ్ళినప్పుడల్లా దేవిప్రియ రాసిన అమ్మచెట్టు కవితా సంకలనంలోని ‘అడవి’ కవిత గుర్తుకు వస్తుంటుందని గుర్తు చేస్తూ, తానీ పుస్తకంలో రాసిన ‘గుంజనా.. నా గుంజనా’ అంటూ నిత్యం జీవనదిలా జాలువారే గుంజన జలపాతం గురించిన కవితను వినిపించారు.
పౌరచైతన్య వేదిక తిరుపతి జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పౌరచైతన్య వేదిక జిల్లా కార్యదర్శి ఏ.ఎన్. పరమేశ్వరరావు, కోశాధికారి హరీష్, సాహితీ వేత్తలు సాకం నాగరాజు, ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు, మన్నవ గంగాధర ప్రసాద్ తోపాటు ట్రెక్కర్లు డాక్టర్ ప్రసాద్, బాలు బండారు, తిరుమల రెడ్డి, శివారెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.