
2024 డిసెంబరు చివరి వారంలో చైనా ఎగురవేసిన రెండు విమానాల వీడియోను చూసి అమెరికా, దాని అనుంగు దేశాలకు దడమొదలైందా ? మీడియాలో వస్తున్న విశ్లేషణలు, వివరాలను చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది. చైనా కమ్యూనిస్టు విప్లవ సారధి మావో జెడాంగ్ 131వ జన్మదినం డిసెంబరు 26వ తేదీన రెండు తయారీ కేంద్రాల నుంచి ఆకాశంలో విహరించిన రెండు విమానాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రతి దేశం స్వంత విమానాలను అవి పౌర లేదా యుద్ధ అవసరాల కోసం తయారు చేసుకోవటం కొత్తేమీ కాదు గానీ చైనా గురించి ఎందుకింత ఆందోళన.స్టెల్త్ బాంబర్ల తరగతికి చెందినవి చెబుతున్న ఆధునిక విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉన్నాయన్నది రహస్యమే.ఐదు, ఆరు తరాలకు చెందిన వాటిని స్టెల్త్ బాంబర్లు అని పిలుస్తున్నారు. ఇవి ఇతర దేశాలకు రాడార్లకు దొరక్కుండా( రెండో కంటికి తెలియకుండా) ఎగిరి శత్రువును దెబ్బతీసేంత వేగం, సామర్ధ్యం కలిగినవి. ఫోర్బ్స్ వెబ్సైట్ నాలుగు సంవత్సరాల క్రితం వివిధ వనరుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 2020 డిసెంబరు నాటికి ఏరకం విమానాలు ఏ దేశం దగ్గర ఎన్ని ఉనాయో పేర్కొంటూ ఒక జాబితాను ఇచ్చింది. దాని ప్రకారం అమెరికా 540, చైనా 41,నార్వే 22, ఇజ్రాయెల్ 18, ఆస్ట్రేలియా 16, బ్రిటన్ 15, జపాన్ 12, ఇటలీ 11, దక్షిణ కొరియా 11, రష్యా వద్ద పది చొప్పున ఉన్నాయి.రాడార్లను తప్పించుకొని ప్రయాణించే నాలుగు రకాలను చైనా రూపొందిస్తున్నదని కూడా ఆ వార్త పేర్కొన్నది. ఈ నాలుగేండ్లలో వాటి సంఖ్య కచ్చితంగా పెరిగి ఉంటుంది. మిలిటరీలో అమెరికా ఇప్పటికీ ఎదురులేని శక్తి అన్నది నిస్సందేహం. ఆ బలాన్ని చూపి ప్రపంచాన్ని తన అదుపులో పెట్టుకోవాలని చూస్తున్న మాట కూడా తెలిసిందే. ఇంతకీ చైనాను చూసి ఎందుకు కంగారు పడుతున్నట్లు ? ప్రపంచంలో ఇప్పటి వరకు ఐదవ తరం యుద్ధ విమానాలే ఉన్నాయి. అమెరికా తయారు చేసిన ఆరవ తరం విమానం 2020లో గగనతలంలో ఎగిరినప్పటికీ దాని గురించి వివరాలు ఇంతవరకు వెల్లడి కాలేదు. తాజాగా చైనాలోని చెంగడు, షెన్యాంగ్ విమాన తయారీ కేంద్రాల నుంచి రెండు కొత్త విమానాలు ఆకాశంలో కనిపించగా వాటికి రక్షణగా ఐదవ తరం జె`20 ఫైటర్ విమానం తిరిగింది. ఆ దృశ్యాలు తప్ప అంతకు మించి వివరాలేమీ ప్రపంచానికి వెల్లడి కాలేదు. ఆయితే ఆ రంగంలో నిపుణులైన వారు ఆ విమానాలను చూస్తే ఆరవతరానికి చెందిన లక్షణాలను కలిగి ఉన్నాయని చెప్పారు.
2024 చివరిలో ఫ్లైట్ గ్లోబల్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 161 దేశాలకు చెందిన సాయుధ దళాల్లో 52,642 విమానాలు ఉన్నాయి. ఇవి అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 759 తక్కువ. ఆఫ్రికా ఖండంలో 4,230, మధ్య ప్రాచ్యంలో 4,595, రష్యా కామన్వెల్త్ దేశాల్లో 5,124, ఆసియా`పసిఫిక్ ప్రాంతంలో 14,583, ఉత్తర అమెరికాలో 13,339,ఐరోపాలో 7,760, లాటిన్ అమెరికాలో 2,956 ఉన్నాయి.దేశాల వారీ చూస్తే అమెరికాలో 13,043(ప్రపంచంలో25శాతం), రష్యా 4,292(8శాతం), చైనా 3,309(6),భారత్ 2,229(4), దక్షిణ కొరియా 1,592(3), జపాన్ 1,443(3),పాకిస్థాన్ 1,399(3) కలిగి ఉన్నాయి. అమెరికాతో పోలిస్తే చైనా దగ్గర ఉన్న మిలిటరీ విమానాలు ఎక్కడా సరితూగవు. చిత్రం ఏమిటంటే అమెరికాతో సహా నాటో దేశాలు ఇస్తున్న మద్దతు చూసి కేవలం 324 మిలిటరీ విమానాలు మాత్రమే కలిగి ఉన్న ఉక్రెయిన్ నాలుగువేలకు పైగా ఉన్న రష్యాను ఓడిస్తామని ప్రపంచాన్ని నమ్మింప చూస్తున్నది. రష్యాను చూసి నాటోలోని 23దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను జిడిపిలో రెండుశాతం అంతకు మించి ఖర్చు చేసేందుకు పూనుకున్నాయి.
చైనా ప్రదర్శించిన రెండు విమానాలు పరీక్ష కోసం ఉద్దేశించినవిగా చెబుతున్నారు. దానిలో తేలే ఫలితాలను బట్టి ప్రమాణాలను నిర్ధారించిన తరువాత మార్పులు చేర్పులతో రంగంలోకి దించుతారు. ఇది అన్ని దేశాలలో జరిగే ప్రక్రియే. అమెరికా ఐదవతరం ఎఫ్22, ఎఫ్35 రకాలకు ధీటుగా చైనా ఉన్నదని అందరూ అంగీకరిస్తున్నారు.మనదేశం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్(ఎఎంసిఏ) రూపకల్పన దశలో ఉంది.ఎగుమతుల కోసం చైనా తయారు చేసిన జె35 రకం 40 స్టెల్త్ బాంబర్లను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ నిర్ణయించింది.చైనాలో ఐదవతరం చెంగుడు జె`20 రకం పని చేస్తుండగా షెన్యాంగ్ ఎఫ్‌సి31 రకం త్వరలో సేనలో చేరనుంది. ఈ సమాచార పూర్వరంగంలోనే ఆరవ తరం విమానాన్ని చైనా పరీక్షించినట్లు భావిస్తున్నారు.దాన్లో మూడు ఇంజన్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆధునిక విమానాల్లో అలాంటి ఏర్పాటు లేని కారణంగా ప్రత్యేకత సంతరించుకుంది.ఇప్పటికిప్పుడు దాన్ని నిర్ధారించుకొనే అవకాశం లేదు.రెండో విమానం పైలట్లతో పని చేస్తుందా లేక మానవరహితంగా లక్ష్యాన్ని చేరేవిధంగా రూపొందించారా అన్న చర్చ కూడా జరుగుతోంది.
అమెరికా 2020 సెప్టెంబరు 14న తాను ఆరవ తరం యుద్ధ విమానాన్ని రూపొందించినట్లు ప్రకటించటమే గాక ఒక విమానాన్ని ఎగురవేసింది. దాని వివరాలు ఇప్పటికీ రహస్యమే. 2022లో అమెరికా వైమానిక దళ విశ్రాంత జనరల్ మార్క్ డి కెలీ చైనా ఆరవతరం విమానాల గురించి హెచ్చరించాడు. సాంకేతికపరమైన తేడాను వేగంగా తగ్గిస్తున్నదంటూ ఆందోళన వెల్లడిరచాడు.1997లో అమెరికా ఐదవతరం స్టెల్త్ ఫైటర్ ఎఫ్`22 రాప్టర్‌ను తొలిసారిగా ఆవిష్కరించారు. దానికి ధీటైన చైనా జె`20 పద్నాలుగు సంవత్సరాల తరువాత 2011లో ఉనికిలోకి వచ్చింది.దీనితో పోల్చుకుంటే అమెరికా 2020లో ఆరవతరాన్ని ఆవిష్కరించిన నాలుగు సంవత్సరాలకే 2024లో చైనా తన విమానాలను ప్రదర్శించింది. దీన్ని బట్టి చైనా సాంకేతిక పరిజ్ఞానం ఇంత వేగంగా ఉందా అని ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. గతంలో చైనా సాధించినట్లు ప్రకటించిన అనేక విజయాలను తొలుత అంతా ప్రచారం తప్ప నిజం కాదని కొట్టిపడవేసిన వారు తరువాత వాస్తవమే అని తెలిసి అవాక్కయ్యారు. ఇప్పుడు ఆరవతరం విమానాల గురించి కూడా అదే డోలాయమానంలో ఉన్నారు.దీని గురించి చైనా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరాది సందర్భంగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు కమాండ్ ఒక సంగీత వీడియోను విడుదల చేసింది. దానిలో నూతన జెట్ బొమ్మలను చేర్చి అనధికారికంగా వాస్తవమే అని సంకేతమిచ్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.వివిధ దేశాలకు చెందిన విశ్లేషకులు భిన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీర్ఘశ్రేణి, అత్యంత వేగంగా ప్రయాణించగల, శత్రు విమానాలను అడ్డుకోగలిగిన రష్యా మిగ్`31 మాదిరి ఉన్నాయని, దానికంటే 45 టన్నుల బరువును మించి మోయగలవని, 400కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను దెబ్బతీయగలవని, ధ్వని కంటే నాలుగురెట్లు వేగంగా ప్రయాణిస్తాయని ఇలా రకరకాలుగా చెబుతున్నారు.
ప్రపంచంలో పరిణామాలు ఇలా ఉంటే మన దేశ పరిస్థితి ఏమిటి ?
పెట్రోలు, డీజిలు మీద విపరీతమైన సెస్సుల భారం మోపి ఏటా లక్షల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే గతం కంటే మోడీ సర్కార్ మిలిటరీ ఖర్చు ఎక్కువగా చేస్తున్నది, దానికి అవసరమైన మొత్తాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించిన రోజులను గుర్తుకు తెచ్చుకోవాలి. సెస్ అంటే ఏ అవసరాల కోసం విధిస్తే దానికి మాత్రమే ఖర్చు చేయాలి, కానీ మోడీ సర్కార్ విధించిన వాటిలో రక్షణ లేదు. కాంగ్రెస్ దేశ రక్షణను నిర్లక్ష్యం చేసిందని ఇప్పటికీ ఆరోపిస్తుంటారు. మన వైమానిక దళ అధిపతి ఏపి సింగ్ సుబ్రతో ముఖర్జీ 21వ సెమినార్లో మాట్లాడుతూ చెప్పిన మాటలు గమనించదగినవి.2010లో తేజ రకం యుద్ధ విమానాల ఒప్పందం ప్రకారం ఇప్పటికీ వాటిని పూర్తిగా సరఫరా చేయలేదని, మరోవైపున చైనా ఆరవతరం జెట్‌ను పరీక్షించిందని, చైనా నుంచి పాకిస్థాన్ ఐదవ తరం యుద్ధ విమానాలను రానున్న రెండు సంవత్సరాలలో కొనుగోలు చేయనున్నదని చెప్పారు. తేలిక రకం 40 తేజ విమానాలు కావాలని 2009`10లో ఆర్డరు పెడితే ఇంతవరకు పూర్తిగా రాలేదన్నారు. 1984లో విమానానికి రూపకల్పన జరిగిందని పదిహేడేండ్ల తరువాత మొదటి తేజా 2001లో ఎగిరిందని పదిహేను సంవత్సరాల తరువాత 2016లో మిలిటరీలో ప్రవేశపెట్టినట్లు, ఇది 2024, ఇంతవరకు తొలి 40 విమానాలను అందచేయలేదని, ఇదీ మన ఉత్పాదక సామర్ధ్యమని సింగ్ చెప్పారు.
చైనాను గమనిస్తే ఎన్ని విమానాలను అది తయారు చేసిందని కాదు, ఎంతో వేగంగా సాంకేతికంగా ముందుకు పోతున్నదని నూతన తరం యుద్ధ విమానాలను బయటకు తీసుకురావటాన్ని ఇటీవల చూశామని ఎయిర్ ఛీఫ్ మార్షల్ అన్నారు. పాతబడిన మిగ్ 21 విమానాల స్థానంలో తేలిక రకం(ఎల్‌సిఏ) విమానాలను స్వంతంగా రూపొందించేందుకు 1980దశకంలో నిర్ణయించారు. ఒక ఇంజను కలిగిన నాలుగవ తరం తేజ విమానాలను స్వంతంగా తయారు చేస్తున్నాము. వాటిని మెరుగుపరచి తేజా ఎంకె`1, తేజా ఎంకె`1ఏ రకాలను రూపొందించాము. ఈ రంగంలో పురోగతిని వేగవంతం చేసేందుకు పదేండ్లలో మోడీ సర్కార్ చేసిందేమిటన్నది ప్రశ్న.
అమెరికా, చైనాలు ఆరవతరంలో ప్రవేశిస్తే మన దేశం వద్ద ఫ్రాన్సు నుంచి దిగుమతి చేసుకున్న దసాల్ట్ రాఫెల్ విమానమే ఆధునికమైనది, అది 4.5వ తరానికి చెందినదిగా పరిగణిస్తున్నారు. చురుకుగా పనిచేసే వైమానిక యూనిట్లు 42 ఉండాలని నిర్ణయించగా ప్రస్తుతం 31 మాత్రమే ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ నివేదికలో వెల్లడిరచారు. ఒక్కొక్క యూనిట్లో రెండు అంతకు మించి యుద్ధ విమానాలు ఉంటాయి. ప్రస్తుతం 83 తేలిక రకం తేజా విమానాల కోసం వాయుసేన ఒప్పందాలు చేసుకుంది, మరో 97కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్దం చేసింది.వచ్చే దశాబ్దిలో ఐదవ తరం తేజా ఎంకె`2 విమానాలు సిద్దం అవుతాయని భావిస్తున్నారు.ప్రస్తుతం ఉన్న మిరేజ్ 2000, మిగ్29, జాగ్వార్ విమానాలున్నాయి, ఐదవతరం తేజా వస్తే మరింత ఆధునికం అవుతుంది. వీటిని అభివృద్ధి చేసేందుకు గత ఏడాది మార్చి నెలలో మాత్రమే కేంద్రం అనుమతించిందనే వార్తలను చూస్తే కబుర్లు చెప్పినంతగా ఆచరణ గడపదాటటం లేదన్నది వాస్తవం.పరస్పరం విశ్వాసం లేమి, మిత్రులుగా పైకి కనిపించే వారే కుట్రలు జరుపుతున్న పూర్వరంగంలో ప్రతిదేశం తన జాగ్రత్తలను తాను తీసుకుంటున్నది. ఈపూర్వరంగంలో మన రక్షణ రంగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు,ప్రచారానికే పరిమితం కాకుండా నిర్థిష్ట కార్యాచరణను రూపొందించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.