
Reading Time: 4 minutes
విషాదాలు విలాపాలే పాలకుల ప్రాపంచిక దృక్పథాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల వ్యవధిలో రెండు తొక్కిసలాట సంఘటనలు జరిగి, ఏడు నిండు ప్రాణాలు పోయాయి. గత నెల డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 సినిమా ప్రీమియం షో సందర్భంగా తెలంగాణా రాజధాని హైదరాబాదులో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఈ నెల 9వ తేదీ గురువారం రాత్రి ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగింది.
ఈ తొక్కిసలాటలు నిత్యావసరాల కోసమో, జీవన్మరణ పోరాటాల కోసమో జరిగినవి కావు. ఒక తొక్కిసలాట సినిమా టికెట్ల కోసం జరిగితే, మరొక తొక్కిసలాట దేవుడి దర్శనం టోకెన్ల కోసం జరగడం పెను విషాదం ! మన ప్రభుత్వాలు ఒకపక్క చిల్లర సినిమాలను, మరొక పక్క భక్తిని ఎందుకిలా ప్రోత్సహిస్తున్నాయన్న ప్రశ్న ప్రజలను కాస్త లోతుగా ఆలోచింప చేస్తున్నాయి.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
సంక్రాంతికి ముందు ముక్కోటి ఏకాదశి నుంచి ధనుర్మాసం మొదలువుతుంది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ప్రతి వైష్ణవాలయంలోనూ ఉత్తరం వైపు నుంచి వెలుపలకు వచ్చే ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారు. మిగతా రోజుల్లో మూసి ఉంచుతారు. భగవదర్శనం చేసుకున్నాక ఉత్తర ద్వారం ద్వారా వెలుపలకు వస్తే, మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దీన్ని వైకుంఠ ద్వార దర్శనం అని కూడా అంటారు.
తిరుమలలో తొలి నుంచి వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఈ వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచే వారు. తిరుమలలో రద్దీ పెరగడం వల్ల మూడు నాలుగు దశాబ్దాల నుంచి వైకుంఠ ఏకాదశితో పాటు ఆ మర్నాడు ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తూ వచ్చారు. అయిదేళ్ళ క్రితం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిన్నాయన వై.వి.సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా నియమితులయ్యారు. వైకుంఠద్వారదర్శనానికి డిమాండ్ పెరుగుతోందని, ఈ ఉత్తర ద్వారాన్ని పదిరోజుల పాటు తెరిచి ఉంచడం మొదలు పెట్టారు.
రాజకీయ లబ్ధికే పెంచిన దర్శనాలు
పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం సంప్రదాయ విరుద్ధమన్న విమర్శలు వచ్చాయి. ఇది ఆగమ విరుద్ధం కాదని కొంత మంది పీఠాధిపతుల చేత కూడా నాటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి చెప్పించారు. వైకుంఠ ద్వారదర్శనం స్థానికులకే అన్న నిబంధన అంటూ ఏదీ లేకపోయినప్పటికీ, స్థానికేతరులకు పెద్దగా తెలిసేది కాదు. రాష్ట్రం నుంచే కాదు, దేశంలో ఎక్కడి నుంచైనా వచ్చే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు ఇస్తారని ఈ తడవ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు పదివేల మందికి చొప్పున పదిరోజులకు లక్ష మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తే, ఆరు నెలల క్రితం అధికారంలో కొచ్చిన కూటమి ప్రభుత్వం రోజుకు 75 వేల చొప్పున పది రోజులకు ఏడున్నర లక్షల మందికి దర్శనం కల్పించాలని నిర్ణయించింది. దీంతో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తిరుపతికి పెద్ద ఎత్తున భక్తులు రావడం మొదలైంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓట్ల రాజకీయ లబ్ది కోసమే ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించే రోజులు పెంచగా, ఈ తడవ అధికారంలోకొచ్చిన తెలుగు దేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కూడా అదే ఓట్ల రాజకీయ లబ్దికోస మే దాన్ని మరింత కొనసాగించింది. పైగా రోజూ జారీ చేసే టికెట్లను ఏడు రెట్లు పెంచింది.
ఈ నెల 10 వతేదీ వైకుంఠ ఏకాదశి కాగా, 9వ తేదీ నుంచి దర్శన టోకెన్లు ఇస్తామని టీటీడీ ప్రకటించేసరికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ నుంచి కూడా భక్తులు తండోపతండాలు తిరుపతికి 8వ తేదీ నుంచే రావడం మొదలు పెట్టారు. వస్తున్న భక్తుల సంఖ్యను టీటీడీ కానీ, జిల్లా యంత్రాంగం కానీ అంచనా వేయలేకపోయింది.
సీ.ఎం సేవలో టీటీడీ, జిల్లా యంత్రాంగం
ఆరవ తేదీ నుంచి 8వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్న తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు.జిల్లా పోలీసు యంత్రాంగమంతా ముఖ్యమంత్రి బందోబస్తు డ్యూటీలోకి వెళ్ళిపోయింది. తిరుపతిలో తొమ్మిది చోట్ల ఈ దర్శనం టోకెన్లు ఇవ్వడానికి కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి సేవలో పడిపోయిన జిల్లా పాలనా యంత్రాంగంతోపాటు టీటీడీ కూడా వేల సంఖ్యలో వస్తున్న భక్తులకు మంచి నీళ్ళు, భోజనం, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయలు కల్పించలేక పోయింది.
తొమ్మిదవ తేదీ రాత్రి 9 గంటల నుంచి టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటిస్తే, ఆ రోజు ఉదయం నుంచే భక్తులు ప్రవాహంలా తిరుపతికి రావడం మొదలు పెట్టారు. టోకెన్లు జారీ చేసే కొన్ని కేంద్రాల వద్దకు ముందు రోజు నుంచే వచ్చి కూర్చున్నారు. భక్తుల రాకను చూసైనా ఏర్పాట్లు పెంచాలన్న ఆలోచన అధికార యంత్రాగానికి తట్టలేదు.
రామచంద్ర పుష్కరిణి వద్ద రోడ్డు డివైడర్ కు ఒక పక్క ట్రాఫిక్ ను నిలిపి వేసి, బారికేడ్లు కట్టి బందెల దొడ్లోకి పశువులను తోలినట్టు రోడ్లోకి తోలారు. అలాగే రెండు వేల మంది మాత్రమే పట్టే బైరాగిపట్టెడ లోని పార్క్ వద్ద జెడ్పీ హౌస్కూల్ ఆవరణలోకి రెండున్నర వేల మందిని పైగా తోశారు. శ్రీనివాసం, విష్ణునివాసం, ఇందిరా మైదానం, భూదేవి కాంప్లెక్స్, ఎం.ఆర్.పల్లె జెడ్పీ హైస్కూల్ ఆవరణలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. దర్శన టోకెన్లు ఇచ్చే కేంద్రాల్లో కనీస సదుపాయాలు అందక, వాటి కోసం బైటకు వెళ్ళలేక, లోపల ఉండలేక భక్తులు ఇబ్బంది పడడంతో అవి బిహిరంగ జైళ్ళుగా తయారయ్యాయి.
టీటీడీ, జిల్లా పాలనా యంత్రాగాలు రాజకీయ నాయకుల, వీఐపీల సేవలో మునిగిపోయి, భక్తుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ తొక్కిసలాటలో వృద్ధులు, స్త్రీలు, పిల్లలు నలిగిపోయి చేసిన హాహాకారాలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. బైరాగిపట్టెడలో జరిగిన తొక్కిసలాటలో అయిదుగురు, విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాటలో ఒకరు మరణించారు. వివిధ చోట్ల జరిగిన తొక్కిసలాటలో నలభై మందికి పైగా గాయపడి రుయా, స్విమ్స్ ఆస్పత్రులలో చికిత్సకు చేరాల్సి వచ్చింది.
దుర్ఘటనతో బైటపడ్డ కూటమి విభేదాలు
ఈ తొక్కిసలాటకు మీరు కారణం అంటే, కాదు మీరే కారణం అంటూ అటు కూటమిలోని రాజకీయ పార్టీలు, ఇటు ప్రతిపక్ష వైఎస్ ఆర్ సీపీ పరస్పర విమర్శలకు దిగాయి. ‘‘రెండు రోజులుండే వైకుంఠ దర్శనాన్ని మీరు పదిరోజులకు పెంచబట్టే ఈ తొక్కిసలాట జరిగింది’’ అని తెలుగు దేశం నాయకులు ఆరోపిస్తే, ‘‘మేం నిర్వహించినప్పుడు తొక్కిసలాట జరగలేదు, మీ పాలనలోనే తొక్కిసలాట జరిగింది. అందుకు మీరే కారణం’’ అంటూ వైఎస్ ఆర్ సీపీ నాయకులు ప్రతి విమర్శలు చేశారు.
‘‘తెలుగు దేశం పార్టీకి హిందూ ధర్మం పై భక్తి శ్రద్ధలు లేకపోవడం వల్లనే ఈ దుర్ఘటన జరిగింది’’ అని మాజీ రాడికల్ అయిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆరోపించడం ఈ సందర్భంగా గమనార్హం.
ముఖ్యమంత్రి ముందే టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో శ్యామలరావు కలహించుకున్నారు. అలాగే ఈ దుర్ఘటనకు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో బాధ్యత వహించాలని ఆరోపిస్తూ, అందుకు క్షమాపణలు చెప్పాలని కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానిస్తే, ‘‘క్షమాపణలు చెపితే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా?’’ అని టీటీడీ చైర్మన్ బి.వి.నాయుడు ఎదురుదాడికి దిగారు. కూటమిలోని తెలుగు దేశం, జనసేన మధ్య ఉన్న విభేదాలు ఈ సందర్భంగా ఇలా బైటపడ్డాయి.
తిరుమల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడోత్సవం నాడు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు కొన్ని సార్లు తొక్కిసలాట జరిగినా, గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం, ప్రాణ నష్టం జరగలేదు. ఈ తొక్కిసలాట జరగడానికి వీరి నిర్లక్ష్యమే కారణమని భావిస్తూ డీఎస్పీ రమణ కుమార్ ను, గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డిని సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి (ఐపీఎస్) శ్రీధర్ ని, జేఈవో గీతని బదిలీ చేశారు.
గతంలో తొక్కిసలాటలు
మతం, రాజకీయాల వల్ల రాష్ట్రంలో గతంలో కొన్ని తొక్కిసలాట సంఘటనలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కందుకూరులో జరిగిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడురోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందారు. చంద్రబాబు 2015లోనూ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన అక్కడ ఉన్నప్పుడే తొక్కిసలాట జరిగి 29 మంది మృతి చెందారు.
దేశ సంపద పెరుగుతోంది కానీ, సామాన్యుల జీవన ప్రమాణాలు రోజు రోజేకూ పడిపోతున్నాయి. కార్పొరేట్ శక్తుల ఆదాయాలు, ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అటుంచి, ఉన్న ఖీళీల భర్తీ చేపట్టడం లేదు. పారిశ్రామికాభివృద్ధి కుంటుపడి, ఉపాధి కల్పన కూడా ఎప్పుడో ఆగిపోయింది. సమాజం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల సంక్షేమం చేపట్టాలనే బాధ్యత నుంచి ప్రభుత్వాలు ఎప్పుడో వైదొలిగాయి.
చంద్రబాబు నాయుడ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ‘‘దేవాలయాలను ఉపాధి కేంద్రాలుగా అభి వృద్ధి చేయాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల దృష్టిని సమస్యల పైనుంచి మరల్చడానికి ఇటు సినిమాలను, అటు మత కార్యక్రమాలను ప్రోత్సహించడమనేది ప్రభుత్వాలు ఒక ప్రాపంచిక దృక్పథంగా పెట్టుకున్నాయనడానికి ఈ సంఘటనలు ప్రబల సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఈ సంక్షుభిత సమాజంలో సామాన్యులు తమ జీవన సమస్యలను పరిష్కరించుకోలేక, కాసేపు సినిమాలో కనిపించే హీరోగానో, హీరోఇన్ గానో తమని తాము ఊహించుకుని, ఆ ఊహల్లోనే ఎంతో కొంత ఊరట పొందాలని చూసినా, చివరికి పుష్ప-2 వంటి సినిమాలు అమాయకుల ప్రాణాలను తీసి విషాదాలుగా మారుస్తున్నాయి. అటు గుళ్ళు గోపురాల వంటి మత కార్యక్రమాల వైపు ప్రజల దృష్టి ని మరలించినా, అవి కూడా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట వంటి విషాదాలుగా పరిణమిస్తున్నాయి.
ఒక కొత్త తొక్కిసలాట జరగగానే పాత తొక్కిసలాటను మర్చిపోతాం. కొత్త తొక్కిసలాట పాత తొక్కిసలాటను మర్చిపోయేటంతటి తీవ్రంగా ఉండడం వల్లనే పాత దాన్ని మర్చిపోతున్నాం. సినిమా తొక్కిసలాటలో ఒకరు మరణిస్తే, దర్శనం టోకెన్ల తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం ఇందుకు తార్కాణం.
తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు పాతిక లక్షల రూపాయాల చొప్పున ఎక్స్ గ్రేషియా(ఉదార చెల్లింపులు)ను ముఖ్యమంత్రి ప్రకటించారు. వారి కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో ‘కాంట్రాక్టు పద్ధతి’పైన ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చాలా ఉదారంగా ప్రకటించారు. గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి అయిదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఏం చేసినా, ఎంత ఎక్స్ గ్రేషియా చెల్లించినా పోయిన ప్రాణాలైతే తిరిగి తీసుకు రాలేరు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.