
మొదటి భాగం
జమిలి ఎన్నికలకు సంబంధించిన హైలెవెల్ కమిటీ సిఫార్సులను డిశంబరు 12న కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ సిఫార్సుల్లో భాగంగా మాజీ రాష్ట్రపతి కోవిద్ నాయకత్వంలోని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఓ నమూనా బిల్లును కూడా రూపొందించింది. వీటి ఆధారంగా లోక్‌సభలో 129వ రాజ్యాంగ సవరణ బిల్లు గా ప్రవేశపెట్టబడిరది. ఈ సవరణల సారాంశం ఏమిటి? ఈ బిల్లు అవసరం ఏమిటి? ఈ బిల్లు పర్యవసానాలేమిటి అన్న విషయాలను ఈ వ్యాసంలో చర్చిద్దాం.
129వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏమి ప్రతిపాదిస్తోంది ?
ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న 82వ అధికరణంకి అదనంగా (అ) క్లాజును, 83వ అధికరణంలో (2)వ క్లాజును, 172 అధికరణంలో (1) క్లాజులో (అ) అనే సబ్ క్లాజును, అధికరణం 327లో ‘నియోజకవర్గాల పునర్య్వవస్తీకరణ’ పదాలకు బదులు ‘జమిలి ఎన్నికలు’ అన్న పదాలను చేర్చటం ఈ సవరణ బిల్లు లక్ష్యం. దీంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు, గవర్నమెంట్ ఆఫ్ ఢల్లీి చట్టంలో 5వ సెక్షన్‌ను కూడా మార్చటానికి మరో బిల్లు ను కేంద్రం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో పాఠకుల అవగాహన నిమిత్తం రాజ్యాంగంలో ఉన్న ఆ అధికరణాలు, క్లాజులు, ఏమిటి, కొత్తగా ప్రతిపాదించిన 129 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఏమి మారబోతోంది అన్న వివరాలు ఇస్తున్నాము.
నేపథ్యం :
1952 నుండీ 1967 వరకూ లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరుగుతూ ఉండేవి. అయితే 1968, 1969లల్లో కొన్ని రాష్ట్రాల శాసనసభలు తమ పదవీకాలం కంటే ముందే రద్దు కావటంతో ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అప్పటి నుండీ లోక్‌సభకూ, శాసనసభలన్నింటికీ ఏకకాలంలో ఎన్నికలు జరిపే సాంప్రదాయానికి గండి పడిరది. భారత న్యాయ సంఘం ‘ఎన్నికల సంస్కరణలు’ అన్న తన 170వ నివేదికలో శాసనసభలకు జరిగే ఎన్నికలు మరీ అనివార్యం అయితే తప్ప లోక్‌సభతో పాటే జరపాలని సిఫార్సు చేసింది. లోక్‌సభ పదవీకాలంతో పాటే అన్ని శాసనసభల పదవీ కాలం ముగిసేలా చూడాలని, తద్వారా లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్నది లా కమిషన్ అధ్యయన సారాంశం. లా అండ్ జస్టిస్ మరియు సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్సెస్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 79వ నివేదికలో జమిలి ఎన్నికల సాధ్యా సాధ్యాలను పరిశీలించి జమిలి ఎన్నికలే సబబని తీర్మానించింది.
జమిలి ఎన్నికల సమర్ధిస్తూ ప్రభుత్వం ముందుకు తెచ్చిన వాదనలు ఏమిటి?
ఎన్నికల నిర్వహణ భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారటం వలన జమిలి ఎన్నికలు నిర్వహించటం తక్షణ ప్రాధాన్యతగా మారిందన్నది కేంద్ర ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లుతోపాటు లోక్‌సభ ముందుంచిన స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ ప్రకటనలో వెల్లడిరచింది. పైగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేర్వేరు సందర్భాల్లో ఎన్నికలు జరగాల్సి రావడం వలన ఆయా సందర్భాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడం, ఆ కారణంగా ఎన్నో అభివృద్ధిపనులు అమలు చేయలేని పరిస్థితులు, పరిమితులు ఏర్పడటం కూడా జమిలి ఎన్నికలకు మొగ్గుచూపడం వెనక మరో కారణమి ఈ లక్ష్యప్రకటన తెలియచేస్తోంది. ఇంతకు మించిన సమర్ధింపు వాదనలు ప్రభుత్వం వద్ద లేకపోవటం గమనించాలి.
ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏమిటి?
భారత రాష్ట్రపతిగా జూలై 2022 వరకూ పని చేసిన వ్యక్తి రామ్‌నాథ్ కోవింద్. ఆయన్ను అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 2023లో (అంటే సరిగ్గా రాష్ట్రపతిగా బాధ్యతల నుండి వైదొలగిన ఏడాది తర్వాత) ఓ కమిటీని నియమించింది. బహుశా 79 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఓ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశంపై అధ్యయన బృందానికి మాజీ రాష్ట్రపతి నాయకత్వం వహించటం ఇదే మొదటిసారి. భారతదేశంలో రాష్ట్రపతి అంటే రాజ్యాంగ రక్షకుడిగా బాధ్యత. అందుకే షెడ్యూల్డ్ ఏరియాలు (పధానంగా ఎస్సీ, ఎస్టీలు మెజారిటీ ఉన్న ప్రాంతాలు)లకు సంబంధించిన సమస్యల విషయంలో, వివాదాల విషయంలో అంతిమ జవాబుదారుడు రాష్ట్రపతే. అంతటి కీలక బాధ్యతలు నెరవేర్చి, పదవీ విరమణ చేసిన తర్వాత భావి భారత నిర్మాణంలో అంతే ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగాన్ని సవరించేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించటం ఓ వైపరీత్యం అనటంలే సందేహం లేదు. అయితే ఇది రాజకీయ వైపరీత్యమా లేక నైతిక వైపరీత్యమా అన్నది పాఠకులే నిర్ణయించుకోవాలి. కోవింద్ నాయకత్వంలోని కమిటీ మార్చి 2024లో తన నివేదికను సమర్పించింది. దీనికోసం ఏకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఈ నివేదిక పూర్తి పాఠం వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
ఈ నివేదిక జమిలి ఎన్నికల అవసరాల గురించి చెప్పిన ఏ ఒక్క కారణానికీ కావల్సిన తర్కబద్ధమైన భూమికను కానీ, తాత్విక భూమికను కానీ ప్రస్తావించలేకపోయింది. కానీ జమిలి ఎన్నికలు జరిగితే దేశం బాగుంటుందన్న సాధారణ సూత్రీకరణతో నివేదిక ముగుస్తుంది. దాంతోపాటు అన్ని రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుతో ముడిపడిన అంశం కాబట్టి జమిలి ఎన్నికలను ఆచరణ సాధ్యం చేయాలంటే రాజ్యాంగ సవరణ తప్పది చెప్తూ రాజ్యాంగ సవరణ ముసాయిదా బిల్లును కూడా నివేదికకు అనుబంధంగా జత చేసింది. రాష్ట్ర శాసనసభల మనుగడకు సంబంధించిన బిల్లు కనుక కనీసం రాష్ట్ర శాసనసభల్లో చర్చకు అనుమతించాలన్న ప్రతిపాదన కూడా ఈ నివేదికలో లేదు. జమ్ముకాశ్మీర్ శాసనసభతో సంబంధం లేకుండా కేంద్రంలో తనకున్న సంఖ్యాబలాన్ని ఉపయోగించి శాసనసభను రద్దు చేయటమే కాక ఏకంగా రాష్ట్రాన్నే రద్దు చేసే (ముక్కలు చేసే) సవరణను పార్లమెంట్లో ఆమోదించుకున్న తరహాలోనే ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ఆమోదించుకోవడానికి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సిద్ధపడుతుందా అన్న సందేహం కలుగుతోంది.
ప్రతిపాదిత సవరణలు
వ్యాసం ప్రారంభంలోనే చెప్పినట్లు ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న 82వ అధికరణంకి అదనంగా (అ) క్లాజును, 83వ అధికరణంలో (2)వ క్లాజును, 172 అధికరణంలో (1) క్లాజులో (అ) అనే సబ్ క్లాజును, అధికరణం 327లో ‘నియోజకవర్గాల పునర్య్వవస్తీకరణ’ పదాలకు బదులు ‘జమిలి ఎన్నికలు’ అన్న పదాలను చేర్చటం ఈ బిల్లు లక్ష్యం. ఇపుడు రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న అధికరణాలు, క్లాజులు ఏమి చెప్తున్నాయి, దానికి ప్రతిపాదిత సవరణలకు మధ్య ఉన్న తేడా ఏమిటన్న విషయాన్ని పరిశీలిద్దాం.
82వ ఆర్టికల్ :
రాజ్యాంగంలో ఉన్న 82వ ఆర్టికల్ ప్రకారం ప్రతి పదేళ్లకొకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత రాష్ట్ర శాసనసభా స్థానాలను పునర్వ్యవస్తీకరిస్తూ పార్లమెంట్ చట్టం చేయాలి. అయితే ఈ పునర్వ్యవస్తీకరణ అప్పటికి ఉనికిలో ఉన్న లోక్‌సభ పదవీ కాలం వరకూ ఈ పునర్వ్యవస్తీకరణ వలన జరిగే మార్పుల ప్రభావం ఉండదు. ఈ ఆర్టికల్ ఆధారంగానే ఏ రాష్ట్రంలో ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి, ఎన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉంటాయి అన్నది నిర్ణయం అవుతుంది. ఈ ఆర్టికల్‌ను కొనసాగిస్తూనే అదనంగా (అ) అనే క్లాజును చేర్చాలని ఈ సవరణ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఆ కొత్తగా చేర్చదల్చుకున్న క్లాజుల ప్రకారం ఈ కొత్త నిబంధన ప్రకారం రాష్ట్రపతి ద్వారా ఆదేశించబడిన రోజు దేశంలోని పార్లమెంట్‌తో సహా అన్ని రాష్ట్రాల శాసనసభలకూ తొలి రోజుగా ఉంటుందనీ, ఆ రోజు నుండీ అన్ని శాసన సభల జీవితమూ పార్లమెంట్ జీవితకాలంతో ముడి పడి ఉంటుందనీ, సదరు తుది గడువు తర్వాత పార్లమెంటతో పాటు అన్ని శాసనసభలకూ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంటుందనీ, జమిలి ఎన్నికలు అంటే లోక్‌సభతో పాటు శాసనసభలకు కూడా ఏకకాలంలో జరిగే ఎన్నికలు అనీ, ఒక వేళ లోక్‌సభ ఎన్నికలతో పాటుగా ఏ రాష్ట్ర శాసనసభకు అయినా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి తలెత్తినప్పుడు సదరు శాసస సభకు తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం రాతపూర్వకంగా తెలియచేయాలనీ, అటువంటి పరిస్థితుల్లో ఏ రాష్ట్రాల శాసనసభల సమయం ముగిసిన తర్వాత కూడా ఎన్నికలు జరపలేమని కేంద్ర ఎన్నికల సంఘం తెలియచేస్తోందో ఆయా రాష్ట్రాల శాసనసభల గడువు కూడా లోక్‌సభ గడువుతోనే ముగుస్తుందనీ, లోక్‌సభకు గడువు ప్రకారమే ముగుస్తుందనీ, ఏయే రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించటానికి ప్రకటన జారీ చేస్తుందే అదే ప్రకటనలోనే సదరు శాసనసభ కాలం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టం చేయాలనీ తాజా సవరణ ఆదేశిస్తోంది.
83వ ఆర్టికల్ :
ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో 83 ఆర్టికల్ ప్రకారం రాజ్యసభ కాలం ఎన్నటికీ ముగియదు. రాజ్యసభలో మూడిరట ఒక వంతు మంది సభ్యులు ప్రతి రెండేళ్లకొకసారి పదవీ విరమణ చేయాలనీ, లోక్‌సభ అనివార్య కారణాల వలన రద్దు కాకపోతే నియమిత తేదీ నుండి ఐదేళ్ల పాటు కొనసాగుతుందనీ, ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు లోక్‌సభ పదవీకాలం అదనంగా ఏడాదిపాటు ఉంటుందనీ, అటువంటి ఆదేశాలను పార్లమెంట్ ప్రతి ఆర్నెల్లకు ఒకసారి పునరుద్ధరించాలి, ఒకవేళ ఆర్నెల్లలోగా పార్లమెంట్ ఆదేశాలు పొందలేకపోతే సదరు అత్యవసర పరిస్థితి ముగింపుకు వస్తుందనీ చెప్తోంది.
దీని స్థానంలో తాజాగా ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం సబ్ క్లాజు (2) తర్వాత అంటే లోక్‌సభ ఐదేళ్ల పాటు ఉనికిలో ఉంటుందన్న క్లాజు తర్వాత ఐదు కొత్త క్లాజులు చేర్చాలని ప్రతిపాదిస్తోంది. ఈ ఐదు కొత్త క్లాజుల్లో మొదటిది నియమిత తేదీ నుండి లోక్‌సభ ఐదేళ్లపాటు ఉనికిలో ఉంటుంది, రెండోది ఏ కారణం చేతనైనా నియమిత తేదీ నుండి ఐదేళ్ల లోపు అర్థాంతరంగా రద్దయితే సదరు కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా సదరు లోక్‌సభ ఐదేళ్లపాటు ఉనికిలో ఉంటుందనీ, లోక్‌సభ నియమిత ఐదేళ్ల గడువు కంటే ముందే రద్దు అయితే సదరు రద్దు కాకపోతే ఎంత కాలం ఉంటుందో అంత కాలం కొనసాగుతుందనీ, ఆ తర్వాతే సభ రద్దయినట్టుగా పరిగణించబడుతుందనీ, ఈ విధంగా ఏర్పడిన లోక్‌సభ పదవీ కాలాన్ని పూర్వపు లోక్‌సభ పదవీకాలంతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు కొనసాగుతుందనీ, ఒకవేళ సభ నియమిత కాలం కంటే సభ ముందుగానే రద్దయి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే దాన్ని మాత్రమే మధ్యంతర ఎన్నికలు గా పరిగణించాలనీ ప్రతిపాదిస్తోంది.
172వ ఆర్టికల్ :
ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో 172 ఆర్టికల్ లో రెండు క్లాజులు ఉన్నాయి. మొదటి క్లాజు ప్రకారం నియమిత తేదీ తర్వాత అర్థాంతరంగా సభ రద్దయితే తప్ప సదరు శాసనసభ ఐదేళ్ల పాటు ఉనికిలో ఉంటుంది. ఒకవేళ సదరు శాసనసభ కాలంలో అత్యవసర పరిస్థితి విధించబడితే సదరు అత్యవసర పరిస్థితి ఆరు మాసాల్లోగా పార్లమెంట్ అనుమతి పొందకపోతే సదరు ప్రకటన అమల్లో లేనట్లుగా భావించబడుతుంది. ఇక రెండో క్లాజు ప్రకారం శాసనమండలి రద్దు కాదు. కానీ రాజ్యసభ తరహాలోనే రెండేళ్లకు ఒకసారి మూడిరట ఒక వంతు మంది సభ్యులు పదవీవిరమణ చేస్తూ ఉంటారు.
దీని స్థానంలో ప్రస్తుత ప్రతిపాత 129వ రాజ్యాంగ సవరణ ఈ అధికరణంలో అదనంగా ఐదు సబ్ క్లాజులు ప్రతిపాదిస్తోంది. అందులో మొదటి సబ్ క్లాజు నియమిత తేదీ నుండి ఐదేళ్ల పాటు ఉన్న కాలాన్ని సభాకాలంగా పరిగణించబడుతుందని ప్రతిపాదిస్తోంది. ప్రస్తుత రాజ్యాంగంలోని రెండో క్లాజు తర్వాత మూడో క్లాజుగా సభ రద్దైనా సరే నియమిత తేదీ నుండి ఐదేళ్ల పాటు సభ మనుగడలో ఉన్నట్లుగానే పరిగణించబడుతుందని చెప్తోంది. నాల్గో క్లాజు ద్వారా ఈ సవరణ ఒక వేళ శాసనసభ రద్దయి ఎన్నికలు జరిగి నూతన సభ ఉనికిలోకి వస్తే ఆ సభ కూడా నియమిత తేదీ నుండి పూర్వపు సభ ఎంత కాలం మనుగడలో ఉంటుందో అంతే కాలం మనుగడలో ఉంటుందని ప్రతిపాదిస్తోంది. చివరిగా ఐదో సబ్ క్లాజులో మధ్యంతర ఎన్నికల ద్వారా ఉనికిలోకి వచ్చిన సభకు కూడా ప్రతిపాదిత సవరణల్లోని మూడో సవరణ అంటే సదరు ఎన్నికైన సభ మిగిలిన కాలానికే ఉనికిలో ఉంటుంది తప్ప ఎన్నికైన తేదీ నుండి ఐదేళ్ల పాటు అధికారంలో ఉండదు.
ఇది రాజ్యాంగపరిభాష. ఆచరణాత్మక రాజకీయాల్లో ఈ సవరణల పర్యవసానాలు ఎలా ఉంటాయో తదుపరి వ్యాసంలో చూద్దాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.