
ప్రతిపక్షం పుంజుకున్న నేపథ్యంలో గత పదేళ్లుగా వ్యవహరించినట్లుగానే వ్యవహరించటం పాలక బిజెపికి కష్టంగా ఉండవచ్చు.
ప్రతిపక్షాలను, ప్రభుత్వ చర్యలను విమర్శనాత్మక దృష్టితో చూసేవారిని ‘అర్బన్ నక్సల్స్’ అని ప్రధాని కొత్తపేరుతో పిలిచినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. 2024 ఆగస్టులో కేంద్ర హోంమంత్రి నక్సలిజంపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధం ముగింపుకు వచ్చిందనీ, దేశ చిత్రపటం నుండి వామపక్ష అతివాదాన్ని 2026 కల్లా తుడిచేయనునాన్నమని ప్రకటించిన కొంత కాలానికే ప్రధాని అర్బన్ నక్సల్స్ వాదన ముందుకు తీసుకురావటం అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. అనుమానాలకు తావిస్తుంది.
హోంమంత్రి చెప్పినట్లు దేశరాజకీయ చిత్రపటం నుండి నక్సలిజాన్ని రూపుమాపబోతున్న తరుణంలో ప్రధాని ఈ వాదన నెత్తికెత్తుకోవటం వెనక ఆంతర్యం ఏమిటి? ఈ మధ్యకాలంలోనే నక్సలిజం గురించీ, నక్సలిజానికి మద్దతు పలుకుతున్న వారి గురించీ ఇష్టమొచ్చినట్లు విమర్శించారు. హర్యానా ఎన్నికల సభల్లో మాట్లాడుతూ ‘‘హర్యానాలో మన సైనికులపై రాళ్ల వర్షం, బుల్లెట్ల వర్షం కురిసే రోజులు రావాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. ఎంతో మంది మన సైనికులు అమరులయ్యారు’’ అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికలకు ముందు సెప్టెంబరులో ఆ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్, దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని కోరుతున్న వాళ్లూ నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని మరో వారం రోజుల తర్వాత జమ్ములో జరిగిన బహిరంగ సభలో ప్రస్తావించారు.
అక్టోబరులో మహారాష్ట్రలోని వాహిలో జరిగిన మరో సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్సే నడుపుతున్నారని విమర్శించారు. మరో సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాదక ద్రవ్య వ్యాపారులతో సంబంధాలు కలిగి ఉందని ఆరోపించారు. ఏడాది క్రితం మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మోడీ కాంగ్రెస్ పగ్గాలు అర్బన్ నక్సల్ నాయకత్వం చేతుల్లోకి వెళ్లాయని దుయ్యబట్టారు. 2022లో మరో అడుగు ముందుకెళ్లి అర్బన్ నక్సల్స్ చివరకు ప్రపంచ బ్యాంకును కూడా ప్రభావితం చేయగలుగుతున్నారని వాపోయారు. నర్మద ప్రాజెక్టును ఆపేసేందుకు అర్బన్ నక్సల్స్ తీవ్రంగా ప్రయత్నించారని కూడా ఆరోపించారు.
గత నెలలో మాట్లాడుతూ ‘‘ ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటామ’’న్న వారిని కూడా అర్బన్ నక్సల్స్ సహించే స్థితిలో లేరన్నారు. ‘‘భారతదేశం విదేశీ పెట్టుబడులకు అంత మన్నికైన స్థావరం కాదు’’ అని చెప్పేందుకు కూడా అర్బన్ నక్సల్స్ బరితెగిస్తున్నారని, తద్వారా విదేశీ పెట్టుబడిదారులకు తప్పుడు సూచనలు పంపుతున్నారని విమర్శించారు. ‘‘ఈ శక్తులు చివరకు సైన్యంలో కూడా కుల కుంపట్లు పెట్టేందుకు వెనకాడటం లేద’’ని మరో సందర్భంగా తెగనాడారు. ప్రధాని మాటలను వల్లె వేస్తూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్సే నడిపిస్తున్నారనీ, కాంగ్రెస్ అర్బన్ నక్సల్స్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తోందనీ, విమానాల ద్వారా అర్బన్ నక్సల్స్ గుజరాత్లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అయితే ఆ ప్రయత్నంలో వారేమీ జయప్రదం కాబోరనీ అన్నారు. ప్రస్తుత పంజాబ్ నాయకత్వం అర్బన్ నక్సల్స్‌ను పోలి ఉందని కూడా అన్నారు.
ఈ విమర్శలకు స్పందిస్తూ ‘‘పొద్దున్నే లేచిన తర్వాత ఎవరో ఒకరిని నిందిస్తూ ఉంటారని’’ కేజ్రీవాల్ ప్రధానిపై విరుచుకుపడ్డారు.
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్ల తమ నిబద్ధతను నిరూపించుకోవడానికి రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకున్నాడు. ఆ పుస్తకానికి ఎర్ర అట్ట ఉండటాన్ని కూడా బిజెపి నేతలు తప్పు పట్టారు. చివరకు రాహుల్ చేతిలో ఉన్న పుస్తకం ఖాళీ కాగితాలేనని కూడా ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా రాహుల్ గాంధీ చేతిలోని ఎర్ర పుస్తకం చూస్తే అరాచకవాదులు, నక్సల్స్‌తో కుమ్మక్కవుతున్నారని చెప్పటానికి నిదర్శనం అంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ కాంగ్రెస్ నాయకుల చేతుల్లో ఉన్నది భారత రాజ్యాంగం కాదనీ, చైనా రాజ్యాంగమనీ విమర్శించారు.
రాహుల్ గాంధీ చేతుల్లో ఉన్నది 2017లో అప్పటి రాష్ట్రపతి కోవిద్ గారికి స్వయంగా ప్రధాని బహుకరించిన రాజ్యాంగ ప్రతేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే గుర్తు చేశారు. వేరే సందర్భంలో ఆ పుస్తకంలో ఉన్నది ఖాళీ కాగితాలు కావనీ, రాజ్యాంగ ప్రతి అనీ రాహుల్ గాంధీ పుస్తకం తెరిచి చూపించారు.
ఇవన్నీ ఇలా ఉంచితే, అసలు ప్రధాని, హోం మంత్రి పదేపదే నక్సల్ గురించిన సమస్యను ఎందుకు ముందుకు తెస్తున్నారన్నది అసలైన ప్రశ్న. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దుందుడుకు చర్యల గురించి పౌరహక్కుల ఉద్యమకారులు, ఇతరులు ఈ మాత్రం ప్రశ్నలు కూడా లేవనెత్తకుండా చేసేందుకు అవసరమైన కఠినతరమైన చట్టాలు రూపొందించేందుకు కావల్సిన భూమికను సిద్ధం చేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది.
ప్రజల స్పందన, వస్తున్న విమర్శలను చూసి ప్రభుత్వం ఆందోళనపడుతోంది. సుధా భరద్వాజ్, గౌతం నవల్ఖా, వరవరరావు వంటి వారికి సంబంధించిన బెయిలు కేసుల్లో వాదనలు జరిగిన సందర్భంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యల వలన కూడా ప్రభుత్వానికి పరువుపోయినంత పనైంది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వద్ద రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పౌర హక్కులను మరింత కఠినతరం చేస్తూ కొత్త చట్టం తీసుకురావటం ఒక ఆప్షన్. లేదా ఇప్పుడున్న ఊపా చట్టానికి న్యాయస్థానాల వ్యాఖ్యల నేపథ్యంలో సవరణలు చేయటం రెండో ఆప్షన్. గత సంవత్సరం పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో ఉపా చట్టంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు అన్న పదానికి ఉన్న నిర్వచనం పరిధిని మరింత విస్తరించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. మరోవైపున అర్బన్ నక్సల్స్ పట్ల తీవ్రమైన చర్యలు ఉండనున్నాయన్న వార్తలు కూడా వచ్చాయి.
పూర్వపు లోక్‌సభలో లాగా ప్రభుత్వం తాను అనుకున్నవన్నీ చట్టాలుగా మార్చే పరిస్థితి ఈ లోక్‌సభలో లేదు. మోడీ ప్రభుత్వం జమ్ము కాశ్మీర్‌కి రాజ్యాంగం కేటాయింంచి ప్రత్యేక హోదాను రద్దు చేయటం లాంటి చట్టాలను ఆమోదించే అవకాశాలు ఉన్నాయని ఈ సారి అంత తేలికేమీ కాదు. ఈ లోక్‌సభలో బిజెపికి సొంతంగా చట్టాలు ఆమోదించేంత సంఖ్యాబలం లేదు. తాను కావాలనుకున్న చట్టాలు ఆమోదించాలంటే మిత్రపక్షాల మద్దతు కావాలి. ఆ మిత్రపక్షాలు ఆయా ప్రత్యేక పరిస్థితుల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో తమకంటూ కొన్ని ఫలితాలు, ప్రయోజనాలు ఆశిస్తాయి. ప్రభుత్వం సివిల్ సర్వీసెస్‌లో దొడ్డిదారిన ప్రైవేటు రంగ నిపుణులను ప్రవేశపెట్టేందుకు చేసిన ప్రయత్నాల్ని ఆఖరి నిమిషంలో విరమించుకున్నట్లే భవిష్యత్తులో పార్లమెంట్లో అవమానాల భారాన్ని మోసే స్థితి లో లేదు. దానికి కారణం అంతో ఇంతో బలం పుంజుకున్న ప్రతిపక్షం.
2024లో మహారాష్ట్రలోని మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్ర స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ బిల్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. రాజకీయ ప్రత్యర్ధులతో పాటు సామాజిక ఉద్యమకారులపై కూడా విచక్షణారహితంగా ఉపయోగించేందుకు, తద్వారా పలు రకాల దుర్వినియోగానికి ఈ బిల్లు ఆస్కారమిస్తుందన్న ఆందోళనలు, సహేతుక విమర్శలు వచ్చాయి.
నక్సల్ ప్రభావం ఉన్న రాష్ట్రాలు ఈ సమస్యను అధిగమించటానికి తమవైన చట్టాలు, వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ బిల్లు కూడా ఆ కోవకు చెందినదే అయినప్పటికీ ఈ బిల్లులోని అనేక క్లాజులు, సెక్షన్లు చూస్తే మొత్తం రాష్ట్రాన్నే పోలీసు పహరా కిందకు తీసుకెళ్లే ప్రమాదం కనిపిస్తోందన్న ఆందోళన సహేతుకమైనదే.
అర్బన్ నక్సల్స్ అనే ఊహాజనిత కేటగిరీ గురించి ప్రధాని, హోం మంత్రి పదేపదే ప్రస్తావిస్తున్నప్పటికీ ఆ పదం ప్రభుత్వ పదకోశంలో కానీ, ఏ చట్టం పరిధిలోనైనా కానీ ఆఖరికి కేంద్ర హోం శాఖ ప్రయోగించే పదకోశంలో కూడా లేదని స్వయంగా కేంద్ర హోం శాఖ 2020లో సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాధనంలోనే ఒప్పుకున్నది. అర్బన్ నక్సల్స్, టుకడే టుకడే గ్యాంగుల గురించి కేంద్ర హోం శాఖ వద్ద సమాచారం లేదన్నది వారి సమాధానం. ఈ రెండు పదాలు కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రియమైన పదాలు.
2022 ఫిబ్రవరిలో పార్లమెంట్ కు ఇచ్చిన సమాధానంలో అప్పటి కేంద్రహోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి ‘‘ప్రభుత్వం అర్బన్ నక్సల్ అన్న పదాన్ని వాడదు, వామపక్ష అతివాదం అని మాత్రమే ఉపయోగిసుస్తంది. పట్టణ ప్రాంతాల్లో శాంతి భధ్రతల యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది. అవసరమైనప్పుడు తగు చర్యలు తీసుకుంటుంది’’ అని సమాధానమిచ్చారు.
పాలకపక్షానికి సన్నిహితంగా ఉండే ఓ సినీ దర్శకుడు, నిర్మాత ప్రతిపాదించిన ఈ పదాన్ని వెంటనే ప్రభుత్వం స్వీకరించి విరివిగా వాడటం మొదలు పెట్టింది. సర్దార్ పటేల్, అంబేద్కర్లతో సహా ఇతర జాతీయోద్యమనాయకుల వారసత్వాన్ని స్వంతం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లే అర్బన్ నక్సల్ అన్న పదంపై కూడా పేటెంట్ సంపాదించేందుకు ప్రయత్నం చేశారు ప్రభుత్వాధినేతలు.
బిజెపి వ్యతిరేకులంతా ఆ పార్టీ దృష్టిలో అర్బన్ నక్సల్సే. జాతి వ్యతిరేకత అన్న పదానికి ప్రజాదరణ తక్కువగానే ఉంటుంది. రాజకీయ ప్రత్యర్ధులు, మేధావులు, నాస్తికులు, పితృస్వామ్యాన్ని ప్రశ్నించేవారు, ఫెమినిస్టు గ్రూపులు, కార్మికసంఘాలు, మురికివాడల్లో పని చేసే సామాజిక సంస్థలు, న్యాయవాదులు, రైతు ఉద్యమకారులు, జర్నలిస్టులు ఇతర స్వఛ్చంద సంస్థలవారినందరినీ అర్బన్ నక్సల్ గ్రూపుల పరిధిలోకి తీసుకురావచ్చు. ఇది అంత విశాలమైన పదం.
నక్సల్స్‌కు పట్టణ ప్రాంతాల్లో పరిచయాలున్నాయి. కేడర్‌కు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్య అవసరాల కోసమో లేక నక్సల్స్ ఎంచుకున్న లక్ష్యాల పట్ల సానుభూతి కలిగిన మేధావులతో సంబంధాలు కొనసాగించటానికో ఈ పరిచయాలు ఉపయోగిస్తూ ఉంటారు. కబాడ్ గాంధీ అలా ఢిల్లీలో చికిత్సకోసం వచ్చినప్పుడే అరెస్టు చేశారు. విద్యార్ధులు, యువత, మేధావుల బృందాలతో నిర్మాణం సాగించాలన్నది నక్సల్ వామపక్ష శక్తుల కాంక్ష.
1960, 70 దశకాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నక్సలిజం వేళ్లూనుకుంటున్నపుడు పట్టణ ప్రాంత యువత కూడా ప్రభావితం అయ్యింది. ఆ సమయంలో కొల్కతాతో పాటు అనేక విశ్వవిద్యాలయాల్లో ఘర్షణలు జరిగాయి. విద్యార్ధులు, యువతను ఆకర్షించే విధంగా ఇంగ్లీషులోనూ, ప్రాంతీయ భాషల్లోనూ సమాంతర పత్రికలు కూడా వెలువడేవి. ‘మా ఇల్లు, మీ ఇల్లు, మావో ఇల్లూ నక్సల్బారీ’ అంటూ పాటలు పుట్టుకొచ్చాయి.
విద్యార్ధుల్లో నక్సలిజం ఆశయాల పట్ల ఆకర్షితులు కావటం ఫ్యాషన్‌గా మారింది. అప్పట్లో సైక్లోస్టైల్ పత్రాల రూపంలో సాహిత్య ప్రచారం సాగేది. ఎవ్వరూ వాళ్లని అర్బన్ నక్సల్స్ అని పిలవలేదు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాఇకి చెందిన విద్యార్దులు కన్నాట్ ప్లేస్‌లోని కాఫీ హౌస్‌లో మావో విధానాలు, ఆచరణ గురించి గంటలకొద్దీ చర్చించుకోవటం ఈ రచయిత కళ్లారా చూశాడు. ‘‘ శతృవు దాడి చేస్తే మనం వెనకడుగు వేస్తాం. శతృవు శిబిరం వేసుకుని కూర్చుంటే వాళ్లను విసిగి వేసారి పోయేలా చేస్తాం’’ అనేవి ఆ చర్చల్లో వినిపించిన కొన్ని విషయాలు. అటువంటి ఓ వ్యక్తిని కొన్నేళ్ల తర్వాత గాంధీ నగర్ సచివాలయంలో జాయింట్ సెక్రటరీగా చూశాను. మావో యుద్ధ తంత్రం గురించి చర్చించుకున్న యువతే తర్వాత సివిల్ సర్వీస్ పరీక్షలు పాసై అధికారులుగా పని చేస్తున్నారు. ఆరేళ్లల్లో పాతకాలపు గెరిల్లాలు అధ్భుతమైన పాలనా సామర్ధ్యం కలిగిన అధికారులయ్యారు. ఇటువంటి ఆశయాల పట్ల ఆకర్షణ కలిగిన వేలాది యువత ప్రస్తుతం వివిధ స్తాయిల్లో పనిమంతులైన అధికారులుగా ఉంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాధినేతలు పదే పదే అర్బన్ నక్సల్స్ అన్న పదాన్ని వాడటం అదికూడా వక్రీకరించిన అర్థం లో వాడటం, మరోవైపున ప్రశ్నించే గొంతుకలను నొక్కేయటానికి కొత్త కొత్త చట్టాలు తేవాలన్న ప్రతిపాదనలు విడి విడి గా చూస్తే దేనికదే ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ కలిపి చూస్తే రానున్న కాలంలో ప్రజాతంత్ర భారతం ఎదుర్కోబోయే గడ్డు కాలం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.
పి రామన్ సీనియర్ జర్నలిస్టు
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.