
‘ఉదారవాదులు’ ఎప్పుడూ ‘జాతీయతను వ్యతిరేకిస్తూ ఉంటారు. జాతీయత అనేది ఏకరూప భావన అని, తక్కిన దేశాల పట్ల ఎప్పుడూ శత్రుపూరిత ధోరణితో ఉంటుందని, వారితో సర్దు బాటు చేసుకోడానికి సంసిద్ధత వ్యక్తం చేయదని, వాటితో ఎప్పుడూ తగువులు పడే వైఖరినే అనుసరిస్తుందని ఉదారవాదులు భావిస్తారు. ఐతే ఈ దృక్పథం పూర్తిగా తప్పు.
యూరప్ ఖండంలో 17వ శతాబ్దంలో కుదుర్చు కున్న వెస్ట్ ఫాలియన్ శాంతి ఒప్పందాల అనంతర కాలంలో తలెత్తిన జాతీయతావాదం వేరు. మూడవ ప్రపంచ దేశాల్లో సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా తలెత్తిన జాతీయతా వాదం వేరు.
యూరోపియన్ జాతీయతా వాదం నుండి నేరుగా పుట్టినది హిట్లర్ వాదం.దానికి పూర్తి విరుద్ధమైనదిగా ఉండే జాతీయతావాదానికి ఉదాహరణ హోచిమిన్ జాతీయతా వాదం.17వ శతాబ్దపు యూరోపియన్ జాతీయతా వాదానికి, 20వ శతాబ్దంలో మూడవ ప్రపంచ దేశాలలో తలెత్తిన జాతీయతావాదానికి కనీసం మూడు విషయాల్లో తేడా ఉంది.
మొదటిది: యూరోపియన్ జాతీయతావాదం ఆ దేశంలో ఒక అంతర్గత ‘శత్రువు’ మీద ఎక్కుపెడు తుంది.ఉత్తర యూరప్‌లో కేథలిక్కులను,దక్షిణ యూరప్ లో ప్రొటెస్లెంట్లను,అన్ని దేశాల్లోనూ యూదులను శత్రువులుగా పరిగణించారు. దానికి పూర్తి భిన్నంగా మూడవ ప్రపంచ దేశాలలోని జాతీయతావాదం తమ తమ దేశ ప్రజలందరినీ ఐక్యపరిచే వైఖరితో ఉంటుంది. సామ్రాజ్యవాద శక్తుల బలం చాలా ఎక్కువ. అటువంటి శత్రువును ఎదుర్కోవాలంటే ఈ విధమైన వైఖరి తీసుకోవడం తప్పనిసరి.
రెండవది: యూరోపియన్ జాతీయతావాదం దేశాన్ని ప్రజలకన్నా గొప్పగా పరిగణిస్తుంది. ఆ దేశం కోసం ప్రజలందరూ త్యాగాలు చేయవలసిందే. అదే మూడవ ప్రపంచపు జాతీయతావాదం ఏళ్ళ తరబడి సామ్రాజ్యవాదుల అణచివేతలో నలిగిపోతున్న ప్రజలందరికీ సేవ చేయడం కోసమే దేశం అన్న వైఖరితో ఉంటుంది.
మూడవది: యూరోపియన్ జాతీయతావాదం మొదటి నుంచీ సామ్రాజ్యవాద స్వభావంతో ఉంది. వెస్ట్ ఫాలియన్ శాంతి ఒప్పందం జరిగిన కొద్ది మాసాలకే ఆలివర్ క్రాంవెల్ ఐర్లండ్‌ను ఆక్రమించాడు. యూరపియన్ దేశాలు అన్నీ తర్వాత కాలంలో అనుసరించిన ఇదే వైఖరికి శ్రీకారం చుట్టాడు. జాతీయతా భావాన్ని ప్రేరేపించి ఆ ప్రాతిపదికన తక్కిన దేశాలను ఆక్రమించు కోవడం ఇక్కడ కనిపిస్తుంది. అదే మూడవ ప్రపంచ దేశాల జాతీయతావాదాన్ని చూస్తే అది కూడా ఒకానొక భౌగోళిక పరిధిలోనే వ్యవహరించినప్పటికీ, తక్కిన మూడవ ప్రపంచ దేశాలతో సౌహార్ద్ర సంబంధాలను పెంపొందించుకోడానికి ప్రయత్నించింది. ఆ దేశాలన్నీ సామ్రాజ్యవాద పెత్తనాన్ని ఎదిరించే పోరా టంలో నిమగమై వుండడమే ఇందుకు కారణం.
ఇక అమూర్తమైన ఆదర్శ భావనగా ‘జాతి’ (లేదా దేశం) అనే దానిని ముందుకు తెచ్చి దానికి దైవత్వాన్ని ఆపాదించి అది ప్రజలకన్నా గొప్పదని చిత్రించడం యూరోపియన్ జాతీయతా వాదపు లక్షణం. దానిని మూడవ ప్రపంచ దేశాల జాతీయతా భావం పూర్తిగా భిన్నం. ఇక్కడ జాతీయత అనేది అమూర్తమైనదేమీ కాదు. అది ప్రజల కోసం రూపొందిన భావం (దీనినే మార్క్స్ గనుక వర్ణించదలచినట్టైతే అది ప్రజల పక్షాన నిలిచే భావం అని చెప్పి వుండేవాడు). జాతీయత ప్రధాన లక్ష్యం ఇక్కడ ప్రజల జీవితాలను మెరుగు పరచడమే.
వలస పాలన నుండి విముక్తి పొందిన దేశాలు వాటి నిర్వహణలో ఎన్ని లోపాలు తలెత్తినప్పటికీ, సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం కలిగిన జాతీయతా భావం పట్ల తమ నిబద్ధతను కొనసాగించాయి. ఉదాహరణకు, భారత రాజ్యాంగపు మౌలిక లక్షణాలన్నీ ఆ ప్రాతిపదిక మీదనే రూపొందాయి. రాజ్యాంగ పీఠిక దానికి అద్దం పట్టింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిజం వంటివి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అంతర్భాగంగా ఉండి ఆ భావనలన్నీ రాజ్యాంగంలో చోటు చేసుకున్నాయి. అదే విధంగా ప్రైవేటు రంగాన్ని లైసెన్సింగ్ విధానం ద్వారా ప్రభుత్వం అదుపులో ఉంచే ఒక మిశ్రమ ఆర్థిక విధానానికి, సమానత్వం సాధించాలనే లక్ష్యానికి కట్టుబడి పని చేయడం అందులో భాగమే. ఇవేవీ సోషలిస్టు వ్యవస్థ స్థాపన వైపు దేశాన్ని నడిపించేవి కావు. కాని సోషలిజం అనే నినాదాన్ని స్వీకరించడం నుంచి వచ్చినవి. అంటే భారతదేశం ఆనాడు అనుసరించిన ”ప్రభుత్వ నియంత్రణతో నడిచే ఆర్థిక వ్యవస్థ” అనేది సోషలిజాన్ని నిర్మిస్తాం అనే ప్రకటిత లక్ష్యం నుండి రూపొందినటు వంటిది. ఇది సామ్రాజ్య వాద వ్యతిరేక స్వభావంతో కూడిన జాతీయతతో ముడిపడి వుంది.
అయితే నయా ఉదారవాద వ్యవస్థను ప్రవేశ పెట్టడంతో మన దేశంలో మార్పు వచ్చింది. ప్రభుత్వం అంటే జాతీయతాభావం చెప్పిన దానికి ఇది భిన్నం. ”జాతి” ప్రయోజనాల కోసమే నయా ఉదారవాద విధానాలను ప్రవేశ పెట్టినట్టు చెప్పి సమర్ధించుకున్నారు. ఆ విధానాలను అమలు చేసినప్పుడే మన దేశ జీడీపీ వేగంగా వృద్ధి చెందుతుందని, దాని ప్రయోజనాలు పైనుంచి కింద ఉండే సామాన్యుల వరకూ క్రమంగా ప్రసరి స్తాయని, (ట్రికిల్ డౌన్) అంతేగాక భారత దేశాన్ని ఒక ప్రధాన అగ్ర రాజ్యంగా చేస్తాయని చెప్పారు.
నయా ఉదారవాద విధానాలు ఆర్థిక అసమానతలను పెంచుతాయనే వాస్తవాన్ని నయా ఉదారవాద సమర్ధకులు ఏనాడూ నిరాకరించలేదు. తమ విధానాలు ఆర్థిక అసమానతలను తగ్గించినట్టు వారు ఎక్కడా చెప్పుకోలేదు. జాతీయోద్యమం ఆశించిన లక్ష్యాలను సాధించడానికి నయా ఉదారవాద విధానాలు మరింత మెరుగ్గా తోడ్పడతాయని వారు చెప్పలేదు.దానికి బదులు ఈ విధానాలు భారత దేశాన్ని ఒక అగ్రరాజ్యంగా మారుస్తాయని వారు చెప్పారు. అంటే ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక దేశంగా, ప్రజల మధ్య సమానత్వం సాధించే దిశగా వ్యవహరించే బదులు,ఆ సామ్రాజ్యవాద దేశాలతో పోటీపడి ఒక అగ్ర రాజ్యంగా తయారవ్వాలనే అవగాహనను ముందుకు తెచ్చారు.
ఈ అవగాహనలో అంతర్లీనంగా ”జాతీయత” అంటే ప్రజల పక్షాన నిలిచేది అనే భావన లేకుండా పోయింది.ప్రజల జీవితాలను అన్ని విధాలా మెరుగుపరచడం కోసం పాటుపడేది అన్న లక్ష్యమే లేకుండా పోయింది. దానికి బదులు ఒక అస్పష్టమైన, అమూర్తమైన, ప్రజలకు అతీతమైన జాతీయత అనే భావన చోటు చేసుకుంది. అటువంటి జాతీయత కోసం ప్రజలందరూ త్యాగాలు చేయాల్సిందే నన్న భావన ముందుకొచ్చింది. అంటే ”ప్రజల కోసం దేశం” అనే భావన స్థానంలో ”దేశం కోసం ప్రజలు” అనే భావన వచ్చింది. యూరప్ ఖండంలో జాతీయత అంటే ఉన్న భావనను ఇది గుర్తు చేస్తోంది. ఐతే ఇది అచ్చంగా యూరోపియన్ భావన వంటిదే అని అనుకోలేం.
ఈ నయా ఉదారవాదవ్యవస్థ అనేది స్వాతంత్య్రా నంతరం నెలకొల్పిన ”ప్రభుత్వ నియంత్రణలో నడిచే ఆర్థిక వ్యవస్థ”కు ఉన్న లక్ష్యాలను మరింత మెరుగుగా,వేగంగా సాధించడం కోసం ఏర్పడినది కాదు.ఇది ప్రభుత్వం అనేది ఎవరివైపు ఉండాలి అన్న కీలకమైన విషయాన్నే మార్చివేసింది.ఒక విధంగా చెప్పాలంటే ”సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయత” అన్న భావన స్థానంలో ”జీడీపీ- జాతీయత” అన్నది వచ్చింది. ఆ విధంగా దేశం, జాతీయత వంటి భావనల అర్ధమే మారిపోయింది. ఈ ”జీడీపీ జాతీయత” అనేది యూరోపియన్ జాతీయత మాదిరిగా ఇతర దేశాలమీద పెత్తనం చేయాలనే సామ్రాజ్యవాద స్వభావం కలిగినటువంటిది కాదు. ఇది మన దేశాన్ని తక్కిన దేశాలతో పోటీలో ఉన్నట్టు పరిగణించే జాతీయత. అలాగే ఈ ”జీడీపీ జాతీయత” అనే భావనలో కొందరు దేశ ప్రజల్ని పరాయివారిగానో, శత్రువులుగానో పరిగణించే కోణం కూడా లేదు. లౌకిక భావనను నిరాకరించే కోణం కూడా లేదు. కాని ”జీడీపీ జాతీయత” దేశం గురించి జొప్పించిన అమూర్తమైన భావన వలన ఫాసిస్టు జాతీయతా భావాలను జొప్పిండానికి దారి ఏర్పడింది.
సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించు కోవాలనే లక్ష్యం ఉంటే అప్పుడు దానిలో భాగంగా అందరికీ సమానమైన పౌరసత్వ హక్కులను కల్పించాలనే లక్ష్యం కూడా ఉంటుంది. సంపద పంపిణీలో అందరికీ న్యాయం జరగాలనే లక్ష్యం కూడా ఉంటుంది. అదే ”జీడీపీ జాతీయత” అనే భావనలో చూస్తే సమానత్వం సాధన అన్న లక్ష్యమే లేకుండా పోయింది. దానికి బదులు అస్పష్టమైన ”అగ్రరాజ్య స్థాయిని చేరుకోవడం” వంటి లక్ష్యం వచ్చింది.
ఈ నయా ఉదారవాద వ్యవస్థ మొత్తంగానే ఇప్పుడు ఒక ఆర్థిక సంక్షోభంలోకి కూరుకు పోతోంది. అందుచేత సంపద వృద్ధి ప్రయోజనాలు అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు క్రమంగా ప్రవహిస్తాయి అన్న ఆశ కూడా అంతరించింది. సంపదలో పెరుగుతున్న అసమానతలు, పేదరికం అంతకంతకూ ఎక్కువమంది ప్రజానీకాన్ని ఆవరించు కుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో అగ్ర రాజ్యస్థాయిని సాధించడం వంటి లక్ష్యాలు ఆ ప్రజానీకాన్ని సంతృప్తి పరచలేవు.
ఈ దశలోనే దేశంలోని బడా పెట్టుబడి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో మమేకం అయి నయా ఉదారవాద వ్యవస్థను నిలబెట్ట డానికి ఫాసిస్టు శక్తులతో కూడబలుక్కుని వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ”హిందూ రాజ్యం” అన్న భావన ముందుకొచ్చింది. ఇది రాజ్యం యొక్క ఫాసిస్టు స్వభావాన్ని కప్పిపుచ్చడం కోసం రూపొందించిన నినాదం మాత్రమే.
ఈ హిందూ రాజ్యం అనే అస్పష్ట భావన ఇంతవరకూ ఉన్న ”జీడీపీ జాతీయత”కు ప్రత్యామ్నాయంగా వచ్చినది కాదు.దానికి తోడుగా అదనంగా వచ్చి చేరినటువంటిది. ఇప్పుడు హిందూ రాజ్యం అనే ఫాసిస్టు జాతీయతావాదం నయా ఉదారవాద వ్యవస్థను బలపరిచే సైద్ధాంతిక ముసుగుగా పని చేస్తోంది.
మన దేశంలో మొదట నయా ఉదారవాద విధానాలను ప్రవేశ పెట్టిన రాజకీయ శక్తులు లౌకిక విధానానికి వ్యతిరేకం కాదు.భారత దేశాన్ని ఒక అగ్ర రాజ్యంగా నిలబెట్టడానికి జీడీపీ వృద్ధి రేటును వేగవంతం చేయడమే మార్గం అనే వాదనతో ఆ శక్తులు కొత్త వ్యవస్థను (నయా ఉదారవాద వ్యవస్థను) బలపరిచాయి. (అవినీతి అనేది భారత దేశాన్ని ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టడానికి ఆటంకంగా తయారౌతోంది కనుక దానిని తొలగించాలని ఒక కాంగ్రెస్ నాయకుడు ఒక సందర్భంలో అన్నాడు. అలా ఆటంకంగా ఉండనట్టైతే అతడికి అవినీతి పట్ల వ్యతిరేకత ఉండేది కాదన్నమాట) ఇప్పుడు ఆ విధానాల అమలుకు ముందు దారి మూసుకుపోయింది.
ఇక్కడ ప్రజలందరి ప్రయోజనాలనూ నెరవేర్చ గల,సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం కల జాతీయత అనేదానికి చోటే లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి బడా పెట్టుబడిదారీ వర్గాన్ని ఫాసిస్టు శక్తులతో జత కట్టడానికి మాత్రమే కాక ఆ ఫాసిస్టు శక్తులు తమ ఫాసిస్టు ”జాతీయత”తో అధికారాన్ని సైతం చేపట్టే స్థాయికి సైతం దోహదం చేసింది.
ఆ విధంగా నయా ఉదారవాద వ్యవస్థను ప్రవేశ పెట్టడానికి సైద్ధాంతిక ప్రాతిపదికగా పని చేసిన ”జీడీపీ జాతీయత” సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయతను దెబ్బ తీసి ఫాసిస్టు ”జాతీయత” పైచేయి సాధించడానికి కావలసిన రంగాన్ని సిద్ధం చేసింది.
అందుచేత ఫాసిస్టు శక్తుల ఆధిపత్యాన్ని అధిగమించాలంటే కేవలం నయా ఉదారవాద వ్యవస్థను అధిగమిస్తే చాలదు. సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయతా భావాలను కూడా పునరుద్ధరించాల్సి వుంటుంది. లేకపోతే ఈ ఫాసిస్టు శక్తులు అధికారం కోల్పోయినా, మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అదే మాదిరిగా మళ్ళీ వచ్చాడు.
ఈ విషయాన్ని ఇప్పుడు నొక్కి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్‌ను చాలా మంచి మనసు, హృదయం ఉన్న వ్యక్తిగా, అసలు సిసలైన లౌకికవాదిగా స్మరించు కుంటున్నారు. కాని ఈ దేశంలో నయా ఉదారవాద విధానాలను ప్రవేశ పెట్టడంలో ముఖ్య భూమిక పోషించినది అతడే.
డా.మన్మోహన్ సింగ్ వ్యక్తిగత విశిష్ట స్వభావాన్ని అడ్డం పెట్టుకుని నయా ఉదారవాద వ్యవస్థను సమర్ధించడానికి పలువురు ఇప్పుడు తయారయ్యారు. ఫాసిస్టు శక్తులు బలపడడానికి, నయా ఉదారవాద విధానాలకు గల సంబంధాన్ని చాలా మంది అర్ధం చేసుకోవడం లేదు కనుక వీరి ప్రయత్నం కొంతవరకూ విజయం సాధించవచ్చు కూడా.
ఫాసిస్టు శక్తులు బలపడడానికి కేవలం రాజకీయ కారణాలు మాత్రమే పరిగణన లోకి తీసుకుంటూ దాని వెనుక ఉన్న ఆర్థిక కారణాలను విస్మరిస్తే ఇదే జరుగుతుంది.ఈ పొరపాటు అవగాహనను సరి చేసుకోకపోతే అది అంతిమంగా ఫాసిస్టు శక్తులు మరింత బలపడడానికే తోడ్పడుతుంది.
✍️ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)
ఈ వ్యాసం తొలుత నవతెలంగాణ లో ప్రచురితం అయ్యింది
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.