ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులపై సరసమైన ధరలు పొందుతున్నట్లే రైతులు కూడా తమ ఉత్పత్తులకు సరసమైన ధర పొందే హక్కుంది. దానికి కొలమానమే కనీస మద్దతు ధర. అయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించినంత మాత్రాన అది ఆచరణ సాధ్యం కాదు. సరిపోయేది కూడా కాదు.
పంజాబ్‌లో రైతులు తమ ఆందోళనను పునరుద్ధరించిన నేపథ్యంలో కనీస మద్దతు ధర చట్టం గురించిన డిమాండ్ మళ్లీ ముందుకొచ్చింది.
జీవనోపాధి భద్రత, ఆదాయభద్రత గ్యారంటీ చేసేలా ఇతర దేశాల రైతాంగానికి ఇస్తున్నట్లుగానే భారతదేశంలో వ్యవసాయానికి కూడా ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తోంది. ప్రత్యేకించి సాగు సమయంలో వచ్చే ఇక్కట్లు, దిగుబడి మార్కెట్‌కు చేరే మధ్యలో వచ్చే ఇబ్బందుల నేపథ్యంలో ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతాంగానికి కొన్ని రక్షణలున్నాయి. కనీసమద్దతు ధరతో పాటు వ్యవసాయోత్పత్తుల సేకరణ వ్యవస్థ రైతాంగానికి ఉన్న అటువంటి రక్షణ కవచాల్లో ఒకటి.
ఈ పద్ధతి గత ఆరు దశాబ్దాలుగా ఉనికిలో ఉంది. ప్రభుత్వ సంస్థల ద్వారా వ్యవసాయోత్పత్తుల సేకరణ జరగక్కుండా కేవలం మద్దతు ధర ఉన్నంతమాత్రాన ఉపయోగం లేదు.
దేశంలో ప్రధానంగా 23 రకాల పంటలు పండుతున్నాయి. కానీ వీటిలో వడ్లు, గోధుమలు, ఒకమేరకు పత్తి మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోంది. చక్కెర మిల్లులు కనీస మద్దతు ధరకే చెరకు పంటను కొనుగోలు చేస్తున్నాయి.
దాంతో నూనె గింజలు, తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు ఇతర పంటలు పండిరచేవారు కూడా ఆ పంటల సాగు వదిలేసి ప్రభుత్వం సేకరించే ధాన్యం, గోధుమ వంటి పంటలు సాగు చేయటం మొదలు పెట్టారు. ఈ పరిస్థితి రెండు పరిణామాలకు దారితీసింది. మొదటిది భూగర్భ, జలవనరులు కరిగిపోవడం, కాలుష్యం ఒకటైతే, ఆహారభద్రతకు కావల్సిన సమతౌల్యమైన రీతిలో పంటలు పండిరచలేకపోవడం రెండో పరిణామం.
ఈ పరిస్థితుల్లో మన్నికైన వ్యవసాయానికి వీలుగా అన్ని పంటలకూ కనీస మద్దతు ధరతో పాటు ప్రస్తుతం వ్యవసాయంలో ఉన్న అసమానతలను సవరించటం అవసరం.
కనీస మద్దతు ధర చట్టం ` సవాళ్లు
ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులపై సరసమైన ధరలు పొందుతున్నట్లే రైతులు కూడా తమ ఉత్పత్తులకు సరసమైన ధర పొందే హక్కుంది. దానికి కొలమానమే కనీస మద్దతు ధర. అయితే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించినంత మాత్రాన అది ఆచరణ సాధ్యం కాదు. సరిపోయేది కూడా కాదు.
ఒకవేళ అటువంటి చట్టాన్ని ఆమోదించినా నిర్దేశిత కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయని వ్యాపారులను శిక్షించేందుకు అవకాశం ఉంటుందే తప్ప రైతుకు పెద్దగా ఉపశమనం కలుగుతుందన్న గ్యారంటీ ఏమి లేదు. కానీ అటువంటి చర్యల పర్యవసానాలు మరింత సంక్లిష్టంగా ఉంటాయి. ఇటువంటి శిక్షలకు భయపడి మార్కెట్లో ధరలు కనీస మద్దతు ధరకన్నా తగ్గిపోయినప్పుడు రెగ్యులేటెడ్ మార్కెట్లల్లో రైతుల నుండి కొనుగోళ్లకు కూడా సిద్ధపడని పరిస్థితులు తెలెత్తే అవకాశం ఉంటుంది.
అటువంటి పరిస్థితుల్లో దేశంలోని 80 శాతం చిన్న సన్నకారు రైతాంగం, ఎక్కువకాలం, ఎక్కువ మొత్తం పంటలు నిల్వ పెట్టుకునే అవకాశం లేని రైతాంగం తమ దిగుబడులు నియంత్రణలేని మార్కెట్లలో మరీ తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితికి నెట్టబడతారు.
పైగా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారస్తులను చట్టం ద్వారా శిక్షించేంత వరకూ కేసులు నడిపే శక్తి సామర్ధ్యాలు, ఓపికలు, సమయం చిన్న రైతాంగానికి లేవు. ఆ పరిస్థితుల్లో రైతాంగం బ్లాక్‌మార్కెట్‌ను ఆశ్రయించటం తప్ప వేరే గత్యంతరం లేని స్థితికి నెట్టబడతారు. అక్కడ చట్టాలు,శిక్షలూ ఏమీ అమలుకావు.
ఇక్కడ మరో విషయాన్ని కూడా పాఠకుల దృష్టికి తీసుకురావాలి. రైతులకు మార్కెట్ వసతులు అందుబాటులోకి తీసుకురావాలంటే సగటున 80 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఒక్కో మార్కెట్ యార్డు ఉండాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన రైతాంగ సమస్యలపై జాతీయ కమిషన్ సిఫార్సు చేసింది. కానీ భారతదేశంలో సగటున 450 కిలోమీటర్లకు ఓ మార్కెట్ యార్డు మాత్రమే ఉంది. దూరప్రాంతాలకు దిగుబడులు చేరవేసేందుకు అయ్యే ఖర్చులు భరించలేక చిన్న రైతులు కల్లం మీదనే అమ్ముకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి కొనుగోళ్లు ప్రభుత్వం లెక్కల్లోకే రావు.
కనీస మద్దతు ధర చట్టం వలన సరసమైన ధరలు వస్తాయన్న ఆశ ఉండొచ్చు కానీ రైతుకు ఆదాయం పెరుగుతుందన్న గ్యారంటీ లేదు. ఉదాహరణకు పంజాబ్, హర్యానాల్లో రైతులు పండిరచే ధాన్యం, గోధుమల్లో 60 నుండి 80 శాతం కనీస మద్దతుధరకు అమ్ముకుంటున్నా రైతాంగం ఆదాయాలు పడిపోయాయని జాతీయ నమూనా సర్వే సంస్థ రైతాంగం స్థితిగతులపై 2013, 2019లలో నిర్వహించిన సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ధాన్యం పండిరచే రైతులు 2013లో హెక్టారు సేద్యానికి సగటున రు.16349 ఉంటే 2019 నాటికి 12597కి పడిపోయింది. గోధుమలు పండిరచే రైతు 2013లో సగటున హెక్టారుకు 10916 రూపాయలు సంపాదిస్తే 2019 నాటికి 9092 రూపాయలకు పడిపోయింది.
ప్రత్యామ్నాయం ఏమిటి?
పోటీవాతావరణంతో కూడిన మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయక విధానపు మౌలిక లక్ష్యం రైతాంగానికి సరసమైన ధరలకు దిగబడులు అమ్ముకునే అవకాశం కల్పించటం. కానీ ఆరు దశాబ్దాల అనుభవంలో కనీస మద్దతుధర విధానం కొన్ని పంటలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఫలితంగా సాగు భారంగా మారటమే కాక విపరీతమైన కాలుష్యానికీ, సహజవనరులు కరిగిపోవడానికీ కారణమైంది.
ఈ అనుభవాల నేపథ్యంలో రైతుల బేరసారాలాడే శక్తిని పెంచుతూ అన్ని పంటలనూ సరసమైన ధరలకు, రైతు ఆదాయం పెంచే విధంగా అమ్ముకునే అవకాశాలు కల్పించే విధంగా వ్యవసాయక విధానాన్ని పున:సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వ్యూహాలు, విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
మధ్యంతర వ్యూహంగా వ్యవసాయోత్పత్తులను వినిమయ వస్తువులుగా మార్చటానికి కావల్సిన వసతులు, సదుపాయాలు, విలువ ఆధారిత సరఫరాలు మెరుగుపర్చటానికి కావల్సిన చర్యలు చేపట్టాలి.
స్వల్పకాలిక వ్యూహంలో భాగంగా రైతులకు కనీస ఆదాయాన్ని గ్యారంటీ చేయటానికి నిర్దేశిత మోతాదులో ఆహార ధాన్యాల సేకరణతో పాటు, రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ, మార్కెట్ ధరకు, కనీస మద్దతు ధరకు మధ్య తేడా ఉన్నప్పుడు వ్యత్యాసపు విలువను రైతుకు జమచేయటం వంటి చర్యలు చేపట్టవచ్చు.
విద్యుత్, రసాయనిక ఎరువులకు ఇస్తున్న రాయితీల స్థానంలో వ్యవసాయక సీజన్ ఆరంభంలోనే సేద్యానికి అవసరమైన నగదు సహకారాన్ని అందించాలి. ఇప్పుడు అందిస్తున్న నగదు మొత్తాన్ని పెంచాలి. ఈ విధానం ద్వారా భూగర్భవనరుల వినియోగాన్ని పొదుపు చేయవచ్చు. కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. తద్వారా మన్నికైన సేద్యానికి మార్గం సుమమం చేయవచ్చు.
పంటల వైవిధ్యాన్ని కూడా ప్రోత్సహించాలి. వనరులు ఖర్చు చేసే ధాన్యం, గోధుమల స్థానంలో సమగ్ర ఆహార భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఉండే పంటల సాగును ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఇస్తున్న రుణాలు, రాయితీలు, ప్రస్తుత తరహాపంటల వలన కరిగిపోతున్న సహజవనరులు, పెరిగిపోతున్న కాలుష్యం, దాని దుష్ప్రభవాలు అన్నీ లెక్కిస్తే ధాన్యం పండిరచే రైతుకు సగటున హెక్టారుకు వచ్చే ఆదాయం కేవలం 8762 కాగా గోధుమ పండిరచే రైతు ఆదాయం 13536 రూపాయలు మాత్రమేనని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మరియు క్రిడా సంస్థల అధ్యయనం వెల్లడిస్తోంది.
రైతులకు అందాల్సిన గిట్టుబాటు ధర మరింతగా సద్వినియోగం కావాలంటే కొన్ని గ్రామాలను ఓ క్లస్టర్ గా ఏర్పరిచి సమగ్రస్థాయిలో మార్కెట్ వసతులు, గిడ్డంగి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
రైతులను నేరుగా మార్కెట్‌తో అనుసంధానించటం ద్వారా రెండు ప్రయోజనాలు సాధించవచ్చు. దళారుల బెడద తగ్గించటం ద్వారా రైతుకు అదనపు ఆదాయాన్ని సమకూర్చవచ్చు. మెరుగైన గ్రేడిరగ్ విధానం ద్వారా సరుకు ప్రమాణాలు, నాణ్యత పెంచవచ్చు. వినియోగదారులకు కూడా తాజా సరుకులు సరఫరా చేయవచ్చు. మారుతున్న వినియోగదారుల అభిరుచులు నిరంతరం తెలుసుకోవడం ద్వారా రైతులు తగిన విధంగా సాగు పద్ధతులు, ఉత్పత్తుల ప్రమాణాలు మెరుగుపర్చుకోవచ్చు. మార్కెట్‌కు అవసరమైన సరుకులు సరఫరా చేయటం ద్వారా రైతులు మెరుగైన ఆదాయాన్ని కూడా సంపాదించవచ్చు.
గిడ్డంగుల సామర్ధ్యం పెంచటంతో పాటు రైతులు గిడ్డంగుల్లో నిల్వ ఉంచిన సరుకులకు ఇచ్చే రశీదుల ఆధారంగా పరపతి సౌకర్యాలు విస్తరించటం ద్వారా సాగుకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చుకునేందుకు మార్గం సుగమమం చేయవచ్చు. 2024`25 నాటికి దేశంలో కనీసం 436 మిలియన్ టన్నుల వ్యవసాయోత్పత్తులు నిల్వచేసే గిడ్డంగులు అవసరం ఉండగా ఇప్పటికి కేవలం 201 మిలియన్ టన్నులు మాత్రమే నిల్వ చేయగల గిడ్డంగులు ఉన్నాయి.
గిడ్డంగుల అభివృద్ధి, నియంత్రణ సంస్థ వెల్లడిరచిన వివరాల మేరకు దేశంలో క్రియాశీలకంగా ఉన్న గిడ్డంగులు కేవలం 5364. వాటిలో నిల్వ సామర్ధ్యం 41 మిలియన్ టన్నులు మాత్రమే.
గిడ్డంగి రశీదులను హామీ పత్రాలుగా పరిగణించేందుకు 2010లో కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభించినా ఏడాదికి 10 లక్షల కంటే మించి రైతులకు ప్రయోజనం కలగలేదు. ఈ రశీదుల ఆధారంగా పరపతి పొందే అవకాశాలున్నందుఉన ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
సంప్రదింపుల ద్వారానే మెరుగైన విధనాలు
ప్రభుత్వం, రైతుల మధ్య నిరంతరం చర్చలు సంప్రదింపులు ద్వారా వ్యవసాయ విస్తరణ సేవలను మెరుగుపర్చుకోవాలి.
ప్రస్తుతం ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు మండల స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా సేద్యానికి సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేర్చడానికి కీలకమైన సాధనాలుగా ఉన్నాయి.
వ్యవసాయానికి హానికారకమైన, భూసారాన్ని తగ్గించే రీతిలో అమలు జరుగుతున్న పథకాల వలన రైతులకు స్థూలంగా వ్యవసాయానికి వచ్చే నష్టం గురించి అవగాహన కల్పించాలి. కృషి విజ్ఞాన కేంద్రాలు కేవలం రైతులకు కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటమే కాక వ్యవసాయక విధానాల రూపకల్పనలో రైతులకు భాగస్వామ్యం కల్పించే కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.
ఈ పద్ధతుల ద్వారా రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందించటంతో పాటు సాగును మన్నికైనదిగా మార్చటానికి అవకాశాలున్నాయి.
అమరేందర్ రెడ్డి
తులసి లింగారెడ్డి
అనువాదం : కొండూరి వీరయ్య