
హ్మ్…..
ఆ మూలుగేంటశేరా!
మామూలుగా ఎవరితోనైనా చాటింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఇంగ్లీషులో అలా పెడుతుంటారు, దానర్థం ఏంటో నాక్కూడా తెలీదు?
అంటే ఈ పుస్తకం గురించి కూడా నీ అభిప్రాయం అదేనా!
హ్మ్… అలా అని కాదు కానీ ఇక్కడొచ్చిన చిక్కు ఏంటంటే, మన సమాజంలో అదీ ప్రత్యేకించి మన మనువాద భారతీయ సమాజంలో “పదుగురు ఆడు మాట పాడియై ధర చెల్లు” అనే నేలపై ఆ పదిమందీ ఏదైతే పాటించరో అదంతా అసహజత్వం కిందికే చేర్చబడుతుంది?
అంటే నీ దృష్టిలో ఈ పుస్తకం అసహజత్వమా!
అలా అని నేను చెప్పలేదే, ఆ పదిమందిలోనే కాదు “అందరితో పాటూ ఆదినారాయణా” అన్న నానుడిలో కూడా నేను లేను కదా. ఏదైతే ఈ సమాజం తాము సహజత్వంలో జీవిస్తున్నామని భావిస్తుందో ఇక మిగతాదంతా వారికి అసహజత్వం కిందికే జమ చేయబడుతుంది కదా.
నీకు ఈ సహజాతాలూ అసహజత్వాల గురించి కాస్తంత అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ నవలలో మోహనస్వామి సైకిల్ నేర్చుకోవడానికి హంపీ శిథిళాల వీధుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడో ఇద్దరు విదేశీ యువకులు ఆ శిథిళ భవనాల చాటుమాటున ఒకరితో ఒకరు సంగమించి సమాగమిస్తున్న అక్షరాలను అదసలు పెద్ద విషయమే కాదన్నట్లుగా పట్టించు కోకుండా ముందు పుటలకు వెళ్ళిపోయే మనం? అదే ఈ నవలలో ప్రథమార్థంలో మోహనస్వామి కార్తీక్‌ల ప్రణయాన్ని జీర్ణించుకోలేక రామేశ్వరం కాకులు కథల సంపుటిలో అతని శీతువు కథలో మోకాళ్ళ నొప్పులతో నీలం సీసాను అందుకోలేని నిస్సహాయుల్లా నిలిచిపోతాం కాదంటారా!
ఉదా నా గురించే చెప్పాలంటే, ఇంట్లో రామయ్య వీధిలో క్రిష్ణయ్యాలాంటి తండ్రనే మా అమ్మ దెప్పి పొడుపులకు మా నాన్న నవ్వే ముసి ముసి నగవులు చూస్తూ, మా అన్నోల్లు వీధుల్లో పడి బీట్లు కొడుతుంటే నా ఫ్రెండ్స్ వాల్ల గురించి ఫలానా అమ్మాయిలతో మీ అన్నోళ్ళు ఫలానా టైంలో ఫలానా చోట ఊ ఊ సర్లేఫ్ఫో అనే మాటలు నాలో ఉత్సుకత పెంచుతుంటే.
నైన్త్ క్లాసుకే నాకోసం ఆడ పిల్లలు ఏదో ఒక మాట కల్పించుకొని మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంటే చూసిన నా ఫ్రెండ్స్, ఊ ఊ తెలుస్తాందిలేప్పో అన్నప్పుడు నాలో లోలోపల ఏదో తెలీని పొడుచుకొస్తున్న మగతనం సంతృప్తి పడుతుంటే, పైకి మాత్రం సామాజిక భయంతో ముడుచుకుపోతుంటే, టెంత్ క్లాసులో ఫాఠ్య పుస్తకాల్లో తెలుగు లెసన్‌లో అయ్యోరు కావ్య నాయకి తొడలు అరటి బోదెలంటూ, వక్షస్థలం ఏనుగు కుంభ స్థలమంటూ, ఆమె జఘనం ఇసుక తిన్నెలంటూ అంగాంగ వర్ణనలు చేస్తుంటే నాలో అంతకంతకూ మహోత్సుత పెరుగుతుంటే.
ఇంటర్ తప్పి జీవిక కోసం వీధి వీధి తిరుగుతున్నప్పుడు వీధీకో అమ్మాయి కవ్విస్తుంటే ఫ్రెండ్స్ చూసి, వాల్లు నన్ను కలవక పోయినా నేను వాల్లను కలవక పోయినా ఒకవేళ కలిసినా ఆనాటి కాలానికి చూపులకు చిట్టి పొట్టి మాటలకు లవ్ లెటర్లకు మాత్రమే పరిమితమైపోయిన ఆ టీనేజ్ ఆకర్షణలకు ఊ ఊ సర్లేప్పో కానీ కానీ అనే వాల్ల మాటలు నన్నో రెమోలాగా ఉద్రేకపరుస్తుంటే.
సంగీతవాణీలో పడ్డాకా పరిచయమైన సాహిత్యంలో మీరాబాయ్ భజనల్లో విగ్రహారాధనల్లో స్త్రీ తన సహజ సిద్ధమైన పురుష సాంగత్యాన్ని నిరాకరించడం, అదే సాహిత్యంలో వీల్లు జీవాత్మా పరమాత్మా సంయోగ వియోగమని ఎంత బొంకినా, పీన పయోధర మర్ధన అంటూ సాగే వేల మంది గోపికల నడుమ రాధా కృష్ణుల మద్యన సాగే శృంగార నైషదం తాలూకూ ఉత్ప్రేరకం రెచ్చగొడుతుంటే.
ఇక వాత్సాయన కామ సూత్రాల్లో కేవలం పురుషుడు అనేకమంది స్త్రీలతో సుఖించడానికి రాసిన వైనాల్లో చిత్తిని పద్మిని శంఖిని అంటూ సాగే స్త్రీల వర్గీకరణలు మెదడులో ప్రభావం రేపుతుంటే చూసిన ప్రతి అమ్మాయిలో {అప్పట్లోలే స్వాముల్లాలా} అంగాంగాలు పట్టి పట్టి పరిశీలిస్తూ నిశిత చూపులతో ఏ జాతో తెలుసుకొని కళ్ళతోనే కామించి రాత్రిళ్ళు కలలోనే భావప్రాప్తి పొందే నాలాంటి సగటు బతుకుల్లో, రంగనాథ రామచంద్ర రావు తెనుగీకరించిన వసుధేంద్ర మూలం “మోహనస్వామి” నవల అసహజత్వం కిందికి వస్తుందా రాదా నువ్వే చెప్పు?
ఇంకా ఐపోలేదు నన్ను మరికొంత చెప్పనివ్వు, పోనీ ఈ నవలలో రెండో భాగంలో ఆ మోహనస్వామి సహజంగా తనలో ప్రకృతి ఏర్పరచిన జీన్స్ ప్రభావం వల్ల తాను ఎలా తయారయ్యాడనేది విశదీకరించిన భాగాన్ని మొదటి భాగంగా పెట్టకుండా, డైరక్టుగా నేనింతే నేనిదే నన్ను నాలా స్వీకరించగలిగితే స్వీకరించండి లేదా ఇక ఇంతటితో ఆపేయండి అన్నట్లు మొదలెట్టిన కార్తికోపాఖ్యాణం అందులో మోహనస్వామి తన మనో వేదన చెప్పుకుంటుంటే పాఠకుడిగా నేను అతని చేతుల్లో కృష్ణుడి బొమ్మలా కొయ్యబారిపోయాను…
ప్చ్ నా 55 యేండ్ల జీవితంలో రకరకాల మనుషుల చిత్త ప్రవృత్తులు వారి వారి శారీరక అనుభవాలు అనుభోగాలు విన్నాను చూసాను దగ్గరగా గమనించాను కానీ, తన శరీరంలో శరీరం కాని వేరే మనసు ఎంత క్షోభ పడుతుందో ఈ అక్షరాల్లో వ్యక్తమౌతుంటే ముందుకు చదువుతూ వెళ్ళే కొద్దీ నేను చూసిన అలాంటి వారి జీవితాలపై నాలో నాకే కొంత విశ్లేషణా పూర్వకమైన చర్చ జరుగుతోంది.
మన అనంతకే చెందిన బండి నారాయణ స్వామి అన్న రాసిన అర్దనారి మరియు మా న్యాస్తుడు సోలోమన్ విజయకుమార్ రాసిన సన్ ఆఫ్ జోజప్ప నవలలు చదివాను కానీ అవి రెండూ సానుభూతితోనూ సహానుభూతితోనూ రాసినవే తప్ప స్వానుభవంతో రాసినవి ఎంతమాత్రం కాదన్నది అక్షరసత్యం.
ఇప్పుడు ఇక్కడొచ్చిన సందిద్గత ఏంటంటే ఈ మనువాద దేశంలో వెనక బడిన కులాల చరిత్రలను కుల పురాణాలుగా అగ్రవర్ణులు ముగించినట్టు కాకుండా, ఎవరి కుల చరిత్రలు వారే పరిశోధించి వారి గొంతుక వారే వినిపించాలని నినదించే నాలాంటి చాలామంది అభ్యుదయవాదులో మానవతావాదులో లేక మరొకరో ఈ దేశంలో అటు కుటుంబపరంగానూ, కుటుంబ సభ్యులపరంగానూ, సమాజపరంగానూ, సమాజంలో వేళ్ళూనుకున్న భావజాలపరంగానూ అత్యంత వివఛ్ఛకు గురౌతూ తమ గురించి తాము చెప్పుకోవడానికి సాహసించని ఎందరో మోహనస్వాముల జీవితాలకు ఓ సాహసిక వెలుగు రేఖాక్షరాలుగా వెలువడ్డ ఈ నవలలోని అక్షరాలలోని విన్నతులను, ఆక్రోశాలను, ఆవేదనలను, ఆలంబనలను మనం చదివి కనీసం అర్థం చేసుకునే ప్రయత్నమైనా జరగాలంటారా లేదా మీరే చెప్పండి…
అబ్బే అవన్నీ మాకెందుకు కాంచనా సినిమా చూసి అందులో మా హీరోల పెర్ఫార్మెన్స్ చూసి ఈలలు వేసాము చాలదా అంటే ఇక నేనేం చేయగలను చెప్పండి…
అవన్నీ సరేగానీ ఇంతకూ ఈ నవల చదివాకా నీ మనోభావాలేంటి అంటే! నేను కొంత ఇక్కడ తప్పక చెప్పక తప్పదు?
నా జీవితంలో నేను చూసిన కొన్ని సంఘటనల పరంగా విశ్లేషించి చూస్తే, ఈ నవల చదవడానికి ముందు నా ఆలోచనా సరళి, చదివాకా నా ఆలోచనల తీరుతెన్నుల్లో వచ్చిన మార్పు తాలూకూ శైలిని చెబితే కొంత బావుంటుందని అనుకుంటాను.
చాలామంది నా మిత్రులు ఇటువంటి అనుభవాలు తాము విన్నవి కన్నవీ చెప్పినా నా స్వానుభవం మేరకు 2000లో నేను నా గిటార్ భుజానేసుకొని డిస్ట్రిక్ లెవల్ మరియు స్టేట్ లెవల్లో ప్రథమ స్థాయిలో నిలిచి గుజరాత్ గాంధీ నగర్లో జరిగిన జాతీయ స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొడానికి వెళ్ళినప్పుడు, నాతో పాటూ వివిధ కళల విభాగాల్లో వచ్చిన వారిలో గుంటూరు నుండి వచ్చిన ఒక డాన్స్ మాస్టర్‌లో అణువణువూ స్త్రీతత్వమే ఉట్టి పడేది. అతన్ని టీంలో అందరూ రకరకాలుగా ఆట పట్టిస్తూ గేళి చేసేవారు. అందుకతను అలవాటైన రీతిలో తుడుచుకుపోయినా ఒక్కోసారి ఉక్రోశం వచ్చినప్పుడు వీధి కొళాయిల వద్ద ఆడవాళ్ళు పెట్టే శాపనార్థాల్లా వారిపై విరుచుకు పడేవాడు.
అతనితో ఆ క్యాంపులో సానుభూతితో మాట్లాడినప్పుడు అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా వున్నట్టు తెలిసింది. అదే విషయాన్ని నేను ఆశ్చర్యంగా అతని వద్ద ప్రస్తావిస్తే అందుకతను తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు బలవంతం బ్రాహ్మణార్థంలా కాపురం కొనసాగుతున్నప్పటికీ తనకు మగవాళ్ళ మీదనే కోరిక ఎక్కువని, తమలాంటి వ్యక్తులు తారసపడినప్పుడు వారిని వారు కనుక్కొని వారితో జత కడుతుంటామని, కాకపోతే ఎక్కువశాతం సమాజానికి భయపడి తమను తాము గే”లుగా బహిర్గత పరచుకోవడానికి ఇష్టపడక, మేకపోతు గాంభీర్యం నటిస్తుంటారని చెబుతూ అదే క్యాంపులో దాదాపూ అరవైకి పైగా వున్న మా గుంపులో పది పదిహేనుమందిదాకా తనలాంటి వారిని చూపించాడు! ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్లాగా వాల్లున్నప్పటికీ అప్పడు నేనంతగా వారిని పట్టించుకోలేదు కానీ ఈ నవల చదివాకా మోహనస్వామి వేదన అర్థమయ్యాకా, ఆనాడు ఆ డాన్స్ మాస్టర్ పట్ల వల్గర్‌గా బిహేవ్ చేసిన ఆ రూడ్ మనస్కుల మాటలు చేష్టలు గుర్తుకొచ్చి వారి పట్ల ఓ రకమైన తృణీకారం భావం నాలో ఇప్పుడు ఏర్పడింది?
ఇక గుంతకల్లులో ఒక సంస్థలో వారాంతంలో సంగీత పాఠాలు చెప్పడానికి వెళుతున్నప్పుడు అనంత నుండి అక్కడ రెగ్యులర్ రైల్వే వారి పిల్లలకు క్లాసికల్ నృత్యం నేర్పించే ఒక దివంగత వృద్ద మాష్టర్ ఒకసారి తన శిష్యుడిని ఎంతో తీర్చి దిద్దానని వాడిప్పుడు తనతో కాకుండా వేరే వారితో తిరుగుతున్నాడిని ఓ ముఫ్ఫై యేండ్ల కుర్రాడి గురించి ఏడుస్తూ నాతో వాపోతుంటే ఇతనిదేం పురుష ప్రేమని నేను అవాక్కయ్యాను కానీ! ఈ నవలలో మొదటి ఎపిసోడ్‌లోనే దానికి సమాధానం వుంది?
ఓ పదైదేళ్ళ కిందట ఇద్దరు క్లాసికల్ డాన్స్ మాష్టర్లు ఒకరితో ఒకరు కలబడి కొట్టుకొని పోలీస్ స్టేషన్‌కు ఎక్కితే సర్ది చెబుదామని నేను నా మరో దివంగత మిత్రుడు స్టేషన్‌కి వెళితే అందులో శిష్య డాన్స్ మాష్టర్ తన గురువు డాన్స్ మాష్టర్పై చేసిన స్వలింగ సంపర్క అభియోగాలు భిత్తరపోయి అక్కడి పోలీసులతో సహా విన్న మేము ఆ తర్వాత చాలాకాలం చాలామంది వద్ద ప్రస్తావించి నవ్వుకున్నప్పటికీ! ప్రస్తుతం ఈ నవల చదివాకా ఆనాడు ఆ గురువు మాష్టర్ ఎంత వేదన పడివుంటాడో కదా అనిపించి నాకు నాపట్ల కొంచెం సిగ్గనిపిస్తోంది?
ఒకసారి చిలకలూరి పేటకు ఏదో డాన్స్ కాంపిటీషన్‌కు ప్రక్క వాయిద్య కళాకారుడిగా వెళ్ళిన నాకు అక్కడ వచ్చిన డాన్స్ మాష్టర్లలో ఎక్కువశాతం వారే కనిపించి వారిలో కొంతమంది వారి గురువుల చేతుల్లోనే లైంగిక దోపిడీకి గురైన వారు కనిపిస్తే మరికొందరు సహజంగా జీన్స్ ప్రక్రియతో మధుర గళాలతో పాడుతున్న వారిని గుర్తు చేసుకునేలా ఈ నవల చేసిందని చెప్పక తప్పదు.
మా అనంత పీటీసీలో ఐదేళ్ళ కిందట ఓ రాత్రి ఇలా మగవాడి పొందు కోరుకుంటూ వెళ్ళిన ఓ యాభైయేండ్ల మాష్టర్‌ను ఒకడు రెచ్చగొట్టి అతడి రూముకే వెళ్ళి అతని ఒంటి మీద పదితులాల బంగారం బట్టలు రూములో డబ్బు భయపెట్టి దోచుకుపోయిన వైనం ఇప్పటికీ అనంతలో చాలామంది నోళ్ళల్లో ముసిముసి నగవులు పూయిస్తున్నప్పటికీ! ఈ నవలలో మోహనస్వామికి, డెరిక్‌కు మద్యన జరిగిన వుదంతాన్ని అందులో భాదితుడు పోలీసు కేసు పెట్టలేని దైన్యాన్ని, ఇక్కడి మాష్టర్ తెగించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నవ్వుల పాలైన వైనాన్ని గుర్తుకు తెచ్చింది?
ఇంకా చాలానే వున్నప్పటికీ ఇంతటితో నా సోది ముగించి మోహనస్వామిలాంటి వాల్ల జీవితాలను ఈ సమాజం అర్థం చేసుకోవడానికి ఈ దేశంలో ఇంకా ప్రథమిక స్థాయిలోనే వుందన్నది అంగీకరించాల్సిన సత్యం ఐనప్పటికీ మోహనస్వామిలాంటి ఎంతోమంది కోసం వసుధేంద్ర వేసిన ఒక విజయవంతమైన అడుగుగా ఇది అభినందించక తప్పదు…
చివరగా చెప్పేదేమంటే ఈ నవలలో ఒక చోట మోహనస్వామి కృష్ణుడి విగ్రహంతో తన గోడు వెళ్ళబోసుకుంటూ ఏమంటాడంటే “పది అవతారాలు చాలించి పదకొండవ అవతారానికి మునివేళ్ళపై నుంచున్నావు కదా? నీ పదకొండవ అవతారంలో నాలా జన్మించు! పదహారు వేలమంది స్త్రీలను అనుభవించిన నీకు ఒక్క స్త్రీని కూడా ముట్టడానికి వీలు కాని దుఃఖం అసహాయత అప్పుడు అర్థం అవుతాయి. ఎవరినీ చెయ్యెత్తి కొట్టటానికి సాధ్యంకాని ఈ నీరసపు జీవితలో ఎలా దుష్ట సంహారం చేస్తావో చూస్తాను” అన్న ఈ పలుకులు నాలోనూ ఇంకా వున్న మనువాద స్త్రీలోలత్వపు ఒక పురుషుడికి ములుకుల్లా తగులుతున్నాయి…
గమనిక: పైన నేను ఉదహరించిన వ్యక్తుల గురించి ఎవరూ అడక్కండి అనవసరపు రంధ్రాన్వేషన చేయకంది.
ఇక ఇంత చెప్పాకా కూడా పుస్తకం చదవాలా వద్దా అన్నది పూర్తిగా మీకే వదిలేస్తూ పుస్తకం కావాలంటే Chaaya Booksలో లభిస్తుంది…
సమీక్షకులు : అడవాల శేషగిరి రాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.