
ప్రజాస్వామ్యం… ప్రజల కోసం ప్రజలే ఎన్నుకునే పాలనా వ్యవస్థ . ప్రజాస్వామ్యం… ఎంత అందమైన పదం! ఇక్కడ ప్రజలంతా సమానులు, ప్రజలకు ఎన్నో హక్కులు, ఎంతో స్వేచ్ఛ. ఈ హక్కులకు ఏమాత్రం భంగం వాటిల్లినా దీని మూల స్తంభమైన న్యాయ వ్యవస్థ ఆ హక్కులు పరిరక్షించే బాధ్యత తన భుజస్కంధాలకు ఎత్తుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. న్యాయస్థానాల్లో ఎలాంటి వివక్షకూ చోటు ఉండదు, ఇక్కడ అందరూ సమానులే, సమన్యాయమే దీని లక్ష్యం. అయితే అవన్నీ రాజ్యాంగపు రాతల్లో తప్ప వాస్తవ పరిస్థితుల్లో కనిపించవు. నిజానికి ప్రజాస్వామ్యం ఒక అందమైన అబద్ధం. ఆ అబద్ధంలోని న్యాయస్థానాలు పాటించే సమదృష్టి, సమన్యాయం ఇంకా పెద్ద అబద్ధం. కంచే చేను మేస్తోంది. ఈ దేశంలో న్యాయస్థానాలే న్యాయాన్ని మింగేస్తుంటే సామాన్యులు అన్యాయమైపోక తప్పదు.
కేసులు అన్యాయం.. వెళ్లకపోతే అరెస్టు వారెంట్
————————–
ఇటీవల ఒక ప్రముఖ కమ్యూనిస్ట్ కార్యకర్త, మాజీ మావోయిస్టు నాయకుడు నాకు ఒక మెసేజ్ పెట్టారు. ‘ప్రభుత్వం నా మీద అన్యాయంగా పెట్టిన కేసులకు సంబంధించి కోర్టుల నిర్లక్ష్యాన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం ఏమైనా పొందే అవకాశం ఉందో లేదో నాకు తెలీదు కానీ నేను మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాను. ఈ చలిలో, ఈ వృద్దాప్యంలో కోర్టుల చుట్టూ తిరగలేక ఆర్ధికంగా, ఆరోగ్యరీత్యా తీవ్రంగా నష్టపోతున్నాను ’ అన్నారు. వెళ్లకపోతే అరెస్ట్ వారెంట్. ప్రజల్ని ఇంతగా ఇబ్బంది పెట్టే అధికారం కోర్టులకు ఎవరిచ్చారు? అసలు కేసుల్ని ఎందుకు ఇంతలా సాగదీస్తారు?
కోర్టుల్లో తీర్పుకు నోచుకోని కేసులు ఏళ్ల తరబడి లక్షల్లో మూలుగుతూ ఆ కేసులకు సంబంధించిన వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి. ఆర్ధికంగా, మానసికంగా కృంగదీసి జీవితం మీద విరక్తి పుట్టిస్తున్నాయి. న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించే సామాన్యుల పట్ల కొందరు న్యాయమూర్తులు అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు, వారి దృష్టిలో న్యాయాన్ని అర్ధించే సామాన్యుల సమయానికీ, డబ్బుకీ ఏమాత్రం విలువ లేదు, ఒక్క గంటలో 60, 70 కేసులు వాయిదాలు వేసి చేతులు దులుపుకుంటారు . ఏళ్లకు ఏళ్ళు కోర్టుల చుట్టూ తిప్పుతారు. కోర్టు, కేసులంటేనే సామాన్యుల వెన్నులో వణుకుపుట్టిస్తారు. చట్టపరంగా అన్యాయాల్ని ఎదుర్కోవాలని ఉన్నా, ఈ దేశంలో న్యాయ స్థానాల వ్యవహార తీరే ఎందరో బాధితులను ఆ దిశగా అడుగులు వేయకుండా అడ్డుకుంటూ అన్యాయానికి తల ఒగ్గేలా చేస్తోంది.
అసలు ఇక్కడ న్యాయం జరుగుతుందా?!
——————–
చట్టాలు, న్యాయాలు ఈ దేశంలో పలుకుబడి, డబ్బు ఉన్న వాళ్లకు ఒకలాగా సామాన్యులకు మరోలాగా పని చేస్తాయనేది కనీస జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇక రాజకీయ నాయకుల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. న్యాయ వ్యవస్థ పేరుకే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ కానీ జడ్జిలను ప్రభావితం చేసి తీర్పులు తమకు అనుకూలంగా తిప్పుకోగలిగే శక్తి, ఎన్ని నేరాలు చేసినా తమ వారికి శిక్ష పడకుండా తప్పించగలిగే శక్తి ఈ దేశ రాజకీయ నాయకులకు మెండుగా ఉంది. బీజేపీ వచ్చాక ఆ శక్తి మునుపెన్నడూ లేని విధంగా కనీ వినీ ఎరుగని రీతిలో తారస్థాయికి చేరుకుంది. గోద్రా ఘటనలో ఎన్ని ఆధారాలున్నా నేరస్థులకు క్లీన్ చీట్ వస్తుంది. కశ్మీర్, బాబ్రీ మసీదు లాంటి వివాదాస్పదమైన కేసులు కూడా న్యాయాన్యాయాలతో సంబంధం లేకుండా తేలిపోతాయి.
వందమంది నేరస్థులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ , ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదని గొప్ప గొప్ప నీతులు వల్లిస్తారు. కానీ కోర్థుల నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది చేయని తప్పుకు ఏళ్ల తరబడి శిక్షలు అనుభవిస్తున్నారు, జీవితాలనే కోల్పోతున్నారు.
మరణిస్తే బాధ్యులు ఎవరు?
————–
పైన చెప్పిన మావోయిస్టు లీడర్ ని అండర్ ట్రయిల్ కింద పదేళ్లు జైల్లో పెట్టారు. నేరం చేశాడనడానికి ఏ ఆధారాలూ లేవని కేసు కొట్టేసి విడుదల చేశారు. ఇటీవల మరణించిన ప్రొఫసర్ సాయిబాబా గారిని కూడా నేరారోపణ మీద పదేళ్లు జైల్లో పెట్టి చివరకు నిరపరాధి అని కోర్టు తీర్పు చెప్పింది. ఈ కోర్టు- జైలు వ్యవహార తీరులో శారీరక మానసిక సమస్యలు ఎదుర్కొంటూ ఆరోగ్యం క్షీణించి మరణిస్తే ఈ హత్యకు బాధ్యులు ఎవరు?
చేయని తప్పుకు ఘోర శిక్ష
————
ఉత్తరప్రదేశ్ కి చెందిన విష్ణు తివారి అనే వ్యక్తి మీద రేప్ కేసు పెడితే సెషన్స్ కోర్ట్ అతనికి శిక్ష వేసి జైల్లో పెట్టింది. అతను హై కోర్ట్ కి అప్పీల్ చేసుకుంటే ఆ కేసు హై కోర్ట్ లో 20 ఏళ్ళు పెండింగులో ఉంది, 20 ఏళ్ల తర్వాత అతని తప్పు ఏమీ లేదని అతని మీద ఉన్నది తప్పుడు అభియోగమని, ఏ ఆధారాలూ లేవని, సెషన్స్ కోర్ట్ ఎలా శిక్ష వేసిందంటూ హై కోర్ట్ కేసు కొట్టేసింది. 23 ఏళ్ల వయసులో జైలుకెళ్లిన వాడు 46 ఏళ్ల వయసులో జైలు నుంచి విడుదలయ్యాడు. కేసుని సుదీర్ఘకాలం పెండింగ్ లో పెట్టి చేయని తప్పుకు ఘోరమైన శిక్ష అనుభవించేలా చేసిన హై కోర్టుకి ఏ శిక్ష లేదు, తప్పుడు తీర్పు చెప్పి జైల్లో వేసిన సెషన్స్ కోర్టు జడ్జికి శిక్ష కాదు కదా కనీసం వార్నింగ్ కూడా ఉండదు. ఇది ఈ దేశంలో జరిగే న్యాయం.
23 ఏళ్ళ తర్వాత నిర్దోషులని తీర్పు
————-
1996 లో జరిగిన శాంలెట్టి బ్లాస్ట్ కేసులో అనుమానితులుగా 6 మంది అమాయకుల్ని అరెస్ట్ చేసి అన్యాయంగా 23 ఏళ్ళు జైల్లో పెట్టారు రాజస్థాన్ హై కోర్టులో ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ 23 ఏళ్ళు సాగదీసి చివరకు వాళ్ళు నిరపరాధులని తీర్పిస్తూ కేసు కొట్టేశారు. ఈ 23 ఏళ్లలో హై కోర్ట్ వాళ్లకు కనీసం బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. వీరికి జరిగిన ఈ అన్యాయానికి బాధ్యులు ఎవరు?
అన్యాయంగా 40 ఏళ్ల జైలు
————–
డార్జిలింగ్ కి చెందిన దీపక్ జైసి అనే వ్యక్తిని హత్య కేసులో అనుమానించి 1980 లో అండర్ ట్రయల్ కింద అరెస్ట్ చేసి 2021లో 40 ఏళ్ల తర్వాత అతను నిర్దోషిగా కోర్ట్ తీర్మానించడంతో విడుదల చేశారు. ఒక వ్యక్తి జీవితంలో 40 ఏళ్ళు అదీ అన్యాయంగా జైలు జీవితం. అయినా ఈ న్యాయస్థానాలకూ, ఆ న్యాయమూర్తులకూ పశ్చాత్తాపం కాదు కదా, కనీస చలనం కూడా లేదు.
కోర్టుల చుట్టూ 38 ఏళ్లు
—————
ఇంకో విచిత్రమైన కేసు ప్రేమ్ చంద్ కేసు. ఇతనో చిరు వ్యాపారి చిన్న పసుపు ప్యాకెట్ లో కల్తీ జరిగిందని ఫుడ్ ఆల్టరేషన్ ఇతడి మీద కేసు పెట్టింది. (ఫుడ్ ఆల్టరేషన్ అధికారులు వాళ్లకు అందాల్సిన మామూలు అందకపోతే కల్తీ లేకపోయినా కేసులు పెడతారు, కాసులు పెద్ద మొత్తంలో అందితే, ఎంత పెద్ద కల్తీ అయినా కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు ) 13 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాక జిల్లా కోర్టు కేసు కొట్టేసి ప్రేమ్ చంద్ కి ఊరటనిచ్చింది. అయితే ఫుడ్ ఆల్టరేషన్ మళ్ళీ హై కోర్టులో అప్పీల్ చేసింది (లంచం అందనట్టుంది పాపం). మళ్ళీ 14 ఏళ్ల తర్వాత పసుపులో కల్తీ జరిగిందంటూ హై కోర్ట్ అతనికి శిక్ష వేసింది. దాంతో ప్రేమ్ చంద్ సుప్రీం కోర్టుకి వెళ్ళాడు. 11 ఏళ్ల తర్వాత ఇతను నిరపరాధి అని చెబుతూ సుప్రీం కోర్టు కేసు కొట్టేసింది. మొత్తం 38 ఏళ్ళు కోర్థుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. దీనికి ఎవరు బాధ్యులు? ఇలా చెప్పుకుంటూపోతే లెక్కలేనన్ని కేసులు.
తీర్పుల్లో వ్యత్యాసం
————
ఆదినాథ్ గోస్వామి కేసులో ఇలాంటి వాటికి బెయిల్ ఇవ్వడం కుదరదని ముంబై కోర్టు బెయిల్ తిరస్కరిస్తే, అదే కేసులో సుప్రీం కోర్టు ఇలాంటి వాటికి బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పింది. ఏంటిది.. ఈ కోర్టు జడ్జి లకు తెలిసిన విషయం కింది కోర్టు జడ్జిలకు తెలియదా?!! కోర్టు కోర్టుకీ తీర్పుల్లో ఇంత వ్యత్యాసం ఉంటే న్యాయానికి విలువేముంది?!! గ్యారెంటీ ఏముంది?!! తప్పుడు తీర్పులతో, నిర్లక్ష్యంతో, జాప్యాలతో ప్రజల జీవితాలతో ఘోరంగా ఆడుకునే న్యాయమూర్తులను శిక్షించేది ఎవరు? ఇంతవరకు ఏ జడ్జి కైనా శిక్షపడిన దాఖలాలు అసలు ఉన్నాయా?
అసలు కోర్టు తీర్పులను ధిక్కరించినా, అవి ఎంతటి తప్పుడు తీర్పులైనప్పటికీ విమర్శించినా అది మళ్ళీ కేసు అవుతుంది. ఎంత గొప్ప న్యాయమో. కోర్టు ధిక్కారం కేసులో ప్రశాంత్ భూషణ్ గారికి ఒక్క రూపాయి జరిమానా విధించడం చూస్తుంటే మన న్యాయ వ్యవస్థ ఎంత బాధ్యతారహితంగా, హాస్యాస్పదంగా ఉందో అర్థమౌతుంది.
అండర్ ట్రయిల్ ఖైదీలు
———–
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (NCRB ) లెక్కల ప్రకారం 2024 మే 8 నాటికి దేశంలో మొత్తం జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య 5,73,220. అందులో అండర్ ట్రయల్ ఖైదీలు 4,34,302. అండర్ ట్రయల్ అంటే నేరం చేశారనే నిరూపణ కాకుండా కేవలం అనుమానంతో అరెస్ట్ అయిన వారు. వీరిలో ఎన్ని లక్షల మంది చేయని తప్పుకు అన్యాయంగా శిక్షలు అనుభవిస్తున్నారో!! ఆ పాపం కచ్చితంగా కోర్టులదే, అవి చూపించే నిర్లక్ష్యానికి ఫలితమే ఇది. న్యాయస్థానాలు చేసే అన్యాయానికి నిదర్శనమే ఇది. ఈ దేశ రాజ్యాంగం ఆర్టికల్ 21, పీనల్ కోడ్ సెక్షన్ 436A ప్రకారం అండర్ ట్రయిల్ ఖైదీలకు చాలా హక్కులున్నాయి కానీ ఏం లాభం, అనారోగ్యంతో ఆహారం తినలేక బాధపడే ఖైదీకి ద్రవ పదార్థాల కోసం ఒక ‘స్ట్రా ‘ ఇచ్చేందుకు కూడా ఒప్పుకోని గొప్ప న్యాయమైన సంస్కారం మనం చూశాం కదా?
లక్షల కేసులు పెండింగులో..
—————-
దేశావ్యాప్తంగా లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ సంఖ్య ఎప్పటికీ పెండింగ్ లోనే ఉంటుంది. కేసు ఓడినవాడు కోర్టు మెట్ల మీద కూర్చుని ఏడిస్తే గెలిచినా వాడు ఇంటికి వెళ్లి ఏడుస్తాడట, ఓడినా, గెలిచినా ఏడుపే మిగిలేలా చేయగల సమర్ధత ఈ కోర్థులకే ఉంది. న్యాయవ్యవస్థ అద్భుతమైన ఈ పనితీరు కారణంగా జరిగే నేరాల్లో 10% కూడా కోర్టు మెట్లు ఎక్కవు. అయినప్పటికీ లక్షల కేసులు పెండింగ్. మన జీవితాలు సర్వనాశనం అవుతున్నా ఎందుకింత నిర్లక్యమని న్యాయవ్యవస్థని ప్రశ్నించే హక్కు ఎవ్వరికీ ఉండదు అది మన ప్రజాస్వామ్యం గొప్పతనం.
వేల కోర్టులు ఉన్నా ఇంకా కోర్టులు చాలవు, జడ్జిలు చాలరు, జైళ్లు చాలవు అంటూ ఇంకా పెంచాలనే చూస్తారు తప్ప, అసలు ఇన్ని కేసులు ఇన్ని నేరాలు ఎందుకు? క్రైమ్ రేట్ తగ్గించే ప్రయత్నం చేయాలనే ఆలోచనే ఉండదు. అదే పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రత్యేకత.
కమ్యూనిస్ట్, సోషలిస్ట్ వ్యవస్థల్లో కోర్థుల వ్యవహారం, పనితీరు దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
చైనాలో విప్లవం వచ్చిన తొలినాళ్ళలో ...
—————–
కోర్టులో జెండాలు, నినాదాలు, నాయకుల ఫోటోలు ఏమీ లేవు. అక్కడ అందరూ సమానులే. చాలా కోర్టులు సంవత్సరానికి 30, 40 కేసులకు మించి చేయవు. 30 లక్షల జనాభా ఉన్న నగరాల్లో చిన్నా పెద్ద కోర్టులు ఐదారుకి మించి ఉండవు (ఒక్క హైదరాబాద్ లోనే అప్పట్లోనే 70 కోర్టులుండేవి )
అది కూడా కేసు ఉన్నప్పుడు మాత్రమే కోర్టు నడుస్తుంది సాధారణంగా పది రోజులకోసారి. అంటే కేసులు ఎంత తక్కువ ఉన్నాయన్నమాట.
మన కోర్టుల్లోలా ఎన్ని సంవత్సరాలైనా జడ్జిల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన దుస్థితి లేదు. విచారణ కోసం వచ్చిన వారిని కూడా జడ్జిల ముందు కుర్చీల్లో కూర్చోబెట్టి మాట్లాడతారు.
ముందుగా జడ్జి వాళ్ళ పేర్లు, వివరాలు కనుక్కుని తన పేరు వివరాలు, పక్కన కూర్చున్న ఇద్దరు జడ్జిల వివరాలు, పనితీరు, రిమార్క్స్ అన్నీ చెప్పి, మీ కేసు మీరే వాదించుకోవచ్చు, ఎందరైనా సాక్షుల్ని తెచ్చుకోవచ్చు, మీ తరపున మీ స్నేహితులు వచ్చి మాట్లాడొచ్చు, కావాలంటే లాయర్ ని పెట్టుకోవచ్చు (ఫీజు లేకుండా ఫ్రీగా ) ఈ రోజు జరిగే కేసు విచారణ రికార్డ్ ని నాలుగు రోజుల వరకు మీరుగానీ ఇతరులెవరైనాగానీ ఏ టైంలో అయినా సరే కోర్ట్ కి వచ్చి చదువుకోవచ్చు. ఈ కోర్ట్ తీర్పుతో సంతృప్తి లేకపోతే పై కోర్ట్ కి అప్పీల్ చేసుకోవచ్చు. మీ ఇద్దరిలో ఎవరికైనా సరే మా మీద నమ్మకం లేకపోతే విచారణ మధ్యలోనే వేరే కోర్ట్ కి వెళ్లిపోవచ్చు. ఇవన్నీ మీ హక్కులు. మా గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అడగొచ్చు అని ప్రధాన న్యాయమూర్తే చెబుతారు. ఇంత సమయం, ఇంతటి స్నేహపూరిత వాతావరణం కల్పిస్తే ఎవరైనా స్వేచ్ఛగా తమ సమస్యను జడ్జికి డైరెక్ట్ గా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పుకోగలుగుతారు. తొందరగా పరిష్కారమూ లభిస్తుంది.
చైనా కోర్టుల్లో సాధారణ కేసులు, చిన్న కేసుల్లో తీర్పులు ఓకే రోజులో వచ్చేవి. ఉదయం 11 గంటలకు కేసు మొదలైతే రెండు మూడు విరామాలతో సాయంత్రానికి కేసు క్లోజ్ అయ్యేది.
కమ్యూనిస్టు వ్యవస్థలో కోర్టులు ప్రజల కోసం, ప్రజల న్యాయం కోసం పనిచేస్తే,
ప్రజా వ్యతిరేకమైన పెట్టుబడిదారీ వ్యవస్థలో కోర్టులు సామాన్యులకు వ్యతిరేకంగా దోపిడీ వర్గానికి మద్దతుగానే పని చేస్తాయి.
వనజ చే
రచయిత సామాజిక అంశాల వ్యాఖ్యాత, అనువాదకురాలు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.