
ప్రజాకవి కాళోజీ నారాయణ రావు షష్టిపూర్తి సందర్భంగా వరంగల్ జనధర్మ పత్రిక అభినందన సంచికను ఎం ఎస్ ఆచార్య వెలువరించారు. (అందులో ఉప సంపాదత్వం చేసే అవకాశం ఈ రచయితకు కూడా లభించింది). అప్పుడు కాళోజీ చెప్పిన నాలుగు మాటలు అద్భుతంగా వచ్చాయి. ‘‘నేనింనా ‘నా’ నుంచి ‘మా’ వరకే రాలేదు, ‘మనం’ అని అన్నప్పుడు కదా ముందడుగు’’ అన్నారు. ఈ వాక్యాలు చిరంజీవిగా ఎప్పడికీ నిలబడతాయి. వినబడతాయి.
We the people… వీ ది పీపుల్ అనే మూడు పదాలు పుస్తక శీర్షికలైనాయి. ఆ మాట వినగానే ఇది మనదేశం అనే దేశభక్తి పెల్లుబుకుతుంది. అవి మంత్రాలా అనిపిస్తాయి. బీజాక్షరాలా అని కూడా అనిపిస్తాయి. వీ ది పీపుల్ అనే మాటలతో పీఠిక విలువైన అక్షరాలుఉంటాయి. సుప్రీంకోర్టు తీర్పులలో అనేక సార్లు ఈ పదాలను విడమరిచి విశ్లేషించారు. తప్పుగా అన్వయం చేసినవారు తక్కువ. కొందరు జడ్జిలు చివరి అభిప్రాయాలు వేరుగా ఉన్నాపీఠిక ను తప్పు పట్టుకోవడం లేదు.
మన రాజ్యాంగ పీఠిక ను తెలుగులో రచించడం చాలా కష్టం. సులువుగా అర్థమయ్యే విధంగా రాయాలని ప్రయత్నం చేసినాను. అయిదారుసార్లు మరింత బాగుండాలని అనుకుని ఈ విధంగా రూపొందించాను. జూన్ లో రాజ్యాంగ పీఠిక ప్రచురించిన తరువాత మళ్లీ కొంత సవరించాను.
ఈ మధ్య భారత రాజ్యాంగం పీఠిక పేరుతో ఈ రచయిత రాసిన పుస్తకాన్ని రెండవ ప్రచురణ వచ్చింది. 2024 జనవరిలో గణతంత్రం సందర్భంగా రాసిన అయిదు వ్యాసాలతో రాజ్యాంగ పీఠిక పుస్తకం జూన్ నెలలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విడుదలైంది. మరో అయిదునెలల్లో రెండవ పుస్తకం ప్రచురణకు రావడం విశేషం. అందులో ముఖ్యమైన అంశం ఏమంటే ప్రియాంబిల్ అనే పీఠిక సులువుగా చదవడానికి వీలుగా ఉండడం. ఇంగ్లీషులో మన రాజ్యాంగాన్ని పీఠికగా రాయడానికి చాలా ఆలోచన చేశారు. రాజ్యాంగ నిర్ణాయక సభ (Constituent Assembly) ఒక్కో అక్షరాన్ని ఎంచుకున్నారు, చర్చించుకున్నారు. ఒక్కో పదం మీద చాలా సేపు వివాదాలు వాదాలు సాగించారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ ఒక్కో వాక్యం వ్యాఖ్యానం వస్తూ వచ్చింది. చాలా గొప్పవారు చాలా జాగ్రర్తగా రాసారు. అనువాదంచేసారు. నిజానికి అది ప్రతి పదాన్ని అనువదించకూడదు. అప్పుడు అర్థం కాదు. కనుక అనువదించకుండా మొత్తం పీఠిక అవగాహన చేసుకున్నతరువాత పదాలపొందిక గా తయారుచేసుకోవాలి.
ఈ పీఠిక రెండవ ప్రచురణలో కూడా మార్పులు జరిగాయి. అయినా ఇంకా చర్చిద్దాం అనుకుని ఫేస్ బుక్ లో కూడా మిత్రులు అభిప్రాయాలు వెల్లడించారు. వెలువరించారు.
ఈ రాజ్యాంగ పీఠిక తెలుగులో ఈ విధంగా ఆవిర్భవించింది ముందు శీర్షికగా “మాకు మేము సమర్పించిన రాజ్యాంగం ” అని ఉండాలనుకున్నాను. కాని తరువాత మిత్రులు సూచనపై తొలగించింది. వ్యక్తి గౌరవాన్ని….సమగ్రతను “హామీ ఇచ్చే” (assured అన్న మాటకు) అనే రెండు .పదాలను, సౌభ్రాతృత్వము అనే మాట కు ముందు చేరిస్తే, ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను అన్నా అని హారతీ వాగీశన్ అన్నారు.
అంటే ఆ వాక్యం కింద పేర్కొన్నట్టు ఉండొచ్చు. “వ్యక్తి గౌరవాన్ని హామీ ఇచ్చే, జాతి ఐక్యతను, సమగ్రతను నిలిపే/పెంచే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే” మిగతాది చాలా బాగా వచ్చింది అని ఆయన వివరించారు. ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ దిలీప్ రెడ్డి వాగీశన్ గారన్నట్టు ‘మాకు మేము సమర్పించిన రాజ్యాంగం’ అనే శీర్షిక వాక్యం అవసరం లేదు. (we can avoid repeating just…) పీఠిక అని పెడితే చాలు అని వివరించారు. ప్రొఫెసర్ మదనమోహన్ చోడవరపుగారు వరంగల్లు నుంచి, పాఠకుడు విజయకుమార్ గుర్రం గారు ‘‘చాలా బాగుంది సర్. దిలిప్ సర్ సూచించినట్టు చేస్తే ఇంకా బాగా వస్తుంది’’ అన్నారు. విజయవాడ నుంచి సత్యనారాయణ వల్లభనేని గారు కొనకంచి మురళి, వరంగల్ మిత్రుడు డాక్టర్ శ్రీనాథ్, కోవెల జగన్మోహనాచారి గారు బాగుందన్నారు.
బాగా చదివిన తరువాత మరో నిపుణుడైన రాజ్యాంగ, రాజకీయ శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ ఎం ఎ శ్రీనివాసన్, మరో రాజ్యాంగ అధ్యాపకుడు నరేశ్ ‘మాకు మేము…. అంటేనే మాగుంటుందని అన్నారు. కాని కాదు కాదు మనం మన భారత … అందాం అని చివరికి ముగించారు.
రాజ్యాంగ నిర్మాయక సభ అని అందామా లేక రాజ్యాంగ పరిషత్తు అనే పదం సరిపోతుందా అని చర్చ ఉండేది. రెండూ ఒకటే అన్నారు. అయినా Constituent Assembly అని కూడా చెప్పడం అవసరం అనిపించింది. కోవూరు మూర్తి గారు ఫేస్ బుక్ లో ‘‘మీరు చాలా శ్రమించి చేశారు కానీ ప్రతి రోజూ మన రాజ్యాంగం రాజకీయ పోలీసులు వ్యాపారస్తులు న్యాయ వ్యవస్థ పార్లమెంటు చట్ట సభలు అధికారులు ధన వంతులు అపహాస్యం చేస్తూ ఉన్నాయి’’ అని బాద పడ్డారు. వారి వలె చాలామంది మన వ్యవస్థ గురించి ఆలోచించడమే గొప్ప కదా.
చివరకు ఈ విధంగా రూపొందించింది. చదవండి.
భారత రాజ్యాంగము భారత ప్రజలమైన మనము మన భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్రదీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాల్ని ఆలోచనా భావప్రకటనా మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛను హోదాల్లోనూ అవకాశాలలోను సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ నిర్ణాయక సభ లో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరించి ఆమోదించి మనకు మనము సమర్పించుకుంటున్నాము. |
ఇందులో ఒక్క వాక్య విభజన సమాసాలు, ఎంపిక రీతి కూడా ముఖ్యం. భారత అని రెండు సార్లు వస్తుంది. కాని ‘‘భారత ప్రజలమైన మనము మన భారతదేశాన్ని..’ అని నొక్కి చెప్పక తప్పదు.
‘‘సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర’’ అనే సుదీర్ఘ సమాసాన్ని ఎంత చదివినా సరిపోదు. ఒక్కొ పదానికి ఒక్కో వ్యాసం రాయాలి. లౌకిక, సామ్యవాద అనే మాటపై బోలెడంత చర్చ వివాదం, కేసులో పదే పదే సుప్రీంకోర్టు తగాదాలు వస్తూ ఉన్నాయి. ఇందరిగాంధీ కాలంలో చేసిన సవరణ కనుక మంచిదికాదనీ, లేకబాగుంది అనేది విమర్శలు వస్తూనే ఉంటాయి.
ఉదాహరణకు న్యాయాన్ని కాదు న్యాయాల్ని అని అర్థం చేసుకోవాలి. ఎందుకీ న్యాయాల్ని అనే మాట అన్నారంటే, అంతకుముందు మూడు పదాలు ముఖ్యమైనవి చదవాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల్ని అని కలిపి చదువుకుంటే సమగ్రత తెలుస్తుంది. అంటే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం కావాలనే మాటలను ఒకే పదం ‘‘న్యాయాల్ని’’ మూడురకాల న్యాయములు కావాలని అంటున్నది ఈ రాజ్యాంగ పీఠిక.
అదేవిధంగా ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మత విశ్వాస స్వేచ్ఛ, ఆరాదనా స్వేచ్ఛ కీలకమైనవి కదా. ఆలోచన వేరు ప్రకటనా స్వేచ్ఛ వేరు. ఎందుకంటే పైకి చెప్పకపోయినా ఆ ఆలోచనకూడా ఉండకూడదు అనుకునే నియంతలు వచ్చినపుడు, ఆలోచన వచ్చినందుకే జైలుకు పంపిస్తున్నారు. ఎంత అన్యాయం. ఆ పని రాజ్యాంగ వ్యతిరేకం కాదా? స్వేచ్ఛను కాపాడుకోవాలని కదా. అని శ్రీ శ్రీ అన్నట్టు
‘‘ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రములన ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి’’ అని పాడుకునే భావస్వేచ్ఛ లేదా?
పోనీ చదువుకునే స్వేచ్ఛ ఉందా? వరవరరావ్
‘‘విద్య ఒసగును వినయంబు గనుక
ప్రి స్కూలు నుంచి ప్రీ యునివర్సిటీకి వచ్చేవరకు
పిల్లలు పెద్దలయి అబద్ధాలు నేర్చి
అధికారానికి అర్హులవుతారు’’ ఇదా మనం చేసే పని.
సమానత్వం అంటున్నాం. నిజంగా ఉందా. హోదాలు ఎత్తులు లోయలు ఉన్నాయికదా. ఇక అవకాశాలలు ఎక్కడున్నాయి. సమానత ఉందా. ప్రతి ప్రభుత్వం పీఠిక అర్థం చేసుకుని అమలు చేయాలని రోజూ వివరించాలి. మరీ మరీ చెబుతూనే ఉండాలి, ఒక పంతులు వలె. సమానత్వాన్ని సాధించేందుకు పని చేయాలి కదా.
వ్యక్తి గౌరవం. ఎక్కడుంది, గాలిపటాలకు చైనా మాంజా మెడకు ఇరికి మనుషులు చనిపోతుంటే, కోవిడ్ రోగానికి లక్షల మంది చచ్చిపోతూ ఉంటే వ్యక్తి గౌరవం ఎక్కడ. బతికుండే గౌరవం లేదు చనిపోయిన తరువాత చేసేదేముంది? సినిమా థియేటర్ లో డబల్ ధరకు టికెట్ ఇచ్చి, అర్థరాత్రికి బెనిఫిట్ సినిమాచూడడానికి హీరో వస్తే చూడడానికి లక్షలమంది వస్తే ఒకరి జీవనం బలిచేసే దేశం తొక్కిచంపుతూ ఉంటే ఏదీ వ్యక్తి గౌరవం? తిరుపతిలో భక్తి ప్రవహించి జనవరి ఒకటో తేదీనాడు లక్షలమంది రావడం ఎందుకు. త్రొక్కులాటలకు ఆరుగురు చనిపోతే వ్యక్తిగౌరవం గురించి ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తున్నాదా? ఇవన్నీ రాజ్యాంగ నేరాలు, రాజ్యాంగ ద్రోహాలు. దురదృష్ఠం అనుకుని నోరు మూసుకుంటున్నదీ జీవితం.
వ్యక్తి గౌరవం తరువాత జాతి ఐక్యత, సమగ్రత పైపెదాలదాకా వినిపించే పదాలు. ఉపన్యాసాలు ప్రవచనాలు అంతే. సిద్ధంతాలనుంచి వ్యతిరేకించిన వారిని జైలుకు పంపడానికి తప్ప ఎక్కడిదీ జాతీ ఐక్యత? ఓహో సమగ్రత? దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్ అన్నారు గురజాడ.
అన్నింటికన్నా ముఖ్యమైంది సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి. అన్నదమ్ములవలె ఉండాలన్నారు గురజాడ.
‘‘అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలెనోయ్
మతం వేరైతేను యేమోయ్ మనసు లొకటై మనుషులుంటే;
జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్’’ వినేదెవరు?
మన రాజ్యాంగ పీఠిక అనుక్షణం అర్థం చేసుకుంటూ ప్రతిజ్ఞ చేసుకోవలసినదీ రాజ్యాంగ ప్రవేశిక.
మాడభూషి శ్రీధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.