
బడ్జెట్ స్థూల వ్యయంతో పోల్చినప్పుడు సామాజిక రంగాలకు ప్రభుత్వ వ్యయం తగ్గింది. వైద్య ఆరోగ్యరంగంలో ప్రభుత్వ కేటాయింపులు స్తబ్దతకు లోనయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతోంది.
దేశం ఆర్థికాభివృద్ధి సాధించటం, ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుబాటులోకి తేవటం మధ్య సమతౌల్యం సాధించాల్సిన సమయంలో కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరాలకు బడ్జెట్ ప్రవేశ పెట్టింది.
ప్రతి ఏటా బడ్జెట్ పెట్టినప్పుడు మీడియా చర్చలన్నీ మూలధన వ్యయం, పన్ను రాయితీలు, ద్రవ్యలోటు వంటి ఆమూర్త విషయాలపై కేంద్రీకృతమవుతాయి. అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేసేది సామాజిక రంగాలపై జరిగే ఖర్చే. దీనిపై మీడియా పెద్దగా దృష్టి సారించటం లేదు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌష్టికత్వం వంటివి కేవలం సంక్షేమానికి సంబంధించిన సమస్యలే కాదు. దీర్ఘకాలంలో జాతీయాభివృద్ధికి అవసరమైన మానవ పెట్టుబడిని అభివృద్ధి చేసే మార్గాలు, ఆర్థిక అసమానతలను తగ్గించే మార్గాలు కూడా.
2023-24 బడ్జెట్లో సామాజిక రంగాలపై చేసిన వ్యయం కేవలం 26 శాతం మాత్రమేనని 2024 ఆర్థిక సర్వే తేల్చింది. సంక్షేమ పథకాల అమలు బాధ్యత ప్రధానంగా రాష్ట్రాలదే. కానీ అన్ని రాష్ట్రాలు సమాన స్థాయిలో ఈ పథకాలు అమలు జరిపేలాచూడటం, తద్వారా కనీస సామాజిక ప్రయోజనాలు అన్ని రాష్ట్రాల ప్రజలకూ దక్కేలా చూడటం కేంద్ర ప్రభుత్వం బాధ్యత.
గత కొంత కాలంగా సామాజిక రంగాలకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రాధాన్యతలు ఇచ్చింది అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాలుగు ప్రధానరంగాల కేటాయింపులు, ఖర్చులూ పరిశీలించాము.
ప్రస్తుత చర్చకోసం సామాజికరంగం అంటే విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆహారభద్రత, పౌష్టికాహారం, సామాజిక భద్రత, గ్రామీణాభివృద్ధితో ముడిపడి ఉన్న శాఖలూ, విభాగాలూ, వాటికేటాయింపులు, ఖర్చులు. అదనంగా నైపుణ్యాభివృద్ధి, సంస్కృతి, దళిత, గిరిజన అభివృద్ధి, పట్టణప్రాంతాల్లో పేదరిక నిర్మూలన పథకాలు కూడా ఈ నిర్వచనం పరిధిలోకే వస్తాయి.
పదహారు మంత్రిత్వ శాఖలకు చెందిన విభాగాల నుండి పైన ప్రస్తావించిన రంగాలకు జరిగే కేటాయింపులన్నింటినీ క్రోడీకరించి విశ్లేషణ చేశాము. గత పన్నెండేళ్ల కాలాన్ని మూడు తరగతులుగా వర్గీకరించి విశ్లేషించాము.
మొదటది : కోవిడ్ కంటే ముందు, అంటే 2014 నుండి 2019 వరకూ
రెండోది : కోవిడ్ మహమ్మారి ప్రభావం, ప్రపంచ ఆర్థిక మాంద్యం అనుభవించిన కాలం 2019 నుండి 24 వరకూ
మూడోది : 2024 తర్వాత, కోవిడ్ ప్రభావం నుండి కోలుకుంటున్న కాలం
తరుగుతున్న సామాజిక వ్యయం
2024-25 ఆర్థిక సంవత్సరానికి 47.16 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 50.65 లక్షల కోట్ల బడ్జెట్ అయ్యింది. అంటే గత ఏడాదికంటే ఈ ఏడాది స్థూల బడ్జెట్ విలువ ఏడు శాతం పెరిగింది. అంటే అన్ని రంగాల కేటాయింపులూ ఈ మోతాదులో పెరగాలి. పెరిగాయా లేదా అన్నది పరిశీలిద్దాం.
2014-19 నుండి 2019-20 మధ్యకాలంలో సామాజిక రంగాల పద్దులకు కేటాయించిన నిధులు మొత్తం బడ్జెట్లో 21 శాతం. స్థూల జాతీయోత్పత్తిలో ఈ పద్దుల వాటా కేవల 2.8 శాతం మాత్రమే. 2019-20 నుండి 2024-25 మధ్య కాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో నిష్పత్తిలో మార్పేమీ రాలేదు. కాకపోతే స్థూలజాతీయోత్పత్తిలో 3.3 శాతానికి పెరిగింది. అంటే ఐదేళ్లల్లో కేవలం ఏడాదికి 0.1 శాతం చొప్పున పెరిగింది. పెరుగుతున్న ధరలతో పోల్చి చూసినప్పుడు ఇది ప్రతికూల నికర వ్యయంగా మారుతుంది తప్ప ప్రజోపయోగ వ్యయం పెరిగే అవకాశం లేదు.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఉపాధి హామీ పథకాలకు కేటాయింపులు పెరగటంతో ఈ సంవత్సరానికి సామాజిక రంగాలపై వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో 5.3 శాతానికి చేరింది. కోవిడ్ లాక్డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ మాత్రమైనా ఈ పథకాలపై వెచ్చించాల్సి వచ్చింది. ఆ ఒక్క సంవత్సరం మినహాయించి తర్వాత నాలుగేళ్లూ ఈ పథకాలపై ఖర్చు తిరిగి యథాతథ స్థితికి చేరుకున్నది. ఫలితంగా పదేళ్లల్లో సామాజిక రంగాలపై కేంద్రం పెట్టిన ఖర్చులో ఎదుగూబొదుగూ లేదని చెప్పవచ్చు.
ఎదుగూబొదుగూ లేదంటే దాని ప్రతికూల ప్రభావం కూడా ఉంటుంది. ఈ పదేళ్ల కాలంలో వివిధ పథకాల కింద లబ్దిదారుల సంఖ్య పెరిగింది. అంటే ప్రజలకు ఈ పథకాల ద్వారా కలిగే సగటు తలసరి ఆర్థిక ప్రయోజనం తగ్గిపోతోంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచనైనట్లు అన్నమాట.
2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం సామాజిక రంగాలపై వెచ్చించిన నిధులు మొత్తం బడ్జెట్లో కేవలం 17 శాతం మాత్రమే. ఈ రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత తక్కువ. ప్రస్తుత బడ్జెట్లో దీన్ని 19 శాతానికి పెంచటానికి వీలుగా కేటాయింపులు జరిగాయి. ఈ రెండు సంవత్సరాల కేటాయింపుల్లో ఉన్న తేడా చూపించి సామాజికరంగాలకు అదనంగా రెండు శాతం పెంచామని ప్రభుత్వం, విశ్లేషకులు చెప్తున్నారు కానీ నిజానికి స్థూలంగా రెండు శాతం తగ్గాయన్న వాస్తవాన్ని మరుగున పెడుతున్నారు.
స్థబ్దతకులోనైన వైద్య ఆరోగ్య రంగాల కేటాయింపులు
ఏయే రంగాలకు అధిక ప్రాధాన్యత దక్కిందో అర్థం చేసుకోవడానికి ఆయా శాఖల కేటాయింపులను సాపేక్షంగా పరిశీలించటం జరిగింది.
సామాజిక రంగాలకు కేటాయించిన నిధులు మొత్తం వంద రూపాయలు అనుకుంటే 2014-19 మధ్యకాలంలో ఆహార సబ్సిడీ 27 శాతం, గ్రామీణాభివృద్ధికి 22 శాతం, విద్యారంగానికి 18 శాతం దక్కింది.
2019-24 మధ్యకాలానికి గాను మొత్తం సామాజిక రంగాల కేటాయింపుల్లో ఆహార సబ్సిడీ 35 శాతానికి చేరింది. కోవిడ్ కాలంలో ఉచిత ఆహారధాన్యాల పంపిణీ వలన ఈ ఖర్చు పెరిగింది. కానీ ఆశ్చర్యకరంగా కోవిడ్ లాంటి ఆరోగ్యపరమైన మహమ్మారి దేశాన్ని చక్రబంధంలోకి నెట్టినా ఆ కాలంలో మొత్తం సామాజిక పద్దుల్లో వైద్య ఆరోగ్యరంగానికి దక్కిన వాటా 10 శాతం మాత్రమే. ఇదేవిధంగా విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల పద్దులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.
సామాజిక ప్రయోజనాన్ని కలిగించే పథకాలకు బదులుగా పట్టణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలకు కేటాయింపులు పెరిగాయి. ఈ కాలంలో గ్రామీణాభివృద్ధి పద్దుల కేటాయింపులు కూడా సగటున 20 శాతం పడిపోయాయి.
కీలక రంగాల్లో మందగిస్తున్న వృద్ధి రేటు
మోతాదుల్లో చెప్పుకున్నప్పుడు కొంత గందరగోళానికి అవకాశం ఉంటుంది. అందుకే వృద్ధి రేటు కొలమానంతో కూడా పరిశీలిద్దాం.
గత దశాబ్దికాలంలో సామాజికరంగాలపై కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు, ఖర్చులు తగ్గుదలను సూచిస్తున్నాయి. 2014-19 మధ్యకాలంలో సగటు సామాజిక వ్యయం ఎనిమిది శాతం చొప్పున పెరిగితే ఈ పెరుగుదల 2019-24 సంవత్సరాల్లో నాలుగు శాతం మాత్రమే. అంటే ఈ నిధులను ప్రభుత్వం ఇతర రంగాలకు మళ్లిస్తోంది. గత ఏడాదికంటే ఈ ఏడాది సామాజికపద్దులపై వ్యయం మరింత కుదింపుకు గురికానుంది. అదేసమయంలో సామాజిక వ్యయంలో సేవా, వితరణ రంగాల నుండి పైన ప్రస్తావించినట్లు ప్రత్యక్షంగా ఆర్థికోత్పత్తితో ముడిపడి ఉండే అనుబంధరంగాలకు ప్రాధాన్యత పెరుగుగుతుంది. అంటే నెలసరి వివిధ రూపాల్లో జనానికి చేరే నగదు సహాయం తగ్గిపోతుంది. ఇళ్ల నిర్మాణంతో సహా ఇతర గ్రామీణ మౌలిక వసతుల కల్పన రంగానికి కేటాయింపులు పెరుగుతున్నాయి. పరోక్షంగా సిమెంట్, ఇనుము, ఇతర అనుబంధ ఉత్పత్తిరంగాలతో ముడిపడి ఉన్న రంగాలకు కేటాయింపులు పెరుగుతున్నాయి.
అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడే కొద్దో గొప్పో మిగులు కూడా సాంప్రదాయక పారిశ్రామికరంగానికి తరలించటంపై ప్రభుత్వం మొగ్గుచూపింది. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రజల కొనుగోలు శక్తి లేక పారిశ్రామిక వాణిజ్య ఉత్పత్తులు అమ్ముడుపోగ గోదాముల్లో నిల్వలు పేరుకుంటున్నాయి. ఈ నిల్వలు తగ్గించటం అంటే ఈ సరుకులను ఖర్చు చేయానికి వీలుగా ప్రభుత్వమే కొన్ని రంగాలకు నిధులు కేటాయించి ఆ నిధుల ద్వారా గోదాముల్లో నిల్వపడి ఉన్న వాణిజ్య పారిశ్రామిక సరుకులకు గిరాకీ కల్పిస్తోంది. తద్వారా ఉత్పత్తి, వాణిజ్య రంగాలల్లోని పరిశ్రమలకు లాభాలు గ్యారంటీ చేసేందుకు చర్యలు తీసుకొంటోంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పారిశ్రామిక వస్తువులు, సరుకులు, సేవల వినియోగాన్ని ప్రోత్సహించే అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచుతోంది కేంద్ర ప్రభుత్వం.
2014-19 మధ్యకాలంలో ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, కార్మికశాఖలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనకబడిన కులాల అభివృద్ధి వంటి శాఖలకు కేటాయింపులు పెరిగాయి. ఈ మార్పు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో వస్తున్న మార్పులను సూచిస్తోంది. గత మూడు ఎన్నికల్లో ఎస్సీ, బిసిలు ఎక్కువగా బిజెపి అభ్యర్ధులకు ఓటువేయటానికి ఈ ప్రాధాన్యతల మార్పుకు మధ్య ఉన్న సంబంధాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అయితే 2019 తర్వాతి కాలంలో ఈ రంగాలకు ప్రాధాన్యతలు తగ్గిపోయాయి. కేటాయింపులు తగ్గాయి.
కోవిడ్ కంటే ముందు వైద్య ఆరోగ్య రంగాలకు మొత్తం సామాజిక పద్దుల వ్యయంలో 16 శాతం దక్కితే కోవిడ్ అనంతర కాలంలో ఇది ఐదు శాతానికి పడిపోవటం గమనించాల్సిన విషయం.
2014-19 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ పథకాల వారీగా చూసుకుంటే మొత్తం సామాజిక పద్దుల ఖర్చులో స్వఛ్చభారత్ పథకానికి 25 శాతం, ఉపాధి హామీ పథకానికి 17 శాతం, ఆవాస్ యోజన పథకానికి 14 శాతం ఉంటే కోవిడ్ అనంతర కాలంలో ఆయా పథకాలకు కేటాయింపులు, వాటాలు తగ్గుతున్న ధోరణి కనిపిస్తోంది.
– అవని కపూర్, శరద్ పాండే (ఇండియా స్పెండ్.ఆర్గ్)
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.