
ప్రయాగ్‌రాజ్‌లో పన్నెండేళ్లకొకసారి జరిగే మహాకుంభ మేళా 45రోజుల పాటు జరుగుతుంది. బహుశా ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సామూహిక పవిత్ర స్నానాలు చేసే సందర్భంగా రికార్డు అయ్యింది. కుంభమేళా గురించి చర్చించుకునేటపుపడు చరిత్ర, నమ్మకాలు, కథలు, కాల్పనిక ఘట్టాలు ఒకదానికొకటి ముడి వేసుకుని ఉంటాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులను కుంభమేళా ఎలా ఆకర్షించింది? వివిధ నాగరికతల్లో పవిత్రస్నానం సాంప్రదాయం ఏమిటి అన్న విషయాలు తెలుసుకుందాం.
మహాకుంభ్ : తిరునాళ్ల, ధార్మిక ఉత్సవం
మహాకుంభ్ ప్రపంచవ్యాప్తంగా భక్తులనే కాదు. రచయితలు, ప్రజానాయకులను కూడా ఆకర్షించింది. 1897లో భారతదేశానికి వచ్చిన అమెరికన్ నవలా రచయిత మార్క్ ట్వైన్ తన ఫాలోయింగ్ ది ఎంక్వయిరర్: జరన్నీ అరౌండ్ ది వరల్డ్ అన్న గ్రంథంలో కుంభమేళా ప్రస్తావన ఉంది. కుంభమేళాకు వచ్చే ప్రజల్లో నాటుకుపోయిన భక్తిప్రపత్తుల గురించి వివరణలూ ఉన్నాయి. ఆయన మాటల్లో
‘‘కుంభమేళాకు వచ్చిన భక్తులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వస్తున్నారు. ఎండనక, వాననక, నెలలతరబడి ప్రయాణం చేసి వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. ప్రయాణంలో తెచ్చుకున్న సామాగ్రి అయిపోయి కడుపు మాడ్చుకుని వచ్చిన వారూ ఉన్నారు. వాళ్లందరినీ నడిపించింది ఒక్కటే. ప్రగాఢమైన విశ్వాసం. ఒకసారి ప్రయాగరాజ్‌లో స్నానం చేసిన తర్వాత వాళ్లలో సంతృప్తి, సంతోషం పెల్లుబుకుతోంది. జీవితానికి సరిపడా తృప్తి చెందుతున్నారు. జీవితంలో చేసిన పాపాలన్నీ కడుక్కోబోతున్నారు. ఈ పవిత్ర జలాల్లో స్నానమాచరించిన తర్వాత వాళ్లు పట్టుకుందల్లా బంగారమైపోతుందన్న నమ్మకంతో వస్తున్నారు…
‘‘కేవలం వాళ్లకున్న భక్తిప్రపత్తులు, నమ్మకం కారణంగానే దేశంలోపలు ప్రాంతాల నుండి యువకులు, వృద్ధులూ, ఆరోగ్యవంతులు, రోగిష్టులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వస్తున్నారు. మార్గమధ్యంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధల గురించి కించిత్తు విచారం కూడా వ్యక్తం చేయటం లేదు. నమ్మకం, విశ్వాసాలకున్న శక్తి అదేనేమో. ఇదంతా ప్రేమతో జరుగుతున్న, జరుపుతున్న వ్యవహారం. నాకు అర్థం కావటంలేదు. దీనివెనక ఉద్దేశ్యం ఏమైనా మాలాంటి వారికందరికీ ఇదో అద్భుతమే. ’’అన్నారు. తన పరిశీలనను నమోదు చేస్తూ ఇది ఓ తిరునాళ్ల, ధార్మిక ఉత్సవం అని అభిప్రాయపడ్డారు.
మొహంజొదారో, రోమన్ నాగరికతల్లో సామూహిక స్నానాలు
హాజరవుతున్న జనసంఖ్య రీత్యా మహాకుంభ అతి పెద్దదే అయినప్పటికీ ఇదే మొదటిది కాదు. వివిధ నాగరికతల్లో సామూహిక స్నానాల సాంప్రదాయం ఉంది. ఈ సందర్భాలు ప్రధానంగా ఒకరినొకరు కలుసుకోవడానికి, తెలుసుకోవడానికీ ఏర్పాటు చేసిన సందర్భాలు. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నాటికే సింధు నాగరికత విలసిల్లిన మొహంజొదారో ప్రాంతాల్లో సామూహిన స్నానపు తొట్లు ఉన్నాయని, నివాస ప్రాంతంలో ఉండేవారంతా కలిసే స్నానం చేసేవారని మనకు ఇప్పుడు ఆధారాలతో వెల్లడైంది. సింధు నాగరికత నాటికే ఇంటింటికీ స్నానపు గడుదు, మురుగునీటి పారుదల వ్యవస్థలు ఏర్పాటైనా సామూహిక స్నానపు వసతులు ఓ క్రతువుగా జరిగేవని పరిశోధకులు వెల్లడిరచారు.
సముద్రాలు కావచ్చు, నదులు, కాలువలు, చెరువులు, కుంటలు లేదా ఆధునిక కాలం నాటి స్పాలు, ఈతకొలనులూ వంటి సామూహిక స్నానపు కేంద్రాలు వివిధ నాగరికతలు, సంస్కృతుల్లో కీలక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఉదాహరణకు రోమన్ నాగరికతలో కూడా క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం ప్రాంతంలో బహిరంగ స్నానాలు, సామూహిక స్నానాలు సామాజిక కారక్రమాలుగానే ఉండేవి. పురావస్తు ఆధారాలు, లిపిశాస్త్రం, సాహిత్య వనరులు ద్వారా సంగ్రహించిన చరిత్ర ఆధారంగా అమెరికాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు గారెట్ జి ఫగన్ రాసిన రోమన్ సామ్రాజ్యంలో బహిరంగ స్నానాలు గ్రంథంలో ‘‘రోమన్ సామ్రాజ్యంలో ఈ క్రతువులు ఆధునిక కాలంలో మస్సాజ్ పార్లర్, స్నానపు గది, జిమ్నాజియంల కలగలుపుగా ఉంటుంది.’ అని వివరించారు.
భవననిర్మాణ శాస్త్రం, శాసనాలు వంటివాటిల్లో ఈ బహిరంగ స్నానవాటికలు నిర్మాణం విధివిధానాలు, రీతిరివాజులు గురించి విపులంగా ప్రస్తావించబడిరది. బట్టలు విప్పటం మొదలు శరీరంపై లేపనాలు అద్దటం, చెమటలుకారేవరకూ వ్యాయామం చేయటం, శరీరాన్ని ఇటువంటి రాయితోనో, మరో సున్నితమైన వస్తువుతోనో (ఇప్పట్లో మనం చూస్తున్న స్క్రబ్స్ లాంటివి) శుభ్రం చేసుకోవటం, వేడినీళ్ల గదిని ఎంచుకుని స్నానానికి ఉపక్రమించటం వంటి పద్ధతులు గురించి వివరమైన ప్రస్తావనలున్నాయి.
వర్గవిభజితమైన రోమన్ సమాజంలో వేర్వేరు సామాజిక తరగతులకు వేర్వేరు స్నానపు వాటికలుండేవి. చిన్నవి, పెద్దవీను. భారీ స్నానపు వాటికలు ధర్మేలనీ, చిన్నవాటిని బాలనీలని పిలిచేవారు. వీటన్నింటిలో వచ్చిన వారికి స్నానాలు చేయించటానికి, ఒళ్లు శుభ్రం చేయటం, ఇతర సంబంధిత పనులు చేయటానికి బానిసలు సిద్ధంగా ఉండేవారు. ఈ రకమైన స్నానపు క్రతువుల వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని పలు వ్యాఖ్యానాలు ప్రస్తావిస్తున్నాయి. ఆ కాలంలో రోమ్ నగరంలో నివశించే గ్రీకు భౌతికశాస్త్రవేత్త అస్కెలేపైడెస్ ఆరోగ్యం కోసం స్నానం చేయాలని ప్రతిపాదించాడు. అయితే బహిరంగ స్నానపు వాటికల్లో పారిశుద్ధ్యం కొరత, మురుగునీటి వ్యవస్థ లేకపోవటం వంటి వాటివలన ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి.
ముస్లిం దేశాల్లో హమ్మమ్
టర్కీ, ట్యునీషియా, ఇరాన్ వంటి ముస్లిం దేశాల్లో ఉండే ఈ సాంప్రదాయాన్ని హమ్మమ్ అంటారు. ఈ సాంప్రదాయపు విధి విధానాలు పరిశీలిస్తే రోమన్ సంస్కృతి ప్రభావం ఉన్నట్లుగా కనిపిస్తుంది. కాకపోతే రోమన్లో స్త్రీపురుషులకు ఉమ్మడిగా స్నానవాటికలు ఉంటే ముస్లిం దేశాల్లో వేర్వేరుగా ఉండేవి. రోమన్ తరహాలోనే హమ్మమ్లో కూడా లేపనాలు, వ్యాయామం, శుద్ధి వంటి క్రమం పాటించేవారు. కాకపోతే ఇవన్నీ స్నానపు గదులకే పరిమితమయ్యేవి. ఒకేచోట ఏర్పాటుచేసిన స్నానపు గదుల్లో ఈ క్రతవులు పాటించేవారు.
టర్కీలో ఈ స్నానపు ఘట్టాలు విలక్షణమైనవే అయినప్పటికీ ట్వైన్ టర్కీ సందర్శించినప్పుడు ఆయన బాగా నిరాశ చెందారు. ‘‘చూడటానికి ఓ గ్రామీణ ప్రాంతంలోని ఆసుపత్రిలా ఉండేదే తప్ప మరేమీ లేదు. అని రాశారు. కానీ నిజానికి పితృస్వామిక పరదా వ్యవస్థల కట్టుబాట్ల నుండి అరబ్ దేశాల్లో హమ్మమ్కు వచ్చేటప్పుడు మాత్రమే స్వేఛ్చ దొరికేది.
పాలస్తీనా కవి ఫద్వా తుగన్ రాసిన కొండలు గుట్టలు దాటి: ఓ ఆత్మకథలో చిన్నతనంలో తల్లితో కలిసి ఇటువంటి సామూహిక స్నానఘట్టాలకు వెళ్లటం ఎంత ప్రాణానికి ఎంత హాయిగా ఉండేదో వివరించింది. నబ్లస్ నగరంలో ఇటువంటి స్నానపు వాటికలకు వెళ్లటం మహిళలకు వ్యాహ్యాళికి వెళ్లినట్లు ఉండేదని తెలిపింది. తుగన్ మాటల్లో ‘‘ ఈ మహిళలను చూస్తే ఎంతో ఆహ్లాదంగా ఉండేది. వాళ్ల జీవితాలు వాస్తవాలకు దగ్గరగా వుండేవి. కులీన కుటుంబాలకు చెందిన మహిళల జీవితాల్లో కనిపించే పటాటోపం, భేషజం వీరిలో కనిపించేది కాదు.’’
ఇతర సంస్కృతుల్లో సామూహిక స్నానాలు
నైలు నదిలో స్నానం చేయటం ఎంతో పవిత్రమైనదిగా భావించేవారు ఈజిప్షియన్లు. విశాలమైన నీటి తొట్లును వాడేవారు ఈజిప్షియన్లు. అదేవిధంగా రష్యన్ సంస్తృతిలో ఈ సాంప్రదాయాన్ని బోన్యా అని పిలిచేవారు. ఇక్కడ కూడా బహిరంగ స్నానాలు, సామూహిక స్నానాలు పవిత్రతతోనూ, శుద్ధి, నిర్మలత్వం, మోక్షం వంటి భావనలతో ముడిపడి ఉండేవి.
కొరియాలో ప్రకృతిసిద్ధమైన వేడినీటి వనరులు ఇటువంటి బహిరంగ స్నానవాటికలుగా ఉండేవి. వీటిని జ్జిమిజిల్బాంగ్ అని పిలిచేవారు. స్త్రీలు, పురుషులు వేర్వేరుగా స్నానాలకు వెళ్లేవారు. అప్పుడపుడూ ఈ కేంద్రాలకు కుటుంబాలకు కుటుంబాలు వ్యాహ్యాళిగా వెళ్లేవి. ఫిన్లాండ్లో సౌనాస్ అనే సాంప్రదాయం నేటికీ అమల్లో ఉంది. అక్కడ కూడా ఆరోగ్యకారణాలతో పాటు సామాజిక వేదికలుగా అమలు జరుగుతున్నాయి. ఓ పౌరకూడిక సందర్భంగా ఉండేవి.
జపాన్‌లో ఇటువంటి బహిరంగ సామూహిక స్నానాలు క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో మొదలయ్యాయి. 19వ శతాబ్దం వరకూ ఉనికిలో ఉన్నాయి. కృత్రిమ వేడినీటి కేంద్రాలను సెంటోస్ అనీ, ప్రకృతి సిద్ధమైన వేడినీటి పాయలను ఆన్‌సెన్ అనీ పిలుస్తారు. జనం కలుసుకునే సందర్భంతో పాటు ధార్మికత, ఆరోగ్యం కోసం కూడా ఈ కేంద్రాలకు వచ్చేవారు.
జపాన్‌లో స్త్రీపురుషులు ఉమ్మడిగా ఉపయోగించుకునే కేంద్రాలను కొన్యోకు ఆన్‌సెన్ అని పిలిచేవారు. ఇవి కూడా 19వ శతాబ్ది వరకూ ఉనికిలో ఉన్నాయి. రానురాను వ్యక్తిగత గోప్యత, నగ్నత్వం గురించి భావనలు నాగరికతల్లో వేళ్లూనుకోవటంతో క్రమంగా ఈ సాంప్రాదాయాలు కనుమరుగవుతూ వచ్చాయి.
మొహమ్మద్ ఆసిం సిద్దికి
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.