
నేను ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వాసాలను, సంస్కృతులను అధ్యయనం చేశాను. ఆ అనుభవాల నుంచి మరింత మెరుగైన సమ్మిళిత, సుస్థిర ద్రవ్య వ్యవస్థను ఎలా రూపొందించుకోవాలో చర్చిద్దాం.
ద్రవ్య సేవలు నానాటికీ మరింత అధునాతనంగా రూపొందుతున్నాయి. దానికి తగినట్లుగానే క్రిప్టో కరెన్సీ, హ్యాకింగ్, డిజిటల్ దోపిడీ వంటి మోసాలు కూడా పెరుగుతున్నాయి. చాలామంది ప్రజలు ఇప్పటికే ద్రవ్య కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. డబ్బును సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే, అది అనేక మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ప్రాథమికంగా డబ్బు అనేదొక సామాజిక, సాంస్కృతిక నిర్మాణం. ఆహారం, దుస్తులు, నివాసం వంటి రోజువారీ అవసరాలను తీర్చుకొనేందుకు ప్రజలు డబ్బుని సృష్టించారు. సమాజానికి సేవ చేయాల్సిన డబ్బు ఇప్పుడు చివరికి సమాజానికే యజమానిగా అవతరించింది. ఆరోగ్యం, సంక్షేమం, ప్రేమలతో సహా జీవితంలోని అన్ని పార్శ్వాలను డబ్బు ప్రభావితం చేస్తుంది. చివరికి మానవ సంబంధాలు కూడా లావాదేవీలుగా మారిపోతాయి.
మానవులు ఇప్పటికే భూగ్రహానికి అపారనష్టం కలగజేశారు. దీనికి కారణమైన ఆర్ధిక విధానాలను, పాలనా వ్యవస్థలను తక్షణం పునఃసమీక్షించాలి. భూమిని తొలిచేసి, దోపిడీ చేసి, నాశనం చేయడం కాకుండా భూమిని పరిరక్షించే విధానాలను రూపొందించాలి.
గత యాభై సంవత్సరాల కాలంలో, ద్రవ్యరంగం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందరినీ ప్రభావితం చేయగలుగుతోంది. వాస్తవానికి వ్యాపారరంగంలో మార్కెటింగ్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, మేనేజ్ మెంట్ లాంటి ఇతర విభాగాలు ద్రవ్యానికి అనుబంధంగా, విధేయంగా మారిపోయాయి. వాటాదారుల సంపదలో, ఆదాయాల్లో స్థిరమైన వృద్ధిని సాధించడం కోసం గరిష్టస్థాయి లాభాల్ని సాధించడమే ప్రథమ ప్రాధాన్యతగా మారింది. దీనినే ఫైనాన్షియలైజేషన్(ఆర్థికీకరణ)అంటారు.
అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యరంగం తాలూకు జ్ఞాన వ్యవస్థని (epistemology), విశ్వాసాల్ని(ontology) సమీక్షించడానికి ఇది సరైన సందర్భం. ఈ ద్రవ్య వ్యవస్థ తాలూకు కీలక భావనలు ఏంటి?అవెక్కడ దారి తప్పాయి? వాటిని ఏ రకంగా సంస్కరిస్తే భవిష్యత్తులో సుస్థిరమైన సమాజాన్ని రూపొందించుకోగలుగుతాం?
ప్రపంచంలోని అత్యంత విస్తారమైన సాంస్కృతిక, మతవైవిధ్యాలను పరిగణనలోకి తీసుకొని; అసమానతలు, సుస్థిరతకు సంబంధించిన సమస్యలను కూడా దృష్టిలో వుంచుకొని నేను డబ్బుకు సంబంధించిన అనేక అనుభవాలను, విశ్వాసాలను, దృక్పథాలను పరిశీలించాను. వీటన్నిటినీ నా కొత్త పుస్తకం, ఆర్గానిక్ ఫైనాన్స్(Organic Finance)లో పేర్కొన్నాను.
ఫలితంగా భూమి, గాలి, నీళ్ళ క్షేమాన్ని గౌరవించే సేంద్రీయ వ్యవసాయంతో పోలిన ఒక విధానం రూపొందింది. సుస్థిరమైన సమాజాలని రూపొందించడంలో సంప్రదాయం, నైతికత, సంస్కృతి,విశ్వాసం చాలా ప్రభావాన్ని చూపుతాయి. డబ్బు సంపాదించడం అనేది ఒక సమగ్ర సంస్కృతిలో భాగంగా మొత్తం పర్యావరణంతో కలిపి ఆలోచించాల్సిన విషయంగా వుంటుంది. వివిధ సంస్కృతుల్లో వెలికి తీసిన విస్మృత జ్ఞానంలో డబ్బు పట్ల ఎటువంటి వైఖరి ప్రకటితమయిందో గమనించాను.
అనేక మతాలకు డబ్బు పట్ల, అప్పు పట్ల, శాంతిని సహజీవనాన్ని రూపొందించడంలో వాటి పాత్ర పట్ల చాలా బలమైన అభిప్రాయాలున్నాయి. చాలా మతాలు స్వంత ప్రయోజనం కోసం సంపదను కూడబెట్టడాన్ని తిరస్కరించాయి. దురాశ గురించి, భౌతిక కోరికల పరిమితుల గురించి హెచ్చరించాయి. కానీ ఈ సూత్రాలన్నీ ప్రపంచవ్యాప్తంగా రూపొందించి బోధిస్తున్న ఆధునిక నైరూప్య అర్థశాస్త్ర, ద్రవ్య భావనలకు పూర్తిగా విరుద్ధమైనవి. వనరులను వెలికి తీయడం, కొల్లగొట్టడం ద్వారా పర్యావరణ క్షీణతకు ఈ విధానాలు దారి తీస్తాయి.
అసంఖ్యాకమైన సంస్కృతులు, సంప్రదాయాలు – సమాజాలను, సామాజిక సంబంధాలను నిర్మించడంలో కుటుంబ సంబంధాలు, దాతృత్వం, స్వచ్ఛంద స్పందన, సేవలు చాలా ముఖ్యమైనవని నొక్కి చెప్పాయి. నమ్మకం, పరస్పర సహకారం అనేవి అనేక సంస్కృతులకు, విశ్వాసాలకు కేంద్రభావనలుగా వున్నాయి. అయినప్పటికీ వీటిని ఆధునిక ఆర్ధిక శాస్త్ర బోధనల్లో విస్మరించారు, నిర్లక్ష్యం చేశారు.
అనేక దేశీయ సంప్రదాయాల్లో చారిత్రకంగా చూస్తే, జీవనోపాధి విషయంలో డబ్బు నిర్వహించే పాత్ర చాలా తక్కువ. ఉదాహరణకు అనేక వందల సంవత్సరాల నుంచి జైనులు ప్రజల కోసం, జంతువుల కోసం, పర్యావరణం కోసం దాతృత్వాన్ని ఆచరిస్తున్న చరిత్ర వుంది.
నా పుస్తకంలో మొదటి చాప్టర్ పేరు “ఈవిల్ ఫైనాన్స్” ఇందులో కొంతమంది పోటీ, దోపిడీ, పీడనలే లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారో వివరించాను. బహుళజాతి సంస్థలు గ్లోబల్ పవర్‌ను కూడగట్టుకున్నాయి. వాటిని నిర్వహించడం, నియంత్రించడం చాలా కష్టం. వాస్తవానికి ఈ విధానం సుస్థిరమైన అభివృద్ధికి వ్యతిరేకమైనప్పటికీ, తరచుగా దీన్నే శాస్త్రీయ వాస్తవికతగా అంగీకరిస్తూ వుంటారు.
చైతన్యయుతమైన, బాధ్యతాయుతమైన భవిష్యత్ ద్రవ్యవ్యవస్థను రూపొందించడంలో ప్రకృతి, ఆధ్యాత్మికత- రెండూ చాలా ముఖ్యపాత్రను పోషిస్తాయి. గ్రామీణ సమాజాలతో, జంతువులతో కూడిన జీవావరణం పట్ల దయతో కూడిన ద్రవ్య దృక్పథం – ఆచరణలో భూసారాన్ని, నీటి స్వచ్ఛతను, కాలుష్యరహిత గాలిని పెంపొందించడంపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. మానవుల పోషణకు లోటు లేకుండా, ప్రకృతికి విధేయులై ఉండేలా ఈ దృక్పథం దారి తీస్తుంది.
లాభాలకంటే ముందు నమ్మకం..
ప్రపంచవ్యాప్తంగా, ప్రజలకు విలువైన సేవలని అందిస్తూ, తమ కుటుంబాలని పోషించుకోవాలనుకునే లక్షలాది చిన్నవ్యాపారస్తులు వున్నారు. తమ వ్యాపారాలు విపరీతంగా వృద్ధి చెందాలన్న ఆశలు వాళ్లకు లేవు. తాము నిర్వహించగలిగిన పరిమితిలోనే విస్తరణ వుండాలని కోరుకొంటారు. వాళ్ళు తమ వ్యాపారాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని అనుకొంటారు. కాబట్టి, వారి వ్యాపార సంస్కృతిలో సుస్థిరత అనేది ఒక విడదీయరాని అంశంగా వుంటుంది. లాభాల కంటే, సంపద కంటే నమ్మకానికి, సంబంధాలకు ఎక్కువ విలువనిస్తారు.
ఈ పుస్తకంలో లాభాలు, సంపద వృద్ధి ఎటువంటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయో; కాలుష్యం, ఉద్యోగ భద్రత లేని ఉపాధి వంటి దుష్ప్రభావాలు ఎలా సంభవిస్తాయో వివరించాను. నా దశాబ్దాల పరిశోధన, అధ్యాపక అనుభవం నుంచి గ్రహించిన విషయం ఏంటంటే- నైతికత, నమ్మకం, సత్సంబంధాలు, సమాజం అనే పదాలు కార్పోరేట్ ఫైనాన్స్, ఇంకా బ్యాంకింగ్ టెక్స్ట్ బుక్స్‌లో అదృశ్యమైపోతున్నాయి. వాటి స్థానంలో వ్యక్తి స్వార్థం, లాభానష్టాలని బేరీజు వేసుకొనే మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు.
మన సంస్కృతి, నైతిక విలువలు, డబ్బుకున్న పరిమితుల తాలూకు మూలాల్లోకి మనం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళకపోతే, ESG(environment, social, governance)వంటి పెట్టుబడులు, లేక నెట్ జీరో లక్ష్యాలు వంటి ద్రవ్య సంస్కరణలు స్వల్పకాలిక, దురాశాపూరితమైన, స్వార్థపూరిత మార్కెట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేవిగా మారతాయి.
ఫైనాన్స్ రంగంలో పని చేసేవారికి వస్తు వినిమయానికి వున్న పరిమితులను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ద్రవ్య వ్యవస్థ తిరిగి సమాజానికి, ప్రకృతికి సేవకునిగా మారగలదు. కుటుంబ, సామాజిక విలువలను పెంపొందించడానికి ఉపయోగపడగలదు. అకౌంటింగ్, ఎకనామిక్స్, ఫైనాన్స్ శిక్షణల్లో నైతిక విలువలని, సంస్కృతిని కేంద్రంగా తీసుకుని బోధనలు ప్రారంభించవచ్చు.
ఫైనాన్స్ పాఠ్యాంశాల్లో స్వీయ అనుభవాల చిత్రణ, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను చేర్చినట్లయితే, మనం గొప్ప సంవాదాన్ని, బలమైన నైతిక నిర్మాణాల్ని రూపొందించగలం. డబ్బును దాని స్థానానికి పరిమితం చేయగలం. అలా ద్రవ్య శాస్త్రాన్ని తిరగరాయడం వల్ల విభిన్న సంస్కృతులను, సంప్రదాయాలను గౌరవించడానికి వీలు కలుగుతుంది. ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని, కలిసి పని చేయడం ద్వారా సమసమాజాన్ని, ఆరోగ్యకరమైన భూప్రపంచాన్ని నిర్మించడానికి మార్గం సుగమం అవుతుంది.
అనువాదం: అమలేందు
(వ్యాస రచయిత లండన్‌లోని సిటీ సెయింట్ జార్జ్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా ఉన్నారు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.