
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ద్వారా భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఒక సీనియర్ అధికారిపై ఒక గుంపు దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వారానికోసారి జరిగే కార్పొరేషన్ ఫిర్యాదుల విచారణ సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై పలు ప్రశ్నలను లేవనెత్తారు.
న్యూఢిల్లీ: సోమవారం(జూన్ 30)నాడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియో ద్వారా భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ప్రధాన కార్యాలయానికి సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక సీనియర్ మున్సిపల్ అధికారిపై కొంతమంది వ్యక్తులు అమానవీయంగా దారుణాతిదారుణంగా దాడి చేశారు.
వార్తా కథనం ప్రకారం, కార్పొరేషన్ వారపు ఫిర్యాదు విచారణ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
బీఎంసీ ఓఏఎస్ అదనపు కమిషనర్ రత్నాకర్ సాహును ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులతో కూడిన సమూహం అమానవీయంగా కొడుతూ, కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకెళ్లడాన్ని వీడియోలో చూడవచ్చు.
ఈ సంఘటనకు సంబంధించి, బీజు జనతాదళ్(బీజెడి) చీఫ్, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విచారాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీని డిమాండ్ చేశారు.
ఓడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థితో సంబంధం ఉన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కౌన్సిలర్ ముందే ఈ సంఘటన జరిగిందని కూడా ఆయన ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి ఇంకా అన్నారుగా, “ఈ వీడియో చూసి నేను పూర్తిగా విభ్రాంతికి గురయ్యాను. అదనపు కార్యదర్శి హోదా కలిగిన సీనియర్ అధికారి, బీఎంసీ ఓఏఎస్ అదనపు కమిషనర్ శ్రీరత్నాకర్ సాహును తన కార్యాలయం నుంచి బయటకు లాగారు. ఇంకా ఓడిపోయిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థితో సంబంధం కలిగిన బీజేపీ కౌన్సిలర్ ముందు అమానవీయంగా కాళ్లతో, పిడికిలితో దారుణంగా కొట్టారు.”
ఆయన ఇంకా తెలియజేస్తూ, “భయంకరమైన విషయం ఏమిటంటే, రాజధాని భువనేశ్వర్ మధ్యలో పట్టపగలు ఒక సీనియర్ అధికారి తన కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులను వింటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది” అని అన్నారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నవీన్ పట్నాయక్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. “ఈ అవమానకరమైన దాడికి పాల్పడిన వారిపైనే కాకుండా, ముఖ్యంగా దాడికి కుట్ర పన్నిన రాజకీయ నాయకులపై కూడా తక్షణం, ఆదర్శప్రాయమైన చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అధికారి తన ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వ్యక్తులు నేరస్థులలా ప్రవర్తించారు. ఒక సీనియర్ అధికారి తన సొంత కార్యాలయంలో సురక్షితంగా లేకపోతే, సాధారణ పౌరులు ప్రభుత్వం నుంచి ఎలాంటి శాంతిభద్రతలను ఆశించవచ్చు” అని ప్రశ్నించారు.
“ప్రభుత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్య తీసుకుంటారని, మాజీ గవర్నర్ కుమారుడు ఒక అధికారిపై దాడి చేసినట్లుగా ఈ హేయమైన చర్యను శిక్షించకుండా ఉండనివ్వరని నేను ఆశిస్తున్నాను. ఒడిశా ప్రజలు దీనిని క్షమించరు” అని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో సాహుపై జరిగిన దాడిని నిరసిస్తూ బీజేడీ కార్మికులు, బీఎంసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారి అయిన జనపథ్‌లో రోడ్డును దిగ్బంధించారు. దీంతో ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం కలిగింది.
దాడికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు అరెస్టు చేయబడిన మేయర్ సులోచనా దాస్, ఒడిశాలో “ఎవరూ సురక్షితంగా లేరు” అని లైవ్ మింట్‌తో అన్నారు.
ఈ కేసు విషయంలో ఖార్వెల్ నగర్ పోలీస్ స్టేషన్లో సెక్షన్లు 333(అతిక్రమించడం), 132 (దాడి లేదా క్రిమినల్ ఫోర్స్), 121 (1), 121 (2) (హాని కలిగించడం), 109 (హత్యా ప్రయత్నం), 351 (2) (క్రిమినల్ బెదిరింపు), 140 (2) (కిడ్నాప్), 304 (చరాస్తులను స్వాధీనం చేసుకోవడం), 61 (2) (క్రిమినల్ కుట్ర), భారత శిక్షాస్మృతిలోని ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
ఇదిలా ఉండగా, ఈ సంఘటనకు సంబంధించి జీవన్ రౌత్, రష్మి మహాపాత్ర, దేబాషిష్ ప్రధాన్‌లతో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.