
ఇన్సూరెన్స్ రంగంలోని ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రధానమైన ట్రేడ్ యూనియన్ సంస్థ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏఐఐఇఏ), జూలై 1 నాటికి ప్లాటినం జూబిలీ వసంతంలోకి అడుగుపెడుతోంది. సంఖ్యాపరంగా చిన్నదే అయినప్పటికీ అత్యంత ప్రభావంతమైన ప్రయాణాన్ని ఏఐఐఇఏ సాగించింది. ఎల్ఐసీ ఆవిర్భావానికి కన్నా ముందు 1951 జూలై 1 నాటికి ఏఐఐఇఏ మనుగడలోకి వచ్చింది. ఎల్ఐసీలోని ఉద్యోగుల భవిష్యత్తును సుస్థిరమైన స్థితిలో, సహచర రంగాలన్నింటికన్నా మిన్నగా ఏఐఐఇఏ నిర్మించిందని చెప్పడానికి, చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎల్ఐసీ ఆవిర్భావంతోపాటు దేశవ్యాప్తంగా అది పటిష్ట పడాలని, భారత ఆర్థిక వ్యవస్థకు ఒక ఛోదకశక్తిలా ఏర్పడాలని నిరంతరం ఉద్యోగులను పురమాయిస్తూ వచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ కార్యక్రమాలకు సంబంధించిన ఉద్యోగులకు మాత్రమే ఏఐఐఇఏ ప్రాతినిధ్యం వహిస్తోంది. అయిన్నప్పటికీ నూతన వ్యాపార సేకరణలో నిమగ్నమై ఉండే ఫీల్డ్ ఫోర్స్, ఏజెంట్లను అనేక సందర్భాల్లో కదిలిస్తూ సర్వీసింగ్ ఫోర్ట్ నైట్లను, నూతన వ్యాపార సేకరణ కార్యక్రమాల నిర్వహణకు పిలుపునిచ్చింది.
మెగా బిజినెస్ డే పేరుతో నూతన వ్యాపారంలో దేశవ్యాప్త రికార్డు నెలకొల్పడానికి మేనేజ్మెంట్తో కలిసి తనవంతు కృషిచేసి ఎల్ఐసీ ఇండియా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్సూరెన్స్ అంటే ఎల్ఐసీ అనే పేరు సంపాదించడంలో, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్‌గా అవతరించడంలో, అంతేకాకుండా ఇప్పటికి కూడా 70 శాతానికి పైగా ప్రజలు ఎల్ఐసీని మాత్రమే ఆదరించేలా చేయడంలో ఒక కార్మిక సంఘంగా ఏఐఐఈఏ ఎంతో కృషి చేసింది. పాలసీదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ కర్తవ్యమని 1974లో తన అఖిల భారత మహాసభలో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. “సంస్థ ప్రగతియే ఉద్యోగుల భవిష్యత్తు” అన్న నినాదాన్ని మర్చిపోకూడదని ఎప్పటికప్పుడు ఉద్యోగులను వెన్నుతడుతూనే ఉంటుంది. ఎల్ఐసీ మొత్తం వ్యాపారంలో కనీసం 10 శాతాన్ని కూడా ఏ ప్రైవేట్ కంపెనీ చేరుకోలేకపోతున్నాయి.
అనుసరణీయ ఎత్తుగడలు ఏఐఐఇఏ సొంతం..
ఎల్ఐసీని ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి అనేక సందర్భాల్లో ఏఐఐఇఏ ఆచరించి, విజయం సాధించిన ఎత్తుగడలు ఎంతో అనుసరణీయమైనవి. 1967లో అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలేమీ చేయకుండా, ఎల్ఐసీలో కంప్యూటరీకరణ ప్రవేశపెట్టాలని ఏకపక్ష నిర్ణయంతో సంస్థ యాజమాన్యాన్ని పురమాయించింది. అప్పుడప్పుడే విస్తరిస్తున్న ఎల్ఐసీలో భవిష్యత్తు నియామకాలు జరగడానికి, పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుకు ఈ కంప్యూటరీకరణ నష్టం కలుగజేస్తుందన్న అంచనాలతో దానిని ఏఐఐఇఏ పూర్తిగా వ్యతిరేకించింది. ఇందులో భాగంగా ఎలాగైనా కంప్యూటర్లను కలకత్తా డివిజనల్ ఆఫీస్‌లో ప్రవేశపెట్టాలని మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని భౌతికంగా అడ్డుకోవాలని నిర్ణయించింది. సముద్ర మార్గాన కంప్యూటర్లను ఫలానా రోజు తీసుకురానున్నారు అనే సమాచారం ఏఐఐఇఏ శ్రేణులకు ముందే తెలిసింది. దీంతో ఎక్కడికైతే తెస్తున్నారో ఆ ఇలాకో భవన పరిధిలోని ఎల్ఐసీ ఆఫీసు వద్ద ఏఐఐఇఏ శ్రేణులు కాపలా కాశారు. అంతేకాకుండా రాత్రంతా కర్రల సహాయంతో గస్తీ చేస్తూ, యాజమాన్యాన్ని- కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆ రోజుల్లో అధికారంలో ఉన్న జ్యోతిబసు ప్రభుత్వం ఏఐఐఇఏ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్రప్రభుత్వానికి పోలీస్ సహాయాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. అనేక సందర్భాల్లో ఆదివాసీలతో పాటు కార్మిక సంఘాలకు ఏఐఐఇఏ ఇచ్చిన సంఘీభావం ఆ సంస్థకు సహాయంగా మారింది. ఇలాకో విజిల్ సందర్భంగా వారందరూ కంప్యూటర్లను భౌతికంగా అడ్డుకోవడానికి ఏఐఐఇఏకు సహకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కంప్యూటరీకరణ నిర్ణయంపై అప్పటి కేంద్రప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇంతటి వీరోచిత పోరాటాన్ని చేపట్టినందుకు అనాటి కేంద్రప్రభుత్వం ఏఐఐఇఏ గుర్తింపును రద్దు చేసింది.
1974లో అఖిల భారత స్థాయిలో ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు, బాంబే, మీరట్, ధార్వాడ్ ఆరు డివిజన్లలో పాక్షిక లాకౌట్‌ను ఎల్ఐసీ యాజమాన్యం ప్రకటించింది. ఒకే బిల్డింగ్‌లో నాలుగు అంతస్తుల్లోని ఉద్యోగులు కొందరు ఆఫీస్‌లో ఉంటే మరో అంతస్తులోని ఉద్యోగులను బయట ఉండమనేలా లాకౌట్‌ను అమలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా లాకౌట్ వర్తించని ఉద్యోగులు కూడా ఆఫీస్‌లోకి వెళ్లకూడదని, అందరూ కలిసి ఆఫీస్ ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పద్ధతి దేశమంతా అమలు చేసేసరికి ఆనాటి కేంద్ర కార్మిక శాఖామంత్రి రఘునాథ రెడ్డి ఏఐఐఇఏ నాయకత్వంతో సంప్రదింపులు చేసింది. చివరికి ఒక అంగీకారానికి వచ్చి లాకౌట్ ప్రకటించబడిన ఢిల్లీ డివిజనల్ ఆఫీస్ తాళాలను ఏఐఐఇఏ నాయకులు సరోజ్ చౌదరీతో తీయించారు.
1985లో ఎల్ఐసీ ఆఫ్ ఇండియాను ఐదు ముక్కలుగా విడగొట్టాలని రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలోని నాటి ప్రభుత్వం ప్రతిపాదించింది. సీపీఎం పార్టీ ద్వారా రాజ్యసభలో ఎంపీగా ఉన్న ఏఐఐఇఏ పూర్వ నాయకులు సునిల్ మైత్ర ఎల్ఐసీని ఐదు ముక్కలుగా చేస్తే జరిగే నష్టాల గురించి రాజీవ్‌గాంధీకి పూసగుచ్చినట్లు వివరించారు. సదరు ప్రతిపాదనను విరమించుకునేలా చేశారు.
భారత ఇన్సూరెన్స్ రంగాన్ని అధ్యయనం చేయాలని 1993లో నాటీ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆర్ఎన్ మల్హోత్రా నేతృత్వంలో కమిటీ వేయబడింది. ఈ కమిటీ స్థూలంగా ఇన్సూరెన్స్ రంగ ప్రైవేటీకరణను ప్రతిపాదించింది. ఒక దశాబ్దం పాటు ఈ కమిటీ నిర్ణయాలు ఏమాత్రం అమలు జరగకుండా వివిధ కార్యక్రమాల ద్వారా ఏఐఐఇఏ అడ్డుకున్నది. అందులో అత్యంత ప్రధానమైనది సంతకాల సేకరణ. 1998లో కోటీ అరవై ఐదు లక్షల సంతకాలు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించి, ఆనాటి పార్లమెంటు స్పీకర్ జీఎంసీ బాలయోగీకి సమర్పించింది. అంతేకాకుండా ఇన్షూరెన్స్ రంగ ప్రైవేటీకరణను దేశవ్యాప్తంగా ప్రజలు అంగీకరించడం లేదన్న సందేశాన్ని పంపింది. అనేక మంది రాజకీయ ప్రముఖులు కార్మికసంఘాల మేధావులు ఇలాంటి వినూత్న కార్యక్రమం పట్ల విస్తుపోయి అభినందించారు.
ఇలా ప్రజల, ప్రముఖుల, ఎమ్మెల్యేల, ఎంపీలు, మంత్రుల అభిప్రాయాన్ని ప్రభుత్వ రంగ ఎల్ఐసీకి అనుకూలంగా గత మూడున్నర దశాబ్దాల నుంచి అనేక సందర్భాల్లో సేకరిస్తూ ప్రభుత్వానికి ఏఐఐఇఏ విన్నవిస్తూనే ఉన్నది. గత సంవత్సరం ఏఐఐఇఏ నిరంతర ఫాలోఅప్ వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని తగ్గించాలని పార్లమెంటులో పెద్ద చర్చ జరిగింది. ముఖ్యంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయానా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయాల్సి వచ్చింది. పాలసీదారులకు మేలు జరిగే ఇలాంటి కార్యక్రమాలను ఒక కార్మిక సంఘం రెండు దశాబ్దాల నుంచి నిర్విరామంగా భుజానికెత్తుకోవడం ఆదర్శవంతమైన పని.
అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం ద్వారా 1999లో ఐఆర్డీఏఐ బిల్ పాస్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీల ఆగమనం మొదలైంది. ఇక చేసేదేమీ లేదు కదాని నిమ్మకుండిపోకుండా ప్రైవేట్ కంపెనీల ఆగడాలు, వాటి వల్ల ప్రజలకు జరిగే నష్టాలు వివరించడానికి కళారూపాల ద్వారా కళాజాతాలను ఏఐఐఇఏ నిర్వహించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను, ప్రజలతో పాటు దేశానికి ఉపయోగపడే వాస్తవాలను వివరించి మంచి ప్రచారాన్ని చేపట్టింది.
అంతేకాకుండా, దేశంలోని 110 డివిజన్లలో ప్రతి ప్రాంతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, సెమినార్లను నిర్వర్తిస్తూ ఇన్సూరెన్స్ రంగంలోకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదన్న ప్రచారాన్ని హోరెత్తించింది. 2004లో ఏర్పడిన యూపీఏ-1 ప్రభుత్వంలో వామపక్ష పార్టీలు భాగస్తులుగా ఉన్నాయి. దీంతో 2004- 2014 వరకు ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐ పెంపు ప్రతిపాదన లేకుండా ఉండేందుకు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ప్రస్తుతించబడేలా కృషిచేసింది. మళ్ళీ 2015లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్‌డీఐ 26శాతం నుంచి 49కి, ఆ తదనంతర కాలంలో 49శాతం నుంచి 74కి పెంచబడింది. ఇప్పుడు 100శాతం పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇలా పెంచిన ప్రతి సందర్భంలోనూ ఏఐఐఇఏ దేశవ్యాప్తంగా సమ్మె చేసింది.
2021 బడ్జెట్లో ఎల్ఐసీ నుంచి 3.5శాతం వాటాల ఉపసంహరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏఐఐఇఏ నిరసిస్తూ సమ్మెకు దిగింది. ఇప్పుడు మళ్ళీ మరిన్ని వాటాల ఉపసంహరణకు, ఇన్సూరెన్స్ చట్టాల సవరణకు కేంద్రం చకచకా పావులు కదుపుతుంటే, భవిష్యత్తు తరాల ముందు దోషిగా నిలబడకూడదని, అలాంటి నిర్ణయాలను సవాలు చేయడానికి పోరాటాలతో ఏఐఐఇఏ సంస్థ సిద్ధమవుతోంది.
గతంలో ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రం వెనకాడలేదు కదా అనిపించవచ్చు. కానీ ప్రభుత్వాల దూకుడును పూర్తిగా నిలువరించలేక పోయినా, కొంతకాలం అడ్డుకొని తద్వారా కొన్ని రకాల సవరణలు సాధించడంతో ఎంతో మేలు జరిగిందని చరిత్ర చెబుతోంది. 1972లో ఏఐఐఇఏను చీల్చాలని ఫెడరేషన్ అనే సంఘం విఫల ప్రయత్నం చేసింది. ఆ తర్వాత కాలంలో బీఎంఎస్, ఐఎన్టీయూసీ వంటి సంఘాలు కూడా మొలకెత్తి నమమాత్రానికే పరిమితమయ్యాయి. అస్తిత్వవాదాన్నెప్పుడూ ఏఐఐఇఏ సభ్యులు బలపరచలేదని దీని ద్వారా రుజువయ్యింది.
దేశవ్యాప్తంగా గత నాలుగు దశాబ్దాల నుంచి జరుగుతోన్న అఖిల భారత సాధారణ సమ్మెలలో ఏనాడూ వెనకాడకుండా భాగస్వామ్యమై కేవలం ఇన్సూరెన్స్ ఉద్యోగుల భవితవ్యానికి మాత్రమే పరిమితం కాలేదు. విశాల కార్మిక- కర్షక ప్రయోజనాలకు తమవంతు కర్తవ్యంగా గొంతెత్తుతామని నికరంగా నిలబడింది. ప్రపంచవ్యాప్త పోరాటాలకు సంఘీభావంగా కూడా నిలబడి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపుల్లో భాగమౌతుంది.
కార్మిక వర్గ ప్రయోజనాలు కేవలం యాజమాన్యాల దగ్గర మాత్రమే సాధించగలిగేవి కావు. వాటి మూలాలు రాజకీయ నిర్ణయాలతో ముడిపడి ఉన్నాయన్న వాస్తవాన్ని ఏనాడో గ్రహించి ప్రతి రాజకీయ ఆర్థిక మార్పులపై తనదైన విశ్లేషణాత్మక తీరులో ప్రతిస్పందనను ఎప్పటికప్పుడు బహిరంగపరుస్తూనే ఉన్నది. ప్రజల జీవన విధానాలను ప్రభావితం చేసే సున్నితమైన ప్రాంతీయ, జాతీయ, మతతత్వ అస్తిత్వ విధానాల పట్ల ప్రాపంచిక దృక్పథాన్ని కలిగి ఉండాలని సభ్యులను చైతన్యవంతులను చేస్తూనే అనేక మార్గాల ద్వారా అట్టి విధానాలను ఎండగట్టడానికి ఏనాడూ వెనుకాడలేదు.
అఖిల భారత స్థాయిలో ఇన్సూరెన్స్ వర్కర్, ప్రాంతీయ స్థాయిలో స్థానిక భాషల్లో మాసపత్రికలను, కరపత్రాలు వంటివన్నీ క్రమం తప్పకుండా విడుదల చేస్తూ జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, కార్మికోద్యమ అంశాలపై ఎప్పటికప్పుడు ఏఐఐఇఏ అందరిని జాగృత పరుస్తూనే ఉన్నది. అందుకే అది భారత కార్మికోద్యమ చరిత్రలో ఒక కలికితురాయిగా స్థిరమైన స్థానాన్ని పొందిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతటి చారిత్రాత్మక స్థానాన్ని ఏఐఐఇఏ పొందడానికి చంద్రశేఖర్ బోస్, సునిల్ మైత్ర, సరోజ్ చౌదరి, ఎన్ఎం సుందరం, మన్‌చందా వంటి వారందరి త్యాగాలు నిక్షిప్తమై ఉన్నాయి. వారి తర్వాత తరాలు కూడా అదే ప్రస్థానాన్ని కొనసాగించారు. అయినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితులు మరింత గడ్డుగా మారాయి. వీటిని ధీటుగా ఎదుర్కోవాలంటే విశాల పరస్పర సంఘీభావం ఎంతో అవసరం. దాన్ని సాధించి ముందుకు నడవగలదన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ ఏఐఐఇఏకి ప్లాటినం జూబ్లీ సంవత్సర శుభాకాంక్షలు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.