
ప్రధానిగా తన పాలన 11 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా కొనసాగినందుకు నరేంద్రమోడీ పరవశంతో చేసుకుంటున్న సంబరాలు కిందటి నెల అర్ధాంతరంగంగా ఆగిపోయాయి. అందరూ అనుకున్నట్టే, “భారతదేశాన్ని సాహసవంతమైన దేశంగా ” తీర్చిదిద్దినందుకు సంబరాలు జరుపుకోవాల్సిన సందర్భమని ఆయన భక్త బృందం బీరాలకు పోయింది. అదికూడా, మోడీమీద విమర్శలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో- ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు పదేపదే భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్న వేళ, మోడీ మౌనం పాటిస్తున్న సందర్భం; ట్రంప్ నిరంతరంగా భారతదేశాన్ని పాకిస్తాన్తో సరిపోలుస్తుండడమే కాదు. యుద్ధం ఆపిన ఘనత తనదేనని డంబాలు పలుకుతున్న సమయం, చట్ట వ్యతిరేకంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయులను సంకెళ్లు వేసి ప్రదర్శించిన వేళ( అది కూడా కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి)- ఇవన్నీ మోడీ పాలనా కాలపు స్వరూపస్వభావాలపై దాడే. ఈ దాడి 11 ఏళ్లు అధికారంలో కొనసాగిన శక్తిని నిర్ధారిస్తాయి. ఒక ఖండం అంతటి దేశం, అనామకంగా, కేవలం ఒక భౌగోళిక రాజకీయ ఆవాసంగా దిగజారింది.
మోడీ పాలనా కాలంలోని ఆర్ధిక వైఫల్యాలు, రాయబార తప్పటడుగుల గురించి అనేక సందర్భాలలో రాశారు.కానీ అసలైన వంచన వల్ల జరిగిన హాని వేరొకచోట ఉంది. అది భారతదేశ సామాజిక సాంస్కృతిక నిర్మాణాన్ని హరింపచేయడం. దేశ బహుళత్వాన్ని దెబ్బతీయడంలో ఈ నష్టం కనిపిస్తుంది. సామాజికంగా లోలోపలి పొరలలో దాగి ఉన్న లోపాలను కఠినతరం చేసింది. 2014కు ముందు ఉన్న సామాజిక సూచికలను నేటి సామాజిక సూచికలతో పోల్చి చూస్తే, మతతత్వ మెజారిటేరియనిజం, తిరోగమన ధోరణి, మేధావులపట్ల వ్యతిరేకత , వివక్షతని వ్యవస్థీకరించడం కనిపిస్తాయి.
సామాజిక సాంస్కృతిక జలతారు పరదాలు- మూడు శతాబ్దాల పాటు సాగిన ఆధునిక సామ్రాజ్యవాద పాలనలో ఎంతో కష్టపడి నేసిన కలనేత, సమానత్వం ప్రేరణతో జరిగిన పోరాటాలు, రాజ్యాంగంలో ప్రతిష్టించుకున్న గణతంత్ర విలువలు ఛిద్రమయిపోయాయి. ఇక మిగిలిందల్లా మధ్యయుగాల నాటి అర్ధంపర్ధం లేని ముసుగులేసిన దేశం. ఇతర రంగాల్లో జరిగిన హాని, ఇవాళ కాకపోతే రేపైనా పూడ్చుకోవచ్చు, పూడ్చు కుంటాము కూడా. కానీ సామాజిక సాంస్కృతిక రంగంలో జరిగిన విచ్చిన్నం- అందులో త్వరితగతిన మారుతున్న నేటి సమాజంలో, ప్రపంచమంతా పరస్పరంగా అనుసంధానించబడి ఉన్న నేటి తరుణంలో- పూడ్చడం సవాలుతో కూడుకున్నది.
నష్టాన్ని అంచనా వేయడం ఎలా?
మత సామరస్యంలో వచ్చిన మార్పు నగ్నంగా మనముందుంది. గృహ మంత్రిత్వ శాఖ ఇచ్చిన గణాంకాల ప్రకారం, యూపీఏ పాలనా కాలం(2011- 2014) భారతదేశంలో ఏడాదికి 600 మత ఘర్షణలు జరిగాయి. కానీ, 2017- 2022 మధ్యకాలంలో మోడీ పాలనలో ఏడాదికి 1000 మత ఘర్షణలు జరిగాయని జాతీయ నేర నమోదు సంస్థ తెలియచేస్తున్నది. అంతకంటే ఘోరం ఆవులకు సంబంధించిన మూకదాడులు. ఇవి ఇదివరకు అరుదుగా, అక్కడక్కడా జరిగేవి. 2014- 2024 మధ్య కాలంలో 300పైగా నమోదయ్యాయి. విద్వేష ప్రసంగాలు అయిదు రెట్లు పెరిగాయి. లోపాయికారిగా రాజకీయ ప్రోత్సాహం, పోలీసుల బలహీనతలతో విద్వేష ప్రసంగాలు పెరుగుతున్నాయి. 2018లో పోలీస్ అధికారిపై బులంద్షలో మూకదాడి చేయడం కానీ, 2020లో పాల్గర్లో మూకలు చంపడం కానీ ఉదాహరణగా చూపవచ్చు. అనేక ప్రాంతాల్లో చట్ట పాలన స్థానాన్ని విజిలెన్ట్ మూకలు ఆక్రమించాయి.
మతతత్వ దాడులు పెరుగుతుండడంతో అసమ్మతి, ప్రజాతంత్ర భావవ్యక్తీకరణల స్థలం కుంచించుకుపోయింది. 2024లో 180 దేశాల ప్రపంచ సమాచార స్వేచ్ఛ జాబితాలో, భారతదేశ స్థానం 140 నుంచి 161కి దిగజారిందని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ నివేదించింది. ఒకప్పుడు దేశద్రోహ నేరాలు ఎప్పుడోగానీ మోపబడేవి కావు. కానీ ఇప్పుడు అవి 160% పెరిగాయి. ఏడాదికి 70 కేసులు నమోదు అవుతున్నాయి. విశ్వవిద్యాలయాలు సైద్ధాంతిక యుద్ధ రంగస్థలాలుగా మారాయి. పాఠ్యాంశాల నుంచి మొగలుల, ప్రజల చరిత్రలు తొలగించారు. అసమ్మతిని తెలిపే విద్య సంస్థలు- జవహర్లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం(జేఎన్యూ) లేదా జామియా మిలియా ఇస్లామీయ సంస్థలు తీవ్రవాద వ్యతిరేక చట్టాల కింద నమోదు అయ్యాయి. ఒకప్పుడు, అసమ్మత పరిశోధనలు, ఎప్పుడో ఒక సారి నిషేధానికి గురవుతుండగా, (ఉదాహరణకి స్థూల జాతీయోత్పత్తి గణాంకాల పునఃపరిశీలన ఎదురుదెబ్బలు ఎదుర్కొంటుండగా)ఇప్పుడు వ్యవస్థీకృత ప్రణాళికా బద్ధంగా(ఇన్స్టిట్యూషనలైజ్డ్ ప్లానింగ్ ), ఉదారవాద విద్యా సంస్థలను(లిబరల్ యూనివర్సిటీస్ ) ఏ మాత్రం సంకోచపడకుండా రూపుమాపేశారు.
మైనారిటీల స్థితి, ప్రధానంగా ముస్లింల స్థితి, ఎంతగా వారు సంస్థాగత బహిష్కరణకు గురయ్యారో తెలియచేస్తుంది. 2009లో 30 మంది పార్లమెంటు సభ్యులు ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తే, 2024లో వారి సంఖ్య 24కు పడిపోయింది. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సారిగా మోడీ క్యాబినెట్లో ముస్లింలకు ప్రాతినిధ్యమే లేదు. ముస్లిం మంత్రులు లేరు.
మత మార్పిడులపై నిషేధం ఇదివరకు కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే పరిమితమయ్యేది. ఇప్పుడు 12 రాష్ట్రాలలో ఈ చట్టం అమలవుతున్నది. మతం మార్చుకోవడం నేరంగా పరిగణిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) జాతీయ పౌరుల నమోదు, భారతీయులుగా గుర్తింపు అంటే హిందువుల చుట్టూ తిప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటకలో “హిజాబ్ నిషేధం”, జ్ఞానవాపి మసీదు వివాదం, ముస్లింల పౌరహక్కులపై దాడిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
గత దశాబ్దాలలో కులం, లింగం ఆధారంగా వివక్షతకు గురికాకుండా ఉండడంలో, సమన్యాయం అమలు జరగడంలో పురోగతి కనిపించింది. ఇప్పుడు అది దిగజారుతున్నది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దళితులపై అఘాయిత్యాలు 2013లో 39,000 నమోదు కాగా 2022లో 50,900 నమోదయ్యాయి. యూపీఏ ప్రభుత్వం సుప్రీం కోర్టు రిజర్వేషన్లు 50% మించకూడదన్న తీర్పును ఉల్లంఘిచకూడదని అనుసరిస్తే, మోడీ ప్రభుత్వం ఉన్నత తరగతులలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10% రేజర్వేషన్లు ప్రకటించి, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలయే ప్రక్రియని నీరుగార్చి, కులాల ఆధారంగా చేసే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు దారి చూపింది. వ్యవస్థ హత్య చేసిన రోహిత్ వేముల సంఘటన, ఉనాలో దళితుడిని కొయ్యకు కట్టి కొట్టడం(2016), కులదురహంకారం తలెత్తున్న సంకేతాలు ఇస్తున్నాయి. సామాజిక న్యాయం స్థానంలో “సమాజ్ కి సంరక్ష”(సామాజిక సామరస్యం) వచ్చేసింది.
గిరిజనుల హక్కులు కూడా వెనక్కి పోయాయి. 2009- 2014లో 1.5 లక్షల హెక్టార్లు అటవీ భూములను ఆక్రమిస్తే, 2014 తరువాత 3.5 లక్షల హెక్టార్లు ఆక్రమణకు గురయ్యాయి. పీఏఎస్సీఓ, వేదాంత లాంటి కార్పొరేట్ ప్రాజెక్టులకు, స్థానిక కార్యకలాపాలకంటే ప్రాధాన్యత దక్కుతున్నది. అదుపులేని అభివృద్ధిని చూపి, నక్సలిజానికి వ్యతిరేకంగా చర్యలని చెప్పుకుంటూ 2014 తరువాత లక్షలాది ఆదివాసీలను తమ స్థావరాల నుంచి వెళ్లగొట్టేశారు. 2022లోని అడవుల రక్షణ చట్టం నిబంధనలు, అటవీ హక్కుల చట్టంలోని అటవీభూములను ఆక్రమించేందుకు గిరిజనుల ఆమోదం కావాలనే నిబంధనను తొలగించారు. ఫలితంగా కొందరు కార్యకర్తలన్నట్టు గిరిజనులు “రెండో సారి భూములను” కోల్పోయారు. అడవులలో ఉన్న సహజ వనరులు, ముఖ్యంగా గనులు సొంతం చేసుకోడానికి, నక్సలైట్లను అంతం చేయడం అనే పేరుమీద ఆదివాసులను అంతం చేయడం మొదలయింది. ఇదే ఈ నేటి పాలకుల నిజస్వరూపం.
మోడీ పాలనకు ముందు, సంక్షేమపథకాలు అందించడానికి మెజారిటీ మైనారిటీల బేధం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాటిని కూడా మెజారిటేరియనిజం కోసం వాడుకుంటున్నారు. అంతకు ముందు కాలంలో ఎంఎన్ఆర్ఇజిఏకి గాని ప్రజా పంపిణి విధానంలో గాని, ముస్లింలనే వివక్షత ఉండేది కాదు. కానీ ఇప్పుడలాకాదు, అనేక బీజేపీ నాయకత్వంలోని రాష్ట్రాలలో పీఎం కిసాన్ ప్రయోజనాలు ముస్లిం రైతులకు అందడం లేదు. మొదట్లో బాగా నడిచినా, తరువాత తరువాత ఉజ్వల పథకం మసక బారింది. ప్రయోజనం పొందిన వారిలో 25% మంది మళ్ళి కట్టెపుల్లలు వాడడం మొదలుపెట్టారు. సంక్షేమ పథకాల పంపిణి బాహాటంగానే మతప్రతిపాదికన అందజేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో 80 వర్సెస్ 20 అంటూ ముస్లింలను కించపరుస్తున్నారు.
సాంస్కృతికంగా దేశాన్ని పెద్ద ఎత్తున సజాతీయీకరణ చేశారు. హిందీని బీజేపీ జాతీయభాష చేసే ప్రయత్నం వల్ల ఈశాన్య రాష్ట్రాల నుంచి తమిళ నాడు నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాల మద్దత్తు ఇచ్చే హిందీ పండగలు, స్థానిక జానపద సంస్కృతి, ప్రాంతీయ సంప్రదాయాలను ఆవరిస్తున్నాయి. అదేసమయంలో ఎంఎఫ్ హుస్సేన్ వంటి గొప్ప కళాకారులు చనిపోయిన తరువాత కూడా నిందలు ఎదుర్కొంటున్నారు. కేవలం సైద్ధాంతిక విబేధాల కారణంగా ‘పా ‘ వంటి ఉత్తమ చిత్రాలను నిర్మించిన రంజిత్ వంటి చిత్ర నిర్మాతలను బహిష్కరిస్తున్నారు. బహుళత్వాన్ని కాపాడుకునే బదులుగా “ఒక దేశం, ఒక సంస్కృతి ” అనే చిహ్నాన్ని, తమ విధానంగా నేటి పాలకులు ప్రజలపై రుద్దుతున్నారు.
ఈ సాంస్కృతిక సంకుచితత్వానికి తోడుగా సూడో సైన్స్ , విజ్ఞానప్రాధానవాదానికి వ్యతిరేకత పెరుగుతున్నాయి. విజ్ఞాన శాస్త్రం అభివృద్ధికి నిధుల కేటాయింపు 2013లో, స్థూలజాతీయోత్పత్తిలో 0.8% ఉండగా 2023 వరకు 0.6% నికి పడిపోయింది. కానీ వేదకాలంలో ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయంటూ ప్రభుత్వం డంబాలకు పోతున్నది. అవి అధికారికంగా ఆమోదం పొందుతున్నాయి కూడా. కొత్త విద్యా విధానం– 2020 సంస్కృతానికి ప్రాధాన్యతనిస్తున్నది. విమర్శనాత్మక ఆలోచనలకు బదులుగా “భారతీయ విజ్ఞాన శాస్త్రం”, “భారతీయ జ్ఞాన సముపార్జనా విధానాలు” అంటూ ఎటువంటి రుజువులు, ఆధారాలు లేని విధానాలను ప్రజలలోకి తీసుకెళుతున్నారు.
అన్నిటికంటే కలతపరిచేది, మోడీ యుగం, దయాగుణం గల మానవత్వాన్ని నేరపూరితం చేయడం. ఈ ప్రభుత్వం 20,000లకు పైగా ఎన్జీఓల లైసెన్సులు, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టం(ఫెరా ) కింద రద్దు చేసింది. ఇందులో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, కేర్ కూడా ఉన్నాయి. మానవత్వపు కార్యకలాపాలపై- ప్రధానంగా గిరిజన ప్రాంతాలలో ఇప్పుడు ‘జాతివ్యతిరేకమని‘ ముద్ర వేస్తున్నారు.
ఇదివరకు బహిరంగంగా ఇచ్చే ఉపన్యాసాలలో విద్వేషాన్ని రెచ్చగొట్టడం నిషేధం. ఒకప్పటి విద్వేష ప్రసంగాలు- 2009 ఎన్నికల ప్రచారంలో వరుణ్ గాంధీ చేసిన రెచ్చగొట్టే ప్రసంగం ఇప్పుడు సర్వ సాధారణం అయిపొయింది. యతి నరసింగానంద్, బీజేపీ నాయకులు అనురాగ్ ఠాకూర్ బహిరంగంగానే ముస్లింలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తూ ప్రసంగాలు చేశారు. కానీ ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోలేదు. పైగా ఈ విద్వేష ప్రసంగాలు చేసిన వారికి పురస్కారాలు దక్కాయి. ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ కాస్తా “గోలి మారో సాలోంకో”(వెధవలని కాల్చి పారేయండి) అనే కారుకూతల స్థితికి దిగజారింది.
ఇటువంటి విద్వేష ప్రసంగాల ఫలితంగా పట్టణాలలో వెలివాడలు వెలిశాయి. ముస్లింలకు ఉండడానికి ఇళ్లు కూడా దొరకకుండా పోయాయి. ఒకప్పుడు ఈ పరిస్థితి కేవలం ముంబై లాంటి ప్రాంతాలకే పరిమితంగా ఉండేది. ఇప్పుడు భారతదేశమంతా వ్యాపించింది. చాలా హోసింగ్ సొసైటీలలో ముస్లింలకు ఇల్లు కేటాయించడం లేదు. అద్దెకి కూడా ఇవ్వడం లేదు.
ఇప్పుడు బుల్డోజర్ రాజకీయ చిహ్నం అయింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ సంస్కృతి లోతుగా పాతుకు పోయింది. మత ఘర్షణల తరువాత ఏ రకమైన నియమనిబంధనలు పాటించకుండానే ముస్లింల ఇళ్ళు కూల్చడం పరిపాటిగా మారింది. ముస్లింలే కోవిడ్- 19 వ్యాపించడానికి కారణమని చేసిన నిందారోపణ వారిని మరింతగా సామాజిక అస్పృష్యులను చేసింది.
ఈ ధోరణులన్నీ చూసినప్పుడు, సామాజిక సంబంధాలు నాశనం అవడమే కాదు. పూర్తిగా కొత్త రూపన్ని సంతరించుకున్నాయని అనిపిస్తుంది. 2014కు ముందు రాజ్యాంగ విలువలు సవాలుచేయబడ్డాయి. కానీ చెక్కుచెదరలేదు- ఉదాహరణకి లౌకిక తత్త్వం, సామాజిక న్యాయం, బహుళత్వం. అయితే, గత 11 సంవత్సరాలలో మొత్తంగా మెజారిటీయనిజం వైపు మళ్లిపోయింది. సామాజిక సూచికలన్నీ మరింత బహిష్కరణవాదం, మరింత అసహనం, మరింత అసమానత్వం వైపుకు చూపిస్తున్నాయి.
మోడీ ప్రభుత్వ పాలనా వ్యవస్థ, సామాజిక పొందికకు చేసిన గాయాలకు పైన చెప్పినవి కేవలం కొన్ని సూచికలు మాత్రమే. ఆర్ధిక, లేదా రాయబార వ్యవహారాలలో దొర్లిన మహాపరాధలు కూడా విధానాలు మార్చుకుని సరిచేసుకోవచ్చు. కొత్తగా అంతర్జాతీయ సంబంధాలు పునరుద్ధరించుకోవచ్చు. కానీ సామాజిక సాంస్కృతిక నష్టం పూడ్చలేనిది.
ప్రజల నైతికతలో, జాతీయత గుర్తింపులో, వ్యవస్థీకృత వివక్షతలో, ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పులు భారతదేశాన్ని మరో భయంకర దశలోకి నెట్టింది. భారతదేశాన్ని లౌకికత్వ ఆలోచనల దేశంగా, అందరిని ఇముడ్చుకునే సార్వభౌమ దేశంగా ఇంకెంత మాత్రం చూడరు. భారతదేశం వెనకపట్టు పట్టడమేకాదు, క్రియాశీలంగా ముట్టడికి గురయ్యింది. దీనిని పునరుద్ధరించదానికి కేవలం రాజకీయసంకల్పం ఉంటే సరిపోదు. మునుపెన్నడూ ఎరగనటువంటి సాంస్కృతిక నైతిక పునరుజ్జీవనం కావాలి. అప్పటివరకు మోడీ చేసిన సాంస్కృతిక గాయాల మచ్చలు ఈ సార్వభౌమ దేశాన్ని వెన్నాడుతూనే ఉంటాయి.
అనువాదం: కె ఉషారాణి
వ్యాసరచయిత ఆనంద్ తేల్తుంబ్డే పీఐఎల్ మాజీ సీఈఓ. ఐఐటీ ఖరగ్పూర్, గోవా, జీఐఎంలలో ఆచార్యుడిగా పనిచేశారు. ఆయన రచయిత, మానవహక్కుల కార్యకర్త కూడా.