
ఇది నా ఒక్క దాని వేదన కాదు
నేనున్నప్పుడు
క్షణ క్షణం అంతరిస్తున్న
జీవితాలెన్నో చూశాను
ఇప్పుడు నేను బయట పడ్డాను గానీ
ఇంకా బయటపడని జీవితాలెన్నో
ఇది పరిష్కారం కాదని నాకు తెలియదా?
ఇదే పరిష్కారం కాదనీ నాకు తెలియదా?
కానీ, అందరికీ తెలియాల్సింది
సమస్య ఏంటని!
అలసిన నా రెక్కలు
ఏదో ఒక చెట్టు నీడన సేద తీరుదామనుకుంటే
ఆ చెట్టే నా పై కూలి
నా రెక్కలు ఉరి తీసుకునేట్టు చేసింది
మీ పక్కన కూడా ఇలాంటి ‘వేధితులు’ ఎవరన్నా ఉన్నారేమో!
లేక అది మీరేనా!?
మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి
నా పట్ల మీ సానుభూతికి సెల్యూట్
అది శృతి మించి నన్నే తిట్టి,
నన్ను బాధ్యతారహితురాలిగాను,
చేతగాని దానిలా చిత్రించి
నేను నా అనుకునే వాళ్ళను
నన్ను నా అనుకునే వాళ్ళందరినీ
బాధపెట్టకండి!
మీరు నా తరఫున న్యాయవాది కాకపోయినా పర్లేదు
కానీ ప్లీజ్ జడ్జిగా మారకండి
మీ తీర్పులతో,
మీమీ ఆలోచనా కోణాలతో
ఇప్పుడు లేని నా ప్రాణాలపై
బాణాల గాయాలు చేయకండి.
రేపు ఇంకెవరూ
ఆత్మ ‘హత్య’ చేసుకునే
వాతావరణం లేని
సమాజంగా తయారు కండి!
చాలు!!
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.