
అమెరికాతో భారత్ కుదుర్చుకోవాల్సిన వాణిజ్య ఒప్పందం విషయంలో భారతదేశానికి ట్రంప్ ప్రభుత్వం 2025 జూలై 8 వరకు గడువు విధించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారత బృందం, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ నేతృత్వంలోని అమెరికా బృందంతో వాషింగ్టన్లో రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. గోయల్ రెండు రోజుల క్రితం భారత్‌కు తిరిగి వచ్చారు. భారతదేశ వాణిజ్య కార్యదర్శి ఇంకా అమెరికాలోనే ఉన్నారు.
ఉభయ దేశాల వాణిజ్య మంత్రిత్వ స్థాయి చర్చలు జరుగుతూ ఉండగానే ట్రంప్ ఏకపక్షంగా భారతదేశంతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశ మార్కెట్‌ను అమెరికా కోసం మరింత “తెరవాలి”. అయితే, పూర్తి వివరాలింకా స్పష్టంగా వెల్లడి కాలేదు.
సామ్రాజ్యవాదానికి లొంగిపోయే దురదృష్టకరమైన మోడీ వైఖరిని ప్రస్తుత సందర్భం మరోసారి బహిర్గతం చేస్తోంది. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై 26 శాతం సుంకాలను అమెరికా విధించింది. దీంతో పాటు, భారత మార్కెట్‌కు అడ్డంకులు లేని ప్రవేశం కోసం ట్రంప్ ఏప్రిల్ 2న “రక్షణాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వు” ద్వారా “పరిమాణాత్మక పరిమితులను” విధించారు. యూరోపియన్ యూనియన్, కెనడా వంటి పాశ్చాత్య సామ్రాజ్యవాద శక్తుల నుంచి తూర్పున చైనా వరకు, లాటిన్ అమెరికాలోని మెక్సికో, ఆఫ్రికన్ దేశాలతో పాటు దాదాపు అన్ని దేశాలు ట్రంప్ ఏకపక్ష సుంకాలకు వ్యతిరేకంగా తక్షణ ప్రతీకార చర్యలను ప్రకటించాయి. అమెరికాపై చైనా తన ప్రతీకార సుంకాలను ప్రకటించి అమెరికా కొమ్ములు వంచింది. ఆ తర్వాత, విధిలేని పరిస్థితుల్లో ట్రంప్ సర్కారు అవమానకర రీతిలో చైనాతో రెండు రౌండ్ల వాణిజ్య చర్చలను నిర్వహించింది. తర్వాత ఒక అడుగు దిగివచ్చి చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవలసి వచ్చింది.
మన స్వయం ప్రకటిత “విశ్వగురు” మోడీ వాణిజ్య బృందం మాత్రం, “మేక్ ఇన్ ఇండియా”, “ఆత్మనిర్భర్ భారత్” వంటి రొటీన్ ఉపన్యాసాలతో ట్రంప్ ఏకపక్ష సుంకాలపై లొంగుబాటు ధోరణిలో తల దించుకుని ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు.
ఈ వాణిజ్య ఒప్పంద నివేదికల ప్రకారం భారతదేశ టెక్స్టైల్స్, వజ్రాలు, ఆభరణాలు, చర్మ ఉత్పత్తులు, దుస్తులు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, ద్రాక్ష, గింజలు, అరటిపండ్లు వంటి శ్రమాధార రంగాలపై అదనపు 26 శాతం సుంకాల నుంచి మినహాయింపు కోసం అమెరికాను భారత్ వేడుకుంటోంది. అయితే, అమెరికా హైటెక్ సాఫ్ట్వేర్లు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఆటోమొబైల్స్, విద్యుత్ వాహనాలు, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, వైన్, ఆపిల్స్, డ్రైనట్స్, డైరీ, జన్యు సంకీర్ణ ప్రక్రియతో పండించిన (జీఎం ఫుడ్స్) పంటలు వంటి వాటిపై సుంకాల సమీకరణలను తనకు లాభదాయకంగా ప్రపంచ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా సాధించాలని భారత్‌పై వాణిజ్య ఆంక్షలు విధించి అధిక లాభాలు పొందాలని అమెరికా చూస్తోంది. ఇందులో భాగంగా ఈ ఒప్పందం 2025లో 191 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త వాణిజ్య ఒప్పందం 2025 జూలై 8నాటికి పూర్తి వివరాలతో ప్రకటించబడుతుందని భావిస్తున్నారు.
అయితే, స్వతంత్ర అంతర్జాతీయ వాణిజ్య పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్ తాజా “భారత మార్కెట్‌ను మరింత తెరవాలని” పేర్కొన్న వాదన ఆధారంగా, మోడీ ప్రభుత్వం అమెరికా ఉత్పత్తులను భారతదేశంలో డంపింగ్ చేయడానికి రెడ్ కార్పెట్ వేస్తోంది. అమెరికా సామ్రాజ్యవాద ఆదేశాలకు లొంగిపోతూ, మేటా, గూగుల్ వంటి సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాలకు కూడా “వ్యాపార సౌలభ్యం” కల్పించేలా స్నేహపూర్వక చర్యలను అమలు చేస్తోంది. ఈ చర్యల ఫలితంగా భారతదేశ ఔషధ పరిశ్రమలకు భారీ దెబ్బ తగలనుంది. అలాగే డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి “ఫ్రంటియర్ టెక్నాలజీల” రంగంలో భారతదేశం కష్టసాధ్యమైన ప్రయత్నాలు మరింత దెబ్బతినే అవకాశం ఉంది.
అమెరికా విధించిన వాణిజ్య ఒప్పందం వల్ల మొదట నష్టపోయే బాధితులు దేశీయ రైతులే. సోయాబీన్, మొక్కజొన్న, ఆపిల్స్, డైరీ వంటి వాటిపై సుంకాల తగ్గింపు వల్ల మన దేశ రైతాంగం తీవ్రంగా నష్టపోనుంది. ప్రో కార్పొరేట్ థింక్ ట్యాంక్ “నీతి ఆయోగ్” ఇటీవల విడుదల చేసిన “కొత్త అమెరికా వాణిజ్య రెజిమ్ కింద భారత్- అమెరికా వ్యవసాయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం” అనే వర్కింగ్ పేపర్లో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి అమెరికా నుంచి సోయాబీన్ ఆయిల్ దిగుమతులపై సుంకం తగ్గించడానికి ఆమోదాన్ని తెలిపింది. దీనిని సోయాబీన్ ప్రాసెసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఓపీఏ) గట్టిగా ఖండించింది. ఎందుకంటే ఇది స్థానిక సాగును ఆర్థికంగా అసాధ్యం చేస్తుంది. మొక్కజొన్న, నూనె గింజలు, ద్రాక్ష, డైరీ ఉత్పత్తులు, జన్యుపరంగా సవరించిన గింజలపై సుంకాల తగ్గింపు అలాగే అమెరికా వ్యవసాయ వ్యాపార బహుళజాతి సంస్థలకు భారత మార్కెట్లో స్వేచ్ఛాయుత ప్రవేశం భారత వ్యవసాయానికి మరణ ఘంటికలను మోగిస్తుంది. అయినా మోడీ ప్రభుత్వం ట్రంప్ సర్కారు ముందు లొంగిపోయి వ్యవహరిస్తోంది. ఇది ముమ్మాటికీ భారత రైతాంగ ప్రయోజనాలను ఫణంగా పెట్టడమే అవుతుంది.
2020 సెప్టెంబర్‌లో కోవిడ్ మహమ్మారి ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు మోడీ వాణిజ్య మంత్రిత్వ శాఖ, ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్లూటీఓ) ఆదేశాల ప్రకారం అమలు చేసిన మూడు దుర్మార్గపు వ్యవసాయ చట్టాలను ఈ చర్య గుర్తు చేస్తుంది. ఇది ఇటీవలి భారత్- అమెరికా పౌర అణు ఒప్పందం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంతో పరోక్షంగా సంబంధం కలిగి ఉంది. ఎందుకంటే రెండూ అమెరికా- భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. భారతదేశం క్రమంగా అమెరికాకు లొంగిపోయిన దేశంగా మారుతుంది.
భారత్- అమెరికా పౌర అణు ఒప్పంద(123 ఒప్పందం) ప్రకటిత లక్ష్యం భారతదేశం పెరుగుతోన్న విద్యుత్ శక్తి అవసరాలను తీర్చడం, సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం. అలాగే వివిధ రంగాలలో అమెరికా- భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం.
ఈ దుర్మార్గపు చర్యను సులభతరం చేయడానికి, మోడీ ప్రభుత్వం అణుశక్తి చట్టంలో సవరణలు కూడా చేసింది. భారతదేశ పౌర అణు పరిశ్రమలో ప్రైవేటు రంగ పెట్టుబడులకు అనుమతించింది. అంతే కాదు, ఒకవేళ “అణు ప్రమాదం జరిగిన సందర్భంలో విదేశీ అణు విద్యుత్ ప్లాంట్ విక్రేతలను బాధ్యత నుంచి విముక్తి చేయడానికి” పౌర అణు నష్ట బాధ్యత చట్టంలో సవరణలు చేయడానికి భారత్ కట్టుబడింది. ఇలాంటి దుర్మార్గమైన ఒప్పందం ఏ దేశమైనా చేసుకుంటుందా? భారత ప్రజల ప్రాణాలు అంటే అంత లెక్కలేని తనమా?
మోడీ ప్రభుత్వం 2025 బడ్జెట్ ప్రతిపాదనలు కూడా విదేశీ అణు సంస్థలకు చిన్న మాడ్యులర్ రియాక్టర్ల నిర్మాణాన్ని అనుమతిస్తాయి. ఇందుకు అమెరికా నియంత్రణలోని వరల్డ్ బ్యాంక్ అణు ప్లాంట్లకు నిధులు సమకూర్చాలని నిర్ణయించడం ముందస్తు చర్యగా ఉంది. ఇవన్నీ “అమెరికా-భారత్ శక్తి భద్రతా భాగస్వామ్యం” కోసం మోడీ రెజిమ్ దృఢమైన నిబద్ధతను సూచిస్తాయి. ఇందులో చమురు, గ్యాస్, పౌర అణు శక్తి అంశాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే మోడీ ప్రభుత్వం ట్రంపిజానికి “అవమానకరమైన లొంగుబాటు ధోరణికి ఒక ఉదాహరణగా ఉంది.
ట్రంప్ అతని అనియంత్రిత విధానాలను ప్రపంచ ప్రజలు, అమెరికాలోని ప్రజాస్వామ్య వర్గాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో, మోడీ నేతృత్వంలో భారత ప్రభుత్వం మాత్రం ట్రంప్ సామ్రాజ్యవాద ప్రభువు ఆశ్రయంలో ఉండటానికి ప్రయత్నిస్తోంది. రైతులు, కార్మికులు అలాగే విస్తృత భారతీయ ప్రజల జీవనోపాధిని పూర్తిగా అగౌరవ పరుస్తోంది. భారత దేశ ప్రగతిపై దీర్ఘకాలం దుష్ప్రభావాలు చూపే పరిణామాలు కలిగిన ఈ సమస్యలను పార్లమెంటులో చర్చించటం లేదు. ఇది కేవలం మోడీ మంత్రి వర్గ నిర్ణయాలు “కార్పొరేట్ బోర్డ్ రూమ్‌లలో ” తీసుకోబడుతున్నాయి. కాబట్టి, రాబోయే అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందాన్ని దృఢంగా వ్యతిరేకించడానికి, దాని నుంచి వెనక్కి తగ్గేలా చేయడానికి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, భారత ప్రజలు స్పష్టమైన అవగాహనతో అందరూ ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.