
తీర్పులు రాయటానికి జడ్జీలు దివ్యమార్గోపదేశం కోసం చూస్తున్న రోజుల్లో లౌకిక ప్రజాతంత్ర రాజ్యాంగ సంరక్షణ కోసం పెద్ద పోరాటమే అవసరం అవుతుందని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ అన్నారు.
‘రాజ్యాంగమే భారతదేశమని తలుస్తారు. ఈ సెక్యులర్ రాజ్యాంగం ఉన్నంత వరకు ఎవరూ ‘‘హిందూరాష్ట్ర’’ని తేలేరు’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. ఒక సమావేంలో ఆమె మాట్లాడుతూ ‘ఇది రాజ్యాంగ మూల విధానమైన సెక్యులరిజం అనేక బెదిరింపులనెదుర్కుంటున్న తరుణం. ఈ తరుణంలోనే భారత న్యాయవ్యవస్థ తన విధులను విఫలం కాకుండా నిర్వహించాలి’ అని అభిప్రాయపడ్డారు.
జస్టిస్ సునంద భండారీ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ఆధునిక భారత రాజ్యాంగ విధానం అన్న అంశంపై జైసింగ్ ప్రసంగించారు. ఈ సమావేశంలో భారత మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మదన్ బీలోకూర్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ విభుభక్రు పాల్గొన్నారు.
జై సింగ్ తన ప్రసంగంలో ‘పౌరులతో వ్యవహరించేటప్పుడు రాజ్యం వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకుండా రాజ్యాంగం కాపుకాస్తుంది. కానీ ప్రస్తుతం ఇలాంటి రాజ్యాంగాన్ని నిరాకరించాలనే డిమాండ్ పెరగడం గమనిస్తే మరో లక్ష్యం ఏమైనా ఉందా వీరికి అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజ్యాంగామే ప్రస్తుత కార్యాచరణ నిబంధన కానీ రాజ్యాంగాన్ని కేవలం మార్గదర్శి మాత్రమే అని అంటున్నారు. రాజ్యాంగ ఉన్నత పదవులు నిర్వహిస్తున్న వారితో సహా మనందరము రాజ్యాంగమే నిబంధన అని గుర్తుంచుకోవాలి’ అని సూచించారు.
ముఖ్యంగా ఆమె తన ప్రసంగంలో ‘న్యాయవ్యవస్థ పౌరుల హక్కులకు సంరక్షించేలా మెలగవలసిన ఈ సమయంలో ఆ పాత్ర సమర్ధవంతంగా నిర్వహిస్తుందా అని చూసుకోవలసిన తరుణం వచ్చింది. ఆధునిక రాజ్యాంగం ముట్టడికి గురవుతోంది. కాపాడాల్సిన వారే రాజ్యాంగాన్ని నిరాకరించే ధోరణికి పూనుకోవడాన్ని మనం చూస్తున్నాం’ అని గుర్తు చేసారు.
ఆమె భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాటలను కూడా ప్రస్తావించారు. పిల్లలకు ‘అసలైన రాజ్యాంగ పుస్తకాన్ని’ పంచాలన్న ఆయన ప్రకటనను జైసింగ్ ‘తప్పుడు సమాచారం’ అని అభివర్ణిస్తూ ‘అసలైన 1954నాటి రాజ్యాంగ ప్రతిలో బొమ్మలు ఉండవు. అంతేకాకుండా అవి మూడు కాపీలే ఉన్నాయి. రెండు పార్లమెంటులో మరొకటి సుప్రీంకోర్టులోనూ ఉన్నాయి’ అని తెలిపారు. ‘అసలైన రాజ్యాంగ ప్రతి’ ఏంటి అన్నది తెలుసుకోవాలి. రాముని బొమ్మలతో కూడిన ప్రతి మాత్రమే అసలైన రాజ్యాంగ ప్రతి అన్నది ఆయన వ్యాఖ్య. ఇది ‘తప్పుడు సమాచారం’ అసలైన ప్రతి ఏదో తెలుసుకోవడం ఆసక్తికరం కూడాను.’ అన్నారు.
ఇంకా ఆమె తన ప్రసంగంలో ఫెమినిజం, కాన్స్టిట్యూషనిజం రెండూ కవలపిల్లలు అని అభివర్ణించారు. అవి రెండు ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయన్నారు. రాజ్యాంగాన్ని నడిపించడానికి మహిళాశక్తి ఎలా తోడ్పడుతుందో వివరించే అనేక సుప్రీంకోర్టు తీర్పులను ఉదాహరిస్తూ ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ వ్యతిరేకమైనదని పోరాడిన షాయరాబానో కేసు ఉదంతంతో సహా అనేకమంది మహిళలు, ఎలా పోరాడారో వివరించారు.
‘రాజ్యాంగం అమల్లోకి వచ్చాక పర్సనల్ లాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి న్యాయమూర్తులకు ఇష్టం లేకపోయింది. ఒక్క జస్టిస్ రోహింగ్టన్ నారిమన్ మాత్రమే షాయరాబానో కేసు విషయంలో(ట్రిపుల్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమని తీర్పును ఇవ్వగలిగారు’ అని జైసింగ్ గుర్తుచేశారు.
ఆమె గుజరాత్ హైకోర్టు తీర్పును ఒకదాన్ని ఉదాహరిస్తూ న్యాయవ్యవస్థలో పితృస్వామిక భావజాలమెంతగా వేళ్లూనుకుని ఉందో ఆ తీర్పు చెబుతుందని ఒక మైనరు బాలిక తనకు గర్భస్రావం చేసుకునేందుకు అనుమతి కోరే కేసులో తీర్పునిచ్చిన న్యాయమూర్తులు మనుస్మృతి చదవమని సలహానిస్తూ, అందులో ఆడపిల్లలు 14- 15 ఏండ్లకే పెళ్లి చేసుకోవాలని 17 ఏళ్లకే పిల్లల్ని కనాలని మనుస్మృతి చెబుతుందని చెప్పారు. అంబేద్కర్ 1927లోనే మనుస్మృతిని తిరస్కరించిన విషయాన్ని జైసింగ్ శ్రోతలకు గుర్తు చేశారు. ఆయన మనుస్మృతిని తగలబెట్టిన రోజును ఇప్పటికీ స్త్రీ విముక్తి దివస్‌గా జరుపుకుంటున్న విషయాన్నీ ప్రస్తావించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26ను ఉదాహరిస్తూ వాటి ప్రకారం చట్టాలు చేయడానికి నమ్మకాలు, విశ్వాసాలు పనికి రావని సీనియర్ లాయర్ అన్నారు. దైవనమ్మకం, మతస్వేచ్ఛను రాజ్యాంగం ప్రజలందరికి ప్రసాదించింది. అయితే అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ మాత్రమే, ప్రజాజీవితంలో అలాంటి స్వేచ్ఛ లేదని, కాని చాలామంది నమ్మకం అన్న అంశాన్ని వదిలేసి మత స్వేచ్ఛను మాత్రమే పట్టుకొని వేలాడుతున్నారని ఆమె విచారం వ్యక్తం చేశారు.
కొత్త క్రిమినల్ చట్టాల గురించి( బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్ఏ) చెబుతూ పాత వలసవాద చట్టాల స్థానంలోనే కొత్త చట్టాలను తెచ్చే నెపంతో వాటి పేర్లు మార్చి ‘స్వదేశీ’ రంగు పూసి తెచ్చిన చట్టాలు దేశాన్ని ‘పోలీసు రాజ్యంగా’ మార్చేలా ఉన్నాయని (ముఖ్యంగా దేశద్రోహ్రం, వైవాహిక మానభంగం వంటివి)’ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ చట్టాలు బలహీనులపట్ల మరింత నిర్ధాక్షిణ్యంగా ఉన్నాయని, అంగబలం అర్థబలం ఉన్నవారికి ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు వంటివి చూస్తే, రాజ్యాంగ పాలన ఛీఫ్ జస్టిస్ వివరించిన విధంగా ఉన్నదా అని నాకు ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. లౌకిక విధానాన్ని కాపాడటం అంటే ముస్లింలను సంతృప్తిపరచడం కాదని అది దేశ సమగ్రతను కాపాడేదిగా ఉండాలని అన్నారు. మాజీ భారతన్యాయమూర్తి ‘ధ్వజం’ అన్నది న్యాయానికి గుర్తు అన్న వ్యాఖ్యను ఆమె ఖండిస్తూ తన అభిప్రాయంలో కేవలం రాజ్యాంగం మాత్రమే న్యాయానికి గుర్తని వ్యాఖ్యానించారు.
సీనియర్ న్యాయవాది హెచ్చరిస్తూ లౌకిక విధానం లేకపోతే దేశం అంతర్గత ఘర్షణలను, పోరాటాలను చూసే ప్రమాదమున్నదని, అది బైటి శక్తులకు ఊతమిచ్చేలా ఉంటుందని గుర్తు చేశారు. అనేక మతాలకు ఆలవాలమైన భారతదేశంలో లౌకిక విధానం లేకపోతే, అది న్యాయ, శాసనవ్యవస్థల్లో ప్రతిఫలించకపోతే దేశ సమగ్రత దెబ్బతింటుదని అన్నారు. న్యాయవ్యవస్థలో సెక్యులర్ దృక్పథం లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుందని హెచ్చరించారు.
ఇటీవల అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ యాదవ్ విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఒక సభలో పాల్గొని ప్రసంగించడాన్ని ఆమె ‘హేట్ స్పీచ్’గా అభివర్ణించారు. అలాగే ఆమె రాముడిని భారతదేశ రూపంగా వర్ణించడాన్ని ఆక్షేపిస్తూ భారతదేశరూపం రాజ్యాంగం మాత్రమే, లౌకిక రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో హిందూ దేశాన్ని తేలేరని వక్కాణించారు.
ప్రసంగాన్ని ముగించేముందు జైసింగ్ ‘అనేక మార్పులు నిశ్శబ్దంగా జరుగుతున్నాయి, చట్టాలలో ప్రజల ప్రయోజనాలు రక్షణలకు గ్యారంటీ ఇచ్చే భరోసా కల్పించే భాగాలన్నీ నెమ్మదిగా తీసేస్తున్నారు. (క్రిమినల్ చట్టాలతో సహా అన్నిటినీ ద్రవ్య చట్టాలను అమల్లోకి తెచ్చినంత సులభంగా న్యాయవ్యవస్థ కొలిజీయం సిఫారసులను పక్కనబెట్టి మరీ తీసివేస్తున్నారు.) అందువల్ల న్యాయస్థానాల్లో ఇక వాటిని ఛాలెంజ్ చేయడం కష్టంగా మారుతోంది. అందువల్ల రాజ్యాంగాన్ని రక్షించే వారు లేక ఓడిపోయే సమయం ఆసన్నమవుతోంది’ అన్నారు.
మాజీ సుప్రీం ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ న్యాయ నిర్ణయాలకు తాను దైవ నిర్ణయంపై ఆధారపడ్తానని అన్న వ్యాఖ్యలను ఆమె నిరసించారు. ‘రాజ్యాంగాన్ని కాపాడవలసిన వారు దాన్ని నాశనం చేయడం గమనించవచ్చు. జడ్జీలు న్యాయ నిర్ణయాలకు రాజ్యాంగ పైనకాక దైవాదేశాలపై ఆధారపడడం అన్నది రాజ్యాంగ విరుద్ధం. నేను దేశ రాజ్యాంగాన్ని అమలు చేయాలని రాజ్యాంగం వైపే గట్టిగా నిలబడుతాను’అని ఇందిరా జైసింగ్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఇందిరా జై సింగ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.