
డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు, అసోసియేట్ ఫ్రొఫెసర్
(ఎస్సీ వర్గీకరణ చేయాలనీ, ఎస్సీలకూ క్రీమీ లేయర్ సూత్రాన్ని వర్తింపచేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అjయితే ఈ వర్గీకరణ ప్రక్రియకు ఎలా రాజ్యాంగబద్ధత దక్కుతుందన్న విషయంలో మాత్రం సుప్రీం కోర్టు తీర్పులో స్పస్టత లేదు. పైగా రాజ్యాంగం ప్రకారం ఎస్సీలు, ఎస్టీలకు రాష్ట్రపతి (అంటే స్వయనా కేంద్ర ప్రభుత్వం) రక్షణకవచం. బిసిల తరహాలో వర్గీకరణ, ఆయా ఉపకులాల సంఖ్యాబలం, సామాజిక ఆర్థిక రాజకీయ హోదాల ప్రాతిపదికన వారికి ఎస్సీ రిజర్వేషన్లలోనే నిర్దిష్టమొత్తం కేటాయించాలని చెప్పటం ద్వారా సుప్రీం కోర్టు ఆ సమస్యను పెనం మీద నుండి పొయ్యిలోకి నెట్టినట్టయ్యింది. ఉన్న రిజర్వేషన్లు అమలు జరగాలన్నా, వాటి వలన ఎవరికో ఒకరికి అర్హులకు ప్రయోజనం కలగాలన్నా ప్రభుత్వ ఉపాధి అవకాశాలు పెరగాలి. లేదా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకు చట్టం చేయాలి. ఇవేవీ చర్చించకుండా వర్గీకరణే ఎస్సీల్లో వెనకబడిన కులాలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్న చందంగా సుప్రీం కోర్టు వ్యవహరించటం, తదనంతర పరిణామాలపై అవగాహన కల్పించేందు నిస్పక్షపాతంగా బహిరంగ చర్చ జరగవల్సిన అవసరం ఉంది. ఈ చర్చను ప్రారంభించటమే ఈ వ్యాసం ప్రచురణ వెనక ఉన్న ఉద్దేశ్యం. దూష భూషణలు, అర్థరహిత, అవాంఛనీయ వ్యాఖ్యానాలకు తావు లేకుండా అర్థవంతమైన చర్చ దిశగా వచ్చే విమర్శలకు కూడా అవకాశం కల్పిస్తాము : తెలుగు వైర్ సంపాదకులు)
పార్లమెంటు రాష్ట్ర శాసన సభలు చేసే చట్టాలపై వ్యాఖ్యానించటం, అవసరమైతే అ చట్టాలు చెల్లుబాటు కావంటూ రద్దు చేసే హక్కును రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ,హైకోర్టులకు ఇచ్చింది. అంటే శాసన సభలు చేసే చట్టాలు రాజ్యాంగానికి లోబడి ఉండాలన్నమాట.ఆ రకంగా రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యతను సుప్రీంకోర్టు కలిగి ఉంది. దీన్నే మరింత విస్తృతార్ధంలో చూస్తే సుప్రీం కోర్టులు ఇచ్చే తీర్పులు కూడా రాజ్యాంగం నిర్దేశించిన చట్రం పరిధికి లోబడి ఉండాలి. ఒకవేళ రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్‌ను సవరించాల్సి వస్తే ఆ సవరణాధికారం చట్టసభలకే ఉంటుంది తప్ప సుప్రీం కోర్టుకు కాదు. అయితే ఇటీవల సుప్రీంకోర్టే రాజ్యాంగానికి వ్యతిరేకమైన తీర్పులిస్తున్న సందర్భాలు ఇటీవల పెరిగాయి. ఇది అభ్యుదయ వాదులకు ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఆందోళన తీర్పు, దాని రాజకీయ పర్యవసానాల గురించి కాదు. రాజ్యాంగం నిర్దేశించిన చట్రానికి వెలుపల వస్తున్న తీర్పులు స్థూలంగా రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తుందన్నదే ఈ ఆందోళనకు కారణం.
ఇటువంటి ఆందోళన కలిగించేమరో తీర్పు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఇస్తూ ఆగస్టు 1,2024 న వెలువరించింది. 7 గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పులో క్రీమిలేయర్ విధానాన్ని ప్రతిపాదించడం, ఇప్పటికే రిజర్వేషన్ ద్వారా ప్రయోజనం పొందిన వారిని దాని పరిధి నుండి తొలగించమని అలాగే ఆర్థిక, సామాజిక వెనకబాటు తనం ఆధారంగా వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని ప్రకటించింది. ఇది ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ లను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని గతంలో చెప్పిన ఇవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కేసులో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నది. కాబట్టి ఈ తీర్పులోని హేతుబద్ధతను, రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించాలంటే ముందు షెడ్యూల్ కులాలు ఏ ప్రాతిపదికన కూడగోట్టబడ్డారు? రాజ్యాంగం దేనిపై ఆధారపడి వారికి రిజర్వేషన్ హక్కుల్ని కల్పించింది? అనేదాన్ని పరిశీలిద్దాం.
ముందుగా 1911 మరియు 1931 జనాభా లెక్కలలో షెడ్యూల్ కులాలను ఎలా గుర్తించారో చూడాలి. 1.హిందుమత నియమాలను అనుసరించని వారు 2.బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని, వేదాల అధికారాన్ని అంగీకరించని వారు.3.హిందూ దేవుళ్లను ఆరాధించని వారు.4. గొడ్డు మాంసం తింటూ, మృత కళేబరాలను ఖననం చేసుకుంటూ జీవిస్తున్న వారు. మొత్తంగా హిందూ సమాజం చేత దూరంగా నెట్టబడిన వారిని అంటే సాంఘిక వెలికి గురియేటువంటి కులాలను కలిపి ఉమ్మడిగా ‘డిప్రెసెడ్ క్లాసెస్’ గా గుర్తించారు . ఈ కులాల మధ్య ఉన్న ఉమ్మడి లక్షణం హిందూ సమాజం చేత సాంఘిక వెలికి గురికాబడటం. అదే సమయంలో వీరి మధ్య ఆనాటికే సాంఘిక, ఆర్థిక పరమైన అంతరాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగం కూడా సాంఘిక వెలివేత అనే ఉమ్మడి లక్షణం ఆధారంగా షెడ్యూల్ కులాలను గుర్తించింది.
వీరినే కాదు, రాజ్యాంగ మొత్తం సమాజాన్ని ఎలా వర్గీకరించిందో చూద్దాం. అడవులపై ఆధారపడి , ప్రత్యేక సంస్కృతితో జీవిస్తున్న వారిని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు)గాను, హిందూ సమాజంలో అంటరానితనాన్ని ఎదుర్కొంటున్న వారిని షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) గాను, ఆర్థిక , సాంఘిక వెనుకబాటుతనం ఆధారంగా వెనుకబడిన తరగతులను(బిసిలు)గాను గుర్తించింది. మిగిలిన వారిని ఇతరులుగా గుర్తించింది. ఈ మొత్తం వర్గీకరణలో కులాలు అనే పదాన్ని %ూ.జ% లకు మాత్రమే వాడిరదన్ని గమనించాలి.ఈ విధంగా రాజ్యాంగం వెలివేత ఆధారంగానే వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ వారిని ప్రత్యేకంగా వర్గంగా గుర్తించింది.
ఇక షెడ్యూల్ కులాలను విడిగా చూస్తే కులాలుగా కనబడతాయి. కానీ దేశవ్యాప్తంగా చూస్తే ఒక వర్గం లక్షణం కనబడుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో బీసీలు ఉన్న చాకలి వారు కేరళలో (కె ఆర్ నారాయన్) ఎస్సీలు గా ఉన్నారు. మన దగ్గర ఉన్న ముదిరాజు లు బీహార్ లో(రామ్ నాథ్ కోవింద్) ఎస్సీలు. అలాగే చేపలు పట్టే బెస్తవారు బెంగాల్లో ఎస్సీలుగా ఉన్నారు. మన మహబూబ్ నగర్ లో బాలస్వామి అనే దళితున్ని గడ్డివాములో సజీవ దహనం చేసిన వాల్మీకిలు, పంజాబ్ లో ఎస్సీలుగా ఉన్నారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాల జాబితాలో 1200 కులాలు ఉన్నాయి. ఇలా భిన్న సమూహాలు కలిసి ఒక ఉమ్మడి స్వభావాన్ని సంతరించుకోవడం అంటే అది వర్గ లక్షణాన్ని కలిగి ఉండటమే. ఇది చరిత్ర.
ఆ రకంగా బ్రాహ్మణీయ మనువాద చరిత్రలో కుల వ్యవస్థ వల్ల ముక్కలు, ముక్కలుగా విడిపోయి ఉన్న కులాలను బ్రిటిష్ సామ్రాజ్యవాది మొదటిసారిగా కులాల పరిధికి మించిన ఉమ్మడి లక్షణాలు గల సామాజిక తరగతిగా, ఒకే వర్గంగా పరిగణించాడు. గుర్తించాడు. తదనుగుణంగా పాలనా పరమైన విధానాలు చేపట్టాడు. ఈ ప్రాతిపదికే వారి హక్కులకు కోసం ఉద్యమం చేయటానికి డాక్టర్ అంబేద్కర్ కు భూమికగా ఉపయోగపడిరది. విచిత్రమేమంటే, ప్రజల్ని ఐక్యం చేసి విప్లవం ద్వారా సమానత్వం తేస్తామని చెప్పే నక్సలైట్ సిద్ధాంతవేత్తలు తిరిగి ఈ వర్గాన్ని వర్గీకరణ పేరుతో ఎవరి స్వతంత్ర అస్తిత్వాన్ని వారికి అప్పగించి, కులాలుగా వారిగా విభజించే దిశగా పాలకవర్గం తీసుకుంటున్న అనేక నిర్ణయాలను అర్థమయ్యో, అర్థం కాకనో అందిపుచ్చుకుంటున్నారు. ఒకవేళ వారు వాదించినట్లు అదే పద్ధతిని ఎస్సీలలో అనుసరించాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్లు ప్రత్యేకంగా ఉండేవి కావు.వారు కూడా బీసీ రిజర్వేషన్ల లో ఏదో ఒక విభాగం లో లేదా మరొక కేటగిరీ కింద ఉండేవారు. కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన పద్ధతి, అలాగే ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించిన పద్ధతి పూర్తిగా భిన్నమైనది. మరి ఎందుకని నక్సలైట్ మేధావులు పేదల మధ్య విభజనలు పెంచే వాదనలు చేస్తున్నారు? వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయో కొద్దిగా చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలను విభచించటానికి ప్రాంతం, మతం, కులం, జెండర్ వంటి రకరకాల గుర్తింపులతో అస్తిత్వ ఉద్యమాలు సృష్టించ పడ్డాయి. శ్రామిక ప్రజల మధ్య ఈ రకంగా విభజన తెచ్చి తమ విధానాలను ప్రశ్నించకుండా వారిని పక్కదారి మళ్లించేందుకు అన్ని రకాలుగా సపోర్టు ఇవ్వటం కనబడుతుంది. ఈ ఉదారవాదం మరింత నగ్నంగా అన్ని సంబంధాలను ‘సరుకు’ సంబంధాలుగా మార్చే ధోరణిని పెంచింది. ఇది మనకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ, కుల అస్తిత్వ ఉద్యమాలలోనూ ఉద్యమాన్ని ఉపాధిగా మార్చిన ధోరణిని చూడవచ్చు. చిత్రమేమంటే, నక్సలైట్ పేరుతో ఉన్నవారు కూడా అస్తిత్వ ఉద్యమ సిద్ధాంతాలను సమర్ధించటమే కాక తాము కూడా దిగబడి ఈ ఉద్యమాల్లో పని చేయటం కనిపిస్తోంది. మొత్తంగా దేశానికి ప్రత్యామ్నాయం చూపించాల్సిన ఈ శక్తులు గతం కంటే మరింతగా బలహీన పడ్డారు. పోనీ వర్గీకరణ విషయములో రాజ్యాంగ భూమికగా సరైన పరిష్కారాన్ని ముందుకు పెడుతున్నారా? అంటే అది లేదు.
ఎందుకు బీసీల తరహా వర్గీకరణను ఎస్సీలకు అన్వయించకూడదు? ఎస్సీలలో వారి అభివృద్ధి స్థాయిని కానీ హోదాని కానీ ఎందుకు పరిగణలోకి తీసుకోకూడదు? మనకున్న అనుభవాలు ఏం చెబుతున్నాయి? అని చూస్తే, బాబు జగజీవన్ రామ్ జాతీయోద్యమ నాయకుడిగా , ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యుడుగా, కేంద్ర ప్రభుత్వంలో ప్రముఖ శాఖలను నిర్వర్తించిన స్థాయి, హోదాలు ఆయనకు ఉన్నాయి. ఆయన 1978లో రక్షణ మంత్రి హోదాలో బెనారస్ లోని ‘సంపూర్ణ నందా’విగ్ర ఆవిష్కరణ చేసి వచ్చిన తర్వాత బ్రాహ్మణులు ఆ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేశారు. అలాగే 2018 లో రామనాథ్ కోవింద్ దంపతులు ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయ ప్రవేశాన్ని అక్కడివారు అడ్డుకున్నారు. సాక్షాత్తు రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తికే ఇలాంటి వెలివేత తప్పలేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం వారు దళితుల దేవాలయ ప్రవేశం చేయిస్తే దేవుడు మైలపడ్డాడని ఆఖరికి ఆ దేవాలయాన్నె కాక ఆ దేవున్ని కూడా వెలివేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దేవున్నే వెలివేసే వారు దళితులను వెలివేయకుండా ఉంటారా? ఇది మన దేశ ప్రత్యేకత. ఈ ప్రత్యేకత పునాదిపైనే షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయని గుర్తించాల్సి ఉంది.ఈ నేపథ్యానికి భిన్నంగా సుప్రీంకోర్టు బీసీల రిజర్వేషన్ల ప్రాతిపదికల్లో తీసుకున్న సాంఘిక, ఆర్థిక వెనకబాటు పై ఆధారపడి తీర్పు ఇవ్వటం అంటే రాజ్యాంగ స్పిరిట్ నుంచి వైదొలగటమే అవుతుంది
ఇలాంటి కారణాల దృష్టనే రాజ్యాంగం షెడ్యూల్ కులాలకు 341 ఆర్టికల్ ద్వారా రిజర్వేషన్లు ఇవ్వటమే కాక, ఒకవేళ ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకుంటే దాన్ని సవరించి అధికారం పార్లమెంటుకు కట్టబెట్టింది. ఆర్టికల్ 341 కేవలం కులాల తొలగింపు, చేర్చడం కోసమే కాక భవిష్యత్తులో పాలక పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం షెడ్యూల్ కులాల మధ్య విభజనలను సృష్టించకుండా, వారి ఉమ్మడి అస్తిత్వాన్ని కాపాడే విధంగా పార్లమెంటు స్థాయిలో విధానపర నిర్ణయాలు తీసుకోవటానికి రాష్ట్రపతికి అధికారాన్ని కట్టబెడుతున్నది. ఆ రకంగా రాష్ట్రపతే కాక, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా వారికి సంరక్షకులుగా ఉండాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. అటువంటప్పుడు వారి అభిప్రాయాలను తీసుకొని ఈ వర్గీకరణను పార్లమెంటే చేయాలని సుప్రీంకోర్టు ఎందుకు కోరలేదు? అలా కోరకపోగా బీసీ రిజర్వేషన్లపై ఇంద్రసహాని కేసులో ఉన్న క్రిమిలేయర్ వాదాన్ని ముందుకు తెచ్చి ఇప్పటికి రిజర్వేషన్ ద్వారా ప్రయోజనం పొందిన వారిని తొలగించమని ఎలా చెబుతుంది? రాష్ట్రాలకు అధికారాన్ని అప్పగించడం వల్ల పాలక పార్టీలు తమ వైఫల్యాలను నుండి తప్పించుకోవటానికి ఈ కులాల మధ్య కుంపట్లు ఎలా రగిలించి తమ పబ్బం ఎలా గడుపుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం కదా. సాక్షాత్తు ప్రధానమంత్రి వర్గీకరణ కోరుతున్న వారికి బాసటగా నిలిచి తీర్పును ప్రభావితం చేశారన్న వాతావరణం కలిగించటం గమనిస్తే న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తి ప్రశ్నార్ధకమవుతుంది.
గత లోక్‌సభలో బిజెపికి అనూహ్యమైన సంఖ్యా బలం ఉంది. అలాంటప్పుడు ఈ సమస్యపై పార్లమెంట్లో చట్టం చేసి దేశవ్యాప్తంగా అమలు చేసేలా నిర్ణయించవచ్చు. కానీ ఆ రకమైన నిర్మాణాత్మక, నిర్ణయాత్మక చర్య ద్వారా ఈ సమస్య పరిష్కారానికి, వర్గీకరణకూ రాజ్యాంగబద్ధమైన పునాదిని ఏర్పాటు చేయటానికి బదులు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిప్పుల కొలిమిలో దూకమని చెప్పటం అంటే దాని వెనక వర్గీకరణ ద్వారా ఎస్సీ రిజర్వేషన్ పొందలేని కులాలకు న్యాయం చేయటం కంటే ఎస్సీలను చీల్చి ఒక ముఠాను తమ శాశ్వత ఓటుబ్యాంకుగా మార్చుకునే ప్రయత్నమే కనిపిస్తోంది. నిజానికి సుప్రీం కోర్టు తీర్పు తర్వాత అయినా బిజెపికి చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న మెజారిటీ రాష్ట్రాల్లో తెలంగాణ తరహా ప్రయోగం ఎందుకు చేయలేదు? తెలంగాణలో వర్గీకరణ ద్వారా ఎస్సీల్లో బలహీనులకు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఇదే న్యాయాన్ని దేశవ్యాప్తంగా ఎస్సీల్లో ఉన్న బలహీనులకు వర్తింపచేయటానికి ఉన్న అవకాశాలూ, మార్గాలూ ప్రభుత్వం పరిశీలించకపోవటం మీదనే బిజెపి, ఆరెస్సెస్‌ల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. ఓ వైపు వర్గీకరణను సమర్ధిస్తూనే మరోవైపు 400 సీట్లు కట్టబెడితే రిజర్వేషన్లను రద్దు చేస్తామని బిజెపి నాయకులు బాహాటంగా ప్రకటించటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇక సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు షెడ్యూల్ కులాలల్లో అసమానతలు కొనసాగుతున్న అనేది యథార్థం. అయితే వారి వెనుకబాటుతనానికి , వారి మధ్య కొనసాగుతున్నఈ అసమానతలకు ఏ ఒక్క షెడ్యూల్ కులం కారణం కాదు. 77 ఏండ్ల పాలకుల నిర్లక్ష్యం, వైఫల్యాలే కారణం. అందువల్లనే నేటికీ ఈ వర్గాలు అన్యాయాలను, వివక్షలను, అణిచివేతలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి రాజ్యాంగ రక్షణ కోసం నిలబడాల్సిన సుప్రీంకోర్టు ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నించకపోవడం వల్ల తాను కూడా ఆ వైపల్యంలో భాగమవుతున్నది కదా! ఈ రకంగా పాలకుల వైఫల్యాన్ని గుర్తింప చేయాలని ఆశించటం తప్పు కాదు కదా. కాబట్టి వారి అభివృద్ధిపై చర్చించి ఒక సమగ్రమైన ఒక చట్టాన్ని పార్లమెంటు రూపొందించాలని ఆదేశించడంలో లోనూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ వైపుకు పురమాయించుటంలోనూ సుప్రీంకోర్టు వైపల్యం స్పష్టంగానే కనబడుతుంది. మొత్తంగా చూస్తే ఈ తీర్పు,’’తాంబూలాలిచ్చాం, తన్నుకు చావండి!’’ అన్నట్లుగా ఉంది. ఈ చిక్కు ముడి నుండి దళిత సమాజం ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సి ఉంది.
డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు, అసోసియేట్ ఫ్రొఫెసర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.