
నీవు వినబడనట్లు నటిస్తున్నావు కానీ
నేను మాత్రం మౌనంగా ఉండలేను
దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూనే ఉంటా..
నీవు కనబడనట్లు నటిస్తున్నావు కానీ
నేను మాత్రం నిత్య చైతన్యంతో
కదులుతూ, కదిలిస్తూనే ఉంటా..
నీవు ఏమీ అర్థం కానట్లు వ్యవహరిస్తున్నావు కానీ
నేను మాత్రం నీకే కాదు
నా చుట్టుపక్కల వారికి కూడా అంతా స్పష్టంగా వివరిస్తా..
నీవు అమాయకంగా ఏమీ చేయలేని
నిస్సహాయత, నిర్లిప్తత, అశక్తత ప్రకటిస్తున్నావు కానీ
నేను మాత్రం నీ బొక్కసం నుండి
ఏ కార్పొరేట్ శక్తులకు సీమ్లెస్ నిధుల
అక్రమ ప్రవాహం సాగుతోందో అందరికీ చూపిస్తా..
నీ వందిమాగధ అసత్య మీడియా రెక్కలను
ఎంత విస్తరింపజేస్తున్నా కానీ
నేను మాత్రం నాకే సొంతమైన
నిత్య సత్య, వాస్తవ పలుకులను
ప్రపంచానికి విస్తారంగా పరిచయం చేస్తా..
నీ కుత్సిత, కుటిల నీతితో
మా మధ్య ఎన్ని తంపులాటలు పెట్టాలని చూస్తున్నా కానీ
నేను మాత్రం మా వర్గమంతా
శ్రామిక, పీడిత, కార్మిక వర్గమేనని
ఐక్యతాదారంతో మళ్ళీ మళ్ళీ గట్టిగా ఒక్కటి చేసి
మా నిజమైన శత్రువెవరో తేటతెల్లం చేస్తా..
ఇది మొదలు కాదు
ఏ నాడో బొట్టు బొట్టుగా చేరి ‘నది’
త్వరలోనే సంద్రంగా మార్చి
ఆ విజృంభణలో
నీ మెడలు వంచి
ఒడలు విరిచి,
సమ సమాజ అభ్యున్నతికి
కొత్త దారులను సృష్టిస్తా
తుపాను తరువాత ప్రశాంతత రుచిని చూపిస్తా..
గిరిధర్
9849801947
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.