
“నేను నిలబడతాను, మీరు నిలబడతారా” అని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలో రాకముందు ఆవేశంగా అన్నారు. మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటం ప్రారంభించారు. ఆ సమయంలో కార్మికుల నిరసనకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఈ మాటలను అన్నారు. నాడు అధికారంలోని వైసిపి ప్రభుత్వానికి కేంద్రాన్ని నిలవరించడం చేతకాలేదని విమర్శిస్తూ, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సాగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద 2021 అక్టోబర్ 31న జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అనుమతించడమంటే ఆంధ్ర రాష్ట్రానికి ఉరి వేయడమేనని చాలా ఆవేశంగా ఆయన ఉపన్యసించారు. అక్కడున్న వేలాది మంది కార్మికులను ఉద్దేశించి ఎట్టి పరిస్థితుల్లోను స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన ఉంటానని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటానని గొప్ప ఉపన్యాసం ఇచ్చారు.
పవన్ హామీ..
ఆ సందర్భంలోనే కడదాకా ”నేను నిలబడతాను, మీరు నిలబడతారా” అని కార్మికులను ప్రశ్నించారు. కార్మికులు కూడా నిలబడతాం, నిలబడతాం అని పెద్ద ఎత్తున నినదించారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోదీ ప్రభుత్వానికి పూర్తిగా దాసోహం అయిపోయిందని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పట్ల దానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని, తాను మాత్రం స్టీల్ ప్లాంట్ రక్షణకు కట్టుబడి ఉంటానని చాలా గట్టిగా హామీ ఇచ్చారు.
అంతే కాదు, తమ మంగళగిరి పార్టీ ఆఫీసు వద్ద ఆయన 2021 డిసెంబరు 12న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక రోజు దీక్ష కూడా చేశారు. ఆ సందర్భంగా 22 మంది ఎంపీలున్నా వైసిపికి కనీసం పార్లమెంటులో ప్లే కార్డులు కూడా చూపించే చేవ కూడా లేకపోయిందని ఘాటుగా విమర్శించారు. అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకు వెళ్లి ప్లాంట్‌ను రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.
విమర్శ- డిమాండు..
ఈ విమర్శ, డిమాండు బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు వీరి కూటమి ఏం చేస్తోందన్నదే అసలు ప్రశ్న. వీరికీ అంతమంది ఎంపీలున్నారు కదా! ఇప్పుడు ప్లేకార్డులు ప్రదర్శించవచ్చు కదా! ఏమిటి అడ్డంకి? అలాగే పవన్‌కు ప్రధాని వద్ద మంచి పరపతి ఉందని చెప్పుకుంటారు కదా! ఆయనే ఒక అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకు వెళ్ళవచ్చు కదా! ఏమిటి ఆటంకం? ఇతరులను విమర్శించే అర్హత మనం పాటిస్తేనే కదా వస్తుంది.
కూటమి హామీ..
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు శరవేగంగా జరిగాయి. పవన్ కళ్యాణ్ చొరవతో బిజెపి, తెలుగుదేశంతో కలిపి కూటమి ఏర్పాటయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తామని చెప్పిన బీజేపీతో జతకట్టడం ఏమిటి? అలా జతకడితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఎలా సాధ్యం అనే సందేహం సహజంగానే చాలా మందికి కలిగింది. అయితే, కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి సర్కార్ ఏర్పడితే కేంద్ర ప్రభుత్వంలో అధికారం పంచుకునే తాము గ్యారంటీగా స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని హామీ ఇచ్చారు.
భారీ మెజారటీ..
ఈ హామీని చాలామంది విశ్వసించారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు విశాఖ జిల్లాలోని తెలుగుదేశం, జనసేన నాయకులు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తమదేనని ఇదే వాగ్థానం చేశారు. అయితే, ప్రజలు బీజేపీ మీద నమ్మకం లేదు. కానీ, వీరిచ్చిన ఈ హామీని విశ్వసించారు. ఓటర్ల తీర్పు కూడా ఈ దిశలోనే వెలువడింది. రాష్ట్రంలో కూటమి భారీ రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. వీరి మాటలను విశ్వసించడం వల్లనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అత్యధికంగా ఉన్న గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ టిడిపి అభ్యర్థులు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు.
డబుల్ ఇంజన్ ధమాకా..
కట్ చేస్తే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది. కానీ అదేం విచిత్రమో గాని, ఈ డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను మరింత బలహీనపరిచే చర్యలను మోదీ ప్రభుత్వం తీవ్రతరం చేసింది. అన్ని రకాలుగా దీన్ని దెబ్బ తీసే కుట్రలకు పాల్పడుతోంది. ఉత్పత్తిని ఉదేశపూర్వకంగానే తగ్గించి వేసింది. రవాణాకు రైల్వే వేగన్లు కూడా రాకుండా అడుగడుగునా అడ్డు తగులుతూ వచ్చింది. చివరకు కార్మికులకు గత ఆరు నెలలుగా సక్రమంగా జీతాలు కూడా డబ్బులు ఉన్నా చెల్లించడం లేదు. మరోపక్క 1200 మంది పెర్మనెంట్ కార్మికులు, అధికారులను వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చింది. 5,600 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని నిర్ణయించింది. ఇప్పటికే వెయ్యి మందికి పైగా తొలగించింది. వీటన్నింటిపై పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాన నాయకుడికి పై నుంచి ఆదేశాలతో యాజమాన్యం ఛార్జ్ షీట్ ఇచ్చింది. ఇదీ నేటి స్థితి.
తీరని కష్టాలు..
ఈ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి 11,400 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజీ అని ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో స్టీల్ ప్లాంట్ కష్టాలన్నీ తీరిపోతాయని కూటమి నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఈ డబ్బులు బ్యాంకుల అప్పులు తీర్చడానికి, ప్రభుత్వానికి పన్నులు కట్టడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయని, దీని నుంచి ముడి సరుకు కొనడం కానీ, కార్మికుల జీతాలు చెల్లించడం కానీ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. దీంతో గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు మరింత కష్టాలే ఎదురయ్యాయి.
నేడు మోదీ ప్రభుత్వానికి పార్లమెంటులో మెజారటీ లేదు. తెలుగుదేశం, జనసేనకు చెందిన రాష్ట్ర ఎంపీల మద్దతుతోనే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. అందువల్ల మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించుకోవడానికి గొప్ప అరుదైన అవకాశం నేడుంది.
నోరు మెదపని పవన్..
కానీ, దురదృష్టమేమిటంటే అంత ఆవేశంగా నాడు ఉపన్యసించిన పవన్ కళ్యాణ్ నోరు గత సంవత్సరకాలంగా మూగబోయింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను మరింతగా బలహీనపరిచే చర్యలు మోదీ ప్రభుత్వం చేపడుతుంటే, దానిపై ఒక్క మాట కూడా ఆయన మాట్లాడడం మానేశారు. స్టీల్ కార్మిక సంఘాల నాయకులు పవన్‌ను 2024 అక్టోబరు 6న ఆయన ఆఫీసులో కలిసి, ఇందులో జోక్యం చేసుకోవలసిందిగా కూడా కోరారు. అయినా కానీ ఉలుకూ లేదు, పలుకూ లేదు. ఇది ఏ రకమైన విశ్వసనీయతో ఆయనకే తెలియాలి. విచక్షణ లేకుండా ఇలాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జనాలను మోసం చేయాలనుకోవడం ఏ రకంగా సమంజసమో కూడా ఆయనే చెప్పాలి.
తీరని ద్రోహం..
నేడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జీవన్మరణ సమస్యలు ఎదుర్కొంటోంది. కేంద్ర ప్రభుత్వం పైకి మాయ మాటలు చెప్తూనే, మరోపక్క పూర్తిగా నిర్వీర్యం చేసి పీక నులిమేసే అన్ని చర్యలను చేపడుతోంది. తెలుగు ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించుకోలేకపోతే చరిత్ర క్షమించదు. కార్మికులు మోదీ ప్రభుత్వ కుట్రలను ఓడించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ నేడు నోటికి ఫెవికాల్ అంటించుకుని ఈ ఉద్యమానికి తీరని ద్రోహం చేస్తున్నారు.
మాయమాటలు చెప్పైనా, ఎలాగోలా అధికారంలోనికి రావడం అంత గొప్ప విషయమేమీ కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో దుర్మార్గులు కూడా ప్రజలకు మంచివారుగానే కనబడి, ప్రస్తుత ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉంటే ఎన్నికల్లో కూడా గెలుస్తూ ఉంటారు. గత అనేక అనుభవసారం కూడా మనకు ఇదే తెలుపుతోంది. నేడు పవన్ కళ్యాణ్ అటువంటి మోసకారుల జాబితాలో చేరతారా లేదా ఆయన చెప్పే ఉపన్యాసం ద్వారా నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ఇప్పటికైనా కాపాడతారా అన్నది తేల్చవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కాకపోతే ఇక మరి ఎప్పుడూ కాదు అన్నది నేటి పరిస్థితి.
కూటమే కారణం..
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మూగనోమును, కూటమి లొంగుబాటును పూర్తిగా అలుసుగా తీసుకొని, ప్రైవేటీకరణ ప్రక్రియను, స్టీల్ ప్లాంట్‌ను బలహీనపరిచే ప్రక్రియను స్పీడుగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో సవ్యసాచి పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి ద్రోహం చేస్తారా? రాష్ట్రానికి న్యాయం చేస్తారా? అన్నదాన్ని బట్టి ఆయన మాటలకు ఎంత విశ్వసనీయత ఉంది అన్నది తెలుస్తుంది. పాత మాటలు గాలికి వదిలేసి, మోదీ భజన బృందంలోనే చేరుతాను,
ఊసరవెల్లిలా రంగులు మారుస్తానని ఆయన పయనిస్తుంటే తప్పకుండా రాష్ట్రానికి ద్రోహం చేయడమే అవుతుంది. కాబట్టి పవన్ నిజ జీవితంలో కూడా హీరోగా నిలబడతారా, లేక కష్ట కాలంలో ద్రోహం చేసి జీరోగా మిగులుతారా అన్నది ఆయనే తేల్చుకోవాలి. ఈ సమయంలోనే ప్రజలు కూడా ఆయన మాటలను, హావ భావాలను కాక, ఆయన చేతలలో ఏం చేశారు అనేది గమనిస్తూనే ఉంటారు.
రాష్ట్రంలో కూటమి ఏర్పాటుకు కర్త, కర్మ, క్రియ పవన్ కళ్యాణ్ అనేది కూటమి నేతలందరూ చెబుతున్నదే. కాబట్టి సహజంగానే కూటమి వల్ల రాష్ట్రానికి జరిగే లాభ నష్టాలకు కూడా ఆయనే బాధ్యత వహించాలి. రాష్ట్రంలోని ఏకైక భారీ పరిశ్రమను కాపాడుకోలేపోతే ఇక డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమిటి? పవన్ కూటమి సాధించేమిటి అన్న ప్రశ్న ఉదయించకమానదు.
ప్రజా ఉద్యమాలే శరణ్యం..
ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిన ఏ రాష్ట్రంలోనూ లేని ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. అదేమిటంటే, ఇక్కడ టిడిపి, జనసేన ద్వయం, వైసిపి ఇద్దరూ కలహించుకుంటారు. కానీ, కేంద్ర మోదీ ప్రభుత్వానికి మాత్రం పోటీపడి దాసోహమవుతారు. ఫలితంగా రాష్ట్రంలో అసలైన ప్రతిపక్ష పాత్ర ప్రజా ఉద్యమాలే నిర్వహించాలి.
ఇటువంటి ప్రభుత్వరంగ సంస్థను కాపాడుకోవడం భవిష్యత్తు తరాలకు రక్ష. రాష్ట్ర ప్రజలు రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా మరింత చైతన్యంతో ఆలోచించి నరేంద్ర మోదీ ప్రభుత్వం తన ఈ నిర్ణయం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలి. పోరాడుతున్న కార్మికులకు అండగా నిలవాలి. పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా కూటమి కుట్రలను భగ్నం చేయాలి. మన మంచి భవిష్యత్తును మనమే నిర్దేశించుకోవాలి.
ఎ అజ శర్మ,
ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.