
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటువెళుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిన అంశంలోనూ పార్టీలకు పట్టింపులు, కూటములే గుర్తొస్తున్నాయా? పార్టీలకు ప్రజల భవిష్యత్ కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా? చెన్నైలో డిఎంకె ఆధ్వర్యంలో డిలిమిటేషన్‌పై జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైసిపి హాజరుకాక పోవడంతో ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసిపి ప్రస్తుతం ఏ కూటమిలో లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరిని కలవాలన్నా పార్టీ అధినేత జగన్ నిర్ణయమే సుప్రీం. అలాంటిది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగబోతోంది, కలిసి రాజకీయాలకు అతీతంగా అందరం కేంద్రంపై పోరాటం చేద్దామంటూ డిఎంకె పిలుపు నిచ్చింది. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ అడుగు ముందుకు వేసి దక్షిణాది పార్టీల ప్రతినిధులను, కాంగ్రెస్‌తో సహా అందరికీ ఆహ్వానాలు పంపి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అలాంటి సమావేశానికి వెళ్లే అవకాశాన్ని వదులుకున్న జగన్, ఆ విషయంలో తమ వైఖరి ఇదేనంటూ ప్రధాని మోదీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. అయితే తమ పార్టీ అభిప్రాయం అంటూ ప్రధానికి రాసిన లేఖ ప్రతినే డిఎంకె నిర్వహించిన సమావేశానికి పంపడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
జగన్ ఎపుడు ఏమి చేసినా ప్రత్యేకంగా చేస్తారు. తన రూట్ సపరేట్ అనిపించుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అసెంబ్లీకి పోకుండా అదే సమయంలో ప్రెస్‌మీట్ పెట్టి ప్రజాసమస్యలను సభలో కాకుండా మీడియాకు వెళ్లడించడమూ ఆయనకే చెల్లింది. అసెంబ్లీ వేదిక వేరు వ్యక్తిగత మీడియా సమావేశం వేరనే సంగతిని జగన్ గుర్తించడం లేదు. ఇప్పుడు జగన్ అదే చేశారు. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని అందరితో పాటు అఖిలపక్షంలో అభిప్రాయం చెప్పకుండా, ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా లేఖ రాసి మరోమారు విమర్శల పాలయ్యారు. సమావేశానికి తాము దూరం అన్నట్లు ఊరుకున్నారా? ఆ విషయం తనకు పట్టనట్టు వదిలేశారా? అంటే అదీను లేదు. దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, డీలిమిటేషన్ ఇప్పుడు మంచిది కాదని తన అభిప్రాయన్ని తెలియజేసి కుండబద్దలు కొట్టారు.
జగన్ లేఖలో ఏముంది..?
డీలిమిటేషన్ మీద తన పార్టీ వైఖరిని జగన్ తేల్చిచెప్పారు. అదే లేఖ రూపంలో రాసి ప్రధాని మోడీకి పంపించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఎంపీ సీట్లు పెద్ద ఎత్తున తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ వల్ల లోక్‌సభ సీట్లు తగ్గితే రాష్ట్రానికి రావలసిన నిధులు కూడా కేంద్రం నుంచి రావని అభిప్రాయం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో జనాభా గణనీయంగా తగ్గిందని, జనాభా నియంత్రణ కోసం కేంద్రం ఇచ్చిన పిలుపుని పాటించినందువల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ, మంచికి పోతే చెడు ఎదురవడం ఏంటని ప్రశ్నించారు.
”వచ్చే ఏడాది 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం డీలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం కచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ లేకుండా చూడండి” అని జగన్ లేఖలో కోరారు
ఇంకా ”కేంద్రం తీసుకునే విధాన నిర్ణయాలలో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలి. లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కోరుకుంటున్నా” అంటూ లేఖలో ప్రస్తావించారు.
1971, 2011 నాటి జనాభా లెక్కల వివరాలను ఇందులో పొందుపరిచారు. అండమాన్ నికోబార్ సహా దక్షిణాదిన ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంత శాతం మేర జనాభా పెరిగింది? తగ్గింది అనేది లేఖలో సవివరంగా తెలిపారు. తన అభ్యంతరాలను లెక్కలతో సహా జగన్ ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు. 2011 నాటి లెక్కల ప్రకారం ఏపీలో 1971లో 5.05 శాతం మేర జనాభా ఉండగా 2011 నాటికి ఈ సంఖ్య క్షీణించిందని పేర్కొన్నారు. 4.08 శాతానికి తగ్గినట్లు తెలిపారు. అండమాన్ నికోబార్ 0.02 నుంచి 0.03, తెలంగాణ 2.89 నుంచి 2.91, కర్ణాటక 5.34 నుంచి 5.05, కేరళ 3.89 నుంచి 2.76, తమిళనాడు 7.52 నుంచి 5.96, పుదుచ్చేరి 0.09 నుంచి 0.10 శాతం ఉన్నట్లు తెలిపారు. అంటే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాదిలో జనాభా భారీగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు దేశాభివృద్ధిని కాంక్షించి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు పెద్దపీట వేస్తే, అదే ఇప్పుడు మెడమీద కత్తి కాకూడదని లేఖలో స్పష్టం చేశారు.
ఆర్టికల్ 81 (2) (ఏ)ను ఈ సందర్భంగా మోడీకి జగన్ గుర్తు చేశారు . అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు సమానంగా చిన్న రాష్ట్రాలకు కూడా పార్లమెంట్లో సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించాల్సి ఉంటుందని ఈ ఆర్టికల్ వివరిస్తోంది. అందుకే ప్రతి రాష్ట్రంలోనూ సమానంగా సీట్లు పెంచేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మొత్తం లోక్‌సభ ప్రాతిపదికన తీసుకుని, రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు ఏ మాత్రం తగ్గకుండా, పెద్ద రాష్ట్రాలకు సమానంగా వాటి సంఖ్యను పెంచాలని ప్రధాని మోడీకి జగన్ కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఇప్పుడే ఈ లేఖ ఎందుకు?
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో చర్చ జోరుగా సాగుతోంది. తమిళనాట డిఎంకె కేంద్ర వైఖరిపై మండిపడుతూ డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది నిరసనను అఖిలపక్షం ద్వారా తెలియపరిచిన సమయంలోనే జగన్ లేఖ ఆసక్తికరంగా మారింది. డిఎంకె ప్రతినిధులు స్వయంగా వచ్చి జగన్‌ను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం లేకున్నా, జనసేనకు కూడా పిలుపు వచ్చింది.
ఎన్డీయే కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, తెలుగుదేశం, జనసేన పార్టీలు డిఎంకె నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉన్నారంటే, అందరూ సమర్ధిస్తారు. మరి ఏన్డీయేలోనూ మరే కూటమిలోనూ లేని జగన్ అఖిలపక్షం సమావేశానికి ఎందుకు పోలేదు అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆ సమావేశానికి హాజరై ప్రధాని మోడీ దృష్టిలో శత్రువు కాకూడదన్నదే వైసీపీ అదే జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. కేసుల భయమూ ఇందుకు కారణమనే వాదనా వినిపిస్తోంది. ఏదిఏమైనా మంచి అవకాశాన్ని జగన్ చేతులారా వదులుకున్నట్టే అవుతుంది.
తెలంగాణలో ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అఖిల పక్షానికి హాజరై, సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఓకే వేదికను పంచుకున్నారు. అటు పంజాబ్ సీఎంతో పాటు అకాళీదళ్ ప్రతినిధులు అఖిలపక్షం భేటీకి హాజరై తమ వైఖరి వ్యక్తంచేశారు.
కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపుతో గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. ఈ దశలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ నడుస్తోంది. దక్షిణాన సీట్ల తగ్గింపు పార్టీల పరంగానే కాదు దక్షిణాది ప్రాతినిధ్యం పైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి ముఖ్యమైన విషయంలో జగన్ మిగిలిన పార్టీలతో కలిసి ముందుకు సాగకపోవడం, తగుదునమ్మా అంటూ ప్రధానికి లేఖ రాయడంతో వైసిపి పార్టీ విమర్శల పాలవుతోంది.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.