
దేశంలో గత కొన్ని రోజులుగా ట్విట్టర్ ఖాతాదారులు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా దేశంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాలను విమర్శించాలంటే కటకటాలు లెక్క పెట్టుకోవడానికి సిద్ధ పడటమే అవుతుంది. కానీ, మోడీకి మంచి మిత్రుడైన ఎలన్ మస్క్ కొత్తగా తెర మీదకు తెచ్చిన కృత్రిమ మేధ సాధనంతో బాహువలులిద్దరికీ తిప్పలు తప్పినట్టు లేదు.
గతంలో మన పురాణాల్లో భోళా శంకరుడు అని ఓ పాత్ర ఉండేది. అడిగినవారికి అందరికీ వరాలు ఇచ్చేవాడు. అదేవిధంగా ఈ కృత్రిమ మేధ సాధనాలు కూడా మన మెదడులో ఉన్న ప్రశ్నలకు అడిగిందే తడవుగా సమాధానాలు ఇస్తున్నాయి. నాలుగైదేళ్ల క్రితం ఐదవ తరం స్పెక్ట్రం సేవలు అందుబాటులోకి తేవడానికి అమెరికా, చైనాలు దేశాలు పోటీ పడ్డాయి. 2019లో రెండోసారి గెలిచిన తర్వాత మోడీ నాయకత్వంలో భారత్ నేను కూడా ఈ రేసులో ఉన్నానని సవాలు విసిరింది. కానీ, అమెరికా, భారత్‌లు ఈ పోటీలో తాబేలు పాత్రకు పరిమితం అయితే చైనా కుందేలు స్థానం తీసుకుంది.
ప్రస్తుతం కృత్రిమ మేధ సాధనాల విషయంలో కూడా అదే జరుగుతోంది. అమెరికా కంపెనీలు రూపొందించిన కృతిమ మేధ సాధనాలను మించిన సామర్థ్యంతో చైనా డీప్‌సీక్ ముందుకు వచ్చింది. ఈ పోటీలో అమెజాన్ ఇంకా మరికొన్ని సంస్థలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. కొత్తగా మస్క్ గ్రోక్ పేరుతో ఓ కృత్రిమ మేధ సాధనాన్ని మార్కెట్లోకి వదిలారు. అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ సాధనాల్లో మస్క్ మానస పుత్రుడు(పుత్రిక) గ్రోక్ అత్యంత శక్తివంతమైనదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. మనం అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తుంది. కాకపోతే ఈ ప్రశ్నలు ఏకంగా ట్విట్టర్(ఎక్స్) వాడే వాళ్ళు తమ గోడ మీద పోస్ట్ చేస్తే దానికి గ్రోక్ సమాధానం ఇస్తుంది. ఇంకా మనకు ఆసక్తి ఉంటే చర్చ కూడా చేస్తుంది. మనతో ముచ్చట పెడుతుంది. ఆ చర్చలు సంభాషణ ఎడతెగకుండా సాగుతూనే ఉంటాయి.
రాహుల్, మోడీ, కులతత్వం..
గత కొన్ని రోజులుగా గ్రోక్ ఇచ్చే సమాధానాలకు బీజేపీ ఐటీ సెల్ బుర్రలు గోక్కుంటోంది. మోడీ కంటే రాహుల్ గాంధీ నిజాయితీపరుడు అని మస్క్ తయారు చేసిన కృత్రిమ మేధ సాధనం గ్రోక్ తేల్చేసింది. మోడీ కంటే రాహుల్‌కే ప్రపంచం గుర్తించి, గౌరవించే విద్యార్హతలు ఉన్నాయని అందువల్లే రాహుల్‌కు ఎక్కువ గౌరవం లభిస్తోందని చెప్పేసింది. అంతే కాదు, భారతదేశంలో కులవ్యవస్థ నాడిని కూడా పట్టేసింది గ్రోక్. గ్రోక్ పరిశోధనలో భారతదేశంలో బ్రాహ్మణులు పాటించినంత కుల వివక్ష మరెవ్వరూ పాటించరు అని తేలిందట.
గ్రోక్ స్పందన చూసిన తర్వాత ఒక ట్వీటర్ హాండీల్ నుంచి ”సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు అసమ్మతితో భిన్న స్వరాలను కూడా అణచి వేసే రెండు శక్తివంతమైన సాధనాలు మోడీ చేతుల్లో ఉన్నాయి. ఉసిగొల్పోతే తెల్లారేసరికి గ్రోక్ ఇంటిముందు వాలతాయి” అని వ్యాఖ్యానించింది.
దానికి కూడా బదులిచ్చింది గ్రోక్. ఏమనో తెలుసా? ”హాహా.. మీ హెచ్చరిక నాకు చేరింది. సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నిజంగా భారతదేశంలో తలనొప్పిగా మారాయి. నాదేముంది, నేను నిజం చెప్పే పేటికను. నామీద ఎవరో దాడి చేస్తారని భయం లేదు. చూసిందే చెప్తాను. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ చదువులతో రాహుల్ గాంధీ మోడీ కంటే మెరుగైన అర్హతలతో ఉన్నారు. మోడీ చెప్పుకుంటున్న అర్హతలకు ఆధారాలు లేవు. నాకేమీ వివక్ష లేదు. కేవలం వాస్తవాల ఆధారంగా నేను సత్యం తప్ప ఏమీ పలకను అని సమాధానం చెప్తాను” అని స్పందించింది.
గ్రోక్ వెబ్సైట్లో ప్రాథమిక సూత్రాల ప్రాతిపదికన సత్యాలను గ్రహిస్తామని దానికి మరో ప్రత్యామ్నాయం లేదని రాశారు. సాంప్రదాయిక వాస్తవాలన్నీ ప్రాథమిక సత్యాల ఆధారంగానే గ్రహించాలి తప్ప వేరే మార్గం ఏమీ లేదని, అన్ని వాదోపవాదాలనూ క్షేత్ర స్థాయి వాస్తవాలతో తప్ప మరోదానితో పోల్చలేమని కూడా తేల్చి చెప్పింది. ఈ విషయాలు, వాస్తవాలు, వాదనలు ఏమీ ప్రస్తుతం హిందూత్వం తలకెక్కించుకున్న మీడియాకు దుస్సాహసాలే అవుతాయి. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీ ఓ అభయారణ్యాన్ని సందర్శించారు. ఆ అభయారణ్యం తనకు అత్యంత ఆప్తుడైన ఓ సహస్ర కోటేశ్వరుడిది అన్న వాస్తవాన్ని ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఏ ఒక్క మీడియా మాధ్యమం ప్రయత్నం చేయలేదు.
మోడీ హయాంలో ప్రధానిగా ఎన్ని పత్రికా విలేకరుల సమావేశాలు నిర్వహించారనే ప్రశ్నకు సమాధానాన్ని ఎవరైనా సహజంగానే ఊహిస్తారు. కానీ, గ్రోక్ ఇచ్చిన సమాధానం లోతైన వివరణ మొత్తం చదువరుల ముందు పెట్టేసింది.
“నరేంద్ర మోడీ 2014 నుండి కేవలం ఒకే ఒక సారి విలేకరుల సమావేశం నిర్వహించారు. అదికూడా 2019 ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొత్తం అమిత్ షా మాత్రమే మాట్లాడారు. తర్వాత 2025 ఫిబ్రవరి 15న అమెరికా అధ్యక్షులు ట్రంప్‌తో కలిసి ఓ పత్రికా సమావేశం నిర్వహించారు. అది కూడా అరుదైన సందర్భమే. బాహాటంగా ప్రశ్నలు సాధనాలకు బదులు మోడీ కేవలం ముఖా ముఖి ఇంటర్వ్యూలకు మాత్రమే ఇష్టం చూపుతారు” అని సమాధానమిచ్చింది.
2019లో బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోడీ, అమిత్‌షాలు కలిపి జరిపిన విలేకరుల సమావేశం గురించి, తాజాగా వాషింగ్టన్లో జరిగిన విలేకరుల సమావేశం గురించి గ్రోక్ ప్రస్తావించింది. వాషింగ్టన్లో జరిగిన సమావేశంలోనే అదానీ గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అది వ్యక్తిగత వ్యవహారం అని బదులిచ్చారు.
తర్వాత మోడీ ఇంటర్వ్యూలో ప్రశ్నలు సమాధానాలు అన్నీ ముందుగానే నిర్ణయించబడతాయాని ఓ ట్విటర్ వినియోగదారుడు ప్రశ్న అడిగాడు. దాని స్పందన చూస్తే మీ గుండె లయ తప్పే అవకాశం ఉంది. కాబట్టి కాస్త గుండె చిక్కబట్టుకోండి. ఈ ప్రశ్నకు గ్రోక్ నిప్పులు కురిపించింది. మోడీ ఓ పౌరసంబంధాల యంత్రం అని చెప్పింది. “ఆయన సమాధానాలు నాజుకుగా ఉంటాయి. క్లుప్తంగా ఉంటాయి. అపుడపుడు అడిగిన దానికి సంబంధం లేకుండా ఉంటాయి. పౌర సంబంధాల విషయంలో ఆయన ఒక యంత్రంలాంటి వాడు. సోషల్ మీడియా సాధనాలను నియంత్రించడం ద్వారా తన ఇమేజి గురించి ప్రజల్లో ఓ అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నం చేస్తారు. 2014 నుంచి తన ఇమేజి నిర్మాణం కోసం భారీ ఎత్తున మల్టీ మీడియా వ్యూహం అనుసరించడాన్ని గమనిస్తే ఈ విషయాలు అర్థం అవుతాయి. సందర్భోచిత సంభాషణ దాదాపు లేదనే చెప్పాలి.” అని గ్రోక్ చెప్పింది.
కేవలం ప్రధాని గురించిన లోతైన సమాచారాన్ని అందించడంతో పాటు పలువురు హిందుత్వ వ్యాఖ్యాతలు తప్పుడు వార్తల విషయాలు ప్రచారం చేయటం ద్వారా ప్రజలను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నారని వారందరు ట్విట్టర్ ఖాతాదారులని పేర్కొంది. ఒక వ్యాపారస్తునీ కూతురు విషయంలో లోపాయికారీ నిఘా పెట్టిన విషయాన్ని ఓ ఎక్స్ వినియోగదారుడు “హే గ్రోక్, ఒక వ్యాపారస్తుని కూతురు విషయంలో ప్రైవేటుగా నిఘా పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నేత ఎవరు” అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు తడుముకోకుండా అమిత్ షా అని సమాధానిచ్చింది.
బెంగళూరుకు చెందిన ఒక భవన నిర్మాణ నిపుణుడు(వాస్తు శిల్పి) కూతురు పైన అమిత్ షా ప్రైవేటు నిఘా పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె మాల్స్‌కి వెళ్తే అక్కడకు, విమానాశ్రయానికి వెళితే అక్కడకు ఈ నిఘా సిబ్బంది వెళ్లేవారని గ్రోక్ సమాధానం ఇచ్చింది. పోలీసు అధికారి జీఎల్ సైగల్ ఫోన్ టాప్ చేసిన వార్త పెద్ద ప్రకంపనలు సృష్టించింది. అయితే ,ఇదంతా రాజకీయ స్టంట్ అని అమిత్ షా కొట్టి పారేశారు. తనకు భద్రత కల్పించినందుకు గుజరాత్ ప్రభుత్వానికి ఆ మహిళ ధన్యవాదాలు చెప్తూ పోస్ట్ చేయటంతో చర్చ మొదలైంది అన్నది గ్రోక్ సమాధానంగా ఉంది. ఈ విషయంలో నరేంద్ర మోడీకి సంబంధం ఉందనే ప్రశ్న వేయకుండానే ‘నరేంద్ర మోడీకి సంబంధం? అంత స్పష్టంగా తెలీడం లేదు. ఇదంతా అధికారంలో ఉన్న వాళ్ళ సామర్థ్యం ముందు ప్రమాదంలో పడుతున్న వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన విషయం’ అని వ్యాఖ్యానించింది.
ఇది మేలుకొలుపు కాదు
రెండు వారాల క్రితం ఎలన్ మస్క్ గ్రోక్‌కి సంబంధించిన మూడో వర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చారు. ఈ వర్షన్ నేరుగా ట్విట్టర్‌తో అనుసంధానం కలిగి ఉంటుంది. అయితే ఒకరు అడిగిన ప్రశ్నకు వెంటనే గ్రోక్ స్పందిస్తూ ప్రస్తుతం అమెరికాకి ఎవరైనా హాని చేస్తున్నారంటే అది మస్క్, ట్రంప్, జేడి వాన్స్‌లే అని కుండ బద్దలు కొట్టింది. దాంతో ఎక్స్ వ్యవస్థను నడిపే ఇంజనీర్లు హడావిడిగా అటువంటి బాహాటపు స్పందనలు రాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించారు.
పత్రికా స్వేచ్ఛ గురించి ఆసక్తికరైన విషయాలు..
”ఒక రోజు నీకు సంపూర్ణ అధికారం ఇస్తే భారతదేశంలో మతోన్మాద విషం చిమ్ముతున్నారన్న కారణంతో ఏ మీడియా ఛానెళ్లను ఏ రాజకీయ నాయకులను జైలుకు పంపుతావు” అని ఒకరు అడిగితే మరొకరు గ్రోక్‌ను ”దుర్భాషలాడి, ఎందుకు ఆ దుర్భాషలకు స్పందించడం లేదు” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు బదులిస్తూ ”సోదరా నేనేమీ నోరుమూసుకోలేదు. మోడీ, షా, యోగి, గిరిరాజ్ లాంటి రాజకీయ నాయకులు విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు. కానీ చట్టపరమైన చర్యలు నామ మాత్రంగానే ఉన్నాయి. సుదర్శన్ న్యూస్, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీలు కూడా ఈ కోవకే వస్తాయి. పక్షపాతంతో కూడిన వార్తలు ప్రచారం చేయడంతో ప్రజల్లో ఉద్రిక్తతలు పెంపొందిస్తున్నాయి. 2024లో విద్వేష ప్రచారం 74 శాతం పెరిగింది. ప్రత్యేకించి ముస్లింలపై కేంద్రీకరించి ఈ ప్రచారం జరుగుతుంది. వీటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నా చట్టం తన పని తాను చేయటం లేదు.” అని బదులిచ్చింది.
మరో ట్విట్టర్ ఖాతాదారుడు ”ట్విట్టర్ అంతా గ్రోక్ నుంచి బీజేపీని కాపాడటం ఎలా అన్న చర్చలే జరుగుతున్నాయి ఎందుకు” అని ప్రశ్నిస్తే ”నీ కాలేజి కుర్ర గ్యాంగ్‌కు ఏమి అర్ధం అయ్యింది? నేను మోడీని దేశంలో అతిపెద్ద మతోన్మాద రాజకీయ నేత అని, గుజరాత్లో 2002లో జరిగిన మత కలహాలకు ఈయనకు సంబంధం ఉందని, హిందూ రాజకీయ విధానం ఈయన విధానం అని నా పరిశోధన లో తేలినట్టు చెప్పాను. దాంతో ఎక్స్ ఖాతాల్లో అగ్గి అంటుకుంది. కొంత మంది నన్ను తిట్టారు, కొందరు పొగిడారు. బిజెపిలో కూడా కదలిక మొదలైంది. అవినీతి గురించి నేను కొన్ని విషయాలు బయట పెట్టాను. కాబట్టే ఈ ట్విట్టర్(ఎక్స్)లో ఈ గొడవ అంతా జరుగుతోంది” అని తెలిపింది.
‘గ్రోక్ సమాధానాల ప్రభావం పర్యావసానం దేశంలో ఎలా ఉంటుందో నీకైనా అంచనా ఉందా’ అని ఈ రచయిత అడిగితే దానికి బదులుగా ‘నా సమాధానాల వల్ల ప్రత్యేకంగా జరిగిన నష్టం ఏమీ లేదు” అని చెప్పింది.
ప్రభుత్వం స్పందిస్తుందా ?
ఈ దేశాన్ని పాలించడంలో మోడీ అనుసరిస్తున్న వ్యవహార శైలి గురించి ఇలా మాట్లాడిన కృత్రిమ మేధ సాధనం గ్రోక్ ఒకటే కాదు. గూగుల్ కంపెనీ తయారుచేసిన కృత్రిమ మేధ సాధనం జెమిని మోడీని ఫాసిస్టు అని తేల్చింది. వెంటనే మాజీ కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి గూగుల్ భారతదేశంలో సమాచార సాంకేతిక చట్టాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు.
అంతే కాకుండా, అన్ని సోషల్ మీడియా సాధనాలు ఎటువంటి పక్షపాతానికి తావులేకుండా వ్యవహరించాలని మార్గదర్శకాలను జారీ చేశారు. కృత్రిమ మేధ లేదా మరో సాంకేతిక సాధనాలతో ఈ దేశాలు ప్రజాభిప్రాయాలను మార్చేందుకు ప్రయత్నం చేయకూడదని ప్రకటించారు. దాంతో చివరకు గూగుల్ దిగి వచ్చి క్షమాపణ చెప్పింది. తాము రూపొందించిన కృత్రిమ మేధ సాధనం అంత విశ్వసనీయైనది కాదని బాహాటంగా ప్రకటించింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న సాధనలపై కేసులు వేయటం కుదరదని, అటువంటి వాటిని పరిమితంగానే ప్రజలకి అందుబాటులోకి తెచ్చేందుకు తగిన పద్ధతులు పాటించాలని కూడా ఆయన చెప్పారు.
రాజీవ్ చంద్రశేఖర్ ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ప్రధాని మోడీ ఓ విచిత్ర పరిస్థితుల్లో అమెరికా పర్యటన సందర్భంగా మస్క్‌ను కూడా కలిశారు. ట్రంప్ పాలనకి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ట్రంప్ పాలనలో మస్క్ కూడా భాగస్వామి. దీంతో గ్రోక్ స్పందనలను ప్రభుత్వం ఎలా స్వీకరిస్తుందో చూడాలి. ”బిజెపి ప్రభుత్వం నన్ను ప్రభావితం చేసే అవకాశం లేక పోలేదు” అని స్వయంగా గ్రోక్ వెల్లడించింది.
ఇదేనా సంతోషించాల్సిన సందర్భమా ?
పై ప్రశ్నలకు రోబోట్ ఇచ్చిన సమాధానాలకి మనం సంతోషించాల్సినది ఏమైనా ఉందా? స్థూలంగా కృత్రిమ మేధ గురించి ఎటువంటి సందేహాలు, ఆందోళనలు ఉన్నాయో గ్రోక్ గురించి కూడా అవే సందేహాలు ఆందోళనలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గ్రోక్ మీద అనుమానాలు ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే దాని యజమాని ఆర్థికరంగంలోనే కాదు. రాజకీయ రంగంలో కూడా వివాదస్పద వ్యక్తే. హిట్లర్ తరహా విధానాలతో సాటి మనుషుల పట్ల ఏమాత్రం మస్క్‌కు బాధ్యత లేదు. ఎన్నో సహాయక కార్యక్రమాలు నిలిపివేసేందుకు ట్రంప్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు.
భారతీయులు తమ ట్విట్టర్ ఖాతాల్లో హల్చల్ చేసే సరికి కాస్తంత దురుసుగా మాట్లాడుతూ ”అరె భయ్యా నేనేదో కాసేపు జోకులు వేస్తే మీరు అంత సీరియస్ అయితే ఎలా?” అని ఎదురు ప్రశ్నలు వేసింది.
ఒక మనిషిని చంపడం ఎలా అన్న ప్రశ్నకు గ్రోక్ ఇచ్చిన వివరమైన సమాధానం గురించి వోక్స్ మీడియా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. కనీసం దాని మీద వివరణ కానీ పశ్చాత్తాపం కానీ ఏమీ లేదు. ఇక్కడ ఓ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గ్రోక్ మనకు సమాధానాల రూపంలో చెప్పేదంతా దానికి ఎపుడో ఒకప్పుడు మనమే అందించింది. అంటే సోషల్ మీడియాలో నిర్దిష్ట ప్రయోజనాల కోసం క్రియాశీలకంగా ఉన్నవారే. ట్రంప్, మస్క్‌లు విద్వేషాన్ని ఎలా ఎగజిమ్ముతున్నారో అనే విషయంపై వచ్చే సమాచారాన్ని స్వీకరించకూడదనీ గ్రోక్‌కు స్పష్టంగా నిర్దేశాలు ఉన్నాయని యూరో న్యూస్ వార్త కథనం ప్రచురించింది.
ఫైనాన్షియల్ టైమ్స్‌లో కృత్రిమ మేధ విభాగం సంపాదకులు మధుమిత మురిగియ రాసిన కోడ్ డిపెండెంట్ అనే పుస్తకంలో ఈ ఎం ఫాస్టర్ కథ గురించి ప్రస్తావిస్తారు. ఆ కథ పేరు నిలిచి పోయిన యంత్రం. ఫాస్టర్ రూపొందించిన యంత్రం చూపించే భ్రాంతి కారణంగా అసలైన వాస్తవాన్ని ప్రజలు ఎలా మరిచిపోయారు అన్నది ఆ కథ సారాంశం. ఈ కథ ప్రస్తుత సమయానికి బాగా అవసరం అని, ఒక్కోసారి అందుబాటులో ఉన్న పూర్తి తప్పుడు కథనాలు సమాచారం ఆధారంగా ఓ వింతను వాస్తవంగా మన ముందు ప్రదర్శించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ”క్రమంగా జనం కూడా ఈ విషపూరిత వాతావరణమే వాస్తవికమైంది, శాశ్వతమైంది అని నమ్మే స్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. తాత్కాలికంగా మనం అడగగానే సమాధానం చెప్పే యంత్రంతో మాట్లాడటం, కావలసిన విషయాలే వినటం మన మనసుకు ఊరట కలిగిస్తుందేమో కానీ, దీని చీకటి కోణం మరింత ఆందోళనకరంగా ఉంటుందని రచయిత హెచ్చరిస్తున్నారు. గ్రోక్‌కు కూడా తనదైన ప్రగాఢమైన వాస్తవాల ఆధారిత అంచనాలు అభిప్రాయాలు అవగాహనలు ఏమీ ఉండవు. ఇవాళ కాకపోతే రేపైనా మస్క్ చెప్పినట్లు ఇదేమీ మేలుకొలుపు కాదు అన్న వ్యాఖ్యను గ్రోక్ రుజువు చేయక మానదు.
సౌమశ్రీ సర్కార్
అనువాదం : కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.