
అడగవే అమ్మా … ఈ భరత దేశం ఎదుగుతుందట… అడగవే అమ్మా…
చూడవే పేదల ఆకలి పోరు… ఇదే నాదేశం మారినతీరు…
రాజ్యంలో రాజకీయ జెండాలుతప్ప మరేదీ మారలే … అడగవే అమ్మా
– మిట్టపల్లి సురేందర్ రాసిన పాట నుంచి కొన్ని చరణాలు
చివరి అఖిల భారత స్థాయి కుల గణనను బ్రిటీష్ వలస ప్రభుత్వం 1931లో నిర్వహించింది. 1931 జనాభా లెక్కల్లో నమోదైన ఇతర వెనుకబడిన కులాల జనాభా(ఓబీసీలు) సంఖ్య వారు పొందుతున్న 27% రిజర్వేషన్ కంటే ఎక్కువగా ఉందని సాధారణంగా అర్థం చేసుకున్నప్పటికీ, దానిపై స్పష్టమైన డేటా అందుబాటులో లేదు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం నిర్వహించే జనాభా లెక్కల నుంచి వివిధ కారణాల రీత్యా కులగణనను తొలగించారు. 2021లో నిర్వహించవలసిన దశాబ్ద జనగణనను నిర్వహించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కులగణను విజయవంతంగా పూర్తిచేసింది. ఈ సర్వే నిర్వహణను నిరోధించటానికి, దాని ఫలితాలను ప్రచురించకుండా ఆపడానికి బిజెపి చేయగలిగిందంతా చేసింది.
2011 జనాభా లెక్కలలో భాగంగా కుల డేటాను, సంబంధిత సామాజిక-ఆర్థిక అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అయితే ‘సోషియో, ఎకనామిక్ కాస్ట్ సెన్సస్(SECC)పేరుతో అలా సేకరించిన సమాచారాన్ని ఇప్పటికీ విడుదల చేయలేదు. అంటే వనరులను హేతుబద్ధంగా కేటాయించటానికి, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన గణాంకాలు అందుబాటులో లేకుండానే విధాన నిర్ణయాలు జరుగుతున్నాయని అర్థం.
బీహార్‌లో కులగణన సర్వేని నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయంపై పాట్నా హైకోర్టు 2023 మే 4న స్టే ఇచ్చింది. దీనిపై బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీకోర్టు విచారిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో ఇలా పేర్కొంది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో మూలాలుగల ‘సెన్సెస్ యాక్ట్-1948’ ప్రకారం జనగణనపై అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ‘రాజ్యాంగం ద్వారా కానీ, మరో మార్గం ద్వారా కానీ, మరే ఇతర సంస్థకు జనగణనను లేక దానిని పోలిన మరేదైనా గణనను నిర్వహించటానికి అధికారం లేదు’ అని కూడా జోడించింది. అయితే ఆ తరువాత సమర్పించిన మరో అఫిడవిట్లో ఈ వాక్యం ‘అజాగ్రత్త వల్ల(అఫిడవిట్లో)చేరింది’అని పేర్కొనటం జరిగింది. 2023 మే18న‘పాట్నా హైకోర్టు ముందున్న విషయంపై తాము జోక్యం చేసుకోలేము’అని సుప్రీంకోర్టు ప్రకటించింది. 2023 ఆగస్టు 1న కులగణన సర్వే చట్టబద్దమేనని పాట్నా హైకోర్టు చెప్పింది. అలా లీగల్ అవాంతరాలను అధిగమించి బీహార్ కుల గణన ఫలితాలు వెలువడ్డాయి. (TDG Network, Bihar Caste Census data: A look at its timeline, potential future impacts:)
బీహార్ జనగణన డేటా మనకు దేశవ్యాప్తంగా కుల గణన అవసరం ఎంత ఉందో తెలియజేస్తుంది. 2011లో 10.41 కోట్లుగావున్నజనాభా ప్రస్తుతం దాదాపు 13 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ సర్వే జనాభాలో మూడు పెద్ద సామాజిక వర్గాలైన షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్ తెగల, ముస్లింల వాటాను నవీకరిస్తుంది. 2011తో పోలిస్తే SC జనాభా వాటా 16% నుంచి 19.65%కి, ST జనాభా వాటా 1.3% నుంచి 1.68%కి, ముస్లిం జనాభా 16.9% నుంచి 17.7%కి పెరిగింది. గత జనాభా లెక్కలతో పోల్చినప్పుడు ST, SCల వాటాలు బాగా పెరిగినట్టు, ముస్లిం జనాభాలో ఈ పెరుగుదల చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక బీహార్ జనాభాలో ఇతర వెనుకబడిన తరగతుల(OBCలు) వాటా 63.14శాతం అని తేలింది. ఇది జాతీయ సగటు 52% కంటే గణనీయంగా ఎక్కువ. ఈ సంఖ్య ఒక ప్రధాన ప్రశ్నను లేవనెత్తుతుంది. 15.5% గావున్నఆధిపత్య కులాలలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% కోటా ఇవ్వగలిగినప్పుడు 63% OBCలను కేవలం 27% కోటాకు ఎందుకు పరిమితం చేయాలి?( Yogendra Yadav, Bihar census identified the privileged and under-privileged castes. Go national now)
ఈ సర్వేలో OBCలలోని రెండు ఉప-వర్గాల జనాభా పరిమాణాలు ఎలా ఉన్నాయో తేలింది. ‘ఉన్నత’ సమూహాలైన యాదవ, కుర్మి, కుష్వాహా వంటి భూస్వామ్య రైతు వర్గాల వాటా 27.12% వరకు ఉంటుంది. ఈ ‘ఉన్నత’ బిసి సమూహాలలో యాదవులు 14.3శాతం, కుర్మీలు 2.9శాతం, కుష్వాహ 4.2శాతం, బనియా 2.3శాతం(బీహార్‌లో బనియాలు OBCలలో భాగం)ఉన్నారు. సేవలు, చేతిపనులు, శారీరక శ్రమచేసే వందకు పైగావున్న చిన్న కులాల సమాహారమైన ‘చాలా వెనుకబడిన కులాల(EBC)’ వాటా 36.01%గా నమోదైంది. ఇది EBCలపై బీహార్ రాజకీయాలు, ప్రభుత్వ విధానం దృష్టిని మరల్చటానికి దోహదపడుతుంది.
బీహార్ జనాభాలో “జనరల్” లేదా సవర్ణ కులాల వాటా కేవలం 15.52% మాత్రమే ఉంది. ఈ వర్గంలో OBCలు కాని కొంతమంది ముస్లింలు ఉన్నారు. జనాభాలో వీరి వాటాలు ఇలా ఉన్నాయి: బ్రాహ్మణులు 3.67శాతం, రాజ్ పుత్‌లు 3.45శాతం, భూమిహార్లు 2.89శాతం, కాయస్థ 0.6. దీని ప్రకారం సవర్ణ హిందువుల వాటా 10.61శాతంగా మాత్రమే ఉంది. వీరికి ముస్లింలలోని అగ్రకులాలను కలిపారు. ఈ కులాల వాటాలు ఇలా ఉన్నాయి: షేక్ 3.82శాతం, పఠాన్(ఖాన్) 0.75 శాతం, సయ్యద్ 0.23శాతం. 1931 జనగణనలో సవర్ణ హిందువుల వాటా 15.4శాతంగా ఉండేది. వీరి వాటా తగ్గటానికి రాష్ట్రం నుంచి వలస పోవటం, జనాభా పెరుగుదల తక్కువగా ఉండటం కారణంగా ఉన్నాయి.
కుల విభజన హిందువులకే పరిమితం కాలేదు. బీహార్‌లోని ముస్లిం అగ్రకులాలైన షేక్ (3.82%), సయ్యద్ (0.23%), మాలిక్ (0.1%), పఠాన్ (0.75%) వంటి అష్రాఫ్ వర్గాలు ముస్లిం జనాభాలో చాలా తక్కువ నిష్పత్తిలో ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. బీహార్‌లోని ముస్లింలలో నాలుగింట మూడు వంతుల మంది జులాహా, ధునియా, ధోబీ, లాల్బేగి, సుర్జాపురి వంటి వివిధ వెనుకబడిన వర్గాలను కలిగి ఉన్న “పస్మాండాలు” ఉన్నారు. వీరి ప్రాబల్యం పస్మాండా రాజకీయాలకు ఊతం ఇచ్చే అవకాశం ఉంది.
అలాగే మతపరంగా చూసినప్పుడు, బీహార్‌లో హిందువులు 81.99శాతం, ముస్లింలు 17.70శాతం, క్రైస్తవులు 0.05శాతం, సిక్కులు 0.01శాతం, బుద్దిస్టులు 0.08శాతం, జైనులు 0.009శాతం, ఇతరులు 0.12శాతం. నాస్తికులు 0.12శాతం ఉన్నారు. (Shemin Joy, Caste survey in Bihar: OBCs, EBCs make up 63.13% of population; Gen Category 15.52% )
మరోవైపు బీహార్‌లో కుటుంబాల నెలసరి ఆదాయం అత్యంత దయనీయంగా ఉంది. 34.1శాతం ప్రజల నెల ఆదాయం 6000కంటే తక్కువగా ఉంది. 29.6శాతం మంది నెల ఆదాయం 6000– 10000మధ్య ఉంది. మొత్తంగా చూసినపుడు 63.7శాతం కుటుంబాలు రోజుకు 333 రూపాయలు, అంతకంటే తక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయి. బీహార్‌లో చట్టపరమైన కనీస వేతనం రోజుకు సాధారణ కూలీకి 378 రూపాయలు, వ్యవసాయ కూలీకి రోజుకి 376 రూపాయలు ఉంది. అంటే బీహార్ ప్రజలు క్రూరమైన దారిద్ర్యాన్నిఅనుభవిస్తున్నారు.
నయావుదారవాద ఆర్థిక విధానాల పర్యవసానంగా రాష్ట్రాలలో అంతర్గతంగాను, వివిధ రాష్ట్రాల మధ్యలోను వృద్ధి రేటుతోపాటు అసమానతలు కూడా తీవ్ర స్థాయిలో పెరిగాయి. 2005లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తరువాత బిహార్ జాతీయ సగటును మించి వృద్ధి రేటును నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయంలో బీహార్ అట్టడుగునే మిగిలిపోయింది. నిజానికి 1985లో ఆర్థికవేత్త ఆశిష్ బోస్ నాలుగు హిందీ మాట్లాడే రాష్ట్రాలను ‘బిమారు(BIMARU)’ రాష్ట్రాలని పేరుపెట్టాడు. ‘బిమారు’ రాష్ట్రాలైన బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్లే కాకుండా, ఈ రాష్ట్రాల నుంచి 2000వ సంవత్సరంలో ఆవిర్భవించిన జార్కండ్, చత్తీస్ గడ్, ఉత్తరాఖండ్‌లు కూడా వెనుకబడిన, పేద రాష్ట్రాలుగా మిగిలిపోయాయి.
ఒక పేద మూడవ ప్రపంచ దేశంగావున్న భారతదేశం 2015లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఆవిర్భవించింది. 2022లో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2029లో అమెరికా, చైనాల తరువాత మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారనుంది. అయినప్పటికీ ప్రపంచంలో భారతీయులు అతి పేదలుగా, అత్యంత అసమానులుగా ఉన్నారు. 2022లో ప్రపంచ సగటు తలసరి ఆదాయం 12,647.5 డాలర్లు ఉండగా భారతీయుల తలసరి ఆదాయం 2388.6డాలర్లుగా మాత్రమే ఉంది. తలసరి ఆదాయం విషయంలోనే కాకుండా భారతదేశంలో యావత్ వృద్ధి గమనం గాడి తప్పిందనటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి.
నోట్ల రద్దు, జిఎస్టి, కరోనా లాక్డౌన్ల తరువాత జనజీవితం తీవ్ర నైరాశ్యంలోకి నెట్టబడింది. భారతదేశం ఆర్థికంగా అనేక రంగాలలో విజయం సాధించినప్పటికీ 45శాతం ప్రజలున్న రాష్ట్రాలలో 62శాతం దారిద్ర్యం కేంద్రీకృతమైంది. అంతేకాకుండా దారిద్ర్య రేఖకు పైన వున్నమహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు తిరిగి దారిద్ర్యంలోకి జారుకునే ప్రమాదం ఎల్లవేళలా పొంచి ఉంది. 2023లో నీతి అయోగ్ విడుదల చేసిన బహుళ పార్శ దారిద్ర్య సూచిక(ఎంపిఐ) ప్రకారం, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్‌లతోపాటు ఆ రాష్ట్రాల నుంచి ఏర్పాటైన జార్ఖండ్, చత్తీస్ ఘడ్, ఉత్తరా ఖండ్ రాష్ట్రాలు బహుళ పార్శ పేదలున్న రాష్ట్రాలలో అగ్రభాగాన ఉన్నాయి. బహుళ పార్శ దారిద్ర్య సూచిక కుటుంబ ఆదాయంలో లేమితోపాటు ఆరోగ్యం, విద్యలలో లేమిని పరిగణనలోకి తీసుకుంది.
నీతి అయోగ్ నివేదిక నిస్పృహకు గురిచేసే అనేక ధోరణులను పేర్కొంది. వాటిలో ముఖ్యమైనవి: అధిక ఉత్పాదకత, అధిక వేతనాలుగల తయారీ రంగం నుంచి తక్కువ ఉత్పాదకత, తక్కువ వేతనాలుగల వ్యవసాయ రంగంలోకి, స్వయం ఉపాధిలోకి మారటం ఒక ధోరణిగా ఉంది. ఇది ముఖ్యంగా మహిళలకు వర్తిస్తుంది. వ్యవసాయేతర రంగాలలో అసంఘటిత వ్యాపారాలు పెరగటం మరొక ధోరణి. అంటే తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవటం ఈ ధోరణి లక్షణం. 2017– 18లో 68.2 శాతంగా వున్న వీటి సంఖ్య 2022-23లో 74.3శాతానికి పెరిగాయి.
దీనికి తోడు 2017– 18 నుంచి నిజ వేతనాలు పడిపోవటం ప్రారంభమైంది. 2020– 21లో నిజ వేతనాలు పడిపోయాయని 2022-23లో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్ఓ) తన వేతనాల నివేదికలో దృవీకరించింది. ఆశ్చర్యకరంగా ఐఎల్ఓ డేటాబేస్ ప్రకారం భారతదేశంలోని కార్మికులు వారంలో చాలా దేశాలలోకంటే ఎక్కువగా 47.7 గంటలు పనిచేస్తుండగా అమెరికన్ కార్మికులు 36.43గంటలు, బ్రిటీష్ కార్మికులు 35.95గంటలు, చైనీస్ కార్మికులు 46.1గంటలు పనిచేస్తున్నారు. (Prasanna Mohanthy, What Bihar caste census tells about India growth story )
మరోవైపు దేశంలో నిరుద్యోగిత విలయతాండవం చేస్తోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ (CMIE) నిరుద్యోగితపై వెల్లడించిన డేటా భయంకరమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది(Prabhat Patnaik, Jobs in India: Gone With the Neoliberal Wind!. కోవిడ్ మహమ్మారికి ముందు నుండి కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగిత రేటు బాగా పెరుగుతూ వచ్చింది. మహమ్మారి సమయంలో మరింతగా పెరిగిన నిరుద్యోగిత స్థూల జాతీయోత్పత్తి( GDP) స్థాయిలో కోలుకున్నప్పటికీ పెద్దగా తగ్గలేదు. 2017-18లో 4.7%గా ఉన్న నిరుద్యోగిత రేటు 2018-19లో 6.3%కి పెరిగింది. మహమ్మారితో సంబంధం ఉన్న లాక్డౌన్ కాలమైన డిసెంబర్ 2020లో ఇది 9.1%. దాకా పెరిగింది. స్థూల జాతీయోత్పత్తిలో పెరుగుదల నిరుద్యోగిత రేటును ఏమాత్రం ప్రభావితం చేయలేకపోతోంది. తాజా గణాంకాల ప్రకారం గత కొన్ని నెలలుగా నిరుద్యోగిత రేటు 8శాతం దగ్గర కొనసాగుతూవుంది.
కులగణనలో ప్రధాన అంశమైన రిజర్వేషన్ల విషయానికి వస్తే, రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలనే వివిధ కుల సంఘాలు, పౌర సమాజం చేస్తున్న డిమాండ్‌ను ఆమోదించినా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించటం వల్ల అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య అంతగా ఉండకపోవచ్చు. ప్రైవేటీకరణ, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టులు, నియామకాలు చేయకపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ విధానాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఇది ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తుంది. పర్యవసానంగా భారతదేశంలో స్వాతంత్ర్యం తర్వాత అత్యధిక నిరుద్యోగిత రేటు నమోదౌతోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ డేటా ప్రకారం, ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపాధి 3.8% వద్ద అత్యల్పంగా ఉంది. ఇది అర్జెంటీనాలో 16.9%, చైనాలో 12.3%, 28%, అమెరికాలో 13.3%, బ్రిటన్‌లో 21.5%, రష్యాలో 40.6%, క్యూబాలో 77% గా ఉంది.
కాబట్టి ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థలలో మరిన్ని ఉద్యోగాలు సృష్టించాలి. దీంతో SCలు (15%), STలు (7.5%), OBCలు (27%), సంవత్సరానికి రూ. 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న అగ్రవర్ణ కులాలలో(7.5%) బలహీన వర్గాలు, మాజీ సైనికులు, శారీరకంగా వికలాంగులకు ఉపాధి లభిస్తుంది. 2015లో విడుదలైన ఏడవ కేంద్ర వేతన సంఘం నివేదిక ప్రకారం 52 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయవలసి ఉంది. 2019 మార్చి 1 నాటికి ఖాళీల సంఖ్య 40.66 లక్షలకు తగ్గింది. వీటిలో 31.43 లక్షలు మాత్రమే భర్తీ చేయబడ్డాయి. అంటే మొత్తం 20.57 లక్షలు తగ్గాయి. ఈ ఖాళీలను భర్తీ చేస్తే, 3,08,550 ఎస్సీలు, 1,54,275 ఎస్టీలు- 5,55,390 ఓబీసీలు ఉపాధి పొందేవారు. మొత్తంగా, 20.57 లక్షల కుటుంబాలు తమ స్థితిని మెరుగుపరుచుకునేవి. వారి పిల్లలకు మెరుగైన విద్య, జీవన నాణ్యత లభించేది. (Thomas Franco, Increasing Privatisation Killing Reservation as Unemployment Soars)
మార్టిన్ వోల్ఫ్ అమెరికా గురించి చెప్పింది భారతదేశానికి కూడా వర్తిస్తుంది. ఆయన తన “ది క్రైసిస్ ఆఫ్ డెమోక్రటిక్ క్యాపిటలిజం” (పెంగ్విన్ ప్రెస్)లో నొక్కిచెప్పినట్లుగా అసమానత ప్రతిచోటా ఉంది. సంస్థల స్థాయిలో: 1980లో, సీఈఓలకు సగటు ఉద్యోగి కంటే దాదాపు నలభై రెండు రెట్లు ఎక్కువ జీతం అందింది. 2016లో, వారికి మూడు వందల నలభై ఏడు రెట్లు ఎక్కువ జీతం ఇచ్చారు. మొత్తం సమాజ స్థాయిలో: అమెరికన్లలో అత్యంత సంపన్నులుగావున్న 1% మంది, అంటే 30లక్షల మంది సంపద, దిగువన ఉన్న 99% మంది, అంటే 29కోట్ల మంది సంపద కంటే ఎక్కువగా ఉంది. నయా ఉదారవాద వ్యవస్థ కారణంగా పెరిగిన అసమానతలు పౌర సమాజానికి తక్షణ ముప్పును కొనితెస్తాయి. ఏదిఏమైనప్పటికీ నయా ఉదారవాదంపై సూర్యుడు అస్తమించాడు. మార్కెట్ భాష దాని మాయాజాలాన్ని కోల్పోయింది.(Louis Menand, The Rise and Fall of Neoliberalism )
ప్రపంచంలో అత్యంత అసమాన దేశాలలో భారతదేశం ఒకటి. జనాభాలో అగ్రభాగానవున్న 10% మంది ఆధీనంలో 77% జాతీయ సంపద ఉంది. భారత జనాభాలో అత్యంత ధనవంతులైన 1% మంది చేతుల్లో 53% దేశ సంపద ఉంది. అయితే జనాభాలో దిగువనగల సగం మంది ప్రజలు జాతీయ సంపదలో కేవలం 4.1% కోసం పోటీ పడుతున్నారు. ప్రపంచ అసమానత నివేదిక 2022 ప్రకారం, అగ్రస్థానంలోవున్న 10%, 1% జనాభా మొత్తం జాతీయ ఆదాయంలో వరుసగా 57%, 22% వాటాను కలిగి ఉన్నారు. దిగువనగల 50% పేదల వాటా 13%కి తగ్గింది. మరోవైపు దేశంలోని మొత్తం వస్తువులు, సేవల పన్ను (GST)లో దాదాపు 64% జనాభాలో దిగువ 50% మంది నుండి వస్తుండగా, శిఖరాగ్రం పైనవున్న10% నుంచి వస్తున్నది 4% మాత్రమే.
చాలా మంది సాధారణ భారతీయులు తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతున్నారు. వీరిలో 6కోట్లమందికి పైగా (ప్రతి సెకనుకు దాదాపు ఇద్దరు వ్యక్తులు) ప్రతి సంవత్సరం ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కారణంగా పేదరికంలోకి నెట్టబడుతున్నారు. భారతదేశ జనాభాలో దాదాపు 74% మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశం యొక్క 2023 GHI స్కోరు 28.7. ఇది GHI ఆకలి స్కేల్ ప్రకారం ఆకలి తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా పరిగణించబడుతుంది. గ్లోబల్ లింగ అంతర నివేదిక ప్రకారం లింగ అసమానతలో 2023లో భారతదేశం 146 దేశాలలో 127వ స్థానంలో ఉంది.
భారతదేశంలోని అసమానతలకు, కుల వ్యవస్థకు అవినాభావ సంబంధం ఉంది. ‘వరల్డ్ ఇనీక్వాలిటి ల్యాబ్’ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం దేశంలోని సంపన్నులలో 90% అగ్ర కులాలకు చెందిన వారే ఉన్నారు. సంపన్న భారతీయులలో షెడ్యూల్డ్ తెగలకు(STs) చెందినవారు ఒక్కరు కూడా లేరు. భారతదేశంలోని బిలియనీర్ల సంపదలో 88.4 శాతం ఉన్నత కులాల (UCs) చేతుల్లో కేంద్రీకృతమై ఉందని ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఈ అసమానత బిలియనీర్ల సంపదకు మించి విస్తరించింది; 2018-19 సంవత్సరానికి ఆల్-ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే (AIDIS) ప్రకారం ఉన్నత కులాలు జాతీయ సంపదలో దాదాపు 55 శాతం కలిగి ఉన్నాయి. సంపద యాజమాన్యంలో ఈ స్పష్టమైన వ్యత్యాసం భారతదేశ కుల వ్యవస్థలో పాతుకుపోయిన లోతైన ఆర్థిక అసమానతలను నొక్కి చెబుతుంది. వ్యవస్థాపకతకి, సంపద సృష్టికి అవసరమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, సోషల్ నెట్‌వర్క్‌లలో భాగం కావటం, క్రెడిట్‌ను పొందడంలో కులం ప్రభావం చూపుతూనే ఉంది. (Gaurav Dwivedi, World Inequality Report: India Has 85% Billionaires From Upper Castes, None From Scheduled Tribes )
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.