
బరువెక్కిన గుండె నుంచో
విసుగు చెందిన మనసు నుంచో
కలచివేసిన కదనాలను చూసో
కదిలించే వదనాలను చూసో
తడి ఆరి పోయిన కొన్ని
ఎడారి హృదయాలను తడుముతూ
కొన్ని అక్షర చినుకులు
కలం నుంచి జాలువారుతాయి..
బాధలో నుంచి పుట్టిన భావమే కవిత్వం. వేదనలో నుంచి పుట్టిన నాదమే కవిత్వం. ఆనందపు తాండవమే కవిత్వం. కవిత్వానికి కొలమానం లేదు. కానీ ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మను దర్శింప చేసేదిగా అనుభూతి చెందించేదే అసలైన కవిత్వంగా పరిగణించబడుతుంది.
మనిషి అస్తిత్వాన్ని వెతుక్కుంటూ తనదైన మార్కుతో సరికొత్త అభివ్యక్తితో పదునైన కవిత్వాన్ని వినిపించే గొంతుక కోసూరి రవికుమార్. గుండెలోని ఘోష అక్షరాలై వుబికినట్టు, విలువలు మరిచిపోతున్న సమాజాన్ని చర్నాకోలతో చుర్రు మనిపించే అక్షరం. ప్రౌఢ భాషా ప్రయోగాలు కాని, భిన్నవాక్యాలు కాని మచ్చుకైనా కనిపించవు. కలర్లు, కోటింగ్లూ అంటని ఓ స్వచ్ఛమైన కవిత్వం. పాఠకుల మనసును హత్తుకునేలా ఒక ఎమోషన్తో, చమత్కారంతో కవిత్వాన్ని దృశ్యగతం చేస్తారు. వీరి కవిత్వంలో వస్తువు అంతర్ముఖంగా వుంటూ మొత్తం కవిత చదివిన తర్వాత మాత్రమే అరెరే ఇప్పటిదాకా చదివింది దీని గురించాని ఆశ్చర్య పోయేలా చక్కని ధ్వనితో వాక్యనిర్మాణం వుంటుంది. దైనందిన జీవితపు అనుభవాలు వాటి స్పందనలు, ఆనందాలు, దిగులు, నిరాశలు, ప్రేమలు, స్నేహాలు వీరి కవిత్వంలో కనిపిస్తాయి. నిత్యం జీవితాన్ని కొలుస్తూ కాకుండా ఓ ఉత్సవంలా జీవించాలి అన్నదే వీరి సిద్ధాంతం.
వీరి “దాపల” కవితా సంపుటి నుంచి కొన్ని కవిత్వ పాదాలు..
“వాన మొదలైనప్పుడు మట్టిలా కొన్ని దృశ్యాలు
రాయి ఎన్ని వానలకు మట్టిలా మారుతుందో
వాన మొదలైన ప్రతిసారి నేను
మనిషిలో మట్టి కోసం వెతుకుతాను.”
వర్షం వస్తే మనకు ఎన్నో అందమైన ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. మట్టిలోంచి వచ్చే వాసన చెట్ల మీద రాలే చినుకులు ఆకాశంలో మెరుపులు ఇంతేనా అంటే, కాదు ఈ కవితా పంక్తుల వెనక కవి హృదయంలో ఓ అన్వేషణ ఉంది. ఇప్పటి సమాజంలో మనుషులు ఆలోచనల్లో, చర్యల్లో రాయిలా గట్టి పడి పోతున్నారు. లాభనష్టాలు, స్వార్థం, పోటీల వలన మనిషి మనసు మృదుత్వాన్ని కోల్పోతుంది. ప్రేమ, దయ,సానుభూతి లాంటి భావనలు వర్షంలా కురిస్తే మనల్ని మళ్ళీ మట్టిలా తయారు చేయగలదు. వర్షం అంటే కేవలం నీరు కాదు, అది మనస్సు శుద్ధి. ప్రతి వానతో మనిషి హృదయం మృదువయ్యే అవసరం, అవకాశం వుందని కవి అంతరంగం.
“కోరికలతో కాల్చిన మబ్బు కొరివితో గడ్డ కట్టిన మంచు కింద చితిని ఒక దాన్ని రగిల్చి కరిగించి కౌగిలించుకున్నాక ఏ చల్లటి హిమ స్పర్శ కోసం దేవులాడగలం”
“పంట కోసం మట్టిని చంపి
వాన కోసం మబ్బులు చంపి
నీళ్ల కోసం నేలలు తవ్విపోసి
నీడ కోసం భూమినిండా సిమెంట్ గూళ్ళు కట్టి ఇంకో గ్రహం కోసం వెంపర్లాడుతూ ఏ సతిత హరితాన్ని కలగనగలం”
ఇది ఓ వ్యంగ్యమైన సామాజిక, తాత్విక దృక్పథంతో రాసిన కవిత. ప్రతి పదంలో ఓ లోతైన అర్థం, ఆవేదనా కనిపిస్తాయి. మానవుని అంతులేని కోరికలు, స్వార్థం, అసంతృప్తి వల్ల తనను తాను, ప్రకృతిని ఎలా నాశనం చేసుకుంటున్నాడో గొప్పగా ప్రతిబింబిస్తున్నాయి. మనిషి పంట, వాన, నీరు, నీడ కోసం ప్రకృతిని ఎలా పాడు చేస్తున్నది, చివరకు భూమిని వదిలి ఇంకో గ్రహం కోసం వెంపర్లాడే స్థితిని చూపుతుంది. మొత్తంగా ఇది ప్రకృతిపై మానవుని దోపిడీ, అంతులేని ఆశలపై సునిశితమైన విమర్శనా కవిత.
“చూపుడు వెళ్ళన్నీ ప్రశ్నించే కొడవళ్లై రూపు కట్టాల్సిన మరో ప్రపంచం గురించి
ఉద్యమమై ఉరకాల్సిన సమయం గురించి మాట్లాడాలి
ఇప్పుడు వడకాల్సింది దారము కాదు నెయ్యాల్సింది అగ్గిపెట్టిలో పట్టే గుడ్డలు కానే కాదు
చెమటలు దోచుకెళ్లే వాడిని కప్పెట్టేందుకు తెల్లగుడ్డ”
ఈ పద్యం ఒక విమర్శ, ప్రతిఘటన, మార్పుకు పిలుపు అన్నీ కలగలిపిన అద్భుత ఉదాహరణ. ఇది ఒక్క సాహిత్య ప్రకటన కాదు, సామాజిక ఉద్యమాలకు ఒక దిశానిర్దేశం. ఇది సాంఘిక, ఆర్థిక, రాజకీయ అవస్థలు ఎదుర్కొంటున్న సమాజాన్ని జాగృతం చేయాలనే సంకల్పం. సమకాలీన పోరాట భావధార, విప్లవ స్పూర్తి, వ్యంగ్య దృక్పథం. సామాన్యుల శ్రమను దోచే వ్యవస్థపై, మోసపూరిత నైతికతపై ప్రతిఘటించి, కొత్త సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది సున్నితంగా భావుకతను కాకుండా, ఘాటుగా నిజాన్ని నిలబెట్టే ప్రయత్నం.
ఇప్పటి వరకు సామాజిక పార్శం చూశాము .ఇప్పుడు అనురాగాన్ని, సుగంధాన్ని, మృదుత్వాన్ని సూచించే “మట్టి ప్రమిదలు” అనే కవితను స్పర్శిద్దాం. “అమ్మ , ఆమె రూపాలు మారినా వాళ్ళ ప్రేమలో మార్పు లేదు. నన్ను నా రూపాలను వెలిగించే మట్టి ప్రమిదలు మనిషి చెట్టుకు పూసిన వెన్నపూలు.”
ఈ వాక్యంలో “అమ్మ”, ఆమె” రూపాలను సమానంగా చూడడం ద్వారా మహిళా పాత్రల మధ్య ఉన్న అనుబంధాన్ని, ప్రేమను, గౌరవాన్ని రచయిత మనకు చూపిస్తారు. “రూపాలు మారిన ప్రేమ” మన జీవన ప్రయాణంలో, మన చుట్టూ ఉండే మహిళా సంబంధాలు మారినా, వాటి వెనుక ఉన్న నిజమైన ప్రేమ మాత్రం మారదని చెప్పే ప్రయత్నం. మట్టి ప్రమిదలు ఎలా వెలుగునిచ్చేవో, అలా తన వ్యక్తిత్వాన్ని వెలిగించే వాళ్ళు తన జీవితంలోని అమ్మ, భార్య అని చెప్పే గాఢమైన భావం. ఇది ఒక విధంగా కృతజ్ఞతా గీతం. జీవితంలో మహిళల స్థానం, వారి ప్రేమ అమూల్యత్వాన్ని సమర్ధంగా చాటుతూ, హృదయాన్ని తాకేలా రాశారు.
ఈ కవి హృదయంలో వున్న భావ సౌందర్యానికి, అద్భుతమైన ఊహకు ప్రతీక ఈ “వేసవిలో దీపాలు పెట్టేవేళ ” అనే కవిత. “పగటి ఆల్చిప్పలోకి చినుకు చంద్రుడు రాలి ముత్యమై మెరిసినట్లు ఎండకి వేగివేగి దుమ్ము లేచిపోతున్న వీధిలోకి వాకిట్లో సందె ముగ్గేసే అమ్మాయిలా వస్తుంది సాయంత్రం”
పగటి ఆల్చిప్పలోకి చినుకు చంద్రుడు
రాలి ముత్యమై మెరిసినట్లు”
ఆకాశంలో మధ్యాహ్నపు వెలుగు మధ్య చంద్రుడు ఒక చినుకులా కిందపడడం, ఆ చినుకు ముత్యంలా మెరసిపోవడం. ఇదొక అద్భుతమైన ఊహ. సాయంత్రాన్ని సందె ముగ్గు వేసే అమ్మాయిలా పోలుస్తూ సొగసైన, సున్నితమైన గ్రామీణ ప్రాంతపు సాంప్రదాయ జీవనశైలి తెలియజేసే దృశ్యాల చిత్రణ.
శ్రమ జీవన సౌందర్యానికి ప్రతీక ఈ “పోరు ” పద్యం. “నేల నాలుగు దిక్కులను చెక్కి చెమట చుక్కల్ని వరుసల్లో చల్లి ప్రతి ఏటా మొలకెత్తుతాడతడు నేల నడుముకు పచ్చటి సిగ్గు వస్త్రమై నిలుస్తాడు.”
ఈ పద్యంలో కవి రైతు శ్రమను ఎంతో హృద్యంగా, లోతుగా చిత్రించారు. నేల నడుముకు పచ్చటి సిగ్గు వస్త్రమై నిలుస్తాడు” అనడం ఎంత అందంగా ఉందో చూడండి. ఇక్కడ పచ్చటి పంటను సిగ్గు వస్త్రమైనట్టు కవి వర్ణించారు. అంటే, పచ్చటి పంట నేలను అలంకరిస్తుంది. ఇది ప్రకృతిశోభను తెలియజేస్తుంది. రైతు కష్టాన్ని, అతని ఆశను, నమ్మకాన్ని, ప్రకృతితో అతని అనుబంధాన్ని గాఢంగా, అందంగా తెలియజేస్తుంది. ఇది భావ గాంభీర్యం, భాషా సౌందర్యం కలిసిన అద్భుత రచనగా చెప్పవచ్చు.
చివరగా “కొంచెం వెన్నెల.. కాసిని గుసగుసలు” వాకపల్లి ఆడబిడ్డపై జరిగిన దురాగతాల విచారణ తీరుపై నిరసన తెలియజేస్తూ రాసిన కవిత.
“వేట బహుముఖం అయిన తర్వాత చట్టం చెవిటిదయ్యాక
వాకపల్లి నీటిపాయలో నెత్తుటి మరకలు
పీలికలైన బొంత కింద ఈతాకులు చెప్పే పచ్చి పచ్చి నిజాలు
ఏవి వినిపించనంత చెవిటితనం
బండ చెముడు దాపురించింది ఈ లోకానికి”
ఈ కవిత పాఠకుడిని ఆలోచింపజేసేలా, కుదిపి వేసేలా ఉంటుంది. న్యాయం కోరే గొంతు, వేదనతో కూడిన సత్యాలు. దీనిలోని హృదయ విదారకమైన చిత్రణలు గ్రామీణ గిరిజన మహిళపై జరిగిన అన్యాయంలో చట్టంపై, న్యాయవ్యవస్థపై, సమాజంపై తీవ్రమైన విమర్శ. ఈ కవిత మహిళా హక్కులు, గిరిజనుల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఒక గట్టిగొంతు. కవితలోని ప్రతి పదం ఒక అరుపు. ఒక మెలకువ. బాధితుల కోసం న్యాయం అడిగే స్వరం. సామాజిక చైతన్యానికి ప్రతీక.
రవికుమార్ మొదటి కవితా సంపుటి “బొడ్డుపేగు”. దశాబ్దపు కాల సుదీర్ఘ విరామం తర్వాత తన రెండవ కవితా సంపుటిగా ఈ “దాపల”ను తీసుకువచ్చారు. ఇందులోని ప్రతి కవితా ఓ ఆణిముత్యం. ఇందులో ప్రజాపక్షం వహించిన కవిత్వం మెండుగా వుంది. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా విద్యార్థులలో తప్పొప్పులను సవరిస్తూ కవిగా సమాజంలోని అసమానతలను, దౌర్జన్యాలను నిలదీస్తూ వృత్తి, ప్రవృత్తులకు సమన్యాయం చేశారని చెప్పి తీరాలి. వీరి కలంనుండి మరెన్నో అభ్యుదయ భావాలతో కూడిన సామాజిక కవిత్వం వస్తుందని ఆశిస్తూ హృదయ పూర్వక అభినందనలు.
(ఒంగోలుకు చెందిన కవయిత్రి, ఈ సమీక్ష రాసిన కృష్ణవేణి పరాంకుశం విమలసాహితీ సంపాదకులుగా ఉన్నారు.)
(దాపల కాపీల కొరకు సంప్రదించండి: కోసూరి రవికుమార్, 9491336488. )
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.