
మెగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మెగా డీఎస్సీలో భాగాంగా టీచర్ పోస్ట్‌ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత ఉంటే, మరి కొన్ని పాఠశాల్లో ఎక్కువ సంఖ్యలో టీచర్లు ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మెగా డీఎస్సీలో భాగంగా 13,192 పోస్టులతో పాటు, జిల్లాల వారీగా ఉపాధ్యాయుల పునర్విభజన (రీఅపోర్షన్‌మెంట్) చేస్తూ నిర్ణయం తీసుకుంది.
4706 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మోడల్ ప్రాథమిక పాఠశాలల హెడ్ మాస్టర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా మార్పు చేశారు దీనివల్ల మోడల్ స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల కొరత తీరనుందని ప్రభుత్వం చెబుతుంది. మిగిలిన 2,754 స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులను క్లస్టర్ స్థాయిలో ఉంచారు. వీరిని అనారోగ్యం, ప్రసూతి సెలవుల వంటి సందర్భాల్లో రెగ్యులర్ టీచర్లు అందుబాటులో లేనప్పుడు తాత్కాలికంగా వేరే పాఠశాలలకు బదిలీ చేయనున్నారు. దీని ద్వార విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటుందని ప్రభుత్వం చెబుతుంది.
వీటితోపాటు మరో 617 పోస్టులను (517 స్కూల్ అసిస్టెంట్ , 98 ఎస్జీటీ)కు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతోపాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 3980 పోస్టులను 3228 పోస్టులకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త పోస్టుల్లో 397 గ్రేడ్-2 హెడ్ మాస్టర్ పోస్టులు, 2709 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 122 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఉన్నాయి. దీనివల్ల కొన్ని కేటగిరీల్లో పోస్టుల సంఖ్య పెరగనుంది.
రాష్ట్రంలోని 779 అప్పర్ ప్రైమరీ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీనివల్ల ఎక్కువ మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతుంది. 362 స్కూల్ అసిస్టెంట్, 1540 ఎస్జీటీ పోస్టులు కలిపి మొత్తం 1902 ఖాళీ పోస్టులను భవిష్యత్తులో అవసరమైన చోట్ల ఉపయోగించడం కోసం డైరెక్టర్ కేడర్‌లో ఉంచనున్నారు. అంటే, ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయకుండా, భవిష్యత్తులో ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ వీటిని వినియోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నేపథ్యం..
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే పరీక్షనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టెట్ కమ్ టీఆర్టీ) లేదా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ(డీఎస్సీ) అంటారు. ఉపాధ్యాయ వృత్తిని ఆశించే అభ్యర్థులకు ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ. గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ పరీక్షలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. అయితే, కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల ఈ నియామక ప్రక్రియ ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉపాధ్యాయ నియామకాలు జిల్లా స్థాయిలో జరిగేవి. ప్రతి జిల్లా తన అవసరాలకు అనుగుణంగా డీఎస్సీని నిర్వహించేది. రాష్ట్ర విభజన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని కొనసాగించింది. అయితే, పోస్టుల సంఖ్య, పరీక్ష విధానం, అర్హతలు వంటి విషయాల్లో కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తన సొంత విద్యా విధానాన్ని రూపొందించుకుంది. దీనిలో భాగంగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో కూడా కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, టీచర్ల అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. ఈ సమీక్షల ఆధారంగానే కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంటుంది.
గత కొన్ని డీఎస్సీ నోటిఫికేషన్లను పరిశీలిస్తే, ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే, కొన్నిసార్లు కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది. అయినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. రాబోయే మెగా డీఎస్సీ-2025 కూడా ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు. ఈసారి ప్రభుత్వం భారీ సంఖ్యలో పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, జిల్లాల వారీగా ఉన్న టీచర్ల అసమతుల్యతను సరిచేయడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. అందుకే, ఈ పునర్విభజన ప్రక్రియను చేపట్టింది.
ఈ మార్పుల వల్ల కలిగే ప్రయోజనాలు..
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయాల వల్ల పలు ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు అంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఉన్న టీచర్ల కొరతను ఈ పునర్విభజన ద్వారా కొంతమేరకు పరిష్కరించవచ్చు. సరైన సంఖ్యలో టీచర్లు అందుబాటులో ఉంటే, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో హెడ్ మాస్టర్ పోస్టులను మంజూరు చేయడం వల్ల మోడల్ స్కూళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. క్లస్టర్ స్థాయిలో టీచర్లను ఉంచడం వల్ల సెలవుల్లో వెళ్లిన టీచర్ల స్థానంలో వెంటనే మరొకరిని నియమించవచ్చు. భవిష్యత్తులో అవసరమయ్యే పోస్టులను గుర్తించి, వాటిని డైరెక్టర్ కేడర్‌లో ఉంచడం వల్ల సమయానుకూలంగా భర్తీ చేయవచ్చు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.