
మహారాష్ట్రలోని కార్వేనగర్లో పాలస్తీనా మద్దతుదారులు, బీడీఎస్ ఇండియా కార్యకర్తలు పాలస్తీనాకు సంఘీభావంగా శాంతియుత నిరసనకు దిగారు. డోమినోస్ పీజా ముందు నిరసన చేస్తున్న వారిపై బీజేపీ శ్రేణులు దాడి చేశారు. హమస్‌కు మద్దతుగా, పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారని ఆరోపిస్తూ నానా హంగామా సృష్టించారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ “ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా” 2025 మే 12న పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తమ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ప్రకటనలో పేర్కొంది.
మే 10వ తేదీన “ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా(పాలస్తీనాకు సంఘీభావంగా భారత ప్రజలు)” ఫోరం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ చేస్తున్న జాతిహననం విషయంలో డోమినోస్ పీజా వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఫోరం ఆధ్వర్యంలో పాలస్తీనా అనుకూల మద్దతుదారులు, బీడీఎస్ ఇండియా ప్రచారకులు ఈ నిరసనలు చేపట్టారు. ఇందులో భాగంగా పూణేలోని కార్వేనగర్ డోమినోస్ ఔట్లేట్ ముందు ఒక నిరసన ప్రదర్శనను నిర్వహించారు. అందరు చూసే విధంగా శాంతియుతంగా స్వచ్ఛంద సామాజిక కార్యకర్తలు బహిరంగంగా తమ కరపత్రాలను పంచారని ఫోరం తమ ప్రకటనలో పేర్కొంది. “ప్రపంచ ప్రజాస్వామ్య సమాజం మెజారిటీ అభిప్రాయంతో, పాలస్తీనా స్వేచ్ఛకు మద్దతు ఇవ్వడంలో భారతదేశం చారిత్రక వైఖరితో మా వైఖరి పూర్తిగా అనుగుణంగా ఉంది” అని ప్రకటనలో స్పష్టం చేసింది. 1948లో పాలస్తీనా భూభూగం ఆక్రమణతో ఏర్పడే ఇజ్రాయిల్ ఆవిర్భావన్ని వ్యతిరేకించిన దేశాలలో భారతదేశం కూడా ఉందని గుర్తు చేసింది.
“మా నిరసన కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 10- 15 మంది గుమిగూడారు, ఇంకా మాతో చర్చించడం మొదలు పెట్టారు. పాలస్తీనా గురించి వారికి ఉన్న అపోహల విషయంలో ఓపికగా వాళ్లకు మేము వివరించడం మొదలు పెట్టాము. ఇదిఇలా ఉండగా బీజేపీ నాయకులైన మహేశ్ పవలే, సాగర్ ధామే నేతృత్వంలో 50- 100 మంది గుమిగూడారు, నిరసనలో పాల్గొన్న వారిపై దాడికి దిగారు.” అని ప్రకటనలో తెలియజేశారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలలో నిరసనకారులపై దాడికి దిగిన వారిని అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్టు అర్థం అవుతుంది. ప్రకటనలో, పోలీసులు ఎవరైతే ఘటనా స్థలానికి చేరుకున్నారో కొద్దిసేపు పక్కకే నిలబడి ఆ తర్వాత తమలోని నలుగురిని తీసుకువెళ్లారని తెలియజేశారు. అంతేకాకుండా నిరసనలో పాల్గొన్న మహిళా నిరసనకారులు దాడికి గురైయ్యారని, వారిని అత్యాచారం చేసి చంపుతామని బెదిరించారని, ఇంకా దాడిలో మహిళా నిరసనకారుల బట్టలు చినిగిపోయాయని ఆరోపించారు.
అయితే, దాడికి గురైన బాధిత నిరసనకారులకు పోలీస్‌స్టేషన్‌లో చేదు అనుభవం ఎదురైంది. కేవలం బాధ్యులకు కొమ్ముకాచి పోలీసులు పక్షపాతంగా వ్యవహరించనట్టుగా ఇండియన్ “పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా” ఫోరం ఆవేదనను వ్యక్తం చేసింది. “పోలీస్ స్టేషన్లో రాత పూర్వకంగా మా ఫిర్యాదును తీసుకున్నారు. కానీ రసీదును ఇవ్వడానికి తిరస్కరించారు. ఏదిఏమైనప్పటికీ బీజేపీ నేతలను రక్షించడానికి పోలీసులకు ఆదేశం అందింది. దీంతో మా ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని మా మీద ఒత్తిడి చేశారు. మేము దానిని తిరస్కరించాము” అని ప్రకటనలో పేర్కొన్నారు.
అంతేకాకుండా “ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం లేదని, వెళ్లిపోవచ్చని చివరికి పోలీసులు చెప్పారు. కానీ ఎమ్మెల్సీ(మెడికల్ లీగల్ సర్టిఫికేట్) చేయించాలని మేము పట్టుపట్టాము. కేవలం మా బలవంతం మీద పోలీసు వ్యాన్‌లో మమ్మల్ని ససూన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మేము ససూన్ ఆసుపత్రికి చేరుకున్నాము, పోలీసులు అక్కడ మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. మా ఎమ్మెల్సీని మేమే పూర్తి చేసుకొని, కార్వే నగర్ పోలీసు చౌకీకి మళ్లీ చేరుకున్నాము. పోకిరీల ఒక చిన్న సమూహం అక్కడే ఒక పోలీసుతో పాటు ఉంది. రక్షణపరంగా ఇబ్బందికరమని పరిగణించి 11వ తేదీ తిరిగి వద్దమాని నిర్ణయించుకున్నాము.”
ప్రకటన ప్రకారం, 12 వ తేదీ నాడు “ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా” సభ్యులు, నిరసనకారులలో ఒకరైన స్వప్నజా అనే అమ్మాయి పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో పూణే పోలీసులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడమే కాకుండా, బాధితులు 10వ తేదీన ఎటువంటి ఫిర్యాదు చేయలేదని బుకాయించారు. ఆ తర్వాత మళ్లీ పాత ఫిర్యాదు పోయిందని అన్నారు. పోలీసులు పాత ఫిర్యాదుపై మాత్రమే ఫిర్యాదుదారులకు రసీదు ఇచ్చి, నిందితుల పేర్లతో ఉన్నటువంటి తమ కొత్త ఫిర్యాదును అంగీకరించడానికి మళ్ళీ నిరాకరించారు. హింసకు పాల్పడిన బాధ్యులకు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. పూణే పోలీసుల అసలు స్వరూపానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
“చాలా స్పష్టంగా పూణే పోలీసులు బీజేపీ నాయకులతో కుమ్మక్కై పని చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ల పోకిరితనాన్ని వెనకేసుకొస్తున్నారు. సోషల్ మీడియాలో సర్క్యూలెట్ అవుతున్నటువంటి వీడియోల ఆధారంగానే కేవలం వీడియోలలో స్పష్టంగా ముఖాలు తెలిసేవారిపైనే చర్యలు తీసుకోవాలి” అని పత్రికా ప్రకటన ముఖంగా “ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా” ఫోరం డిమాండ్ చేసింది.
ఇంకా “బీడీఎస్ పూణే, బీడీఎస్ ఇండియా, “ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా” గురించి బీజేపీ ప్రచార యంత్రం, అనుబంధ ఐటీ సెల్ అసత్య కథనాలను అల్లి వరుసగా వీడియోస్‌ను విడుదల చేస్తున్నారు. మా శాంతియుత ప్రచారంపై దాడి చేసిన గూండాలు మాపై మోపిన నిరాధారమైన ఆరోపణలన్నింటినీ మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా మా ప్రాథమిక హక్కు అయిన ఎఫ్ఐఆర్ నమోదుచేయకుండా వాళ్లను(బీజేపీ శ్రేణులను) రక్షించడానికి ప్రయత్నిస్తున్న చర్యలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.” అని ప్రకటనలో చెప్పుకొచ్చారు.
“మేము పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశామని చెప్పే నిరాధారమైన ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము. న్యాయాన్ని ప్రేమించే వారందరూ చేస్తున్నట్టే, పాలస్తీనా జాతీయ విముక్తికి మేము కూడా మద్దతుగా నిలబడుతున్నాము. అంతేకానీ దీనికి హమాస్ భావజాలంతో ఎటువంటి సంబంధం లేదు. దీని మీద బీజేపీ ఐటీ సెల్ ద్వారా అసత్య ప్రచార తరంగం మాత్రమే సృష్టించబడుతోంది. పాలస్తీనా సమస్య విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని ఇది తేటతెల్లం చేస్తుంది” అని ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి ప్రకటనలో ఇంకా ప్రస్తావిస్తూ, “పాలస్తీనియన్ల మాతృభూమికి భారతదేశం మద్దతు ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ మంత్రి జైశంకర్ బహిరంగంగా ప్రకటించారు. అయినప్పటికీ పాలస్తీనా అనుకూల సంఘీభావానికి వ్యతిరేకంగా మత విద్వేషాన్ని, ముస్లిం వ్యతిరేక మాటలను బీజేపీ క్రూరమైన కార్యకర్తలే వ్యాప్తి చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్- బీజేపీ యంత్రాంగం తన ఫాసిస్ట్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి కథనాలను వక్రీకరిస్తూ ఏదైనా పాలస్తీనా అనుకూల ప్రతిఘటనను దురుద్దేశంతో దుర్భాషలాడుతోంది.” అని పేర్కొన్నది.
అంతేకాకుండా, పాలస్తీనాపై జాతి నిర్మూలనకు, పాలస్తీనా భూభాగ ఆక్రమణకు వ్యతిరేకంగా నిరసన తెలపడం తమ ప్రాథమిక- ప్రజాస్వామ్య హక్కు అని ప్రకటించింది. పోకిరీల దబాయింపులకు, ఫాసిస్ట్ గూండాల బెదిరింపులకు బీడీఎస్ తలొగ్గదని స్పష్టం చేసింది. పాలస్తీనాకు మద్దతుగా తాము తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని “ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా” ఫోరం తెలియజేసింది.
అయితే, “ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా” ఫోరం పత్రికా ప్రకటనను, దాడికి సంబంధించిన వీడియోలను విడుదల చేసిన తర్వాత సోషల్ మీడియా వ్యాప్తంగా పూణే పోలీసుల వైఖరిని వ్యతిరేకించారు. ప్రజల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత ప్రభావంతో మే 12వ తేదీ తర్వాత తలొగ్గిన పూణే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అణిచివేయబడుతున్న బాధితుల తరఫున మానవత్వంతో గొంతెత్తితే ఏ విధంగా అసత్య ప్రచారాలతో అధికారాన్ని, పోలీసుల ప్రోద్బలాన్ని అడ్డుపెట్టుకొని ఉద్యమాలను అణిచివేస్తారో ఈ ఘటన తేటతెల్లం చేస్తుంది. అణిచివేతకు గురవుతున్న పాలస్తీనా ప్రజల హక్కుల గురించి మాట్లాడితే హమాస్‌కు మద్దతు పలుకుతున్నారని, పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించకపోయినా నినదించారని ఆరోపిస్తూ ఏ విధంగా నిరసనకారుల గొంతునొక్కుతున్నారో స్పష్టంగా మనకు అర్థం అవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.