
వెళ్ళిపోవాలి తొందరగా తప్పదు
పొద్దు గుంకిపోతోంది
సంజె చీకట్లు కమ్ముకుంటున్నాయి
ఆడుకున్న ఆటలు పిలుస్తున్నాయి
ఆనాటి తరగతి చదువులు పిలుస్తున్నాయి
వెళ్ళిపోవాలి తప్పదు
మట్టి పిలుస్తోంది
నా ఊరి గాలి పిలుస్తోంది
నా తొలి అడుగుల నేల పిలుస్తోంది
నూతి దగ్గరి మా అమ్మ నన్ను కన్న పురిటి గది పిలుస్తోంది
నా కనులు కన్న తొలి రూపంలేని కలలు పిలుస్తున్నాయి
ఆ ఊరి రావిచెట్టు పిలుస్తోంది
రాలిన ఆకులు ఎండి గలగల మంటూ పిలుస్తున్నాయి
కోనేటి అలల సవ్వడి పిలుస్తోంది
ఆ గట్టుమీద నేను పాడిన గురజాడ పూర్ణమ్మ పాట పిలుస్తోంది
నీటి మీదకి వంగిన కొమ్మల్ని అలలు తాకితే రేగిన
మంద్రపాటి సంగీతం పిలుస్తోంది
ఎర్ర చెరువు ఒడ్డున జరిగిన చవితి సంబరం పిలుస్తోంది
అమ్మ మా చెవులకి పెట్టిన పుట్టబంగారం తడిగా పిలుస్తోంది
చాలు ఇక చాలు
గడిచిన గతుకులు చాలు
రాత్రింబవళ్ళు నడిచిన
పొడవాటి ముళ్ళ డొంకల రహదార్లు చాలు
ఈదిన సముద్రాలు చాలు
జారిపోయిన జారుడు లోయలు చాలు
కూరుకుపోయిన ఊబి
నేలలు బిగుసుకున్న ఉరులు చాలు
కమ్మేసిన సందిగ్ధతలు చాలు
ఈ విషసర్పాలు చాలు
నా నేల పిలుస్తోంది
నా తల్లికి తగిలిన గాయం పిలుస్తోంది
నేను వెళ్ళిపోవాలి తప్పదు
ధీర
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.