
దేశంలో ప్రస్తుత పరిస్థితులలో మతసామరస్యం ఎంతో ముఖ్యమని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. మత సామరస్యాన్ని పెంపొందిస్తూ, ద్వేషాన్ని వెదజల్లే వారిని ఎదుర్కొవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అన్ని పండుగలను జరుపుకోవడం వల్ల వివిధ మతాల ప్రజలలో స్నేహాన్ని పెంపొందించడానికి ప్రతి జిల్లాలో ఒక కమిటీ అవసరమని గుర్తుచేశారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢి మాట్లాడుతూ “దేశంలోని రెండు వర్గాల మధ్య చీలిక తీసుకురావడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వ ‘గోడి మీడియా’, ‘వాట్సాప్ విశ్వవిద్యాలయ’ సైన్యం ప్రవర్తిస్తుంది” అని అన్నారు. అంతేకాకుండా దీనిని ప్రేమతో మాత్రమే ఎదుర్కోగలమని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో చెప్తూ “సమాజాన్ని విభజించడమే ఏకైక పనిగా బీజేపీ ప్రభుత్వం వందలాది వ్యవస్థలను కలిగి ఉంది. కానీ, ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఒక్క వ్యక్తి వల్ల సమాజంలో ఉన్నా ద్వేషం ఓడిపోతుంది” అని ప్రతాప్‌గఢి తెలిపారు.
అంతేకాకుండా, అన్ని పోరాటాలు రాజకీయమైనవి కావని, కొన్నింటిని వ్యక్తిగత స్థాయిలో ఎదుర్కోవాలని, శాంతిని నెలకొల్పడానికి మనం చేయగలిగినదంతా చేయాలని ప్రతాప్ గఢి ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 288 మంది ఎంపీలు ఓటు వేయగా, దాదాపు అంతే సంఖ్యలో 232 మంది ఎంపీలు దానిని వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు. “తెలుగుదేశం, జేడీయు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే, ఈరోజు బిల్లు ఆమోదం పొంది ఉండేది కాదు. ఏపీ సీఎం చంద్రబాబు ముస్లింలకు అన్ని విధాలా మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఆయన ఎంపీలు బిల్లుకు మద్దతుగా ఎందుకు ఓటు వేశారు?” అని ఎంపీ ప్రశ్నించారు.
కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ బీజేపీ ప్రధాన లక్ష్యం అధికారంలో కొనసాగడమేనని, దాని విభజన విధానాలు దీర్ఘకాలంలో సమాజంపై చూపే ప్రభావాన్ని గుర్తించే దూరదృష్టి దానికి లేదని అన్నారు. “ప్రభుత్వం మత విద్వేషాన్ని రెచ్చగొడితే, పౌరులుగా మనం మంచి సైన్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా దానిని ఎదుర్కోవచ్చు. ప్రేమ , సత్యాన్ని వ్యాప్తి చేయడం, స్వాతంత్ర్య ఉద్యమం, దేశాభివృద్ధిలో ముస్లిం, క్రైస్తవ సమాజాల వాస్తవ పాత్ర, వక్రీకరించబడని చరిత్రను ప్రజలకు తెలియజేయడం దీని బాధ్యత” అని ఆయన ప్రజలకు సందేశమిచ్చారు.
ఇంకా మాట్లాడుతూ, “దేశంలోని చాలా మంది ప్రజలు ఇతర మత వర్గాలతో కలిసి శాంతియుతంగా జీవించాలని కోరుకుంటారు. కానీ వారిలో ఐక్యత లేదు. అయితే, విభజన శక్తులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, వ్యవస్థీకృతమై ఐక్యంగా ఉన్నాయి” అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. వాస్తవాలను తెరపైకి తీసుకురావడంలో ప్రత్యామ్నాయ మీడియా సహకారం ఎంతో అవసరమని భూషణ్, ప్రతాప్‌గఢి ఇద్దరూ నొక్కి చెప్పారు.
ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి, ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ కానూరి లక్ష్మణరావు కుమారుడు, సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఉపాధ్యక్షుడు కె విజయ్ రావు మాట్లాడారు. “ప్రతీకారం, ద్వేషానికి సంబంధించిన అంతులేని వలయాన్ని తొలగించాలి. మత సామరస్యం లేనప్పుడు, ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు నిలబడవు. పెట్టుబడులు పెట్టడానికి మన దేశానికి ఎవరూ రావడానికి ఇష్టపడరు. వివిధ వర్గాల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు మనం కలిసి మెలిసి ఉన్నప్పుడు మాత్రమే తొలిగిపోతాయి” అని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్వేష రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ఆటంకంగా మారాయని, రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనాల కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య అనైక్యతను సృష్టిస్తున్న పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలుపుతుండటం దురదృష్టకరమని మరికొందరు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ వ్యవసాయ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేత తులసి రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాజీ మంత్రి మొయిద్ అహ్మద్ ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.