
పబ్లిక్ గ్రీవెన్స్ ద్యారా తమ దృష్టికి వచ్చిన సమస్యలకు వెంటనే స్పందన లభిస్తోందని ఏపీ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ “పబ్లిక్ గ్రీవెన్స్‌కు స్పందించేదెవరు?” అంటూ ద వైర్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనానికి ప్రభుత్వం స్పందించింది. నిర్దేశించిన సమయంలోనే ప్రజా ఫిర్యాదులపై గ్రీవెన్స్ సెల్ స్పందిస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేసింది.
అంతేకాకుండా ప్రజా సమస్యల వేదికలో ఫిర్యాదులు చేసే వారి సంఖ్య పెరుగుతోందని, దానికి తగ్గట్టుగానే 80- 90 శాతం సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని అధికారులు వెల్లడించారు. గ్రీవెన్స్ సెల్ చీఫ్ అందించిన సమాచారం ప్రకారం 8,60,812 ఫిర్యాదులు ఇప్పటి వరకు తమకు అందగా 7,91,307 ఫిర్యాదులను పరిష్కారం చేశామని తెలిపారు.
“69,505 ఫిర్యాదులు ఇంకా పెండింగ్‌లో వున్నాయి. అయితే అధికారుల వద్ద నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్తున్నాయి కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి వేరుగా వుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ఐవిఆర్ఎస్లో 78 శాతం అసంతృప్తి వ్యక్తమయింది” అని ద వైర్ అందించిన కథనంపై ఏపీ ప్రభుత్వ అధికారులు స్పందించారు. ప్రత్యేకంగా పిజిఆర్ఎస్పై రాష్ట్ర ప్రభుత్వం 1100 ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదని,
అయినా ఫిర్యాదులు అందిన వెంటనే మూడు స్థాయిలలో స్పందిస్తున్నామన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే దానికి సంబంధించిన విభాగానికి, ఆ శాఖ ప్రధాన అధికారికి పంపుతారని వెల్లడించారు. తర్వాత జిల్లా స్థాయిలో ఆ సమస్య పై ఫాలోఅప్ వుంటుందని, మూడవ స్థాయిలో పెండింగ్‌లో వున్న ఫిర్యాదులను కూడా ఎందుకు పెండింగ్‌లో పెట్టారో రివ్యూ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
అసలేంటీ ‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్’..
ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై వేగంగా పని చేయాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన మొదట్లోనే ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే కసరత్తు జరగాలని అధికారులకు దిశా నిర్దేశం కూడా చేశారు. పాలనలో తన మార్క్ చూపిస్తానని అధికారులను హెచ్చరిస్తూ వచ్చిన చంద్రబాబు, అధికారం చేపట్టిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారం వైపు దృష్టి పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ‘స్పందన’ కార్యక్రమాన్ని ప్రక్షాళన చేశారు. స్పందన పేరు మార్చి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’గా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ‘పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్’ పేరుతో ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. దానికి అనుబంధంగా గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మిగిలిన మంత్రులు కూడా తమ పర్యటనలో ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తారు. వాటిని కూడా వెంటనే గ్రీవెన్స్ సెల్‌కు పంపుతారు.
వివిధ రూపాల్లో ప్రభుత్వానికి ఇప్పటివరకు 8,26,099 ఫిర్యాదులు అందాయి. రీసర్వే గ్రామ సభల ద్వారా 2,59,642 దరఖాస్తులు, రెవెన్యూ సదస్సుల ద్వారా 2,34,944 దరఖాస్తులు, ప్రతి జిల్లా కలెక్టరేట్ల పిజిఆర్ఎస్ ద్వారా 99,510, మండల స్థాయి పిజిఆర్ఎస్ ద్వారా 72,403, ఆన్లైన్ ద్వారా 52,475, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రుల ద్వారా 19,581, ఎస్పి కార్యాలయాల ద్వారా 14,889, ముఖ్యమంత్రి పిజిఆర్ఎస్ ద్వారా 10,664, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ ద్వారా 9,610, ఇతర మార్గాలలో 18,734 చొప్పున ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయి.
2024 జూన్ 15 నుంచి ఇప్పటి వరకు 8,26,812 ఫిర్యాదులు అందితే, వీటిలో 7,91,307 పరిష్కరించామని, 69,505 ఫిర్యాదులు పరిష్కరించాల్సి ఉందని ప్రభుత్వం లెక్కలు తేల్చింది. అయితే అందిన ఫిర్యాదుల్లో 1,73,020 ఆడిటే పూర్తిచేయకుండా పూర్తిచేసినట్లు లెక్కలు చెబుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇప్పుడు తమ దగ్గరికి వచ్చిన ఫిర్యాదులన్నీ క్రమ పద్ధతిలో పరిష్కరించబడతాయని ద వై ర్ ప్రచురించిన కథనానికి స్పందిస్తూ వివరణ ఇవ్వడం గమనార్హం.
ద వైర్ క్షేత్రస్థాయిలో కొంతమంది ఫిర్యాదుదారులతో మాట్లాడినప్పుడు విరుద్ధ స్పందన వచ్చింది. ఒకవైపు ప్రభుత్వం తమకు వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అటువంటి దాఖలాలు లేవు. ఇందుకో ఉదాహరణగా అనంతపురం జిల్లాలోని ఎటిపి 20241026350 నెంబర్ ఫిర్యాదుదారుడు సమస్యను పరిష్కరించకుండానే తన ఫిర్యాదు మూసివేయబడినట్టు తనకు మెసేజ్ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే సాఫ్ట్‌వేర్‌లో ఉన్న సాంకేతిక లోపం వల్ల ఇలా యాదృచ్ఛికంగా సమస్య మూసివేయబడినట్టు సందేశాలు కొంతమందికి వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని గ్రీవెన్స్ సెల్ చీఫ్ డాక్టర్ చిన్నారావు ద వైర్ తో తెలియజేశారు. వీటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇలా వచ్చిన వాళ్ళందరినీ మళ్లీ తామే కాంటాక్ట్ అవుతున్నామని, ఆ వాయిస్ రికార్డుతో పాటు సంబంధిత జిల్లా కలెక్టర్‌కు మళ్ళీ సమస్యను అటాచ్ చేస్తున్నామని ద వైర్‌తో ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే టిడిపి, జనసేన , బిజెపి కార్యాలయాలలోనూ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఎంతో ఆశతో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెట్టుకొనే ధరఖాస్తులు, ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని చెబుతున్నా, కొన్ని శాఖలలో అధికారుల వెంటనే స్పందించడం లేదనే విమర్శలు వస్తూనే వున్నాయి. కాబట్టి అధికారులు మరింత దృష్టిపెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సివుంది.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.