
మూడో భాగం
భారతదేశంలో పేట్రేగిపోతున్న హిందూత్వ రాజకీయాలు, ఉధృతమవుతున్న నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులకు లోనవనున్నది. ఉన్నత విద్యారంగంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే హిందూత్వ, నయా ఉదారవాద రాజకీయాల ఉమ్మడి ప్రయోజనాల సాధన దిశగా కదులుతున్న ధోరణులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం ఈ ధోరణులను మరింత కట్టుదిట్టం చేయనున్నది. ఈ విధానం ముందుముందు ఉన్నత విద్యను మరింత వేగంగా ప్రైవేటీకరించనున్నది. చిన్నాచితక కుటుంబాల నుండి వచ్చే విద్యార్ధులకు ఉన్నత విద్య భారం కాబోతోంది.
జనవరి 2025లో విద్యాశాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక సమర్పించింది. ఈ నివేదికను పరిశీలిస్తే గత దశాబ్దకాలంలో విద్యారంగంలో ప్రభుత్వం పాత్ర ఎంతమేర కుదించుకుపోయిందో అర్థమవుతుంది. ప్రైవేటురంగం ఒంటెలా విస్తరిస్తున్న తీరును కూడా ఈ నివేదిక చర్చించింది. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల నియామకాల్లో పెరుగుతున్న నయాఉదారవాద ప్రభావాన్ని, బోధనా సిబ్బందిసైతం కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించబడుత్నున వైనాన్ని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న కేంద్రాల్లో అత్యధిక నియామకాలు కాంట్రాక్టు ప్రాతిపదికనే జరుగుతున్నాయి. ప్రభుత్వం విద్యారంగంనుండి క్రమంగా వైదొలగటం వల్లనే ఉన్నత విద్యాకేంద్రాల్లో బోధన, బోధనేతర సిబ్బంది షిఫ్టులవారీగానూ, కాంట్రాక్టు లేదా తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు జరగటానికి మూలం నయా ఉదారవాద విధానాల ప్రభావమేనని పార్లమెంటరీ సంఘం అభిప్రాయపడిరది.
యూజీసి స్థానంలో ఏర్పాటు చేయదల్చిన ఉన్నత విద్యా సంఘం ముసాయిదా బిల్లు పరిశీలిస్తే రానున్న కాలంలో విశ్వవిద్యాలయాల నిర్వహణ, ఏర్పాటు, నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను భూస్థాపితం చేయనున్నట్లు అర్థమవుందని స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ బిల్లు చట్టం రూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యపై కేంద్ర ప్రభుత్వం పట్టు మరింత బిగుస్తుంది. బోధనాంశాలు కేంద్రమే రూపొందిస్తుంది. రాష్ట్రాలు తమ కోసం ఓ అధ్యాయాన్ని కలుపుకుంటే కలుపుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష, ఒకే పరిపాలన విధానం, ఒకే అడ్మిషన్ల విధానం రానున్నాయి.
కనుమరుగవుతున్న ప్రజాతంత్ర స్వభావం..
మేధో స్వాతంత్య్రం, బోధనా స్వయంప్రతిపత్తి విషయంలో నేను పని చేసిన జెఎన్యూ శిఖరాయమానంగా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లోనూ విద్యార్ధులు, అధ్యాపకులతో కూడిన కమిటీలతో పాటు యూనివర్శిటీ రూపొందించే ప్రతి విధానంలోనూ యూనివర్శిటీలో భాగస్వాములైన అన్ని తరగతుల అభిప్రాయాలకూ అవకాశం ఉండేలా ఓ స్వీయ నియంత్రణ వ్యవస్థను రూపొందించుకున్న తొలి విశ్వవిద్యాలయం జెఎన్యూ అని చెప్పవచ్చు. ఈ రకమైన భాగస్వామ్య పద్ధతి వలన యూనివర్శిటీలో జరిగే అన్ని విషయాలపై అధ్యాపకులు, విద్యార్ధులు, పాలకమండలి మధ్య ఏకాభిప్రాయం రావడానికి మార్గం తేలికైంది. కానీ దురదృష్టవశాత్తూ ప్రస్తుతం ఇదే యూనివర్శిటీలో వికేంద్రీకృత భాగస్వామ్య విధాన నిర్ణయం స్థానంలో సంపూర్ణమైన కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ వేళ్లూనుకొంటోంది.
యూనివర్విటీలోని కీలకమైన బాధ్యతలు, విభాగాలు అన్నింటిలో పాలకపార్టీ అనుయాయులుగా ఉన్న వారిని నియమించటంతో మౌలిక సమస్య అయిన మేధో స్వయంప్రతిపత్తి ప్రశ్నార్ధకమవుతోంది. పాలకపార్టీకి సన్నిహితంగా ఉండేవారిని కీలక బాధ్యతల్లో నియమించటం ఇదేమీ మొదటిసారి కాదు. 2014కు ముందు కూడా కొన్ని సందర్భాల్లో బోధనా సిబ్బంది నియామకాల్లో రాజకీయ పలుకుబడులు పని చేశాయి. కాకపోతే అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే గతంలో రాజకీయ ప్రభావం ఉన్నప్పటికీ మేధో సామర్ధ్యం విషయంలో నియమితులైనవారి గురించిన శషభిషలు, భిన్నాభిప్రాయాలూ ఉండేవి కావు. కానీ ఇపుడు మేధో సామర్ధ్యంతో సంబంధం లేకుండానే కేవలం రాజకీయా పలుకుబడి, ప్రభావం ప్రధానంగా నియామకాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు మొత్తంగా ఉన్నత విద్యావ్యవస్థలో నాణ్యతకు, అంతర్జాతీయ ప్రమాణాల విషయంలో డొల్లతనం ఏర్పడడానికి దారితీస్తున్నాయి.
రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో ఉన్న అంశం. కానీ గత పదేళ్లుగా జరుగుతున్న పరిణామాలు విద్యారంగంపై కేంద్రం పెత్తనాన్ని ఘనీభవింపచేస్తున్నాయి. దాంతో యూనివర్శిటీల రోజువారీ నిర్వహణ మొదలు వైస్ ఛాన్సలర్ల నియామకం, సిబ్బంది నియామకంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం విపరీతంగా పెరిగింది. యూజిసి 2025లో విడుదల చేసిన మార్గదర్శకాలు యూనివర్శిటీ నియామకాలన్నిటిలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాత్మక జోక్యానికి పెద్దపీట వేస్తున్నాయి. ఈ మార్గదర్శకాలు రాజ్యాంగ ప్రమాణాలు ఉల్లంఘించి రాష్ట్రాల స్వయంవప్రతిపత్తిని సమాధి చేసేవిగా ఉండటంతో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. మేధావులు కూడా స్పందిస్తున్నారు.
వైస్ ఛాన్సలర్ల నియామకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాజా వివాదాలకు కేంద్రంగా ఉంది. వైస్ ఛాన్సలర్‌ను ఎంపిక చేయటానికి ఏర్పాటు చేసే కమిటీలో విజిటర్/ఛాన్సలర్ ప్రతినిధులు, యూజిసి ప్రతినిధులు, యూనివర్శిటీ సిండికేట్ ప్రతినిధులూ ఉంటారు. ఈ కమిటీకి అధ్యక్షుడుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఉండేవారు. కానీ తాజా మార్గదర్శకాలతో తమ ప్రతినిధిని అధ్యక్షుడుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసే త్రిసభ్య కమిటీలో ముగ్గురులో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కావటంతో ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు, సిపార్సులు గట్టెక్కే అవకాశాలే లేవు.
పైగా తాజా మార్గదర్శకాల ప్రకారం తగిన ఉన్నత విద్యార్హతలు లేనివారు కూడా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్లుగా నియమించబడేందుకు అర్హులవుతున్నారు. అంటే వైస్ ఛాన్సలర్ స్థాయిలో ఉన్న వాళ్లు మేధో రంగంలో విశిష్ట స్థానాలు కలిగిన వ్యక్తులు కానవసరం లేదనే సూత్రం ముందుముందు రాజకీయ పలుకుబడి ఉంటేచాలు, మేధో విశిష్టత అవసరం లేకపోయినా వారు యూనివర్శిటీలకు కులపతులు కావచ్చు. యూనివర్శిటీలు కానీ, లేదా యూనివర్శిటీలకు నిధులు సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం పెత్తనం ముందు నోరుమూసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిణామాలు వైస్ ఛాన్సలర్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యాన్ని ఖాయం చేస్తాయి. ఫలితంగా కేంద్రంలో అధికార పార్టీకి అంటకాగటానికి సిద్ధం అయ్యేవారితో యూనివర్శిటీలు నిండిపోయే ప్రమాదం పొంచి ఉంది.
నిర్లక్ష్యానికి గురవుతున్న సామాజిక శాస్త్రాలు, మానవ సంబంధిత అధ్యయనాలు..
ఈ మేధో వ్యతిరేక లక్షణాల్లో ఇంకోటి సామాజిక అధ్యయనాల పట్ల విముఖత. సమాజ అధ్యయనాలు అంత ప్రాధాన్యత లేనివనే భావన కలిగించేందుకు పాలకపక్షం శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. దీనికి రెండు కారణాలు. మొదటిది సకలం సరుకుమయం అయిన ఈ రోజుల్లో ఏది చదివితే ఎంత సంపాదన వస్తుందనే ధోరణి ప్రబలటం. రెండోది సామాజిక శాస్త్ర అధ్యయనాలు విద్యార్థులు, అధ్యాపకుల్లో విమర్శనాత్మక దృష్టిని పెంపొందించటం. అది పాలకవర్గానికి సంకటంగా మారటం. కానీ ఈ రెండు అధ్యయన శాస్త్రాలు – సామాజిక అధ్యయన శాస్త్రాలు, మానవవ అధ్యయన శాస్త్రాలు – ప్రతి మనిషి జీవితాన్ని తెలుసుకోవడానికి అక్కరకొచ్చే అంశాలు. కేవలం తక్షణమే ఆర్థికాభివృద్ధి అనే యంత్రంలో మనుషులను మరలుగా మార్చేందుకు పనికొచ్చే సాంకేతిక విద్య ఈ కొరతను తీర్చలేదు. అందుకే లాభం కోసం కాదు, ప్రజాస్వామానికి మానవాభిశాస్త్రాల అవసరం ఏమిటనే తన రచనలో తత్వవేత్త మార్త నాబుస్సుం ‘‘ఉదారవాద కళలను అంత ప్రాధాన్యత కలిగినవి కాదని చెప్పటం ద్వారా మనం ప్రజాస్వామ్యాన్ని, పౌరసత్వాన్ని నిస్సారంగా మారుస్తున్నాము. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం మనుగడకు స్వతంత్రించి ఆలోచించగల వ్యక్తులు, వారి సృజనాత్మక సామర్ధ్యాలు కావాలి. ఇటువంటి వారు నిచ్చెనమెట్ల వ్యవస్థను, పెత్తందారీ ధోరణులను, నిరంకుశత్వాన్ని ప్రశ్నించి సవాలు చేయగల సమర్ధులై ఉండాలి. వ్యక్తిత్వం కలిగినవాళ్లై ఉండాలి’’ అన్నారు.
గతాన్ని పునః ప్రశస్తిగల చరిత్రగా మల్చటం..
ఈ ప్రభుత్వం సామాజిక శాస్త్రాలను నిర్లక్ష్యం చేసినంత తేలిగ్గా చరిత్రను నిర్లక్ష్యం చేయలేదు. చేయబోదు. ఉన్నత విద్యా కేంద్రాలు, మేధో కేంద్రాలను పాలకపక్ష సైద్ధాంతిక ప్రచారానికి వనరులుగా మల్చుకోవాలంటే వేద ప్రమాణాలను పాటించే రీతిలో నూతన మనది కాని చరిత్రను మన చరిత్రగా ప్రజలపై విద్యార్ధులపై రుద్దడానికి చరిత్రను తిరగరాయటం పాలకపక్షానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన కర్తవ్యం. క్రమానుగతంగా భారత చరిత్ర పరిణామాన్ని అధ్యయనం చేయటానికి బదులు పురాణాలే చరిత్రగా చలామణి చేయటం, ఖగోళ శాస్త్రానికి బదులు జ్యోతిష్యాన్ని విజ్ఞానశాస్త్రంగా ప్రచారం చేయటం, ఎంతో వైవిధ్యభరితమైన భారతీయ సంసృతి స్థానంలో ఏకశిలాసదృశైన సంస్కృతిని ప్రవేశపెట్టడం ప్రస్తుత ప్రభుత్వం ముందున్న మౌలిక లక్ష్యాలు. హిందూ జాతీయవాదం పేరుతో ముందుకొస్తున్న ధోరణులు దేశంలోని హిందూయేతరులను వెలివేయటం ద్వారా సామాజిక సాంస్కృతిక భాషా వైవిధ్యాన్ని సమాధిచేస్తాయి. ఇది భారతదేశం రాజకీయంగా, సాంస్కృతికంగా వైవిధ్యమైన దేశమనే భావనను నులిమేస్తుంది.
నిరంతరం చరిత్ర పరిశోధన కొత్త పుంతలు తొక్కుతూనే ఉంటుంది. అయితే ఇది ప్రామాణిక చరిత్ర పరిశోధన సూత్రాలు పాటించి వెలుగులోకి తెచ్చే కొత్త విషయాలు, కొత్త కోణాలతో చరిత్ర రచన పరిపుష్టమవుతుంది. చరిత్ర కూడా పరిపుష్టమవుతుంది. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం పాలనలో జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఒక్క మాటలో చెప్నాలంటే ఈ దేశ స్మృతిలో హిందూ ఆధిపత్యం ఆది, అంతం, అనంతం అన్న భావనను కల్పించే ప్రయత్నమే. నిజానికి చరిత్ర రచనలో చిన్నపాటి జాతీయ దురంహకారం, వక్రీకరణ కూడవని అమెరికా చరిత్రకారుడు డేవిడ్ కాఫ్ అంటారు. ప్రస్తుతం పురాణాలు, ఇతిహాసాలు, జ్యోతిష్య శాస్త్రాలే ప్రామాణికమైన భారతీయ చరిత్ర అనే ప్రభుత్వ ఆదేశాలను అమలు జరపటమే చరిత్రపరిశోధకులు, చరిత్ర విభాగాల కర్తవ్యంగా మారింది. జాతీయోద్యమంలో హిందూత్వ వాదుల పాత్ర లేకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికి హిందూజాతీయవాద చిహ్నాలను, వ్యక్తులను సొంతం చేసుకోవటం ద్వారా పెద్దఎత్తున ప్రయత్నం జరుగుతోంది.
అంతిమంగా మేధో స్వాతంత్య్రం కుదింపు ప్రజాస్వామ్యానికి ప్రాణసంకటం. విభేదించే హక్కు, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే హక్కు, కేవలం ప్రజాస్వామ్యానికే కాదు. జ్ఞానోత్పత్తికి కూడా ప్రాణవాయువులు. ఇవి లేని సమాజం ఎక్కువకాలం నాగరిక సమాజంగా మనుగడ సాగించటం సాధ్యం కాదు. గత దశాబ్దకాలంగా దేశంలో అమలవుతున్న ఆంక్షలు, నియంత్రణలు, కుదించుకుపోతున్న స్వేఛ్చ, మేధో కేంద్రాల్లో జ్ఞానోత్పత్తి ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను మనముందుంచుతుంది.
ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటింగ్ హక్కులు, క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు మాత్రమే కాదు. ఆచరణాత్మక ప్రజాస్వామ్యంలో సమాచార ప్రవాహం, నిర్నిరోధమైన పరిశోధన, అర్థవంతమైన చర్చ కీలకమని చెప్పుకోవాలి. వీటి ద్వారానే భావితరాలకు అందించాల్సిన జ్ఞానాన్ని సమకూర్చగలం. కానీ ప్రస్తుతం ఉన్నత విద్య, పరిశోధనా కేంద్రాల్లో ఇటువంటి హక్కులు, అవకాశాలు, స్వేఛ్చలు ఎన్నో కునారిల్లుతున్నాయి.
మేధో వ్యతిరేకతకు స్పందన
ఈ వ్యాసంలో ప్రస్తావించిన రీతిలో భారతీయ మేధో వర్గాన్ని ప్రభుత్వం ప్రత్యక్ష పరోక్ష రూపాల్లో కట్టడి చేయటానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా దేశీయ మేధో వర్గం పూర్తిగా లొంగిపోలేదు. గతంలో బహిరంగంగా అంగీకరించలేని కొన్ని విషయాలను, ప్రధానంగా హిందూత్వ ప్రాజెక్టులోని కొన్ని అంశాలను సమర్థించేందుకు కొంతమంది మేధావులు, పరిశోధకులు అవకాశవాదాన్ని ప్రదర్శిస్తున్నా విశాల మేధోలోకం ఆధిపత్య రాజకీయాల మత్తులో జోగటానికి సిద్ధం కాలేదు. ఆధిపత్య రాజకీయాల ప్రయోజనాలు చేకూర్చే పరిశోధనలు చేపట్టడానికి సిద్ధంగా లేదు.
ఈ ప్రతిఘటన కేవలం వీధుల్లో కనిపించేది మాత్రమే కాదు. అంగీకారం కాని పరిణామాలు జరుగుతున్నప్పుడు వ్యక్తిగతంగా కానీ, ఉమ్మడిగా కానీ వెలువడే ప్రకటనల రూపంలో కూడా ఈ ప్రతిఘటన కనిపిస్తోంది. వ్యక్తమవుతోంది. ఇక్కడ విలక్షణత ఏమిటంటే ఈ పౌరమేధావుల స్పందన కేవలం వారి వారి వ్యక్తిగత సమస్యలకు పరిమితం కావటం లేదు. విశాల జనావళిని ప్రభావితం చేసే ప్రభుత్వ విధానాలన్నిటి గురించి ఈ మేధావులు స్పందిస్తున్నారు. రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా ఉన్న విధి విధానాలపై స్పందిస్తున్నారు. భావ ప్రకటనా స్వేఛ్చ సంరక్షణ కోసం ఢిల్లీ పరిసరాల్లోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న పరిశోధకులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాల ప్రాధాన్యతను దేశం గుర్తించకపోయినా దేశంలో భావ ప్రకటనా స్వేఛ్చ, మేధో స్వేఛ్చ కోసం సాగుతున్న పోరాటంలో వారి భాగస్వామ్యం చరిత్ర నమోదు చేస్తుంది.
జోయా హసన్
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.