
అంబేడ్కర్ జయంతి నాడు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేవలం తెలంగాణలోనే కాకుండా దేశంలోనే ఓ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 30 సంవత్సరాలుగా కొనసాగుతున్న పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ ఉద్యమకారులకు లభించింది. అంతేకాకుండా దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం అడుగులు వేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
బడుగు- బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్‌గా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నారు. బిల్లు ఏర్పాటులో భాగంగా క్షేత్ర స్థాయిలో పరిశోధన- అధ్మయనం చేసేందుకు ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి ఛైర్మన్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి షమీమ్ అక్తర్‌ను నియమించారు.
2024 నవంబరు 11న కమిషన్ ఛైర్మన్‌గా షమీమ్ అక్తర్ బాధ్యతలు స్వీకరించారు. 82 రోజులలో తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను ఏర్పాటు చేసి సమర్పించారు. అయితే, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఆఫీసులకు ఆఫ్‌లైన్, ఆన్లైన్లో వచ్చిన వినతులను పరిశీలించారు. తర్వాత ఎస్సీ ఉపకులాలను 3 కేటగిరీలుగా వర్గీకరించాలని ప్రతిపాదించారు.
రాష్ట్రవ్యాప్తంగా షమీమ్ అక్తర్ కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి 199 పేజీల నివేదికను రూపొందించింది. నివేదిక ఏర్పాటులో భాగంగా ఎస్సీ ఉప కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసింది. మొత్తం 8,600కి పైగా ప్రతిపాదనలు అందుకున్న కమిషన్ జనాభా, అక్షరాస్యత, ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు, ఆర్థిక వనరులు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై విశ్లేషణ చేసింది. తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
నివేదిక అనుసారం 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా ప్రభుత్వం విభజించింది. గ్రూప్–ఏలో ఎక్కువగా వెనుకబడిన 15, గ్రూప్–బీలో 18, గ్రూప్–సీలో 26 కులాలను చేర్చింది. ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వ విద్య, ఉద్యోగ అవకాశాలలో 15 శాతంగా అమలు చేయనుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు తెచ్చి, దేశంలో నూతన ఒరవడిని సృష్టించింది.
ఎస్సీ వర్గీకరణ చట్టం- 2025 అమలులోకి వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు “ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బడుగులకు రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటాం” అన్నారు. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. అయితే 2026 జనగణన పూర్తి కాగానే ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు.
“గ్రూప్- ఏలో ఉన్న వారికి ఒక శాతం, గ్రూప్- బీలో ఉన్న వారికి 9 శాతం, గ్రూప్-సీలో ఉన్న వారికి 5 శాతంతో అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం. దీనికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దేశం మొత్తంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దీనికి సంబంధించిన జీవో 33ను విడుదల చేశాము. యాక్ట్ 15తో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశాం. జీవో 9ను కూడా విడుదల చేశాం. దీని వల్ల ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లదు” అని ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.