
– తీవ్రంగా స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి
– కేంద్ర పభుత్వం పక్షపాత వైఖరిని అవలంభించింది: రేవంత్
– ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై తెలంగాణ మేధావులు అసంతృప్తి
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించే పౌర పురస్కారాల ప్రధానంలో తెలంగాణా పట్ల కేంద్ర ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంభించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షత చూపుతూనే ఉందని విమర్శించారు.
తెలంగాణా ప్రభుత్వం గద్దర్‌ను పద్మవిభూషణ్‌కు, చుక్కా రామయ్యను పద్మభూషణ్‌కు, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు, అందెశ్రీలను పద్మశ్రీ అవార్డులకు సిఫార్స్ చేసింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి సిఫార్సులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ మేధావుల అసంతృప్తి..
తమ పార్టీ పాలిత రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పిస్తూ తెలంగాణకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా ఉండటాన్ని చూస్తుంటే, నరేంద్ర మోడీ నేత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వవలసిన కనీస గౌరవాన్ని ఇవ్వటం లేదని తెలంగాణ మేధావులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఇద్దరు కేబినెట్ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ రాష్ట్రానికి ఇవ్వవలసిన పద్మ అవార్డుల ప్రధానంలో వివక్షను పాటించటం గర్హనీయమైన విషయమనే భావన తెలంగాణ వ్యాప్తంగా ఉంది.
బీజేపీ వైఖరి మార్చుకోవాలని సూచన..
తెలంగాణాలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వ సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోకపోవటం ఆలోచించాల్సిన విషయం. ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలపట్ల బీజేపీ అవలంభిస్తున్న వైఖరి సరైనది కాదని, దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని సమకూర్చుతున్న రాష్ట్రాలలో తెలంగాణా ఒకటి. రానున్న బడ్జెట్లో విభజన హామీల అమలుకు కావలసిన నిధులను కేటాయించాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణా ఆత్మగౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించేలా చేయటంలో తెలంగాణాకు చెందిన ఇద్దరు క్యాబినెట్ మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని, ఇప్పటికైనా వారు తమవంతు కృషి చేయాలని తెలంగాణ సమాజం భావిస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.