
– సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర మహాసభలు
– కార్యక్రమానికి హాజరైన పార్టీ కీలక నేతలు
– శతవసంతాల వేళ భవిష్యత్తు కార్యాచరణ
సంగారెడ్డి: భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ శతసంతాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం పార్టీ మహాసభలను నిర్వహిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో సీపీఎం పార్టీ మహాసభలు తెలంగాణలో జరగటం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. అయినప్పటికీ ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలేవి పెద్దగా నెరవేర్చలేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్కు స్వస్తి చెప్పి, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్న ప్రజలకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అయింది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి మేమే ప్రత్యామ్నాయం అంటూ కల్లబొల్లి కబుర్లతో నమ్మబలికే ప్రయత్నం చేస్తుంది. మతోన్మాద శక్తులు బలపడకుండా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా సీపీఎం పార్టీ ఎదిగేందుకు ఈ మహాసభలతో నేతలు నడుంబిగించారు. ఇందులో భాగంగా తమ పార్టీ కర్తవ్యాన్ని నిర్దేశించుకునేందుకు అనేక తీర్మానాలు చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గోకుల్ గార్డెన్స్‌లో సీపీఎం రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. సభా ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాని పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండాని మాజీ ఎంపీ మీడియం బాబురావు ఆవిష్కరించడంతో కార్యక్రమం ప్రారంభమయింది. ముందుగా సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి, కాసాని ఐలయ్యకు సంతాపం ప్రకటించారు. సంతాపం తర్వాత పలువురు కీలక నేతలు మాట్లాడారు. సీపీఎం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తమ ముందు ఉన్న కర్తవ్యాన్ని, దేశ ప్రస్తుత పరిస్థితులను గుర్తుచేశారు.
ప్రారంభ ఉపన్యాసం
సీపీఎం పార్టీ సమన్వయకర్త ప్రకాశ్ కారత్ కార్యక్రమంలో పాల్గని, ప్రారంభ ఉపన్యాసం చేశారు. ‘‘ఈ మహాసభల్లో కామ్రెడ్ సీతారాం ఏచూరి లేకపోవడం చాలా బాధాకరం’’ అని విచారం వ్యక్తం చేశారు. ఈ సారి సీపీఎం జాతీయ మహాసభలు మధురైలో జరుగనున్నాయని స్పష్టం చేశారు. సీతారామ్ ఏచూరి లేని లోటును తీర్చాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందన్న విషయాన్ని ప్రకాశ్ కారత్ గుర్తుచేశారు. బూర్జువా పార్టీల్లాగా తాము ఉండకూడదని, జనంతో మమేకమై పనిచేయాలని పార్టీ శ్రేణులను కోరారు.
అంతర్జాతీయ అంశాల ప్రస్థావన
ప్రకాశ్ కారత్ తన ప్రసంగంలో అంతర్జాతీయ అంశాలను ప్రస్థావించారు. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్- పాలస్తీనా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయని, భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు మద్దతిస్తుంది కానీ పాలస్తీనాని పట్టించుకోవడం లేదని అన్నారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని, అమెరికా అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయించాలనే కుయుక్తులను పన్నుతోందని అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాల్లో లెఫ్ట్ పార్టీలకు ఆదరణ పెరుగుతుందనే విషయాన్ని ప్రతినిధుల దృష్టికి తెచ్చారు. శ్రీలంకలోను అధ్యక్ష పదవిని ప్రజలు లెఫ్ట్ పార్టీకి అందించారన్నారు. అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని చైనా దేశం కట్టడి చేస్తుందని, చైనా, రష్యాతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు మితవాద శక్తులని కట్టడి చేయాలన్నారు. ప్రధాని మోడీ అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహం అవుతున్నారని, విదేశాంగ నిర్ణయాలు కూడా అమెరికాకు అనుకూలంగా తీసుకుంటున్నారని కారత్ ఆగ్రహం వ్యక్తంచేశారు ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నదని, అయితే ఎక్కువ సీట్లు వస్తే మాత్రం రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూసిందని, దేశాన్ని మొత్తం ఒకే మతానికి పరిమితం చేయాలని ఆ పార్టీ నేతలు చూశారని కారత్ తెలిపారు.
హిందుత్వ సిద్ధాంతంతో ప్రమాదంలో రాజ్యాంగం
కారత్ ఇంకా మాట్లాడుతూ.. ప్రస్తుత దేశ పరిస్థితుల గురించి స్రస్థావించారు. బీజేపీ నిర్ణయాలతో దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడిందని వాపోయారు. హిందుత్వ సిద్ధాంతం, కార్పొరేట్ శక్తులు అనే రెండు పిల్లర్లపై మోడీ ప్రభుత్వం ఆధారపడి ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం, మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువస్తున్నారని గుర్తుచేశారు. దేశ సంపదలో 20 శాతాన్ని అదాని, అంబానీ, టాటా, బిర్లాలు కబ్జా చేశారని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను నమ్మని వాళ్లపై విష ప్రచారం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ వెనుక ఆర్ఎస్ఎస్ లాంటి ఫాసిస్ట్ సంస్థ ఉందని గుర్తుచేశారు. హిందుత్వ అజెండా, నూతన ఆర్థిక విధానాలు, సామాజిక అణిచివేత, కుల వివక్షపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యక్రమానికిహాజరైన పార్టీ శ్రేణుల దృష్టికి తెచ్చారు. సీపీఎంకు సొంత బలం సమకూర్చేందుకు జాతీయ మహాసభల్లో నిర్ణయాలు తీసుకోవాలని కారత్ సూచించారు. అంతేకాకుండా లౌకికవాద శక్తులతో కలిసి బీజేపీ విదానాలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న మోడీ ప్రభుత్వం: బీవీ రాఘవులు
ప్రకాశ్ కారత్ ప్రసంగం అనంతరం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని రాఘవులు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్.. బీజేపీ పట్ల తన వైఖరి ఏంటో ఇప్పటివరకు స్పష్టం చేయలేదని, ఈ విషయంలో ఆ పార్టీ దోబూచులాడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ తన స్పష్టమైన వైఖరిని ప్రదర్శించే విధంగా ప్రజా ఉద్యమాలతో ఆ పార్టీపై ఒత్తిడి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలేవి పెద్దగా అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. వీటన్నిటిపై పోరాడేందుకు ఈ మహాసభల ద్వారా పలు తీర్మానలు చేయాలని పిలుపునిచ్చారు.
సీపీఎం భవిష్యత్తు కార్యాచరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో చాలా అవకతవకలు జరిగాయి. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఏడాది కాలంలోనే తొలిగిపోయింది. ఇక మేమే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తే తెలంగాణ ప్రజలు మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదురుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సీపీఎం పార్టీ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఈ మహాసభల్లో తన భవిష్యత్తు కార్యచరణకు వ్యూహరచన చేస్తోంది.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలిచే పార్టీలుగా ఏమాత్రం కనిపించడం లేదు. పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయి. రాష్ట్రంలో సామాన్యుల, మధ్యతరగతి ప్రజల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి, రాష్ట్రంలోకి పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు రాబోతున్నాయి, ఉపాధి లభించబోతుందంటూ పేదల భూములన్ని పారిశ్రామిక వేత్తలకు అధికారంలో ఉన్న నేతలు కట్టబెడుతున్నారు. కార్మిక వర్గం పరిస్థితి కూడా అంతా ఆశాజనకంగా లేదు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం ఇది. దీంతో పార్టీ నేతలు ప్రజలకు చేరువ అయ్యేందుకు కసరత్తులు చేస్తున్నారు.
– పీవీ రాజ్యం, సంగారెడ్డి టౌన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.