
భారతదేశంలో మైనారిటీ ప్రాంతాల కారణంగానే భారత రాజ్యాంగంలో ఆర్టికిల్ 3 అవసరం అయ్యింది. భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సమైక్యతలకు పునాది ఆర్టికల్ 3. అన్ని మైనారిటీ ప్రాంతాలను బతికించింది కూడా రాజ్యాంగమే. ఇక్కడ మైనారిటీ అంటే కేవలం మతపరమైన మైనారిటీలు మాత్రమే కాదు. రాజకీయంగా భిన్నాభిప్రాయం కలిగిన మైనారిటీలు కూడా ఉన్నారు. ప్రాంతీయ మైనారిటీలకు ఆర్టికిల్ 3 ప్రాణవాయువు గా ఉంది. దీనికి తెలంగాణ అవతరణ ఒక మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.
ఒక రాష్ట్రం నుంచి కొంత భూభాగాన్ని వేరు చేయాలనుకున్నా, రెండు లేదా ఎక్కువ రాష్ట్రాలను కలపాలనుకున్నా ఆర్టికిల్ 3 కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలిపిస్తుంది. అంతేకాకుండా ఒక రాష్ట్రం నుంచి కొంత భాగాన్ని వేరు చేసి, మరో భాగానికి చేర్చి, కొత్తగా ఒక రాష్ట్రాన్ని కూడా ఆర్టికల్ 3 ద్వారా సృష్టించవచ్చు.
ఏదైనా రాష్ట్రం భూభాగాన్ని పెంచవచ్చు, ఏదైనా రాష్ట్ర భూభాగాన్ని తగ్గించవచ్చు, లేదా ఏదైనా రాష్ట్రం సరిహద్దులను మార్చవచ్చు; ఏదైనా రాష్ట్రం పేరు మార్చవచ్చు అని ఆర్టికల్ 3లో వివరంగా ఉంది.
ఇప్పుడున్న రాష్ట్రాలను తగ్గించడమే కాకుండా, కొంత భూభాగాన్ని బహుమానంగా మరో రాజ్యానికి కూడా ఇవ్వవచ్చు, లేదా కొత్తగా చేర్చుకోవచ్చు. సరిహద్దుల పేర్లు కూడా మార్చుకోవచ్చు అని భారత రాజ్యాంగం ఆర్టికిల్ 3లో నిర్ణయించింది.
సుప్రీంకోర్టులో బాబూలాల్ పరాటే వర్సెస్ బాంబే స్టేట్ కేసు కీలకమైనది. ఈ కేసు ఆర్టికల్ 3 మీద ప్రభావాన్ని చూపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను తెలంగాణ పూర్తిగా ఉపయోగించే అవకాశం వచ్చింది. విభజనకు రాష్ట్ర అసెంబ్లీ అనుమతి అవసరం లేదు. కేవలం తన అభిప్రాయాలను పేర్కొంటే సరిపోతుంది. దీని కోసం గడువు సమయాన్ని రాష్ట్రపతి నిర్ణయించాలి. ఈ క్రమంలో రాష్ట్రపతి గడువును పొడిగించవచ్చు. ఆ విధంగా పొడిగించిన గడువుకూడా ముగిసిపోతే రాష్ట్ర అసెంబ్లీ అంగీకరించినా, అంగీకరించక పోయినా పార్లమెంట్ ప్రతిపాదించిన రాష్ట్ర విభజన చట్టాన్ని ఆమోదించవచ్చు. ఆ దశలో ఎన్ని సమస్యలు సృష్టించబడ్డాయో అన్నది ఆధునిక తెలంగాణ చరిత్ర లో అంతర్భాగం.
రాష్ట్ర హోదాను తగ్గించడం న్యాయమా?
ఒక రాష్ట్ర హోదాను తగ్గించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం కూడా సాధ్యమే. కాని ఇదివరకెప్పుడూ ఈ ఆర్టికల్ ను ఈ ప్రయోజనం కోసం ఎన్నడూ ఉపయోగించలేదు. ఇప్పటివరకు ఆర్టికల్ 3 ప్రకారం జరిగిన నిర్ణయాలు ప్రజా ఉద్యమ ఫలితాలు. ప్రజల ఆకాంక్షకు స్పందనలు గా మాత్రమే జరిగాయి. కానీ తొలిసారి కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా, సైద్ధాంతిక అవగానే పునాదిగా ఓ రాష్ట్రాన్ని ముక్కలు చేయటం జరిగింది. ఈ విధంగా గతంలో ఎన్నడూ జరగలేదు. జమ్మూ కశ్మీర్ ను కలిపి ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు.
అధికారం ఉంది కనుక ఎన్డీఏ, పార్లమెంటు తలచుకుంటే చాలా నిరంకుశంగా అవసరం లేకపోయినా జమ్మూ కశ్మీర్ ను, జమ్మూ కశ్మీర్ లో భాగమైన లఢాక్ ను విడదీసి మరో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అందులో చాలా లోపాలు, రాజ్యాంగ వ్యతిరేక లక్షణాలు ఉన్నాయని చాలా మంది విమర్శిస్తున్నారు.
చాలా సంవత్సరాల తరువాత జమ్ము కశ్మీర్ లఢాక్ యూటీలలో ఈమధ్యే ఎన్నికలను జరిగాయి. అక్కడ కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. విశేషమేమంటే జమ్ము కాశ్మీర్ పునర్విభజన సరికాదనే అభిప్రాయం సుప్రీంకోర్టు వ్యక్తీకరించింది. ఆదేశంలా ఇవ్వకపోయినా, కేంద్ర ప్రభుత్వం త్వరలో రాష్ట్ర హోదాను ఇస్తామని సుప్రీంకోర్టు ముందు హామీ ఇచ్చింది. ఎన్నికలకు చాలా రోజుల కిందటే యూటీని రాష్ట్రహోదాగా తప్పకుండా మార్చుతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ముందు పదేపదే చెప్పింది. హోదా పెంచిన తరువాతనే ఎన్నికలు జరుగుతాయని కూడా అన్నారు. కానీ జరగలేదని అందరికీ తెలిసిందే.
అంటే.. జనం వ్యతిరేకించినా ప్రభుత్వానికి ఇష్టమైతే ఒక రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి సులువుగా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేయొచ్చా అన్న సందేహం వ్యక్తం అవుతుంది.
ఇదిలా ఉంటే దీనికి పూర్తి విరుద్ధంగా మరోవైపు 60 సంవత్సరాలు పోరాడిన తరువాత ఏడిపించి, నష్టం చేసి, అన్యాయాలు చేసి, దారుణాలు చేసి, వందలమంది ఆత్మహత్య చేసుకున్న దశ తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా నిలబడింది.
ఆంధ్రప్రదేశ్ – పార్లమెంట్ మధ్య తెలంగాణ ప్రాణ సంకటం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా చేయడం పార్లమెంట్ ద్వారా సాధ్యమయింది. కానీ ఒక రాష్ట్రం తనంత తాను రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలుగా మార్చుకునే అవకాశం లేదు. కానీ ఒక రాష్ట్రం తన రాష్ట్రంలో జిల్లాలు పెంచుకోవచ్చు, పంచుకోవచ్చు, తగ్గించవచ్చు కూడా. తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి మనం చూస్తూనే ఉన్నాము. అంటే మనదేశం సమగ్రతను రక్షించుకుంటూ మొత్తం దేశంలో కొన్ని రాష్ట్రాలను మార్చుకోవడం సాధ్యం. కానీ ఆ అధికారం పార్లమెంట్ చేతిలోనే ఉంటుంది. ఒక రాష్ట్రంగా ఉన్నపుడు మరో రెండు రాష్ట్రాలుగా వేరు చేయడానికి ఆ రాష్ట్రం కచ్చితంగా ఒప్పుకోవలసిన అవసరం లేదు. కానీ మొత్తం పార్లమెంట్ ఒప్పుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఒక రాష్ట్రం ఆమోదించకపోయిన ఒక నిర్ణీత గడువులోగా అసలు ఏమీ చెప్పకుండా కాలయాపన చేస్తే రాష్ట్ర అసెంబ్లీ అంగీకారంతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విస్తారమైన అధికారం పార్లమెంట్‌కు ఉంది.
కేవలం అధికారం ఉందనుకన్నా ఆ అధికారాన్ని ఆచరణలో కి తేవడానికి ఎన్నో రాష్ట్రాలు ఎన్నో ఉద్యమాలు, త్యాగాలు చేయవలసి వచ్చింది. ఒక సంవత్సరం, దశాబ్ది అనీ కాదు దాదాపు 60 సంవత్సరాలు పోరాడిన తరువాత తెలంగాణ ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 23 జిల్లాల్లో 10 జిల్లాల తెలంగాణ వారు ఒక మైనారిటీ అవుతుంది. 13 జిల్లాల సీమాంధ్ర అనీ లేదా ఆంధ్ర రాయలసీమ పెద్ద మెజారిటీ అవుతుంది. మొత్తం రాష్ట్రం తెలుగువారే అయినా అందులో ఒక మైనారిటీ ప్రజలను రక్షించుకోవడం, వారి జీవనశైలి, సంస్కృతి, యాస, పదాలు, భాష దాన్ని బతికించుకోవడం అవసరమని అర్థమైయ్యేదాకా పోరాటం జరిగింది. ఇక్కడే కాదు. ఎక్కడైనా మెజారిటీ, మైనారిటీల మధ్య సమన్యాయం తోపాటు కనీస న్యాయం కోసం పోరాటం సాగుతూనే ఉంటుంది. కులాలలో కూడా మెజారిటీ ఉంటుంది, తక్కువ వాళ్లు ఉండడం సహజం. అదే విధంగా మతాలతో, ఆయా ప్రాంతాలతో, భాషలలో పోల్చితే ఎక్కువ తక్కువలు ఉంటాయి. ఎన్ని అసమానతలు ఉన్నా అందరికీ న్యాయం చేయడమే రాజ్యాంగ లక్ష్యం.
సమానత ఏవిధంగా అమలువుతుంది? దానికి జవాబు మెజారిటీ శక్తితో పోరాడి, మైనారిటీ వారు బతికి, నిలబడి మరో వర్గమై, జిల్లాయై, రాష్ట్రమై తమ ఉనికిని, అస్తిత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఆర్టికిల్ 3కూడా సహజ న్యాయ సూత్రాలకు పెద్ద పీట వేసిన ఆర్టికిల్ 14కు లోబడి ఉండాలి. రాజ్యాంగపు ఆదేశం అది. ఈ లోతుపాతులు అర్థం చేసుకోవడానికి భారత రాజ్యాంగాన్ని అవగాహన చేసుకోవలసి ఉంటుంది.
ఒక బలమైన వర్గం చేతిలో బలహీనమైన వర్గం దెబ్బ తింటున్నపుడు, దాన్ని ప్రజాస్వామ్యం అనడం సాధ్యం కాదు. అది భారత రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది. ముందు రెండు ప్రాంతాల మధ్య సమానత లేకపోవడంతో యుద్ధం మొదలవుతుంది. తెలివైన వాళ్లు వాదన చేస్తూ ఉంటారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో, సుప్రీంకోర్టులో బలమైన తెలివైన వాదనలు ఉంటాయి. అదే మైనారిటీవారు ఓడిపోకుండా నిలబడి మెజారిటీవారితో వాదించి గెలవడం అవసరం. ఓ ఇంట్లో తెలివైన అన్నగారు తమ్ముడినే అందంగా ప్రేమగా తెలివిగా దెబ్బకొడుతూ ఉంటే, కనపడకుండా దోచుకుంటూ ఉంటే పోరాటమనేది సమానతకోసమనీ, రాజ్యాంగ పోరాటమనీ అర్థం చేసుకోవాలి. మన భారత రాజ్యాంగ పీఠికలో వివరించింది ఇదే.
మన పీఠిక మన తెలంగాణకు పీఠం
న్యాయంతో కూడిన సమానత కావాలి. విడివిడిగా పొడి పొడి పదాలుగా మాట్లాడే న్యాయం గురించి అడగడం లేదు. న్యాయమైన సమానత కావాలి. హోదాల్లోనూ, అవకాశాలలోను సమానత్వాన్ని సాధించేందుకు కృషి చేయాల్సిందే కదా. ఊరికే ఆర్టికిల్ 14 కింద సమానత అంటూ చదివితే తెలియదు. పదిసార్లు జపం చేస్తే సమానత రాదు. పోరాడితేనే వస్తుంది.
మన రాజ్యాంగ పీఠికలో ఉన్న రెండవ అంశం ఆలోచనా భావప్రకటనా, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛను సాధించే ప్రయత్నం చేయడమే మన పని. ఈ స్వేచ్ఛ కూడా సమానమైన, న్యాయమైనదై ఉండాలి అటువంటిదే కావాలి. ఏ విధంగా వస్తుందీ స్వేచ్ఛ? భయపెట్టి అరెస్టు చేసి, కేసు ఏమిటో కూడా తెలియకుండా జైలుకి పంపుతాం అంటే స్వేచ్ఛ ఎక్కుడుంటుంది? లేదు. ఉండదు. మొత్తం రాజ్యాంగం ఫ్రీడం ఆఫ్ స్పీచ్ పైన అధారపడి ఉంది. అంటే మాట్లాడుకునే హక్కు, చెప్పదలచుకున్న విషయాలు, డిమాండ్ చేయడం, సమాచారం ఇవ్వాలనడం, విమర్శించడం, వ్యతిరేకించడం, ఈ చట్టం సరిగాలేదనే హక్కు, చివరకు సుప్రీంకోర్టు నిర్ణయంలో కూడ కొన్ని రాజ్యాంగ వ్యతిరేక అంశాలు ఉంటే దాని గురించి వివరించే శక్తి కూడా ఉంటుంది. అయితే తిట్టడం, బూతులు చెప్పడం, నీచంగా, అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడుకోకూడదు వాక్ స్వాతంత్ర్యం కాదు. అటువంటి దురాగతాలకు రాజ్యాంగ పరమైన ఆమోదం లేదు. ఉండదు.
ఇందులో మరో భాగం మతవిశ్వాస, ఆరాధనా హక్కులను వివరిస్తున్నాయి. అక్కడే మైనారిటీ అనే మాట వస్తున్నది. భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన మైనారిటీల సమస్య తెలంగాణ పోరాటంలో కీలకమైంది. ఆ మైనారిటీలలో ఎస్సీ ఎస్టీ, బీసీ వర్గాలు వస్తాయి. భాషాపరమైన మైనారిటీల వారిని కూడా రక్షించుకోవాలసిన బాధ్యత మన రాజ్యాంగంలో ఉంది.
పీఠిక ప్రజల గొంతుక
సమాన న్యాయం గురించి పీఠిక మాట్లాడుతున్నది. సామాజిక,ఆర్థిక, రాజకీయ న్యాయాల్ని అనేది చాలా ముఖ్యమైంది. న్యాయాన్ని అంటే సరిపోదు. న్యాయాల్ని అనాల్సిందే. మనం లీగల్ న్యాయం గురించి పీఠిక అనడం లేదు. లీగల్ న్యాయం డబ్బు తెలివి ఉన్నవాళ్లు తీర్పులను గెలుచుకుంటారు. సామాజిక న్యాయం కావాలి అంటూ తెలంగాణలో ప్రజలందరూ సామాజిక సమానతను గెలిచి, సాధించాలి. ఆర్థిక సమానత ఉండాలి. రాజకీయ సమానత కావాలి. ఇదీ ఆ పీఠిక అర్థం.
సమానత కోసం
సమానత అవసరం కోసం జరిగే పోరాటాలకు ఆర్టికిల్ 3 ఎంతో ఉపయోగకరమైనది. అసమానతపై రాజ్యాంగ పరమైన పీఠిక బలంతో సాగిన పోరాటమే తెలంగాణ. కానీ జమ్ము కశ్మీర్ లఢాక్ సమస్యలు దీనికి భిన్నం. పాలకవర్గం ఓ వైపు, జనం మరోవైపు పోరాడుతున్న సందర్భం ఇది.
ముగింపు వాక్యం
రాజకీయ అణచివేత, దారుణమైన పాలనకు ముగింపు ముఖ్యం. మనది రాష్ట్రాల సమాఖ్యతో కూడిన దేశం. ఇక్కడ కొన్ని ప్రాదేశిక వర్గాలలో కొందరు అసమానతలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వారి మైనారిటీ జనసమూహాల రక్షణ, వికాసం కోసం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని ఉపయోగించే అవకాశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. కొన్ని కీలకమైన పరిమితులు కూడా ఉంటాయి, అది సహజం. ఆ పరిమితులన్నీ దాటుకుని తెలంగాణ ఏర్పాటు సాధించడం ప్రపంచంలో ఒక గొప్ప ఉదాహరణగా చరిత్రలో మిగిలిపోతుంది. ఇది రాష్ట్రాలను రూపొందించడానికి లేదా విభజన చేయడానికి కేంద్రాన్ని స్వయంగా లేదా ఏకపక్షంగా అధికారాలు వాడుకుంటూ ఉంటే, ఆర్టికల్ 3 చాలా క్లిష్టమైన, బహుళస్థాయిలో మన దేశ సమాఖ్యలో కేంద్ర, రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతాయి.
పార్లమెంట్ బిల్లు తయారు చేయడం, అసెంబ్లీకి పంపడం, అది ఒక పట్టాన ముగిసే అవకాశమే లేదు. ఎందుకంటే కొందరు మెజారిటీ శక్తులుగా ఉంటే, మరికొంత మంది వెనుకబడిన బాధితులుగా ఉంటారు. అటువంటి సందర్భంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏమాత్రమూ ఒప్పుకోకుండా ఏదేదో ఆటంకాలు సృష్టిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించకుండా ఆపడానికి ప్రయత్నించింది. అప్పుడే తెలంగాణకు ఆర్టికల్ 3 నియమాలు, ప్రక్రియ విధానాలు అనేక సంక్లిష్ట స్వార్థశక్తుల ఎజెండాల మధ్య ఘర్షణలో నలిగిపోతూ తెలంగాణ నిర్మాణమైంది. అదొక అద్భుత చరిత్ర.
ప్రజాస్వామ్య తెలంగాణ కల నిజమయ్యేనా?
అయితే, ఇప్పటికీ ఆంధ్ర- కేంద్ర అధికారుల పెద్దల ఫిరాయింపుల ఆధారంగా మాజీ తెలుగుదేశం పెద్దలు, రాజకీయ అధికారాలను సంపాదించి తెలంగాణ వ్యతిరేకులుగా అన్యాయాలు చేస్తున్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. నిధులు, నీళ్లు, నియామకాలు అని నినాదంతో పోరాడిన తెలంగాణ ఇప్పటికీ ఈ సమస్యలతో సతమతమవుతుంది . రాజకీయ తెలంగాణ వచ్చింది. కానీ ప్రజాస్వామ్య తెలంగాణ రాలేదు. న్యాయంగా ఇవ్వవల్సినన్నీ, జలకళలో ఉండవలసిన నీళ్ల తెలంగాణ తెలంగాణకు ఇంకా రాలేదు. నియామకాలు అనుకున్నట్టు రావడం లేదు. ఎప్పుడు ఏ విధంగా వస్తాయో, అసలు వస్తాయో లేదో తెలియదు. అలా అని కనీస ప్రయత్నం కూడా చేయకపోతే ఇక అవి సాధించుకునే అవకాశమే లేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.