
భారత రాజ్యాంగం విస్తృతమైనది. ప్రపంచంలోనే అతి పెద్దది. అంతటి విస్తృతమైన, పెద్ద రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే తేలికైన మార్గం, సూటైన సాధనం పీఠిక. రాజ్యాంగపు సారాన్ని ఒడిసిపట్టిన పీఠిక గురించి గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ వ్యాసం.
నేడు జనవరి 26. భారతదేశాన్ని సర్వసత్తాక, గణతంత్ర లౌకిక ప్రజాస్వామిక దేశంగా ప్రకటించుకుంటూ రాజ్యాంగాన్ని ఆమోదించి అమల్లోకి తెచ్చిన రోజు. అందుకే జనవరి 26ను ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం జనవరి 26ను కేంద్ర ప్రభుత్వం స్వర్ణిమ భారతం : వికాసం, వారసత్వ దినంగా కూడా ప్రకటించింది.
జనవరి 26న భారత రాజ్యాంగ స్పూర్తిని, సారాన్ని, సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే పీఠిక గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
రాజ్యాంగంలోని పీఠిక భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర దేశంగా నిర్వచిస్తోంది. భారతదేశపు ప్రజాస్వామిక స్వభావానికి ప్రజాతంత్ర వ్యవస్థల నిర్మాణానికి పునాదులు వేసింది పీఠిక.
స్వేఛ్చ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రజలందరూ అవలంబించేలా భావిభారత నిర్మాణం జరగాలని కాంక్షించింది పీఠిక.
భారతీయులమైన మేము…
ప్రపంచంలో ఏ ఆధునిక రాజ్యాంగంలో లేని లక్షణం, విలక్షణ భారత రాజ్యాంగానికి ఉన్నది. రాజ్యాంగ సభలో రాజ్యానికి కీలకమైన అంగాలకు అధికారాలు ఎక్కడినుండి దఖలు పడ్డాయో చెప్పాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ఈ రాజ్యాంగాన్ని భారతీయులమైన మేమే మా కోసం రాసుకుని మాకే అంకితం చేసుకుంటున్నామన్న స్పూర్తి కొట్టొచ్చినట్లు కనిపించేలా తొలి వాక్యం ‘భారతీయులమైన మేము’ అన్న పదాలతో మొదలవుతుంది.
ఇక్కడ బ్రిటిష్ వారు మనకు అధికారాన్ని బదిలీ చేశారనో, లేదా దేవుని చల్లని చూపుల వల్ల దేశానికి ఈ అధికారాలు దక్కాయనో లేక మరో కారణంతో దేశానికి అధికారాలు వచ్చాయనో ఊహించుకోవడానికి, అన్వయించుకోవడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా నేరుగా భారతీయులమైన మనమే మనకు రాజ్యాంగంలో ప్రస్తావించుకున్న హక్కులు, అధికారాలు, బాధ్యతలు మాకు మేముగా సంక్రమింపచేసుఉన్నట్లు రాసుకున్నాము. అదే రాజ్యాంగాన్ని గత 75 ఏళ్లుగా అమలు చేసుకుంటున్నాము. బహుశా ప్రపంచంలో ఇంతకన్నా లౌకిక స్పూర్తి ప్రపంచంలో ఏ రాజ్యాంగానికి లేదు.
ఈ ఒక్క వాక్యం చాలు భారతదేశం నికార్సయిన లౌకిక రాజ్యం అని చెప్పుకోవడానికి. దీన్ని సహించలేని మతోన్మాద శక్తులు ఈ దేశానికి ఉన్న ప్రత్యేకతలు, విలక్షణతలూ ఫలానా మతం వల్లనో, ఫలానా ప్రవచనకారుడి వల్లనో, ఫలానా ప్రవక్త వల్లనో దక్కాయని, వాటిని కాపాడేందుకు జీవితాలు అంకితం చేయాలని ప్రతిపాదిస్తూ వందేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ‘భారతీయులమైన మేము’ అన్న నిఖార్సయిన లౌకిక స్పూర్తిని కుహనా లౌకికవాదం అంటూ తప్పుడు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యం కూడా రాజ్యాంగ మౌలిక విలువకు పునాదులు వేసిన పీఠికనూ, దానిలో ప్రయోగించిన పదాలనూ, వాటి అర్థాన్నీ, సారాన్ని మననం చేసుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెస్తున్నాయి.
‘భారతీయులమైన మేము’ అన్న ప్రకటనలో మరో ప్రత్యేకత కూడా ఉంది. రాజ్యాంగంలోని తొలి వాక్యంలోనే సామాజిక జీవితంలో సర్వమానవ సమానత్వం అంతిమ లక్ష్యం, ఆచరణాత్మక ఆదర్శంగా ఉండాలన్న భావన వ్యక్తమవుతోంది. ఇందులో ఫలానా మతానికి చెందిన మేము అని కానీ ఫలానా ప్రాంతానికి చెందిన మేము అని కానీ ఫలానా భాష మాట్లాడేవాళ్లమో లేక ఫలానా దేవుడిని మొక్కేవాళ్లమో అన్న వర్గీకరణ లేనే లేదు. ఈ తొలివాక్యంలోనే భారతీయులందరూ సమానమే అని రాజ్యాంగం తీర్మానిస్తుంది. అలాంటపుడు ఈ దేశంలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అన్న చర్చ కానీ ఒక మత విశ్వాసాన్ని పాటించే వారే దేశానికి అసలైన వారసులు మిగిలిన వాళ్లంతా ద్వితీయ శ్రేణి పౌరులు అని కానీ, ఒకరు ఊరిలోనూ మరొకరు వాడలోనూ ఉండాలని కానీ, ఒకరు ఒకే వృత్తిని పాటించాలనికానీ, ఒకరు అంటగలిగిన వారు, మరొకరు అంటరానివారు అని కానీ జరిగే చర్చలన్నీ రాజ్యాంగ విరుద్ధమైనవని స్పష్టమవుతోంది.
‘భారతీయులమైన మేము’ అన్న పదబంధం మరో విషయాన్ని కూడా మనకు బోధిస్తోంది. అది ఆర్థిక రాజకీయ సమానత్వం. రాజ్యాంగరూపకర్తలు ఎన్ని భిన్నమైన రాజకీయ శిబిరాలకు, నేపథ్యాలకూ చెందిన వారైనా ఆ రోజు భారతీయులందరికీ రాజకీయ ఆర్థిక అభ్యున్నతిలో సమాన అవకావాలు కల్పిస్తామని వాగ్దానం చేయాల్సిన రావటం ఓ చారిత్రక అవసరంగా ముందుకు వచ్చిన గొప్ప చారిత్రక సందర్భం అది. అప్పటికే స్వాతంత్య్రోద్యమంలో జ్యోతిరావు పూలేతో మొదలై అంబేద్కర్ వరకూ సాగిన నాల్గో స్రవంతి స్వతంత్ర భారతదేశంలో సామాజిక న్యాయం అనివార్యతను ముందుకు తెచ్చింది. ఓవైపు వలసపాలకుల చేతుల్లో వివక్షకు గురయ్యామని ఉద్యమించిన నాయకులు అప్పటికే భారతదేశంలో ఐదువేల ఏళ్లుగా కూరుకుపోయి పేరుకుపోయిన కులవివక్ష నిర్మాణానికి లోబడి ఆధునిక సమాజ నిర్మాణానికి పూనుకుంటామని, కొందరికి మాత్రమే ఆర్థిక రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పే సాహసం చేయలేకపోయిన గొప్ప చారిత్రక సందర్భం అది. ఈ చారిత్రక నేపథ్యంలో స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని, స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలనూ రాజ్యాంగం ప్రతిబింబించకపోతే అఖండ భారతదేశం సమైక్యంగానూ, సమగ్రతతోనూ మనుగడ సాగించలేదన్న వాస్తవం పాలకవర్గాలకు అర్థమైంది. ఈ అవసరం రీత్యా కూడా ‘భారతీయులమైన మేము’ అన్న వాక్యం ద్వారా స్వాతంత్య్రోద్యమ స్పూర్తిని, లక్ష్యాలను, భావిభారత నిర్మాణానికి మార్గాన్ని స్పష్టం చేయాల్సి వచ్చింది.
ఈ మకుటంతో మొదలైన పీఠిక సదరు భారతీయులు ఈ దేశాన్ని ఎలాంటి దేశంగా చూడాలనుకున్నారో, నిర్మించాలనుకుంటున్నారో దిశ, దశలను కూడా స్పష్టం చేసింది. అందులో భాగమే దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాతంత్ర గణతంత్రదేశంగా నిర్మించాలన్న లక్ష్యం ఈ పీఠికలో అక్షరాంకితమైంది. ఈ పదాలు రాజకీయ ఉపన్యాసాల్లో ఉపయోగించే పడికట్టు పదాలు కాదు. భావి భారత నిర్మాణానికి దారి చూపించే దివిటీలు. అందుకే ఒక్కో పదానికి ఉన్న లోతైన అర్థాన్ని, దాని సారాన్ని కూడా ప్రతి భారతీయుడూ తెలుసుకోవాలి.
సర్వసత్తాక : రాజ్యాంగ తాత్వికతలోనూ, రాజనీతి శాస్త్రంలోనూ కీలకమైన భావన సార్వభౌమత్వం. దాన్నే సర్వసత్తాక అని వాడుకలో అంటున్నాము.
సార్వభౌమత్వం అన్న భావనలో మూడు అంశాలున్నాయి. మొదటిది రాజ్యపు అత్యున్నత ఆధిపత్యానికి, అధికారానికి ఈ పదం నిదర్శనం. అంటే రాజ్యానికి మించిన మరే శక్తి ఉండదు, ఉండకూడదు అన్నది దీని అర్థం. ఎటువంటి లొంగుబాటుకు, విదేశీ శక్తుల ముందు తలొగ్గేందుకు వీలులేదు అన్నది రెండో అంశం. అంటే సర్వసత్తాక రాజ్యంలో ఎవరూ ఎవరికీ తలొగ్గి ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత రాజ్యానిదే. ఇంకా వివరంగా చెప్పాలంటే దేశంలోని పౌరులందరూ సర్వ స్వతంత్రులు. ఒకరికి లొంగి, ఒకరికింద అణిగిమణిగి ఉండే అవసరం లేని స్వతంత్రులు. సార్వభౌములు. అందుకే ఆధునిక భారతం గురించి కలలుగన్న రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడ తలెత్తుకుని సగటు భారతీయుడు సగర్వంగా నిలబడగలడో అటువంటి భారతాన్ని నిర్మించాలని ఆశించారు.
సార్వభౌమత్వం అన్న భావన గత ఐదు శతాబ్దాలుగా ఉనికిలో ఉన్నా నేడు మనం అర్థం చేసుకుంటున్న అర్థంతోనే లేదు. ఆధునిక ప్రజాస్వామ్యాలు విలసిల్లటానికి, రాజ్యాంగబద్ధమైన పాలనా వ్యవస్థలు ఉనికిలోకి రావడానికి ముందు సార్వభౌమత్వం అన్న భావనకు అర్థం అది ఏ రాజు చేతిలోనో, చక్రవర్తి చేతిలోనో, మతాధిపతిచేతిలోనో ఉండేది. వారికి మాత్రమే ప్రాతినిధ్యం వహించేది. కానీ రాజ్యాంగ తాత్వికత కోణంలో సార్వభౌమత్వం ఉమ్మడి స్వభావం. ప్రజలందరి ఉమ్మడి అధికారానికి ప్రతిబింబం. దానికి ప్రత్యక్ష కార్యాచరణ రూపం శాసన వ్యవస్థ. శాసన వ్యవస్థకు ఎన్నికైన ప్రతినిధుల ద్వారా ప్రజాభిప్రాయానికీ, ప్రజాభీష్టానికీ ప్రతిబింబం ఈ సార్వభౌమత్వం. రాజ్యాంగం ఆశించిన, నిర్దేశించిన సార్వభౌమత్వం ప్రజల సార్వభౌమత్వం. ఒకపార్టీ లేదా ఒక నాయకుడు లేదా ఒకే అభిప్రాయాలు కలిగిన ముఠా దేశంపైనా, ప్రజలపైనా రుద్దే సార్వభౌమత్వం కాదు.
సోషలిస్టు : తొలుత రాజ్యాంగ పీఠికను రూపొందించినప్పుడు సోషలిజం అన్న పదం పీఠికలో లేదు. కానీ సోషలిస్టు లక్ష్యాలైన సంపద వికేంద్రీకరణ, సహజవనరులను జాతి ఉమ్మడి ప్రయోజనాలకు వినియోగించటం, సహకార రంగం వంటి ప్రాధాన్యతలు, అందరికీ కూడు, గుడ్డ, నీడ, ఆరోగ్యం, అక్షరాస్యత వంటి సార్వత్రిక సోషలిస్టు లక్ష్యాలు,లక్షణాలు రాజ్యాంగంలో అంతర్భాగంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఈ లక్ష్యాలు సాధించేందుకు ప్రభుత్వాలు పాటుపడాలంటూ ఆదేశిక సూత్రాలు చెప్తూనే ఉన్నాయి. అంతిమంగా 1976లో ఆమోదించిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్టు అన్న పదం లౌకిక అన్న పదంతో పాటు పీఠికలో అంతర్భాగమైంది. ఈ పదాలు భావి భారత ప్రభుత్వాల కార్యాచరణకు అవరోధాలుగా మారతాయేమోనన్న అనుమానం అంబేద్కర్‌కు ఉండబట్టే తొలి రోజుల్లో ఈ పదాలను పీఠికలో చేర్చలేదు. ఈ మధ్య పదవీ విరమణ చేసిన భారాత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ దేశం ఒకే ఆర్థిక మూసలో ఉండకూడదని, అందువల్లనే సోషలిస్టు స్పూర్తితో కూడిన అంశాలకు విలువనివ్వరాదన్న సారాంశంతో ఓ తీర్పు కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా సోషలిజాన్ని సహజన్యాయసూత్రాల నేపథ్యంలో వ్యాఖ్యానించిన జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పులను కూడా చంద్రచూడ్ తప్పు పట్టడం, దానిపై ప్రజాస్వామిక వాదులతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కూడా నిరసనలూ, అభ్యంతరాలూ వ్యక్తం చేయటం చూశాము. ఇదే అంశాన్ని ఛాలెంజ్ చేస్తూ బిజెపి సీనియర్ నాయకులు సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ మధ్యనే కొట్టేస్తూ పీఠికలో ఉన్న పదాలు రాజ్యాంగ స్పూర్తికి అద్దం పడుతున్నాయనీ, వాటిని తొలగించాల్సిన అవసరం లేదనీ ప్రకటించింది. ఈ విషయంపై మాజీ కేంద్ర సమాచార కమిషన్ సభ్యులు, పౌర మేధావి మాడభూషి శ్రీధర్ రాసిన వ్యాసాన్ని కూడా ది వైర్ తెలుగు పాఠకులకు అందించింది.
లౌకిక : సమకాలీన భారత రాజకీయాల్లో ఈ పదానికి ఉన్నంత ప్రాధాన్యత మరే పదానికీ లేదని చెప్పటానికి సందేహించనవసరం లేదు. భారతదేశపు లౌకిక లక్షణం దేశాన్ని ఈస్డిండియా కంపెనీ ఆక్రమించకముందే అమల్లో ఉంది. అక్బర్ ఆస్థానంలో ఉన్నతాధికారుల పొందిక మొదలు శివాజీ ఏలుబడిలో కీలక పాత్ర పోషించిన అధికారుల వరకూ, వివిధ రాజ్యాలూ, సంస్థానాల మధ్య జరిగిన వియ్యపు సంబంధాల్లో కూడా ఈ మతాతీత లక్షణం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీనికి వికృత వ్యాఖ్యానం చెప్తూ భారతదేశ చరిత్ర అంతా ప్రధానంగా హిందూ, ముస్లింల మధ్య సరిగిన యుద్ధాలు, ఘర్షణల చరిత్రే అని బ్రిటిష్ చరిత్రకారులు రాయటం, దాన్ని మనదేశంలోని కొంతమంది మేధావులు వంటబట్టించుకోవడం మొదలైంది. అయితే ఈ అవరోధాలను అధిగమించి లౌకికస్పూర్తి స్వాతంత్రోద్యమ్యంలో మరింత గాఢతను సంతరించుకుంది. ఆ స్పూర్తి 1970 దశకం వరకూ నిర్నిరోధంగా సాగింది. రానురాను లౌకితత్వం అన్న పదాన్ని, దాని అర్థాన్నీ, సారాన్నీ, స్పూర్తినీ వక్రీకరిస్తూ కుహనా లౌకికవాదం అన్న పదబంధం సృష్టి జరిగింది. లౌకికతత్వం అన్న పదం అసలైన అర్థాన్ని, చారిత్రక పరిణామంలో అది రూపొందిన తీరుపై ముసుగు కప్పేస్తూ దైనందిన రాజకీయ జీవితంలో నిర్దిష్ట తక్షణ రాజకీయ ప్రయోజనాలు, ప్రత్యేకించి పార్లమెంటరీ వ్యవస్థలో ఓట్లు దండుకునే మార్గానికి పెట్టిన పేరు లౌకితత్వం అన్న వ్యాఖ్యానం గత యాభయ్యేళ్లుగా ఈ దేశాన్ని వెంటాడుతోంది.
నిజానికి లౌకికతత్వం అంటే సావర్కారో, గోల్వాల్కరో, అద్వానీయో లేక నేడు అధికారంలో ఉన్న మోడీ, అమిత్ షాలో చెప్తున్న అర్థం కాదు. ఓ మతాతీత రాజ్యాన్ని నిర్వచించే పదం. లౌకితత్వం అన్నది పశ్చిమ దేశాల చరిత్రలో ఆధునిక ప్రజాస్వామ్యాల ఆవిర్భావానికి కీలక పాత్ర పోషించింది. రాజ్యపు వ్యవహారాల నుండి మతాన్ని, మత వ్యవహారాల నుండి రాజ్యాన్ని వేరు చేయడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థలు ప్రజల దైనందిన సాంఘిక రాజకీయ ఆర్థిక జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రమే (ఇహపరమైన విషయాలు మాత్రమే – లౌకిక) చూడాలని చెప్పింది.
సమాజంలోని ఓ బృందం మరో బృందంపై ఆధిపత్యం వహించాలన్న భావనకు లౌకికతత్వంలో స్థానంలేదు. భారతదేశ చరిత్ర, అనుభవాలు ఈ లౌకికస్పూర్తికి అదనంగా పరస్పర భిన్న ఆచారాలు, సాంప్రదాయాలు, విశ్వాసాలు, రీతి రివాజులు పాటించే వారంతా కలిసి మెలిసి సహజీవనం చేయటం కూడా లౌకితత్వంలో భాగం అంటూ ఈ పదానికి సాంప్రదాయంగా ఉన్న అర్ధాన్ని మరింతగా విస్తరింపచేసింది భారతదేశ చరిత్ర.
రాజ్యాంగంలో ఈ స్పూర్తికి ప్రాతినిధ్యం వహించే పలు అధికరణాలున్నాయి. ప్రాధమిక హక్కులూ, ఆదేశిక సూత్రాలు కూడా లౌకికతత్వం భావనను బలోపేతం చేసేందుకు వీలుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో లౌకితత్వం అన్న భావనను తిరస్కరించటం అంటే రాజ్యాంగపు ఆయువుపట్టును నులిమేయటమే. అంటే రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన హక్కులు, అధికారాల్లో కీలకమైన భాగాలను నిర్వీర్యం చేయటమే. అందువలన గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అంటే ఈ దేశాన్ని లౌకిక దేశంగా కాపాడేందుకు మనల్ని మనం అంకితం చేసుకోవడమే. లౌకితత్వం మీద జరుగుతున్న రాజకీయ సైద్ధాంతిక దాడులను తిప్పికొట్టేందుకు మనల్ని మనం కంకణధారులను చేసుకోవడమే.
ప్రజాస్వామ్యం : పీఠికలో తొలి వాక్యంలోని భారతీయులమైన మేము అన్న పదబంధానికీ, ప్రజాస్వామ్యం అన్న పదానికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. రాజ్యాంగం ప్రజలకోసమేనని పీఠికలో ఈ పద ప్రయోగం ధృవీకరిస్తోంది. అంతేకాక రాజ్యాంగ వ్యవస్థల నిర్మాణం, నిర్వహణ, వాటిని పనిచేయించటం అన్నీ ప్రజాస్వామ్యయుతంగా ఉండేలా చూడాలని పీఠిక ఆదేశిస్తోంది. ఎక్కడా ఏకస్వామ్యానికి, పార్టీ లేదా వ్యక్తి లేక పార్టీలో ఓ వ్యక్తి ఏకఛత్రాధిపత్యానికి, అడ్డు అదుపులేని విచక్షణాధికారాలకు, వికృత చర్యలకూ ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకూడదని పీఠిక మార్గదర్శనం చేస్తోంది. భారత ప్రజాస్వామ్యానికి పునాది ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ అని అంబేద్కర్ రాజ్యాంగపరిషత్‌లో ప్రస్తావించటాన్ని ఈ సందర్భంలోనే అర్థం చేసుకోవాలి.
ప్రజాస్వామ్యంలో ప్రతి భారతీయుడి మాటకూ, ఓటుకూ, ఆచరణకూ, ఆలోచనకు సమాన విలువ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అంతర్భాగంగా ఉన్న మరో అంశం పారదర్శకత. ప్రజాస్వామిక పరిపాలన అంటే పారదర్శకతతో కూడిన విధాన నిర్ణయాలు. విధానాల రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం. దీన్ని కేవలం ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంఎల్యేనో, ఎంపీనో ఎన్నుకోవడానికి ఓటు వేయటం మాత్రమే ప్రజాస్వామ్యం అని కుదించటం రాజ్యాంగ మౌలిక సూత్రాలకూ, అవగాహనకూ విఘాతం కలిగించటమే.
గణతంత్రం : పీఠికలో తొలి వాక్యం (మకుటం)లో భాగమైన భారతీయులమైన మేము అన్న పదబంధానికి, ప్రజాస్వామ్యానికి, గణతంత్రానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ప్రజాస్వామ్యం, గణతంత్రం అన్న పదాలు రెండూ వాటి అసలైన సారాన్ని రూపాన్ని ఆచరణలోకి తెచ్చినప్పుడే ఈ రాజ్యాంగం నిజంగా దేశానికి దిశా నిర్దేశం చేసే సాధనం అవుతుంది. దేశానికి అంటే కేవలం ప్రభుత్వానికి మాత్రమే కాదు. దేశంలోని ప్రజలందరకూ అని అర్థం. గణతంత్రంలో మరో ముఖ్యమైన అంశం ప్రజలందరూ ప్రత్యక్షంగా ఓటింగ్‌లో పాల్గొని తమకు నచ్చిన తాము మెచ్చిన ప్రతినిధిని ఎన్నుకుని తమ సమస్యలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు పంపించటం. అంటే ఇది నేరుగా ఎన్నికల ప్రక్రియతో ప్రత్యక్షంగా ముడిపడిన అంశం.
ఈ ఎన్నికలు ఎంత పారదర్శకంగా ఎంత అర్థవంతంగా, ఎంత ఆదర్శప్రాయంగా జరుగుతాయో గణతంత్ర వ్యవస్థ అంత అర్థవంతంగా, అంతే పారదర్శకంగా, అంతే ఆదర్శప్రాయంగా అమల్లో ఉంటుంది. కానీ గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలు ప్రత్యేకించి ఎన్నికలరంగంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ దేశం ఎక్కువకాలం రాజ్యాంగ స్ఫూర్తి కి అనుగుణంగా గణతంత్ర రాజ్యంగా మనుగడ సాగించగలుగుతుందా అన్న సందేహం తలెత్తుతుంది.
2019 నుండీ పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలకు వ్యవస్థాగత రూపం ఇవ్వటం ఆందోళనకరం. గతంలో ఎన్నికల ప్రక్రియకు కలిగే అంతరాయాలు ఎక్కడో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూత్‌లకు మాత్రమే పరిమితం అయ్యేవి.వాటినిసరి చేయటానికి రీపోలింగ్ రూపంలో ఓ మార్గం ఉండేది. కానీ 2014 తర్వాత ఇటువంటి అవకతవకలు, అంతరాయాలు, అవరోధాలు సార్వత్రికం అయ్యాయి. 2024 నాటికి ఇవి మరీ దేశవ్యాపిత స్వభావాన్ని సంతరించుకున్నాయి.
మచ్చుకు ఓ ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఏ ఎన్నికల్లో అయినా పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లూ సమానంగా ఉంటాయి. ఉండాలి. కానీ 2024 ఎన్నికల్లో దాదాపు 99 శాతం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ పొంతనలేదు. గతంలో రిగ్గింగ్ కేవలం ఓటింగ్ సమయంలో మాత్రమే జరిగేది. కానీ 2024 నాటికి ఈ రిగ్గింగ్ ఓట్ల లెక్కింపులో కూడా జరుగుతోందన్న సందేహాలకు పై పరిణామలు అవకాశమిస్తున్నాయి. ఈ విషయాలను మరింతకూలంకషంగా చర్చించిన పరకాల ప్రభాకర్ వ్యాసం కూడా ది వైర్ తెలుగు పాఠకుల ముందుంచింది.
గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున జరుపుకునే ఉత్సవం. ఈ ఉత్సవం రాజ్యాంగ స్పూర్తికి అద్దం పట్టేదిగా ఉండాలి. అన్ని వందల అధికరణాలు, వాటిపై వచ్చిన వ్యాఖ్యానాలు, తీర్పులూ, వివాదాలూ అన్నిటినీ ఆకళింపు చేసుకోవడం సాధారణ ప్రజలకు సాధ్యం అయ్యే పనికాదు. అందుకే రాజ్యాంగ స్వరూపం, స్వభావం, భావిభారతానికి రాజ్యాంగం ఇచ్చిన దిశా నిర్దేశం, చూపించిన మార్గం గురించి ప్రాధమిక అవగాహన కలగాలంటే ప్రతి పౌరుడూ పీఠికను తప్పక చదవాలి. పీఠికలోని పదాలను అర్థం చేసుకోవాలి. అదే సమయంలో పీఠిక అందించిన స్పూర్తికి భిన్నంగా, లేదా పీఠిక స్పూర్తికి తూట్లు పొడిచేలా పాలకులు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించేందుకు కంకణబద్ధులం కావాలి. కర్తవ్యోన్ముకులం కావాలి. అదే నిజమైన గణతంత్ర దినోత్సవ సంబరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.