![Election Commision Of India Press Conference](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/Election-Commision-Of-India-Press-Conference.avif)
99 శాతం నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య తేడా ఎందుకు వచ్చింది?
దేశంలో మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలుంటే 538 నియోజకవర్గాల్లో అంటే 99 శాతం నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య ఉన్న తేడా ఉంది. ఇదేదో చిన్నపాటి వివరణతోనో, సాధారణ వ్యాఖ్యలతో కొట్టిపారేసేది కాదు.
2025 జనవరి 7న గంటసేపు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఎన్నికలసంఘం ఢిల్లీ శాసనసభకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటానికి ముందు ఎన్నికల సంఘం ప్రధానాధికారి దాదాపు 41 నిమిషాలు ధారాళంగా ప్రసంగించారు.
ఈ ఉపన్యాసంలో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య ఉన్న తేడా గురించి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ‘‘ మెషిన్ సమయానికి పని చేయకపోవడమో, మాక్ పోల్ సందర్భంగా పోలైన ఓట్లను ఓటింగ్ మెషిన్ మెమొరీ నుండి తొలగించకపోవడం, చిన్న చితక తేడాలు వలన ఈ వివాదం తలెత్తి ఉండొచ్చు. దేశవ్యాప్తంగా పదిన్నర లక్షల ఓటింగ్ మెషిన్లు పనిలో ఉన్నాయి. ఇటువంటి పొరపాట్లు మూడు నాలుగు చోట్ల జరిగితే జరిగి ఉండొచ్చు. అటువంటప్పుడు ఆ మెషిన్‌ను పక్కన పెడతాము.
ఓట్ల లెక్కింపు జరిగినప్పుడు గెలిచిన అభ్యర్థికీ ఓడిన అభ్యర్థికీ ఉన్న తేడా అలా పక్కన పెట్టిన మెషిన్లో పోలైన ఓట్లకంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ఆ మిషిన్కు సంబంధించిన వివిపాట్ స్లిప్పులు లెక్కిస్తాము. లేదంటే ఆ మెషిన్లో పోలైన ఓట్లను పక్కన పెడతాము. అంటే ఆ మిషిన్‌లో పోలైన ఓట్లమేరకే తేడా ఉంటుంది. కానీ గెలుపు ఓటముల మధ్య భారీ వ్యవత్యాసాలు ఉన్నందున ఆ మోతాదులో ఓట్లను లెక్కించినా, లెక్కించకపోయినా పెద్దగా వచ్చే తేడా ఏమీ లేదు. ఫారం 20లో అభ్యర్దులకు పోలైన ఓట్ల వివరాలు ఉండనే ఉంటాయి.’’ అన్నారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్స్ నిర్వహించిన విలేకరుల సమావేశానికి బహుశా ఈ రూపంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించినట్లుంది. ఎడిఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ‘‘2024 లోక్‌సభ ఎన్నికల్లో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలు – బహుముఖ కోణాలు’’ అన్న శీర్షికన ఓ పత్రాన్ని చర్చకు పెట్టారు. ఈ విలేకరుల సమావేశంలో ఎడిఆర్ ప్రతినిధులతో పాటు సీనియర్ జర్నలిస్టులు, మేధావులు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ నుండి సేకరించిన గణాంకాలు విశ్లేషిస్తే 2024 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 543 నియోజకవర్గాలకు గాను 538 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య తేడా ఉన్నట్లు తేలింది.
ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు, మిగిలిన ఇద్దరికీ వివరాల కోసం లేఖ రాశారు. దానిపై ఇంత వరకూ స్పందన లేదు.
ఎన్నికల సంఘం ప్రకటన ఓట్ల తేడా సమస్యకు అర్థవంతమైన వివరణ ఇస్తుందా?
ఎన్నికల సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశం గంట 11 నిమిషాల 40 సెకన్ల పాటు సాగింది. రాజీవ్ కుమార్ చేసిన ‘ఆ మొత్తం ఓట్లు లెక్కకు రావు’’ అన్న ప్రకటన పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు తక్కువైన సందర్భం గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు.
ఎడిఆర్ సంస్థ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఆరోపాయింట్ను ఇక్కడ ప్రస్తావించుకోవడం అవసరం :
‘‘ఓటింగ్ మిషన్లలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా : 362 నియోజకవర్గాల్లో మొత్తం పోలైన ఓట్లకంటే 554598 ఓట్లు తక్కువగా లెక్కించారు. మరో 176 నియోజకవర్గాల్లో 33093 ఓట్లు అదనంగా లెక్కించారు. ప్రతి ఓటూ లెక్కించాలి. ప్రతి ఓటుకూ విలువ ఉంటుంది. ఈ నేపథ్యంలో పైన చూపించిన తేడాలకు కారణాలు ఏమిటో కేంద్ర ఎన్నికల సంఘం నుండి తెలుసుకోవాలనుకుంటున్నాము.’’. అని ఆ లేఖలో ఏడిఆర్ సంస్థ కోరింది.
ఇంత స్పష్టంగా ప్రశ్నించినప్పటికీ ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ సన్నాయినొక్కులు నొక్కిందే తప్ప పోలైన ఓట్లు అన్నీ ఎందుకు లెక్కించలేదో వివరించలేకపోయింది.
172 నియోజకవర్గాల్లో అదనంగా లెక్కించిన ఓట్లకు సంబంధించి మాటమాత్రమైనా ప్రస్తావించలేదు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ కొత్తగా చెప్పినదేమీ లేదు. ఎడిఆర్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఓ విద్యావేత్త తన ట్విటర్ ఖాతాలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కొంత వివరణ ఇస్తూ ఈ క్రింది విధంగా ప్రస్తావించారు :
‘‘కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు (కౌంటింగ్ ఏజెంట్ హండ్ బుక్‌లోని 11.4పేరా) ప్రకారం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పోలింగ్ ఓట్లను లెక్కించకుండా వదిలేయవచ్చు. అటువంటి పోలింగ్ స్టేషన్లు రెండు రకాలుగా ఉంటాయి.
- పోలింగ్ అధికారి మాక్ పోలింగ్ జరిగిన తర్వాత ఓటింగ్ మెషిన్లను డేటాను శుభ్రం చేయకపోనా, పోలింగ్ కంటే ముందు జారీ చేసిన నమూనా వివిపాట్ స్లిప్పులు తొలగించకపోయినా అటువంటి ఓటింగ్ మిషన్ల లో పోలైన ఓట్లు లెక్కించనవసరం లేదు.
- కంట్రోలు యూనిట్లో పోలైన ఓట్లకూ, ఫారం 17 సిలో నమోదైన ఓట్ల సంఖ్యకూ మధ్య వ్యత్యాసం ఉంటే అటువంటి కంట్రోలు యూనిట్ నుండి ఓట్లు లెక్కించనవసరం లేదు.
అన్ని యూనిట్లలో పోలైన ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యాక ఒక వేళ గెలుపు ఓటముల మధ్య ఉన్న తేడా ఈ లెక్కించని మిషిన్లలో ఉన్న ఓట్ల సంఖ్య కంటే సమానంగా కానీ, ఎక్కువగా గానీ ఉంటే వీటిని లెక్కలోకి తీసుకోవాలి. ఒక వేళ అటువంటి తేడా లెక్కించని మిషిన్లలో పోలైన ఓట్లసంఖ్య కంటే తక్కువగా ఉంటే అసలు వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు.’’
నిర్దిష్ట అంశాలు లేవనెత్తినప్పుడు సార్వత్రిక వివరణ తో సరిపెట్టవచ్చా?
పరిశీలకులు నిర్దిష్టంగా లేవనెత్తిన సమస్యలు, సందేహాలకు ఎన్నికల సంఘం సాదాసీదాగా సార్వత్రిక వివరణ ఇచ్చి చేతులు దులుపుకోవటం ఆందోళన కలిగిస్తుంది.
కనీసం ప్రపంచంలో అతి పెద్ద ఎన్నికల కసరత్తు నిర్వహించే భారతదేశపు ఎన్నికల ప్రక్రియకు విలువనిచ్చే వాళ్లెవరైనా ఇటువంటి ముక్తసరి దాటవేత సమాధానాలతో తృప్తి చెందరు.
ఒక బ్యాంకు బ్రాంచిలో ఒకరోజు చివర్లో సరిచూసే జమాఖర్చుల లెక్కకు ఎంత విలువ ఉంటుందో ఓట్ల లెక్కింపుకు కూడా అంటే విలువ ఉంటుంది. ప్రజల ఓట్లను డబ్బు విలువతో చూడలేము కాబట్టి ఈ పోలిక సరైనది కాదు. అయినా తేలిగ్గా అర్థం చేసుకోవడానికి ఇంతకన్నా మంచి పోలిక దొరకలేదు.
బ్యాంకు లెక్కల్లో రోజు చివరికి రూపాయి తేడా వచ్చినా సదరు బ్యాంకు మేనేజరు లేదా తనిఖీ అధికారి తన జేబు నుండి రూపాయి జత చేసి లెక్క ముగించరు. రోజంతా జరిగిన లావాదేవీలు జమలు అన్నీ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతనే అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఆ రోజుకు ఖాతాను సరిచేసి ముగిస్తారు. అలా సరిచేయటానికి కూడా ఓ పద్ధతి, పర్యవేక్షణ, నిబంధనలు ఉంటాయి.
అదేవిధంగా ఓ పోలింగ్ బూతులో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకూ మధ్య తేడా వచ్చిందంటే సదరు పర్యవేక్షణాధికారి అలా తేడా వచ్చిన ప్రతి ఓటుకూ లెక్కకు రాని ప్రతి ఓటుకూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ పొరపాటు ఎలా జరిగింది, ఎందుకు జరిగిందో ఓటర్లకు వివరించాలి.
అలాంటిది ఓ ఎన్నికల అధికారి లేక ఎకాఎకిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనరే స్వయంగా కొందరు పోలింగ్ అధికారులు మిషిన్లలో ఉన్న లెక్కలు తనిఖీ చేయకుండా పోలింగ్ ప్రారంభించాడనో, డబ్బాలో పోలింగ్ కంటే ముందే కాగితాలు ఉన్నాయా లేవా అని చూడటంలో పొరపాటు చేశాడనో చెప్పేసి చేతులు దులుపుకుంటే దాన్నేమంటారు?
అటువంటి బాధ్యతారహితమైన ప్రకటన చేయటం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని హేళన చేయటం తప్ప మరోటి కాదు.
ప్రపంచంలో కట్టుదిట్టంగానూ, పారదర్శకంగానూ ఎన్నికలు నిర్వహించటంలో బంగారంతో సమానమైన ప్రమాణాలు పాటిస్తున్నామని జబ్బలు చరుకునే వాళ్లెవరైనా ఇటువంటి ప్రశ్నలు తలెత్తినప్పుడు చేయాల్సిన పనేమిటి?
కనీసం నియోజకవర్గస్థాయిలోనైనా
- ఓటింగ్ మిషన్‌లోనూ, పోస్టల్ బాలెట్ ద్వారానూ పోలైన నికర ఓట్ల లెక్క తీయాలి.
- లెక్కించిన ఓట్లలో మిషన్‌లో పోలైన ఓట్లు ఎన్ని, పోస్టల్ బాలెట్లో పోలైన ఓట్లు ఎన్నో లెక్క తేచ్చాలి.
- పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ మధ్య ఉన్న వాస్తవికమైన తేడాను నమోదు చేయాలి.
- ఏయే బూత్‌లలో ఈ తేడాలు వచ్చాయో గుర్తించి స్పష్టమైన కారణాలు నమోదు చేయాలి. ఉదాహరణకు
- మాక్ పోల్ సందర్భంగా ఉపయోగించిన వివిపాట్ స్లిప్పుల్లో ఎన్నిటిని తొలగించలేదు
- ఏయే నిర్దిష్ట బూత్‌ల విషయంలో పోలింగ్ అధికారి ఫారం 17 సి లో తప్పుడు లెక్క రాశారు, అలా ఎన్ని ఓట్ల విషయంలో తప్పుడు లెక్కలు రాశారు
- ఎన్ని బూత్‌లలో ఓటింగ్ మిషన్లు మొరాయించాయి? దాని వలన ఎన్ని ఓట్లు పోలవలేకపోయాయి?
వంటి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలి.
ప్రజలకు తెలియచెప్పాలి. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఉన్న పోలింగ్ ఏజెంట్లకైనా రాతపూర్వకంగా తెలియచేయాలి.
కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు లెక్కకు వచ్చాయనో, మరికొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు లెక్కకు వచ్చాయనో చెప్పి దానికి సాకు కింద పోలింగ్ అధికారులు తెలిసో తెలియకో చేసిన పొరపాట్ల వలన జరిగిందని చేతులు దులిపేసుకుంటే కుదరదు.
99 శాతం నియోజకవర్గాల్లో ఇలాంటి తప్పు జరిగినప్పుడు దాన్ని ముక్తసరి సమాధానంతో కథ కంచికి చేర్చలేరు.
పారదర్శకతే మా ప్రాణవాయువు అని గంట బజాయించిమరీ చెప్పుకునే రాజ్యాంగ బద్ధమైన సంస్థ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తుందా? దేశం ఎదురు చూస్తుంది.
జగదీష్ చోకర్
అనువాదం : కొండూరి వీరయ్య